సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చారిత్రాత్మక గ్లోబల్ ఏఐ సదస్సు - కృత్రిమ మేధ ఆవిష్కరణలు, పాలన, భాగస్వామ్యాలు, సమ్మిళిత వృద్ధికి ప్రపంచ కేంద్రంగా సుస్థిర స్థానాన్ని సాధించిన భారత్


ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పోలో తప్పుదారి పట్టించేలా ఉన్న ఒక ప్రకటనపై ప్రభుత్వం తక్షణ చర్య: ప్రదర్శనల స్వభావం, నిబంధనలకు ఎగ్జిబిటర్లే బాధ్యత వహిస్తారని స్పష్టం

నాడు పోస్టు చేయడమైనది: 11 MAR 2026 4:03PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, ప్రభుత్వం సాంకేతికత అభివృద్ధిని వినియోగాన్ని ప్రజాస్వామ్యీకరిస్తోంది. వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి,  వివిధ రంగాలలో జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృత్రిమ మేధను ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించింది. దీని ప్రాముఖ్యతను గుర్తిస్తూ,  బాధ్యతాయుతంగా, సమ్మిళితంగా కృత్రిమ మేధ  వినియోగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వాములు, పరిశ్రమలు, విద్యాసంస్థలు,  రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోంది.

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'ను 2026 ఫిబ్రవరి 16-21 తేదీలలో భారత్ నిర్వహించింది. గ్లోబల్ ఏఐ సదస్సు గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి)లో జరగడం ఇదే మొదటిసారి. ఇది మరింత సమగ్రమైన ప్రపంచ ఏఐ చర్చల దిశగా జరుగుతున్న విస్తృత పరిణామాన్ని సూచిస్తుంది.  

ఈ సదస్సు ఒక చారిత్రాత్మక ప్రపంచ సమ్మేళనంగా ముగిసింది, ఇది కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ఆవిష్కరణలు, పాలన, భాగస్వామ్యం,  సమ్మిళిత వృద్ధికి ప్రపంచ కేంద్రంగా భారత్ స్థానాన్ని సుస్థిరం చేసింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ భారీ సదస్సు ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నిర్వహించిన అతిపెద్ద సదస్సు గా నిలిచింది. ఇది "సర్వజన హితాయ, సర్వజన సుఖాయ" (అందరి సంక్షేమం, అందరి సంతోషం) అనే ఇతివృత్తంతో ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, పౌర సమాజం,  స్టార్టప్‌ల నాయకులను ఒక వేదికపై చేర్చింది. 

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా అనుబంధ కార్యక్రమంగా ఇండియా ఏఐ  ఇంపాక్ట్ ఎక్స్‌పో ను నిర్వహించారు. 'ప్రపంచ శ్రేయస్సు కోసం భారత ఏఐ శక్తి' ఇతివృత్తాన్ని ప్రదర్శించే లక్ష్యంతో దీనిని నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ ఏఐ  వ్యవస్థ భాగస్వాములైన కార్పొరేట్లు, స్టార్టప్‌లు, దేశాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు,   విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా/పరిశోధన సంస్థలు,  స్వచ్ఛంద సంస్థలను వారి ఆసక్తి వ్యక్తీకరణ ఆధారంగా ఆహ్వానించారు. ఎక్స్‌పో ఆమోదిత లేఅవుట్ పరిధికి లోబడి, స్థలం అందుబాటును బట్టి 'ముందు వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత'  ప్రాతిపదికన స్థలాన్ని కేటాయించారు. 

ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పోలో ప్రదర్శించిన వస్తువుల స్వభావం, ప్రాతినిధ్యాలు, అలాగే వర్తించే చట్టపరమైన,  నియంత్రణ సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఉండే బాధ్యత ఆయా ప్రదర్శకుల  పైనే ఉంది.

ప్రభుత్వ వైఖరి ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ప్రదర్శనకారుడు చేసిన తప్పుడు వాదనను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేదు లేదా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నించలేదు. దీనికి విరుద్ధంగా, సదరు ప్రదర్శనకారుడిపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకుంది.

ఈ సందర్భంగా ఒక ప్రదర్శకుడు చేసిన అసత్య ప్రకటనను ప్రాచుర్యం చేయడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. సంబంధిత ప్రదర్శకుడిపై ప్రభుత్వం తక్షణ చర్యలు కూడా తీసుకుంది.

ఈరోజు లోక్‌సభలో శ్రీ ఆర్. శశిధానంతమ్  ప్రశ్నకు సమాచార, ప్రసార,  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2238630) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam