జల శక్తి మంత్రిత్వ శాఖ
సుజల్ గ్రామ సంవాద్ నాలుగో సంచికను స్థానిక భాషల్లో నిర్వహించిన డీడీడబ్ల్యూఎస్: కార్యక్రమంలో పాల్గొన్న అయిదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 6 గ్రామపంచాయతీలు
ఆయా గ్రామాల ప్రజలతో స్థానిక భాషల్లో సంభాషించడం ద్వారా బలోపేతమవుతున్న ‘జన్ భాగీదారి’, సామాజిక భాగస్వామ్య నీటి నిర్వహణ
తాము అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను స్థానిక భాషల్లోనే పంచుకొనే అవకాశాన్ని గ్రామాలకు అందించిన ‘సుజల్ గ్రామ్ సంవాద్’
నాడు పోస్టు చేయడమైనది:
24 FEB 2026 5:26PM by PIB Hyderabad
నీటి నిర్వహణలో సామాజిక భాగస్వామ్యానికి, సమాజ నేతృత్వంలో జల్ జీవన్ మిషన్ (జేజేఎం) అమలులో భారత ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ.. ‘సుజల్ గ్రామ్ సంవాద్’ నాలుగో సంచికను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్) విజయవంతంగా నిర్వహించింది.
వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రతినిధులు, గ్రామీణ నీటి-పారిశుద్ధ్య కమిటీ (వీడబ్ల్యూఎస్‌సీ) సభ్యులు, పౌరులు, మహిళా ఎస్‌హెచ్‌జీలు, విద్యార్థులు, క్షేత్ర స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. వీరితో పాటుగా జేజేఎం మిషన్ డైరెక్టర్లు, జిల్లా కలెక్టర్లు/జిల్లా మెజిస్ట్రేట్లు/డిప్యూటీ కమిషనర్లు, డీడబ్ల్యూఎస్ఎం అధికారులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సుజల్ గ్రామ సంవాద్ నాలుగో సంచికలో భాగంగా 6 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామస్థాయి చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్న 2,000 మంది పాల్గొన్నారు. ఇది సమాజం, అధికారులకు ఉన్న దృఢ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో మహిళలు, చిన్నారులు, యువత, వృద్ధులతో సహా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో నమోదు చేసుకున్న వారి సంఖ్య కంటే ఎక్కువ సామూహిక భాగస్వామ్యం కనిపించింది.
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి మౌలిక వసతుల కల్పనపై జేజేఎం దృష్టి సారించిందని డీడీడబ్ల్యూఎస్ కార్యదర్శి శ్రీ అశోక్ కేకే మీనా అన్నారు. ఈ వ్యవస్థలు స్థిరంగా కొనసాగేలా చూడటమే అత్యంత కీలకమన్నారు. మౌలిక వసతులను ఏర్పాటు చేసిన అనంతరం, సమర్థమైన కార్యకలాపాలు, నిర్వహణ వ్యవస్థల ద్వారా క్రమం తప్పకుండా గృహాలకు తాగునీటిని సరఫరా చేయడంలోనే అసలైన బాధ్యత ఉందన్నారు. అలాగే స్థిరంగా సేవలను అందించడమే కేంద్రీయ ప్రాధాన్యం కావాలని తెలియజేశారు.
నీటి సరఫరా నిర్వహణ ప్రాథమికంగా స్థానిక సంస్థల బాధ్యత అని ఆయన తెలిపారు. పథకాల అమలులో గ్రామపంచాయతీలు, వీడబ్ల్యూఎస్‌సీలు పోషించే కీలకపాత్ర గురించి కూడా ఆయన వివరించారు. భవిష్యత్తులో నీటి సరఫరా వ్యవస్థల బాధ్యతను గ్రామపంచాయతీలకు ఇవ్వడంపై ప్రధాన దృష్టి సారిస్తున్నామని, తద్వారా నిర్వహణ, నియంత్రణలో వాటికి పూర్తి అధికారం లభిస్తుందన్నారు.ఈ పరివర్తనకు అవసరమైన సాంకేతిక, నిర్వహణ సహకారాన్ని అందించడానికి జిల్లా సాంకేతిక విభాగం (డీటీయూ)తో సహా ఇతర సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేస్తామని ఆయన వివరించారు.
