ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ఆర్థిక వృద్ధిని నిలబెట్టుకోవడం, బలోపేతం చేయడం’పై నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబినార్‌నుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


· నిరంతర ఆర్థిక వృద్ధి, ఆర్థిక బలోపేతంపై మా నిబద్ధతను చాటేలా ఈ ఏడాది బడ్జెట్

· మా దశా దిశా, సంకల్పం సుస్పష్టం... మరింతగా నిర్మిద్దాం, ఉత్పత్తిని పెంచుదాం, మెరుగ్గా అనుసంధానిద్దాం, ఎగుమతులను పెంచుదాం

· ప్రపంచం నేడు విశ్వసనీయ, పటిష్టమైన తయారీ భాగస్వాముల కోసం చూస్తోంది.. ఈ పాత్రను సమర్థంగా నెరవేర్చే అవకాశం నేడు భారత్‌కు ఉంది

· అనేక దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు: దేశానికి విస్తృతమైన అవకాశాలు... ఈ తరుణంలో నాణ్యత మన బాధ్యత

· కర్బనోద్గారాల శోషణ, వినియోగం, నిల్వ ముఖ్య కార్యక్రమం.. ప్రధాన వాణిజ్య వ్యూహంలో స్థిరత్వాన్ని ఏకీకృతం చేయడం అత్యావశ్యకం

· కాలానుగుణంగా పర్యావరణ హిత సాంకేతికతల్లో పెట్టుబడి పెట్టే పరిశ్రమలకే.. మున్ముందు కొత్త మార్కెట్లలో మెరుగైన ప్రవేశ యోగ్యత

· వ్యయం పైనే కాదు, స్థిరత్వంపైనా నేడు మార్కెట్ల దృష్టి... ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పరివర్తన ఇది: ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 03 MAR 2026 1:02PM by PIB Hyderabad

‘ఆర్థిక వృద్ధిని నిలబెట్టుకోవడం, బలోపేతం చేసుకోవడం’ అంశంపై ఈ రోజు నిర్వహించిన బడ్జెట్ అనంతర రెండో వెబినార్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత వారం ఉత్సాహాన్ని గుర్తుచేసుకుంటూ.. మొదటి వెబినార్ విజయవంతమైందని, బడ్జెటులో పేర్కొన్న అంశాల అమలుపై అద్భుతమైన సూచనలు వచ్చాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

దేశ ఆర్థిక వృద్ధికి నిరంతర బలాన్ని సమకూర్చడంతో అంతర్లీనంగా ఈ వెబినార్‌ ముడిపడి ఉందని ప్రధానమంత్రి అన్నారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల రూపురేఖలు మారుతున్న ఈ తరుణంలో.. బలమైన భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి ఒక ఆశాకిరణంగా మారిందని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన పురోగతి, వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

మరింతగా నిర్మిద్దాం, ఉత్పత్తిని పెంచుదాం, మెరుగ్గా అనుసంధానిద్దాం, ఎగుమతులను పెంచుదాం అనే మూల మంత్రాలను గుర్తుచేస్తూ... ప్రభుత్వ స్పష్టమైన లక్ష్యాన్ని, దృఢ సంకల్పాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ‘‘నిశ్చయంగా ఈ రోజు మీ మధ్య జరిగే చర్చలు, మీరిచ్చే సూచనలు కీలక పాత్ర పోషిస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

వివిధ రంగాల మధ్య సమన్వయం గురించి వివరిస్తూ.. తయారీ రంగం, లాజిస్టిక్స్, ఎంఎస్ఎంఈలు, పట్టణ కేంద్రాలు విడివిడి విభాగాలు కావని, అవన్నీ ఒకే ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమై ఉన్న మూలస్తంభాలని ప్రధానమంత్రి వివరించారు. తయారీ రంగం ఎగుమతులను ఎలా ప్రోత్సహిస్తుందో, అలాగే పోటీతత్వం కలిగిన ఎంఎస్ఎంఈలు సౌలభ్యాన్ని, ఆవిష్కరణలను ఎలా పెంపొందిస్తాయో ఆయన వివరంగా పేర్కొన్నారు. ‘‘వీటన్నింటికీ ఈ ఏడాది బడ్జెట్ గొప్ప బలాన్ని చేకూర్చింది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

కేవలం విధానపరమైన దిశానిర్దేశం మాత్రమే ఫలితాలను ఇవ్వదనీ.. పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల క్రియాశీల భాగస్వామ్యం కూడా ఆవశ్యకమనీ ప్రధానమంత్రి స్పష్టం చేశారు. తయారీని, ఉత్పత్తిని పెంచడంతోపాటు ఖర్చులను మరింత పోటీతత్వంతో మార్చడం వంటి అంశాలపై చర్చలకు ప్రాధాన్యమివ్వాలని చర్చలో భాగస్వాములను ఆయన కోరారు. ‘‘ఈ దిశగా మీరిచ్చే సూచనలు.. అభివృద్ధిని దేశంలో నలుమూలలకూ చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

తయారీ రంగంలోని ప్రధాన సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, ప్రస్తుత అవరోధాలను తొలగించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి వివరించారు. ‘‘మన వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడమే.. ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్లు, కంటైనర్ తయారీ వంటి రంగాలపై దృష్టి సారించడంలో ప్రధాన లక్ష్యం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

బడ్జెట్ లో ప్రకటించిన బయోఫార్మా శక్తి మిషన్ గురించి కూడా ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బయోలాజిక్స్, అధునాతన వైద్య పద్ధతులకు అంతర్జాతీయ కేంద్రంగా భారత్‌ను నిలపడమే ఈ మిషన్ లక్ష్యం. ‘‘అధునాతన బయోఫార్మా పరిశోధనలు, తయారీ రంగంలో అగ్రగామిగా నిలిచే లక్ష్యంతో పయనించాలని ఆకాంక్షిస్తున్నాం’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా.. ప్రస్తుతం నమ్మకమైన, పటిష్టమైన తయారీ భాగస్వాముల కోసం ప్రపంచం క్రియాశీలంగా అన్వేషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. పూర్తి విశ్వాసంతో పెట్టుబడులు పెట్టాలని, అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, పరిశోధనలపై భారీగా పెట్టుబడులు పెట్టాలని, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలను పాటించాలని భాగస్వాములను ఆయన కోరారు. ‘‘ప్రపంచం కోరుకుంటున్న పాత్రను బలంగా పోషించే అవకాశం భారత్‌కు ఉంది’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల గురించి ప్రస్తావిస్తూ... ఈ ఒప్పందాలు అపారమైన అవకాశాలకు తలుపులు తెరిచాయని, నాణ్యతపై దృష్టి సారించాల్సిన బాధ్యత భారతీయ పరిశ్రమలపై ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ వినియోగదారుల అభిరుచులూ, వారి అవసరాలపై పరిశోధించి, వారికి అనుకూలమైన ఉత్పత్తులను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘‘అప్పుడే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభిస్తున్న అవకాశాలను మనం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలుగుతాం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి వర్గీకరణలో ఇటీవలి సంస్కరణలు.. చిన్న తరహా పరిశ్రమలలో ఉన్న విస్తరణ భయాన్ని తొలగించాయని ప్రధానమంత్రి అన్నారు. రుణ సదుపాయం, సాంకేతిక నవీకరణలను ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తున్నప్పటికీ.. ఎంఎస్ఎంఈలు అంతర్జాతీయ స్థాయి పోటీలో నిలిస్తేనే నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఉత్పాదకతను పెంచుకోవడానికి, నాణ్యత ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి, డిజిటల్ ప్రక్రియలతో అనుసంధానంతోపాటు అన్ని దశల్లోనూ బలోపేతమయ్యేలా ఎంఎస్ఎంఈలకు ఇదే సరైన సమయం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ఈ ఏడాది బడ్జెటులో మూలధన వ్యయానికి రికార్డు స్థాయిలో కేటాయింపులు చేశామని ప్రధానమంత్రి చెప్పారు. తద్వారా మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ రంగాలు దేశ వికాసానికి మూలాధారాలుగా నిలుస్తాయని వివరించారు. హై స్పీడ్ రైలు మార్గాల విస్తరణ, మల్టీ మోడల్ రవాణా సదుపాయాలు, నౌకల మరమ్మతు కేంద్రాలు... సామర్థ్యాన్ని పెంపొందించుకునే దిశగా ఇవి కీలకమైన చర్యలని ఆయన పేర్కొన్నారు. ‘‘పరిశ్రమలు, పెట్టుబడిదారులు తమ వ్యూహాలను ఈ మౌలిక సదుపాయాలకు అనుగుణంగా మార్చుకుంటేనే, వీటి అసలైన ప్రయోజనం సిద్ధిస్తుంది’’ అని ఆయన గుర్తుచేశారు.

పట్టణీకరణ గురించి ప్రస్తావిస్తూ.. సమర్థమైన నగర ప్రణాళిక, నిర్వహణతోనే దేశ భవిష్యత్తు వృద్ధి ముడిపడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను నూతన వృద్ధి కేంద్రాలుగా ఎలా తీర్చిదిద్దవచ్చనే అంశంపై సలహాలివ్వాలని సూచించారు. ఈ విషయంలో సలహాలు అత్యంత ముఖ్యమైనవని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ స్పృహ దిశగా మార్పులను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ప్రస్తుతం మార్కెట్లు కేవలం వస్తువు ధరనే కాకుండా, పర్యావరణంపై అది చూపే ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయని చెప్పారు. ‘కర్బన శోషణ, వినియోగం, నిల్వ మిషన్’ ఒక కీలకమైన ముందడుగు అన్నారు. పర్యావరణ హిత సాంకేతికతలను మౌలిక వాణిజ్య వ్యూహాల్లో అంతర్భాగంగా చేసుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ‘‘సకాలంలో పర్యావరణ హిత సాంకేతికతలపై పెట్టుబడి పెట్టే పరిశ్రమలకు భవిష్యత్తులో కొత్త మార్కెట్లలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి’’ అని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు.

‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు ‘సమష్టి బాధ్యత’ తీసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. చర్చలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ యంత్రాంగంతో భాగస్వాములై అభివృద్ధిలో వేగాన్ని పెంచాలని చర్చలో భాగస్వాములను ఆయన కోరారు. ‘‘మీ ప్రతి సూచనకు, మీ ప్రతి అనుభవానికి, క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను తీసుకురాగల సామర్థ్యం ఉంది’’ అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

***

 

(రిలీజ్ ఐడి: 2235040) సందర్శకుల సూచీ సంఖ్య : : 74