మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్తవ్యపథ్‌లో 'శక్తి వాక్- #షీలీడ్స్‌భారత్' నిర్వహణ


ప్రగతిశీల, సమ్మిళిత భారతదేశ నిర్మాణంలో మహిళల కీలక పాత్రను తెలియజేస్తూ, #షీలీడ్స్‌భారత్ ఇతివృత్తంతో కలిసి అడుగులు వేయనున్న వివిధ రంగాలకు చెందిన మహిళలు

నాడు పోస్టు చేయడమైనది: 07 MAR 2026 9:41AM by PIB Hyderabad

రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌ వద్ద "శక్తి వాక్- #షీలీడ్స్‌భారత్" పేరుతో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండబ్ల్యూసీడీ), మహిళల నేతృత్వంలో పాదయాత్రను నిర్వహిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. అన్ని రంగాల్లో మహిళలు సాధించిన విజయం, నాయకత్వం, విశేష కృషిని వేడుకగా జరుపుకుంటుంది. లింగ సమానత్వం, భద్రత, గౌరవం, సాధికారత దిశగా ఉమ్మడి నిబద్ధతను స‌్పష్టం చేస్తుంది. ఈ స్ఫూర్తితో ప్రగతిశీల, సమ్మిళిత భారతదేశ నిర్మాణంలో మహిళల కీలక పాత్రను చాటిచెప్పేందుకు శక్తి వాక్ నిర్వహించనున్నారు.

వివిధ రంగాల్లో మహిళలు కనబరిచిన నాయకత్వాన్ని, వారి అందించిన విశేష సేవలను వేడుకగా జరుపుకోవటం శక్తి వాక్ ప్రధాన లక్ష్యం. మహిళల భద్రత, రక్షణ, సాధికారత పట్ల ప్రభుత్వానికున్న నిబద్ధతను బలోపేతం చేయటం.. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ప‌్రదర్శన, వివిధ రంగాలకు చెందిన మహిళలను ఒకచోట చేర్చి, వారి మధ్య ఐక్యతను, సమష్టి గౌరవాన్ని పెంపొందించటం, జాతీయ ప్రగతికి మహిళా నేతృత్వంలోని అభివృద్ధి అత్యంత కీలకమని చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు ఇండియా గేట్ నుంచి కర్తవ్యపథ్ మీదుగా విజయ్ చౌక్ వరకు సుమారు 2 కి.మీ. మేర ఈ నడక కార్యక్రమం సాగుతుంది.

ఈ కార్యక్రమంలో సాయుధ దళాలు, పోలీసు శాఖ, మీడియా, వైద్య రంగం, క్రీడలు, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, క్షేత్రస్థాయి కంపెనీల ప్రతినిధులతో సహా 150కి పైగా మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల నుంచి సుమారు 3000 మంది మహిళలు పాల్గొంటారని అంచనా. ప్రగతిశీల, సమ్మిళిత భారతదేశ నిర్మాణంలో మహిళల కీలక పాత్రను తెలియజేస్తూ #షీలీడ్స్‌భారత్ ఇతివృత్తంతో సాగే ఈ శక్తి వాక్‌లో వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొంటారు.

భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన మహిళా అధికారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.

ఈ శక్తి వాక్‌కు కేంద్రమంత్రులు, సహాయమంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు వంటి మహిళా ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖ మహిళా నాయకురాళ్లు, విశిష్ట అతిథులు నాయకత్వం వహిస్తారు.

ప్రముఖుల ప్రసంగాలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత అధికారికంగా వాక్‌ను ప్రారంభిస్తారు.

మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక పథకాలతో పాటు వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను కర్తవ్యపథ్‌ వెంట ప్రదర్శనగా ఏర్పాటు చేయనున్నారు.

మహిళా శక్తిని, జాతీయ గౌరవాన్ని చాటిచెప్పేలా ఇండియా గేట్ వద్ద ఒక ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా ప్రదర్శించే డోలు కునిత, కలరియపట్టు, సింగారిమేళం, రణచండి, ఘూమర్ వంటి కళారూపాలు భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, మహిళల అసమాన శక్తిని ప్రతిబింబిస్తాయి.

మహిళా శక్తిని, జాతీయ గౌరవాన్ని చాటిచెప్పేలా ఇండియా గేట్ వద్ద జరిగే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శన.. సామూహికంగా వందేమాతరం ఆలపించటంతో ప్రారంభమవుతుంది. అనంతరం "శక్తి వాక్- #షీలీడ్స్‌భారత్‌" సందేశం ఉన్న బెలూన్లని ఆకాశంలోకి వదులుతారు.

వికసిత్ భారత్-2047 స్వప్నాన్ని సాకారం చేయటంలో మహిళల కీలక పాత్రను ఈ వేడుకలు గుర్తిస్తాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2236306) సందర్శకుల సూచీ సంఖ్య : : 122
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam