జల శక్తి మంత్రిత్వ శాఖ
జల్ సంచయ్ జన్ భాగీదారీ: ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో అనుసరించిన 5 శాతం నమూనా నీటి ఎద్దడి నుంచి నీటి భద్రత స్థితికి ఎలా మార్చివేసిందో గమనించండి
నాడు పోస్టు చేయడమైనది:
05 MAR 2026 1:08PM by PIB Hyderabad
నీటి ఎద్దడి అన్నింటి కన్న గంభీరమైన వాతావరణ సవాళ్లలో ఒకటిగా మారుతున్న కాలంలో, ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లా అత్యంత శక్తిమంతమైన పరిష్కారం పెద్ద ఆనకట్టలు గానీ, లేదా భారీ యంత్రాంగంతో గానీ మొదలవదనీ, ప్రజలతోనే ఆ పరిష్కారం సాధ్యపడుతుందనీ నిరూపించింది.
జల్ సంచయ్ జన్ భాగీదారీ (ఈ హిందీ పదాలకు నీటిని నిల్వచేయడం, ప్రజల భాగస్వామ్యం అని అర్థం) భావనకు కార్యరూపాన్నిచ్చి ఈ జిల్లా ఒక సరళమైన, విప్లవాత్మక ప్రశ్నను అడుగుతూ ఒక బలహీన భూభాగాన్ని అనుకూలతను సాధించుకున్న నమూనాగా మార్చేసింది. ఇంతకూ ఆ ప్రశ్న ఏమిటంటారా.. అది.. ప్రతి రైతూ తన భూమిలోని 5 శాతం భాగాన్ని నీటిని నిల్వ చేయడానికి అంకితం చేస్తే అప్పుడు ఏమవుతుంది? అనేదే.
5 శాతం నమూనా: చిన్న ప్రయత్నం, అది తీసుకు రాగల పెనుమార్పు
ఆవా పానీ ఝోకీ ఉద్యమంలో భాగంగా, రైతులు స్వచ్ఛందంగా తమ వ్యవసాయ క్షేత్రంలో నుంచి 5 శాతం భూమిని చిన్న రీచార్జి చెరువుల్నీ, మెట్లతో కూడిన నీటి గుంటల్నీ రూపొందించడానికి అట్టిపెడతారు. ఈ నిర్మాణాలు పొలాల్లోపలే వర్ష జలాన్ని ఒడిసిపడతాయి. ఫలితంగా వర్షకాలంలో ప్రతి నీటి చుక్కనూ సంరక్షించి, సంగ్రహించి, తిరిగి ఉపయోగించడం వీలు పడుతుంది.
దీనివల్ల అసాధారణ ఫలితాలు దక్కాయి:
• ఇదివరకు పారే వాననీరు ఇకపై నేలనూ, నీటి కుంటలనూ రీచార్జి చేస్తుంది.
• నేల కోతకు గురికావడం చాలా వరకూ తగ్గిపోయింది.
• చినుకు రాలని కాలాల్లో పంటల్లో తేమ స్థాయులు మెరుగుపడ్డాయి.
• భూగర్భ నీటి మట్టం రీచార్జి స్థిరంగానే కాక నిరంతరంగా సాగుతోంది.
ఈ మోడల్ నిరంతర నీటి నిర్వహణకు విస్తృత స్థాయిలో నీటి రవాణా గాని, లేదా భారీ ఎత్తున పెట్టుబడి పెట్టాల్సిన అవసరం గాని లేదని రుజువు చేసింది. దీని కోసం కావలసిందల్లా సామూహిక ఇచ్ఛాశక్తే.
సామూహిక ఏకతే ఉద్యమానికి జోరును అందిస్తోంది
ఈ ప్రచార ఉద్యమానికి పెద్ద ఎత్తున సామూహిక భాగస్వామ్యం బలాన్ని అందింది. మహిళలు ‘నీరన్ర నాయికలు’గా మారి, కుటుంబాలకు మార్గాన్ని చూపారు. వారు జల సంరక్షణ కోసం ఇంకుడు గుంతలను నిర్మించడంలో సారథ్యం వహించారు. దీంతో పాటు జానపద గీతాలతో చైతన్యాన్ని వ్యాప్తి చేశారు. యువ స్వచ్ఛంద కార్యకర్తలు ‘జల దూతలు’గా పదుగురికీ పరిచయమై, కందకాల మ్యాపింగుతో పాటు కాలవల్లోని పూడికలను తీయడం, వీధి నాటికలు ఏర్పాటు చేయడంతో పాటు నీటిని పొదుపుగా వాడుకోవాలని చాటి చెబుతున్న బొమ్మలను గోడలపైన గీసి ఈ ఉద్యమానికి శక్తినిచ్చారు. ఉమ్మడిగా శ్రమదానం చేసి 440 కన్నా ఎక్కువ సాంప్రదాయిక చెరువులను పునరుద్దరించారు. ఆ చెరువులను ప్రకృతి సిద్ధమైన నీటి నిల్వ వనరులుగా మార్చారు. ఈ ఉద్యమం నుంచి స్ఫూర్తిని పొంది, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు చెందిన 500 మందికి పైగా లబ్ధిదారులు కూడా తమ ఇళ్ల వద్ద నీటి నిలవ కుంటలను రూపొందించారు. దీంతో జల సంరక్షణ ప్రభుత్వ కార్యక్రమంగా ఉన్నది కాస్తా ఒక సామూహిక బాధ్యతగా రూపుదిద్దుకొంది.
