ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని సానంద్‌లో మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
మైక్రాన్ సెమీకండక్టర్ కేంద్రం ప్రారంభోత్సవం సాంకేతిక నాయకత్వం వైపు భారత్ ప్రయాణంలో ఒక మైలురాయి: ప్రధాని
సాఫ్ట్‌వేర్ శక్తిగా ఎంతోకాలంగా గుర్తింపు పొందిన భారత్ హార్డ్‌వేర్ రంగంలో కూడా తన ముద్రను బలంగా వేస్తోంది: ప్రధాని
భారత్ నేడు ప్రపంచ సెమీకండక్టర్ విలువ శ్రేణిలో వేగంగా అంతర్భాగం అవుతోంది: ప్రధాని
ఈ శతాబ్దం ఏఐ విప్లవానిదే: ప్రధానమంత్రి
గత శతాబ్దాన్ని చమురు శాసించి ఉంటే, ఈ శతాబ్దాన్ని మైక్రోచిప్స్ శాసిస్తాయి: ప్రధాని
ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు భారత్ సందేశం ఒక్కటే - భారత్ సిద్ధంగా ఉంది, భారత్ నమ్మకమైంది, భారత్ ఫలితాలను అందిస్తుంది: ప్రధానమంత్రి
భారత్ సమర్థవంతమైంది, పోటీతత్వం కలది, అంకితభావం కలిగింది అనే సందేశం ప్రపంచానికి స్పష్టంగా చేరింది: ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
28 FEB 2026 7:10PM by PIB Hyderabad
గుజరాత్‌లోని సానంద్‌లో మైక్రాన్ అసెంబ్లీ, టెస్ట్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభాన్ని సూచించే ఈ చారిత్రాత్మక ఘట్టం ప్రపంచ సాంకేతిక నాయకత్వం వైపు భారత్ భారత ప్రయాణంలో ఒక ముందడుగు.
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ఏఐ సమ్మిట్ తర్వాత, నేడు మనం మరో చారిత్రాత్మక మైలురాయిని చూస్తున్నామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. "ఏఐ సమ్మిట్ ద్వారా భారత ఏఐ సామర్థ్యం ప్రపంచానికి తెలిస్తే, నేటి సందర్భం సాంకేతిక నాయకత్వం పట్ల భారత అంకితభావానికి నిదర్శనం" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
భారత్ ఒకప్పుడు ప్రధానంగా సాఫ్ట్‌వేర్, ఐటీ సేవలకు మాత్రమే గుర్తింపు పొందిందని, కానీ ఇప్పుడు హార్డ్‌వేర్ రంగంలో కూడా తన ముద్రను వేగంగా బలపరుచుకుంటోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. "నేడు సానంద్‌లో ఒక కొత్త భవిష్యత్తు ప్రారంభాన్ని మనం చూస్తున్నాం. మైక్రాన్ ఏటీఎంపీ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం ప్రపంచ సాంకేతిక విలువ శ్రేణిలో భారత పాత్రను మరింత బలోపేతం చేస్తుంది" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
విధాన రూపకల్పన నుంచి ఉత్పత్తి వరకు మునుపెన్నడూ లేని వేగంతో పనులు జరుగుతున్న "నవ భారత్" ఆలోచనా విధానాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్ట్ వేగవంతమైన పురోగతిని వివరిస్తూ, జూన్ 2023లో అవగాహన ఒప్పందం కుదిరిందని, ఆ తర్వాత సెప్టెంబర్ 2023లో సానంద్‌లో భూమి పూజ జరిగిందని గుర్తుచేశారు. "ఫిబ్రవరి 2024 నాటికి పైలట్ కేంద్రంలో యంత్రాల ఏర్పాటు ప్రారంభమైంది, ఇది ఫిబ్రవరి 2026లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభానికి దారితీసింది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
భారతదేశం సంక్లిష్టమైన నియంత్రణ ప్రక్రియలను గణనీయంగా సరళీకరించిందని, అడ్వాన్స్‌డ్ ప్రైసింగ్ అగ్రిమెంట్లను (ఏపీఏ) కేవలం కొన్ని నెలల్లోనే విజయవంతంగా పూర్తి చేస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇదే ప్రక్రియ పూర్తి కావడానికి సాధారణంగా మూడు నుంచి నుండి ఐదు ఏళ్ల సమయం పడుతుందని ఆయన గుర్తుచేశారు.
