వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసిన భారత్-ఇజ్రాయెల్ ఎఫ్‌టీఏ తొలి విడత చర్చలు
ఎఫ్‌టీఏ చర్చల్లో విస్తృత అంశాలపై సమీక్ష.. మే 2026లో ఇజ్రాయెల్‌లో తదుపరి విడత చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
26 FEB 2026 6:56PM by PIB Hyderabad
భారత్-ఇజ్రాయెల్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు న్యూఢిల్లీలో జరిగిన మొదటి విడత చర్చలు ఇవాళ విజయవంతంగా ముగిశాయి. వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని పెంపొందించే అంశాలపై చర్చలకు రూపొందించిన అధికారిక విధివిధానాల(టీఓఆర్)పై నవంబర్ 2025లో సంతకాలు జరిగాయి.
రెండు రోజుల పర‌్యటన నిమిత్తం ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో ఉన్న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఫిబ్రవరి 2026న జెరూసలెంలోని నెసెట్ ప్రత్యేక ప్లీనరీ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ఇప్పటివరకు వినియోగించుకోని వాణిజ్య సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు ప్రతిష్ఠాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
భారత్‌కు వచ్చిన ఇజ్రాయెల్ ప్రతినిధి బృందంతో 24 ఫిబ్రవరి 2026న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. వాణిజ్యం, ఆవిష్కరణలు, వృద్ధి రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇరుపక్షాలు పనిచేయాలని, తద్వారా రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. ఆధునిక, సమగ్ర, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండే వాణిజ్య ఒప్పందానికి ఇరుదేశాలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నాలుగు రోజుల పాటు జరిగిన చర్చల్లో వస్తు, సేవల వాణిజ్యం, వస్తువుల మూల స్థాన నియమావళి, శానిటరీ, ఫైటోశానిటరీ చర్యలు, వాణిజ్యానికి సాంకేతిక అడ్డంకులు, సుంకాల విధానాలు, మేధో సంపత్తి హక్కులు, డిజిటల్ వాణిజ్యం వంటి విస్తృతమై అంశాలపై ఇరుదేశాలు చర్చించాయి. నిర్మాణాత్మకంగా, భవిష్యత్ ప్రణాళికతో ఈ చర్చలు జరిగాయి. సమగ్ర, సమతుల్య, ఇరుపక్షాలకు ప్రయోజకర ఒప్పందాల కోసం చర్చలు జరపాలని ఇరుదేశాల లక్ష్యాన్ని స్పష్టం చేశాయి. తదుపరి విడత ప్రత్యక్ష చర్చలు మే 2026లో ఇజ్రాయెల్‌లో జరగనున్న నేపథ్యంలో అంతకన్నా ముందుగా వర్చువల్ పద్ధతిలో చర్చలను కొనసాగించటానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వస్తు వాణిజ్యం సుమారు 3.62 బిలియన్ డాలర్లు. భారత్, ఇజ్రాయెల్‌లో వ్యాపారాలకు స్థిరమైన, అంచనా వ్యవస్థను అందించటం ద్వారా వాణిజ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతిపాదిత ఎఫ్‌టీఏ అవకాశం కల్పిస్తుంది. యంత్రాలు, రసాయనాలు, వస్త్రాలు, వ్యవసాయం, వైద్య పరికరాలు, అధునాతన సాంకేతికతలు వంటి కీలక రంగాల్లో ఇప్పటికీ వినియోగించుకోని సామర్థ్యం ఉందని ఇరుపక్షాలు గుర్తించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటానికి, వాణిజ్య భాగస్వాములకు నూతన అవకాశాలను సృష్టించటానికి ఇరుదేశాలు ఇస్తున్న ప్రాధాన్యతను విజయవంతమైనన మొదటి విడత చర్చలు ప్రతిబింబిస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2233344)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2