ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న అల్ప్రాజోలమ్ ఫ్యాక్టరీ..
డీఆర్ఐ దాడులు.. ఆపరేషన్ ‘‘వైట్ హ్యామర్’’లో 237 కిలోల మందులు స్వాధీనం..
విలువ రూ.47 కోట్లు
3.5 టన్నులకు పైగా రసాయనాల జప్తు.. ఇద్దరి అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
13 MAR 2026 10:36AM by PIB Hyderabad
కృత్రిమ ఔషధాలను చట్టవిరుద్ధంగా తయారు చేస్తున్న వర్గాలపై కొరడాను ఝళిపిస్తూ, రెవిన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) ఆంధ్రప్రదేశ్‌లో యన్‌టీఆర్ జిల్లా కొండపల్లి పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతంలో ఒక రహస్య స్థావరం గుట్టును రట్టు చేసింది. దీంతో, ఎన్డీపీఎస్ చట్టం-1985లో ప్రస్తావించిన మానసిక రోగ కారక అల్ప్రాజోలమ్‌ను ఆ చోటులో ఉత్పత్తి చేస్తున్న వైనం తెలిసింది.
గోప్య సమాచారం అందడంతో పక్కా ప్రణాళికను వేసుకొని మరీ ‘‘ఆపరేషన్ వైట్ హ్యామర్’’ అని సంకేత నామంతో దాడులు చేపట్టారు. ఈ ప్రణాళికను 2026 మార్చి నెల 11, 12 తేదీల్లో అమలుచేశారు. అల్ప్రాజోలమ్ తయారీకి ఒక పూర్తి పారిశ్రామిక వ్యవస్థనే నెలకొల్పిన సంగతి బయటపడింది. ఒక రసాయనిక తయారీ విభాగం ముసుగులో, ఈ వ్యవస్థను కొనసాగిస్తున్నట్లు కనుగొన్నారు.
ఆ పరిసరాల్లో సోదాలు చేసి, 237 కిలోల అల్ప్రాజోలమ్ స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ రూ.47 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో పాటు 800 కిలోలకు పైగా ముడిపదార్థాలనీ, 2860 లీటర్ల పరిమాణంలో వివిధ రసాయనాలనీ, రియాక్టర్లు, డ్రయ్యర్లు, ఒక సెంట్రిఫ్యూజ్ సహా పెద్ద ఎత్తున పారిశ్రామిక ఉపకరణాలనీ కూడా జప్తు చేశారు. ఈ సాక్ష్యాలు వ్యవస్థీకృత, భారీ చట్టవిరుద్ధ ఉత్పాదన సదుపాయాన్ని వెలుగులోకి తీసుకువచ్చాయి.
రసాయనాలు, ఔషధాల నిర్మాణ రంగంలో 20 సంవత్సరాల కన్నా ఎక్కువ అనుభవం ఉన్న ఒక కెమిస్టు ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. అతడు హైదరాబాద్‌లో తన సహచరునితో చేయి కలిపాడు. ఆ వ్యక్తి ముడి పదార్థాలని సమకూర్చడంతో పాటు పంపిణీకి కూడా ఏర్పాట్లు చేశాడు. నిందితులు అల్ప్రాజోలమ్‌ను దొంగచాటుగా తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీ పరిసరాల్ని అద్దెకు తీసుకున్నారు. సూత్రధారులు ఇద్దరినీ అరెస్టు చేశారు.
వర్తమాన ఆర్థిక సంవత్సరంలో, డీఆర్ఐ గోప్య సమాచారాన్ని అందుకొని ముందుకు కదిలి ఎనిమిది రహస్య మందుల తయారీ యూనిట్లను ఛేదించింది. ప్రభుత్వం అమలుపరుస్తున్న ‘నశా ముక్త్ భారత్’ ఉద్యమం పట్ల, మత్తుమందుల, మానసిక రోగ కారక పదార్ధాల బెడద నుంచి సమాజాన్నీ, ప్రజలనీ సురక్షితంగా ఉంచడం పట్ల డీఆర్ఐ దృఢ నిబద్ధతని ఇది చాటిచెబుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2239667)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5