భాగస్వామ్యం నుంచి యాజమాన్యం వరకూ
5 శాతం మాడల్ విజయవంతం కావడం ఒక్క మౌలిక సదుపాయాల కల్పనలోనే కాదు, యాజమాన్యంలోనూ ఇమిడిపోయింది. గ్రామ సభలో తీర్మానాలు చేయడం ద్వారా, శాస్త్రీయ ప్రణాళికల అండతో ఈ కార్యక్రమం నిజానికి ఒక ప్రజాందోళనగా మారింది.
1,260మంది కన్నా ఎక్కువ రైతులు తమ పొలాల్లో 5 శాతం చొప్పున భూమిని రీచార్జి వ్యవస్థకు అట్టిపెట్టారు. జిల్లా అంతటా చూస్తే 2,000కు పైగా నీటి ఇంకుడు గుంతలను సిద్ధం చేశారు. గ్రామీణ గృహనిర్మాణ పథకాల లబ్ధిదారులు తమంతట తాము ఇళ్ల వారగా ఇలాంటి గుంతలను తవ్వుకొని, నీటి రీచార్జిని నిత్య జీవననంలో భాగంగా మార్చుకున్నారు.
ఉమ్మడి కార్యాచరణతో ముడిపడిన ఈ చరిత్రాత్మక చొరవలో సముదాయాలు కేవలం 3 గంటల లోపల 660 ఇంకుడు గుంతలు నిర్మించారు. ఇవి సమన్వయపూర్వక సార్వజనిక భాగస్వామ్య శక్తికి సంకేతంగా నిలిచాయి.
కంటికి కనిపించే పర్యావరణ పరమైన, సామాజిక పరమైన ప్రయోజనాలు
జల్ సంచయ్ జన్ భాగీదారీ ప్రభావం స్పష్టంగానూ, పరిమాణాత్మకంగానూ కనిపించడం మొదలైంది:
• చాలా గ్రామాల్లో భూగర్భ జల మట్టం 3 మీటర్ల మొదలు 4 మీటర్ల వరకూ పెరిగింది.
• సుదూరంగా ఉన్న ఆదివాసీ పల్లెల్లో ఏరులను పునరుద్ధరించారు.
• నేలలో తేమ వాటా పునరుద్ధరణ మెరుగుపడిన కారణంగా వ్యావసాయిక ఉత్పాదకత ఇదివరకటి కన్నా వృద్ధి చెందింది.
• జీవనోపాధి మార్గాలు స్థిరపడినందువల్ల రుతువును బట్టి వలస పోవడం సుమారుగా 25 శాతం మేర తగ్గింది.
నీటి భద్రత ఆర్థిక భద్రతను బలోపేతం చేసింది.
విజ్ఞాన శాస్త్రం, సాముదాయిక భావనల మేలికలయిక
జిల్లా యంత్రాంగం సూక్ష్మ వాటర్‌షెడ్ మ్యాపింగ్, జలభూవైజ్ఞానిక అంచనాలు, సాంకేతిక మార్గదర్శకత్వంల ద్వారా ఈ కార్యక్రమానికి మద్దతును అందించింది. దీంతో ప్రతి ఒక్క నిర్మాణానికీ గరిష్ఠ రీచార్జి సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా స్థల ఎంపికను చేపట్టారు. ఇంత జరిగినా, సాముదాయిక నాయకత్వమే ప్రేరక శక్తిగా ఉంటూ వచ్చింది. శాస్త్రీయ ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం.. వీటి కలబోత ఒక స్థిర పాలన నమూనాను ఆవిష్కరించింది.
కొరియా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ, ‘‘ఈ కార్యక్రమం కేవలం నిర్మాణాలకే పరిమితం కాదు. ఇది మన రైతుల భవిష్యత్తును సురక్షితంగా ఉంచే, వలసలను తగ్గించే, ప్రతి పల్లెలో భరోసాతో కూడిన నీటి లభ్యతకు పూచీ పడడంతో ముడిపడి ఉంది. కొరియా జిల్లా ఈ వేగాన్ని నిలబెడుతూ సుస్థిర అభివృద్దిలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది’’ అన్నారు.
భారత్‌ను దృష్టిలో పెట్టుకొని ఒక మార్గదర్శక నమూనాను ఇవ్వడం
వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడాన్ని వికేంద్రీకరించిన, చౌకయిన, భాగస్వామ్యపూర్వక మాడల్‌గా చేపట్టవచ్చని కొరియా జిల్లా అనుసరిస్తున్న 5 శాతం మాడల్ నిరూపించింది. ఇది నీటిని నిల్వ చేయడం కోసం ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా జల సంరక్షణను ఫలానా విభాగానికి అప్పజెప్పిన బాధ్యతగా మాత్రమే కాక, పౌరుల ఉమ్మడి బాధ్యతగా మార్చవచ్చో చాటిచెబుతోంది.
ప్రజలు తమ భూమిలో కేవలం 5 శాతాన్నిస్తూ, తమ జల సంబంధిత భవిష్యత్తును 100 శాతం సురక్షితమైందిగా మార్చేసుకున్నారు.
కొరియా జిల్లా తాను ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి సమస్య తన భవితను నిర్ణయించే స్థితిలోనే తాను కొనసాగాలని భావించలేదు. అది ఏకత, నవకల్పన, ఉమ్మడి కార్యాచరణ.. వీటిలో నమ్మకం పెట్టుకొని మరీ ప్రతిస్పందించింది.
కొరియా జిల్లా అమలు చేసిన 5 శాతం నమూనా ఎప్పుడైతే ప్రజలు జల సంరక్షణ కోసం కలిసి నడుస్తారో, అప్పుడు ఈ వనరును రాబోయే కాలపు అవసరాలకు సంరక్షించుకోవడం సాధ్యమేనని పక్కాగా నిరూపిస్తోంది.



***
(రిలీజ్ ఐడి: 2235608)
సందర్శకుల సూచీ సంఖ్య : : 65