జల్ సేవా ఆంకలన్ ద్వారా పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామపంచాయతీలు ఏటా గ్రామసభకు నీటి సేవల వివరాలను సమర్పిస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే పెద్ద సంఖ్యలో గ్రామపంచాయతీలు పూర్తి చేశాయని, మిగిలినవి సైతం త్వరలోనే దీన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మార్చి 8 నుంచి 22 వరకు జాతీయ స్థాయి జల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో మొదలై.. ప్రపంచ జల దినోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో దృష్టి సారించే విషయాలు:
జల్ అర్పణ్ దివస్ ద్వారా గ్రామపంచాయతీలకు తాగు నీటి సరఫరా వ్యవస్థలను అధికారికంగా అప్పగించడం.
నీటి నాణ్యతా పరీక్షలు, పర్యవేక్షణను బలోపేతం చేయడం.
గ్రామ, జిల్లా స్థాయుల్లో సంస్థాగత సామర్థ్య నిర్మాణం.
సమాజ భాగస్వామ్యంతో స్వచ్ఛమైన తాగునీటికి హామీ.
ప్రతి గ్రామంలోనూ స్థిరమైన, సమాజ నేతృత్వ నీటి నిర్వహణ ఉండేలా, జల్ మహోత్సవ్‌లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
క్షేత్రస్థాయి అభిప్రాయాలు
పశ్చిమ దామ్‌చెరా, ఉత్తర త్రిపుర, త్రిపుర
ఉత్తర త్రిపురలోని పశ్చిమ దామ్‌చెరా ప్రజలతో సంభాషణ ద్వారా సంవాద్ ప్రారంభమైంది. వీడబ్ల్యూఎస్‌సీ సభ్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, పంప్ ఆపరేటర్లు, ఎఫ్‌టీకే- శిక్షణ పొందిన మహిళలు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బెంగాలీలో తమ అనుభవాలను పంచుకున్నారు. జేజేఎం అమలుకు ముందు వాగులు, సీజనల్ నీటి వనరుల నుంచి శుద్ధి చేయని నీటిపై ఆధారపడాల్సి వచ్చేదని, దానివల్ల నీటికొరతను, నీటి ద్వారా వచ్చే వ్యాధులను ఎదుర్కోవాల్సి వచ్చేదన్నారు.
జేజేఎం ద్వారా ఇంటింటికీ కుళాయి సౌకర్యాన్ని కల్పించడంతో తమ దైనందిన జీవితం గణనీయంగా మెరుగుపడిందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పిందన్నారు. తరచూ నీటి నాణ్యతా పరీక్షలతో పాటు క్రమం తప్పకుండా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయడం వల్ల బాలల్లో డయేరియా, తదితర వ్యాధులు గణనీయంగా తగ్గాయని వెల్లడించారు.
అలాగే జల్ సేవా ఆంకలన్ కూడా పూర్తయిందని వారు తెలియజేశారు. పైపులైన్ల లీకేజీలను సాంకేతిక బృందం తక్షణమే పరిష్కరించి, జాప్యం లేకుండా సాధారణ నీటి సరఫరాను పునరుద్ధరిస్తోందని, ఇది స్థానిక నిర్వహణ, పర్యవేక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
అలాగే ఇళ్లలో, సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి, సమర్థమైన మురుగు నీటి నిర్వహణ ద్వారా గ్రామీణ వాతావరణం స్వచ్ఛంగా మారుతోందన్నారు.
