సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
డబ్బుతో కూడిన అన్ని రకాల ఆన్‌లైన్ ఆటలను నిషేధిస్తూ సురక్షితమైన డిజిటల్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు 'ఆన్‌లైన్ గేమింగ్ చట్టం 2025'ను అమలులోకి తెచ్చిన ప్రభుత్వం
ఆన్‌లైన్ గేమింగ్ ముసాయిదా నిబంధనలు- 2025పై భాగస్వాముల అభిప్రాయాలను ఆహ్వానిస్తోన్న ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
18 MAR 2026 4:14PM by PIB Hyderabad
దేశంలో సురక్షితమైన, బాధ్యతాయుతమైన, పారదర్శకమైన ఆన్‌లైన్ గేమింగ్ వ్యవస్థ ఉండేలా చూసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలో ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సామాజిక క్రీడలలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, డబ్బుతో కూడిన ఆన్‌లైన్ ఆటలను (ఆన్‌లైన్ మనీ గేమ్స్) నిషేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం 'ఆన్‌లైన్ గేమింగ్ నిరోధక, నియంత్రణ చట్టం- 2025'ను (గేమింగ్ చట్టం) అమలులోకి తెచ్చింది.
ఈ గేమింగ్ చట్టం ఆన్‌లైన్‌లో డబ్బుతో కూడిన అన్ని రకాల ఆటలను సమగ్రంగా నిషేధించింది. అవి అదృష్టంతో కూడినవైనా, నైపుణ్యంతో కూడినవైనా లేదా రెండింటి కలయికతో కూడినవైనా సరే.. వాటిపై పూర్తి నిషేధం ఉంది. ఇటువంటి ఆటల ప్రకటనలు, ప్రచారం, వాటిని ప్రోత్సహించడంపై కూడా నిషేధం ఉంది. బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్స్ ద్వారా వీటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిర్వహించడంపై కూడా నిషేధం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం- 2000 నిబంధనల ప్రకారం చట్టవిరుద్ధమైన ఇటువంటి ప్లాట్‌ఫాంలను బ్లాక్ చేసే అధికారాన్ని కూడా ఈ చట్టం అధికారులకు కల్పిస్తోంది.
నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి అత్యంత కఠినమైన శిక్షలను గేమింగ్ చట్టం విధిస్తుంది. ఆన్‌లైన్‌లో డబ్బులతో కూడిన ఆటలను నిర్వహించడం లేదా వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సహకరించడం వంటి నేరాలకు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా లేదా ఈ రెండూ విధించొచ్చు. రెండోసారి లేదా ఆ తర్వాతి సారి ఇదే నేరానికి పాల్పడితే కనీసం 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, కనీసం కోటి రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇటువంటి డబ్బులతో కూడిన ఆన్‌లైన్ ఆటలను ప్రచారం చేయడం శిక్షార్హమైన నేరం. దీనికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా 50 లక్షల రూపాయల వరకు జరిమానా లేదా ఈ రెండూ విధించొచ్చు. రెండోసారి లేదా ఆ తర్వాతి సారి ప్రకటనల నియమాన్ని ఉల్లంఘిస్తే కనీసం 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, కనీసం 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
పైన పేర్కొన్న అంశాలతో పాటు ఈ గేమింగ్ చట్టం ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సామాజిక క్రీడల గుర్తింపు, ప్రోత్సాహానికి కూడా వీలు కల్పిస్తుంది. దీనిలో భాగంగా 'ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా' ఏర్పాటు, ఆన్‌లైన్ గేమ్‌ల కోసం పారదర్శకమైన రిజిస్ట్రేషన్ విధానం, వినియోగదారుల కోసం ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, డబ్బులతో కూడిన నిషేధిత ఆన్‌లైన్ క్రీడల వల్ల కలిగే నష్టాల నుంచి తగిన రక్షణ చర్యలను ఈ చట్టం కలిగి ఉంది.
అనుమతించదగిన క్రీడలను వర్గీకరించడం, రిజిస్టర్ చేయడం.. ఏదైనా ఒక ఆట 'డబ్బులతో కూడిన ఆట' పరిధిలోకి వస్తుందో లేదో నిర్ణయించడం, ప్రవర్తనా నియమావళిని జారీ చేయడం, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడం వంటి బాధ్యతలను జాతీయ స్థాయి 'ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ' నిర్వహిస్తుంది. ఒక కేంద్ర నియంత్రణ సంస్థకు అధికారాలను కల్పించడం ద్వారా సమన్వయంతో కూడిన విధానపరమైన మద్దతును అందించడం, సమర్థవంతమైన పర్యవేక్షణను చేపట్టడం, ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వ స్థానంలో నిలబెట్టాలన్నది ఈ చట్టానికి ఉన్న ముఖ్య ఉద్దేశం. సాంకేతిక వృద్ధి జాతీయ ప్రయోజనాలకు, వినియోగదారుల రక్షణ సూత్రాలకు అనుగుణంగా ఉండేలా ఈ చట్టం చూసుకుంటుంది.
గేమింగ్ చట్టాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 2025 అక్టోబర్ 2న 'ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సాహం, నియంత్రణ ముసాయిదా నిబంధనలు- 2025'ను బహిరంగ సంప్రదింపుల కోసం విడుదల చేసింది. చట్టాల రూపకల్పనలో అందరినీ భాగస్వాములను చేయాలనే ప్రభుత్వ నిశ్చయానికి అనుగుణంగా భాగస్వాములతో సహా ప్రజలందరి నుంచి అభిప్రాయాలు, సూచనలను ఆహ్వానిస్తోంది.
ఈ రోజు లోక్‌సభలో శ్రీ రావు రాజేంద్ర సింగ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా సమాచార- ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ సమాచారాన్ని సమర్పించారు.
***
(రిలీజ్ ఐడి: 2241952)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11