ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

బెళగావిలోని యడూరు శ్రీ వీరభద్రేశ్వర ఆలయంలో రాజగోపురం, కలశారోహణంతో పాటు మహా కుంభాభిషేక ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి


హిందూ చేతన కేవలం ఆచారాలకు పరిమితం కాదు, అది జీవన మార్గమన్న ఉపరాష్ట్రపతి

ఆధ్యాత్మిక, విద్యా, సాంస్కృతిక, సామాజిక అభ్యున్నతిలో వీరశైవ లింగాయత్ సంప్రదాయం అందిస్తున్న తోడ్పాటును ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి

భారత ఆధ్యాత్మిక దృష్టి ప్రకృతితో పాటు ప్రతి ఒక్క మనిషిలోనూ దివ్యత్వాన్ని దర్శిస్తుంది: ఉపరాష్ట్రపతి

సనాతన ధర్మం కాలపరీక్షకు గురికావచ్చునేమో గాని, దానిని చెరిపివేయడం ఎన్నటికీ సాధ్యం కాదన్న ఉపరాష్ట్రపతి

ప్రధానమంత్రి దార్శనికత ‘‘వికాస్ భీ, విరాసత్ భీ’’ (అభివృద్ధితో పాటు వారసత్వం) కేవలం ఒక ప్రకటన కాదు, అది భారత్‌లో అభివృద్ధితో పాటు వారసత్వం కలిసికట్టుగా నడవాలని
స్పష్టం చేస్తోంది: ఉపరాష్ట్రపతి

పవిత్ర స్థలాల పునరుద్ధరణ ఒక్క వాస్తుకళకు మాత్రమే పరిమితం కాదు, అది సాంస్కృతిక ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పునరుద్ధరించడానికి సంబంధించిందన్న ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 05 MAR 2026 12:45PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు కర్నాటకలోని బెళగావి జిల్లా యడూరులో శ్రీ వీరభద్రేశ్వర ఆలయ రాజగోపురం, కలశారోహణం, మహాకుంభాభిషేక కార్యక్రమ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
శ్రీ క్షేత్ర యడూరులో సభను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ ఈ సందర్భాన్ని సాంస్కృతిక పునరుత్థానంగానే కాక నాగరికతను పునరుద్ధరించుకొనే క్షణమని కూడా వర్ణించారు.
భారత్ కేవలం ఒక దేశం కాదు.. అది చైతన్యవంతమైన నాగరికతగా భాసిల్లుతోందని ఉపరాష్ట్రపతి అన్నారు. సింధూ లోయ మొదలు కన్యాకుమారి వరకు ప్రవహిస్తున్న చైతన్యం ఒక నిరంతర ప్రవాహం భారత్ అని ఆయన అన్నారు. ఈ పవిత్ర భూమిలో వేదాల శాశ్వత జ్ఞ‌ానం మొదటిసారి ప్రసారమైందన్నారు. అలాగే భగవద్గీత ధైర్యంతో పాటు కర్తవ్య నిర్వహణకు ముందుకు ఉరకాలని, ధర్మ మార్గంలో నడవాలని, తిరుగులేని నమ్మకంతో అంకితమివ్వాలని మానవ జాతికి మార్గదర్శనం చేస్తుందని ఉపరాష్ట్రపతి చెప్పారు.
హిందూ చేతన ఒక్క ఆచారాలకే పరిమితం కాదని, అది ఒక జీవన మార్గమని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రకృతిలో, ప్రతి ఒక్క మనిషిలో దివ్యత్వాన్ని దర్శిస్తున్న ‘‘వసుధైవ కుటుంబకమ్’’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే శాశ్వత సిద్ధాంతాన్ని, భారత ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
వీరశైవ లింగాయత్ వారసత్వాన్ని గురించి ఉపరాష్ట్రపతి చెబుతూ కర్నాటకలోను, పొరుగునే ఉన్న మహారాష్ట్రలోను ఆధ్యాత్మిక, విద్యా, సాంస్కృతిక, సామాజిక అభ్యున్నతిలో ఈ వారసత్వం చెప్పుకోదగిన తోడ్పాటును అందించిందన్నారు.
విశ్వాసం, సేవ, సామాజిక సద్భావనల విలువలను పెంచి పోషించడంలో వీరశైవ మఠాలు, ఆలయాలు ఒక పరివర్తన పూర్వక భూమికను పోషించాయని ఆయన తెలిపారు.
శివ యోగి శ్రీ కాడసిద్ధేశ్వర్ స్వామీజీ ఆధ్యాత్మిక దృష్టికోణానికి ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. ఆ స్వామీజీ కాలంతో పాటు కనుమరుగైన ఒక పవిత్ర స్థలాన్ని తిరిగి కనుగొని, పునరుజ్జీవింప చేసి సనాతన ధర్మమనే శాశ్వత జ్యోతిని ప్రజ్వలింప చేశారన్నారు. సనాతన ధర్మానికి తరచుగా పరీక్షలు ఎదురవ్వొచ్చేమో గాని, దానిని ఎన్నటికీ చెరిపివేయజాలరని ఉపరాష్ట్రపతి అన్నారు.
నిత్య పూజ, మతాచారాలు, జీర్ణోద్ధరణ పనులతో పాటు ఆధ్యాత్మిక సేవ.. వీటిని సంరక్షించడంలో శ్రీ కాడసిద్ధేశ్వర మఠానికి చెందిన మఠాధిపతులంతా అలుపెరుగని ప్రయత్నాలు చేస్తుండడం ప్రశంసనీయమని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెబుతున్న ‘‘వికాస్ భీ, విరాసత్ భీ’’ (అభివృద్ధితో పాటే వారసత్వం) దృష్టికోణాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, భారత్‌లో అభివృద్ధి, వారసత్వం కలిసి ముందుకు సాగాలన్నారు. భారత్ తన నాగరికత మూలాలను బలంగా నిలబెట్టుకొంటూనే ప్రస్తుతం సాంకేతికంగా ఉన్నతిని సాధిస్తూ, ఆర్థికంగా పటిష్ఠమవుతూ, ప్రపంచంలో ప్రభావవంతమైన దేశంగా పురోగమిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
రాజగోపురాన్ని ప్రారంభించుకోవడమంటే అది విశ్వాస పునరుద్ఘాటన, సంప్రదాయానికి నిరంతరాయతను సంతరించడమని ఉపరాష్ట్రపతి వర్ణించారు. పవిత్ర స్థలాల పునరుద్ధరణంటే అది ఒక్క వాస్తుకళకు సంబంధించింది మాత్రమే కాదు.. సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పునరుద్ధరించడంతో సమానమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న వారిలో కర్నాటక గవర్నరు శ్రీ థావర్‌చంద్ గెహ్లోత్, కర్నాటక ప్రభుత్వ భారీ, మధ్యతరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ  మంత్రి శ్రీ ఎం.బి. పాటిల్, శ్రీ శ్రీశైల జగద్గురు డాక్టర్ చన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్య స్వామీజీ, పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ) శ్రీ ఈరణ్ణ కడాడి, ధార్మిక ప్రముఖులతో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా హాజరయ్యారు.

 

***


(రిలీజ్ ఐడి: 2235582) సందర్శకుల సూచీ సంఖ్య : : 67
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada , Malayalam