ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ గురు తేగ్ బహదూర్ ‘350వ అమర సమాగమం’లో ప్రధానమంత్రి ప్రసంగం


· “సిక్కు సమాజంతోపాటు సామాజిక ఐక్యత దిశగా ఆయన కృషి అనిర్వచనీయం”

· “శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ కాలం నాటి ఘనమైన సత్యం.. సాహస స్ఫూర్తి నేటికీ సందర్భోచితమే”

నాడు పోస్టు చేయడమైనది: 01 MAR 2026 7:52PM by PIB Hyderabad

‘హింద్ ది చాదర్’ శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ జీ 350వ అమర సమాగమం (బలిదాన వార్షిక సంస్మరణ) సంస్మరణ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయనకు నివాళి అర్పిస్తూ, మహనీయుడైన ఆ గురువును నేడు మరొకసారి స్మరించుకుంటున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ చారిత్రక, పవిత్ర కార్యక్రమంలో పాలు పంచుకోవడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

భారతదేశ చరిత్ర సాహసం, సామరస్యం, సహకారం వంటి సుగుణాలకు ఒక ప్రతీక అని ప్రధానమంత్రి అన్నారు. మహారాష్ట్ర గడ్డపై నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ఆ వారసత్వాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. గురువుల అసమాన త్యాగానికి నెలవైన ఆ శకంలో సామాజిక ఐక్యత కీలక పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. సత్యం, సంస్కృతి పరిరక్షణలో నాటి గురువుల నుంచి అన్ని వర్గాల ప్రజలు స్ఫూర్తి పొందారని వ్యాఖ్యానించారు. “శ్రీ గురు గోవింద్ సింగ్ అనుసరించిన ‘గురు నానక్ నామ్-లేవా సంగత్’ వంటి సంప్రదాయాలు ఆనాటి సామాజిక ఐక్యత మహా యజ్ఞంలో కీలక పాత్ర పోషించాయి” అని శ్రీ మోదీ గుర్తుచేశారు.

ఈ సందర్భంగా జాతీయ సమైక్యత ప్రాధాన్యాన్ని ప్రస్ఫుటం చేస్తూ- దేశం మరోసారి సామాజిక ఐక్యతపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో గురువుల, సాధువుల ఆశీస్సులు మనకు ఉన్నాయని ఈ అద్భుత ‘సంగత్’ (సమాగమం) దేశానికి  భరోసా ఇస్తున్నదని చెప్పారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ పావన భూమినుంచి నిరుడు ప్రారంభమైన ఈ సమాగమ నిర్వహణ ఒక నిరంతర పయనంగా మారి, నాందేడ్‌లోని ‘తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్’ వద్ద మరింత ప్రాధాన్యం సంతరించుకోవడం మనం చూశామని ప్రధానమంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో “ఇవాళ నవీ ముంబైలో, ఈ పయనం ఒక కీలక మలుపును చేరుకున్నది. శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ ఘన చరిత్రను ఈ కార్యక్రమం గ్రామగ్రామానికీ చేరువ చేసి, మహారాష్ట్ర నలుమూలలకూ వ్యాపింపజేసింది” అని శ్రీ మోదీ వివరించారు. ఈ కార్యక్రమ నిర్వహణపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఇటీవలి సంస్కరణ కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ- హర్యానాలోని కురుక్షేత్రలో నిర్వహించిన ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడం తనకు లభించిన గౌరవంగా పరిగణించానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గురు సాహిబ్‌ల సంబంధిత ప్రతి చారిత్రక సందర్భాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ 400వ జయంతి నాడు ‘స్మారక తపాలా బిళ్ల, ప్రత్యేక నాణెం’ ఆవిష్కరించడాన్ని గుర్తుచేశారు. అలాగే శ్రీ గురు నానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా వైభవోపేతంగా నిర్వహించిన కార్యక్రమం వంటి కీలక ఘట్టాలను శ్రీ మోదీ ప్రస్తావించారు. ఈ విధంగా ప్రతి సందర్భాన్నీ భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, అంతేకాకుండా ‘సాహిబ్‌జాదాల' గౌరవార్థం ఏటా ‘వీర బాలల దినోత్సవం’ నిర్వహించే కొత్త జాతీయ సంప్రదాయాన్ని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

అంతేకాకుండా ‘కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్’ నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తి చేయడం, ‘శ్రీ హేమకుండ్ సాహిబ్ యాత్ర’ కోసం కొత్త సౌకర్యాల కల్పన వంటి కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి గుర్తుచేశారు. “సిక్కు సంస్థలు, గురుద్వారాలతో ముడిపడిన సంస్థలకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. అలాగే పాఠశాల స్థాయి పాఠ్యాంశాలు సహా  సాంస్కృతిక కార్యక్రమాల్లో సిక్కు చరిత్రకు సముచిత స్థానం కల్పించేలా చూశాం. ఇలా సిక్కు సమాజం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కార్యాలన్నిటినీ చక్కబెడుతున్నాం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

సిక్కులకు గౌరవం, న్యాయంపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, 1984 నాటి అల్లర్లపై విచారణ నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. అలాగే, మూసివేసిన కేసులను తిరగదోడి, దోషులకు శిక్షపడేలా చేశామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా 1984 అల్లర్ల నాటి బాధిత కుటుంబాలకు అదనపు పరిహారం ప్రకటించామని, మైనారిటీల జాతీయ కమిషన్‌కు మరింత ప్రాధాన్యం కల్పించామని ఆయన వివరించారు.

ఆఫ్ఘనిస్థాన్‌లోని సిక్కు సోదరుల భద్రతను ప్రభుత్వం “నిర్దిష్ట లక్ష్యం”గా పరిగణించి చర్యలు చేపట్టిందని చెప్పారు. అలాగే, ‘గురు గ్రంథ్ సాహిబ్’ మూల ప్రతులను గౌరవప్రదంగా స్వదేశానికి తెచ్చామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా “ఆఫ్ఘన్ సిక్కులు, హిందువులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. హింసకు గురైన శరణార్థులకు ‘సీఏఏ’ ద్వారా ఉపశమనం కల్పించింది. జమ్మూకాశ్మీర్‌లోని సిక్కు కుటుంబాలకు పునరావాస ప్యాకేజీలను అమలు చేసింది”  అని శ్రీ మోదీ వివరించారు. ఓసీఐ, వీసా నిబంధనల సరళీకరణతోపాటు విదేశాల్లోని సిక్కుల ప్రయాణ సౌలభ్యం కోసం వేలాది మంది పేర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

“సిక్కు సమాజం విశ్వాసాలను గౌరవించడం, వారి పురోగమనానికి కొత్త అవకాశాలను సృష్టించడాన్ని ఒక సేవా హక్కుగానే కాకుండా తన బాధ్యతగా ప్రభుత్వం పరిగణిస్తోంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

చివరగా- శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ కాలం నాటి ఘనమైన సత్యం, సాహస స్ఫూర్తి నేటికీ సందర్భోచితమేనని ప్రధానమంత్రి అన్నారు. “నవ తరం ఈ విలువలతో అనుసంధానితులైతే సంప్రదాయం ఒక సంస్మరణగా కాకుండా భవిష్యత్తుకు దిశను నిర్దేశించేదిగా మారుతుంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. “ఈ సమాగమ ప్రధానోద్దేశం చరిత్ర పునశ్చరణకు పరిమితం కారాదు.. దాన్ని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవనశైలిలో అంతర్భాగం చేసుకోవాలి” అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

 

***


(రిలీజ్ ఐడి: 2234658) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam