పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
భారతీయ విమానయానంలో ప్రయాణికులకు అందించే సౌకర్యాలు బలోపేతం
నాడు పోస్టు చేయడమైనది:
18 MAR 2026 8:56AM by PIB Hyderabad
ఉడాన్ పథకం ద్వారా విమానయానం అందరికీ అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయంగా మూడో అతి పెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించింది. భారతీయ విమానాశ్రయాల ద్వారా రోజుకు అయిదు లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇది ఈ రంగంలో సాధించిన వృద్ధిని సూచిస్తుంది.
ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడమే పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అత్యంత ప్రాధాన్యమైన అంశం. దీనికి కట్టుబడి ఉంటూ.. ప్రయాణికులే కేంద్రంగా, వారికి ప్రయాణ సౌలభ్యాన్ని కల్పిస్తూ అనేక కార్యక్రమాలను మంత్రిత్వశాఖ ప్రారంభించింది. వీటిలో చౌక ధరలకే ఆహారాన్ని అందించే ఉడాన్ యాత్రి కేఫ్‌లు, ఉచితంగా పుస్తకాలు చదివేందుకు ఫ్లైబ్రరీ, విమానాశ్రయాల్లో ఉచిత వైఫై తదితర సౌకర్యాలున్నాయి.
ప్రయాణికులకు సౌకర్యాన్ని, విమానయాన సంస్థల్లో పారదర్శకతను, అవి అనుసరించే పద్ధతుల్లో ఏకరూపతను తీసుకొచ్చేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ద్వారా మంత్రిత్వ శాఖ దిగువ పేర్కొన్న ఆదేశాలను జారీ చేసింది.
-
అందరికీ విమాన ప్రయాణాన్ని అందుబాటులో ఉంచడం కోసం ఏ విమానంలోనైనా 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కేటాయించాలి.
-
ఒకే పీఎన్ఆర్ ఉన్న ప్రయాణికులు పక్కపక్కనే ఉన్న సీట్లలో కూర్చొని ప్రయాణించవచ్చు.
-
భద్రత, నిర్వహణ నియంత్రణలకు లోబడి క్రీడా సామగ్రి, సంగీత సాధనాలను పారదర్శకమైన, ప్రయాణికులకు అనుకూలమైన పద్ధతిలో రవాణా చేయాలి. పెంపుడు జంతువుల రవాణాకు సంబంధించి సైతం స్పష్టమైన, పారదర్శకమైన విధానాలను విమానయాన సంస్థలు రూపొందించాలి.
-
విమానాల ఆలస్యం, రద్దు, బోర్డింగు నిరాకరించడం లాంటి ముఖ్యమైన సందర్భాల్లో ప్రయాణికుల హక్కులకు సంబంధించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి.
-
విమానయాన సంస్థల వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లు, బుకింగ్ వేదికలు, విమానాశ్రయ కౌంటర్లలో ప్రయాణికుల హక్కులను స్పష్టంగా ప్రదర్శించాలి.
-
విస్తృత స్థాయిలో విమానయానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకు రావడానికి, అవగాహన పెంపొందించడానికి ప్రాంతీయ భాషల్లో ప్రయాణికులకు హక్కుల గురించి స్పష్టంగా వివరించాలి.
ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కల్పించేందుకు, పారదర్శకతను పెంపొందించేందుకు, ఫిర్యాదులను తగ్గించేందుకు, విమానయాన రంగంలో అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలను అనుసరించేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2241671)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14