“సంకల్పం స్పష్టంగా ఉండి, దేశం వేగవంతమైన అభివృద్ధి పట్ల అంకితభావంతో ఉన్నప్పుడు, విధానాలు పారదర్శకంగా మారుతాయి. నిర్ణయాలు వేగం పుంజుకుంటాయి" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
ఈ కేంద్రం భారత్, అమెరికాల మధ్య, ముఖ్యంగా ఏఐ, చిప్ టెక్నాలజీ రంగాలలో ఉన్న బలమైన భాగస్వామ్యానికి నిదర్శనమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా ప్రపంచ సరఫరా వ్యవస్థ రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను మరింత నమ్మకమైనదిగా మార్చేందుకు ఏఐ సమ్మిట్ సందర్భంగా కుదుర్చుకున్న 'పాక్స్ సిలికా' ఒప్పందాన్ని ఒక ముఖ్యమైన ప్రయత్నంగా ఆయన ఉదహరించారు.
ఈ శతాబ్దం ఏఐ విప్లవ శతాబ్దమని పేర్కొంటూ, ఈ మార్పుకు సెమీకండక్టర్లే వారధి అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. చారిత్రక మార్పులను పోలుస్తూ, 20వ శతాబ్దాన్ని చమురు శాసించి ఉంటే, 21వ శతాబ్దాన్ని మైక్రోచిప్ శాసిస్తుందని శ్రీ మోదీ తెలిపారు. పారిశ్రామిక విప్లవాన్ని ఏఐ విప్లవంతో అనుసంధానించే మాధ్యమం ఒక చిన్న చిప్ అని ఆయన వివరించారు. "ఈ దార్శనికతతోనే సెమీకండక్టర్ రంగంలో దూకుడుగా ముందుకు సాగాలని భారత్ నిర్ణయించుకుంది. ప్రపంచం కోవిడ్ విలయంతో పోరాడుతున్న సమయంలోనే భారత్ తన సెమీకండక్టర్ మిషన్‌ను ప్రకటించింది. మహమ్మారి కాలంలో అంతా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, మనం నమ్మకంతో నాటిన విత్తనాలు ఇప్పుడు పెరిగి ఫలితాలను ఇస్తున్నాయి" అని శ్రీ మోదీ ప్రముఖంగా పేర్కొన్నారు.
సెమీకండక్టర్ రంగం పట్ల భారత నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ కింద 10 ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, ఉత్తరప్రదేశ్, అసోం, ఒడిశా, పంజాబ్ సహా వివిధ రాష్ట్రాల్లో మరో మూడు ప్రాజెక్టులు త్వరలో ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. "మనం నిర్మిస్తున్న ఈ వ్యవస్థ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు. ఇది అఖిల భారత వ్యాప్తం. 'వికసిత భారత్' కోసం దేశంలోని ప్రతి మూలలో కొత్త టెక్ హబ్‌లు అభివృద్ధి చెందుతున్నాయి" అని శ్రీ మోదీ తెలిపారు.
సెమీకండక్టర్ వ్యవస్థ అంటే కేవలం ఒక కర్మాగారం మాత్రమే కాదని, అందులో యంత్ర తయారీదారులు, డిజైన్ ఇంజనీర్లు, పరిశోధనా సంస్థలు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు, నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు ఇలా అనేక విభాగాలు ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వీటన్నింటి సమన్వయం ద్వారానే ఒక చిప్ తయారవుతుందని వివరించారు. " మొత్తం విలువ శ్రేణి పై భారత్ దృష్టి పెడుతోంది. ఇందుకోసమే ఈ ఏడాది బడ్జెట్‌లో 'ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0' ప్రకటించాం” అని ప్రధాని తెలిపారు. అభివృద్ధి స్థాయిని వివరిస్తూ, "ఉత్పత్తి పెరిగే కొద్దీ భారతదేశంలో ముడిపదార్థాలు, విడిభాగాలు, సేవల అవసరం కూడా పెరుగుతుంది. ఇదే అతిపెద్ద అవకాశం" అని శ్రీ మోదీ అన్నారు.
"భారత జనాభాలో చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు మొదటిసారి గ్యాడ్జెట్లను వాడుతున్నారు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ లేదా ఇతర సాంకేతికతలు ఏవైనా సరే, వీటికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. 'మేక్ ఇన్ ఇండియా' ఇప్పుడు పూర్తి స్థాయిలో సాగుతోంది," అని శ్రీ మోదీ ప్రముఖంగా పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ రంగం ఉత్పత్తి, ఎగుమతులలో సాధించిన బహుముఖ వృద్ధిని వివరిస్తూ, "పెట్టుబడిదారులకు ఇటు దేశీయ మార్కెట్, అటు అంతర్జాతీయ అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సానంద్ ఆటోమొబైల్ హబ్‌గా మారిన తీరును ఉదహరిస్తూ, మైక్రాన్ కేంద్రం ఒక కొత్త సెమీకండక్టర్ వ్యవస్థకు పునాది వేస్తుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ డేటా సెంటర్లు, ఏఐ అప్లికేషన్లు, మొబైల్ పరికరాల కోసం ఈ ప్లాంట్ డి-రామ్, నంద్ సొల్యూషన్లను ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏటీఎంపీ క్లీన్‌రూమ్‌లలో ఒకటి ఇక్కడ ఉండటం, తక్కువ నీటి వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన ప్రశంసించారు.
గుజరాత్ ప్రభుత్వ విధానాలను ప్రశంసిస్తూ, సెమీకండక్టర్ రంగం కోసం రూపొందించిన విధానాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. గుజరాత్ సాంకేతిక రంగంలో వేగంగా ముందుకు సాగడాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. "అనుమతులు, భూమి కేటాయింపు, మౌలిక సదుపాయాల వంటి ప్రక్రియలను సరళీకరించడం పెట్టుబడిదారుల నమ్మకాన్ని బలపరిచింది. ధోలేరా, సానంద్ పశ్చిమ భారత దేశ సెమీకండక్టర్ క్లస్టర్‌లుగా అభివృద్ధి చెందుతున్నాయి" అని శ్రీ మోదీ పేర్కొన్నారు. సెమీకండక్టర్ రంగానికి అవసరమైన రసాయనాలు, పెట్రోకెమికల్స్ వంటి ముడిపదార్థాల పరిశ్రమలతో పాటు, నైపుణ్య శిక్షణ కేంద్రాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని ప్రధానమంత్రి వివరించారు.
ప్రపంచ పెట్టుబడిదారులకు "భారత్ సిద్ధంగా ఉంది. భారత్ నమ్మకమైంది. భారత్ ఫలితాలను అందిస్తుంది" అనే శక్తిమంతమైన సందేశంతో ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తిరుగులేని మద్దతు ఉంటుందని ఆయన ప్రపంచ భాగస్వాములకు, పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చారు. ఈ దశాబ్దం భారత సాంకేతిక ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మలుపు అని ఆయన పేర్కొన్నారు. "భారత్ సమర్థవంతమైంది. భారత్ పోటీతత్వం కలది. భారత్ అంకితభావం కలిగింది" అనే స్పష్టమైన, దృఢమైన నిబద్ధతతో కూడిన ఆయన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది.
***
(రిలీజ్ ఐడి: 2234075)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4