సెడెరాపేట, పుదుచ్చేరి, పుదుచ్చేరి
సెడెరాపేట కమ్యూనిటీ సభ్యులు డీడీడబ్ల్యూఎస్ అధికారులతో తమిళంలో మాట్లాడుతూ, 1,248 గృహాలకు, 6,700 మంది జనాభాకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు గృహాలకు తాగునీటి కనెక్షన్ (ఎఫ్‌హెచ్‌టీసీ)లు 100 శాతం అందించామని తెలిపారు. ఈ తాగునీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా, సమర్థంగా పనిచేస్తోందని తెలిపారు.
నీటి మౌలిక వసతులను విస్తరిస్తూ 5,000 లీటర్ల సామర్థ్యమున్న ఓవర్ హెడ్ ట్యాంకును, ఏడు బోరుబావులను, 24 డిస్ట్రిబ్యూషన్ కనెక్షన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరంతరాయంగా సేవలను అందించేందుకు క్రమం తప్పకుండా వీటిని పర్యవేక్షిస్తామని తెలిపారు. పంచాయతీ స్థాయిలో ప్రత్యేకంగా కేటాయించిన పంపు ఆపరేటర్లు వాటి దైనందిన కార్యకలాపాలను నిర్వహిస్తారు.
అన్ని గృహాలకు సురక్షితమైన తాగు నీరు అందుతుందని నిర్ధారించుకోవడానికి కాలానుగుణంగా నాణ్యత పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగం కూడా ఉంది.
పులిమామిడి, రంగారెడ్డి, తెలంగాణ
తెలంగాణలోని పులిమామిడి గ్రామానికి చెందిన రైతులు డీడీడబ్ల్యూఎస్ అధికారులతో తెలుగులో మాట్లాడారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని గృహాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు 100 శాతం కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని నిరంతరం సరఫరా చేస్తున్నామని తెలిపారు. తమ గ్రామంలో జల్ అర్పణ్, జల్ సేవా ఆంకలన్ కార్యక్రమాలు రెండూ పూర్తయ్యాయని వెల్లడించారు. త్వరలో చేపట్టనున్న జల మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జల అర్పణ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే బాలలకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పిస్తూ.. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని టాయిలెట్లకు కుళాయి సౌకర్యం, హ్యాండ్ వాషింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే అందరికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
న్గోపోక్ పోక్‌దుమ్, తూర్పు సియాంగ్, అరుణాచల్ ప్రదేశ్
జేజేఎం కింద చేపట్టిన పనులు తమ గ్రామంలో పూర్తయ్యాయని న్గోపోక్ గ్రామానికి చెందినవారు స్థానిక ఆది భాషలో డీవోడబ్ల్యూఆర్ అధికారులకు వివరించారు. గ్రావిటీ ఆధారిత నీటి సరఫరా వ్యవస్థ ద్వారా అయిదు గూడేల్లోని 330 గృహాలకు స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ జిల్లాలో 24X7 క్రమం తప్పకుండా, విశ్వసనీయంగా నీటిని అందించే మొదటి గ్రామ పంచాయతీగా న్గోపోక్ మారింది. ఉత్తమ పనితీరు కనబరిచే వీడబ్ల్యూఎస్‌సీ, శిక్షణ పొందిన ‘నల్ జల్ మిత్ర’లు, నీటి నాణ్యతను పరీక్షలను నిర్వహించే నిపుణులైన పది మంది మహిళలతో చురుకైన సామాజిక భాగస్వామ్యం, నిర్వహణను ఈ పంచాయతీ తెలియజేసింది.
క్రమం తప్పకుండా ఐఈసీ కార్యకలాపాలను నిర్వహిస్తామని, రిజిస్టర్ల సక్రమంగా నిర్వహిస్తూ వినియోగ రుసుం వసూలు చేస్తామని, నీటి వ్యవస్థ సుస్థిరతకు హామీ ఇచ్చేలా ఇంటింటికీ అవగాహన కల్పిస్తామని వారు తెలియజేశారు. నిర్వహణ, పర్యవేక్షణ అవసరాల నిమిత్తం ప్రతి ఇంటికీ రూ.50 చొప్పున, వాణిజ్య సంస్థలకు రూ.200 చొప్పున నెలవారీ ఛార్జీలు విధించేందుకు గ్రామసభ ఆమోదం తెలిపింది. స్వచ్ఛతా శ్రమదాన్, నిల్వ ట్యాంకుల నిర్వహణ, నీటి వనరులన్న ప్రదేశాల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం విస్తృతంగా ఉంది. నీటి వ్యవస్థను పరిరక్షించడంలో, దీర్ఘకాల స్థిరత్వాన్ని అందించడంలో పంచాయతీ నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. నీటి శుద్ధి కేంద్రాలున్న ప్రదేశాల దగ్గర చెత్త వేస్తే జరిమానాలు విధించడం, వనరులను క్రమం తప్పకుండా పరిశీలించడం వంటి చర్యలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
మాతవార్, తూర్పు ఖాసీ హిల్స్, మేఘాలయ
కొండ ప్రాంతాలు, ఎత్తయిన ప్రదేశాలకు నీటిని అందించడాన్ని సవాలుగా పరిగణిస్తారని మాతవార్ సర్పంచ్ ఇంగ్లీషులో చెప్పారు. జేజేఎంకు ముందు తమ గ్రామస్థులు, ముఖ్యంగా మహిళలు నదులు, బావుల నుంచి నీటిని తీసుకువచ్చేందుకు రోజుకు 1 నుంచి 3 గంటలు వెచ్చించేవారని, వేసవిలో తరచూ పొడవైన క్యూలో నిల్చొని ఎదురుచూసేవారని తెలియజేశారు. జేజేఎం ద్వారా గ్రావిటీ ఆధారిత పంపిణీ సౌకర్యాన్ని అందించేందుకు ఎత్తయిన స్టోరేజీ ట్యాంకులను నిర్మించామని, ప్రతి ఇంటికీ క్రమం తప్పకుండా తాగునీటిని అందిస్తున్నామని వివరించారు. శారీరక భారం తగ్గడం, సమయం ఆదా అవడం, గౌరవం, సౌలభ్యం పెరగడంతో సహా రోజువారీ జీవితంలో ముఖ్యంగా మహిళల జీవితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించిందన్నారు.
సేవల సరఫరాలో అంతర్భాగంగా నీటి నాణ్యత మారిందని ఆ గ్రామ నాయకులు తెలియజేశారు. ఏడాదిలో కనీసం మూడు సార్లు శిక్షణ పొందిన నలుగురు మహిళలు, ఆశాలు, అంగన్వాడీలు పరీక్షిస్తారని తెలిపారు. పంపిణీ నిర్వహణ, నాణ్యతా పర్యవేక్షణ, అవగాహాన కార్యక్రమాలు, ఫిర్యాదు పరిష్కారంలో వీడబ్ల్యూఎస్‌సీ చురుకైన పాత్రను పోషిస్తోందని తెలియజేశారు. లీకేజీల వంటి చిన్న సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకుంటామని, పెద్ద సమస్యలను పీహెచ్ఈడీ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఇది దృఢమైన సామాజిక బాధ్యతను, సమర్థవంతమైన గ్రామీణ నీటి నిర్వహణ వ్యవస్థను ప్రతిబింబిస్తోంది.
కున్నమ్మల్, కోజికోడ్, కేరళ
కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కున్నమ్మల్ గ్రామ పంచాయతీ నుంచి ప్రజా ప్రతినిధులు, జేజేఎం లబ్ధిదారులు తమ అనుభవాలను మలయాళంలో పంచుకున్నారు. గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు వేసవిలో ట్యాంకర్లపై పంచాయతీ ఆధారపడాల్సి వచ్చేదని తెలియజేశారు. జేజేఎం అమలు తర్వాత ఏడాదంతా స్వచ్ఛమైన తాగు నీరు ఇళ్లకు అందుతోందని, 24×7 తాగునీటి సరఫరాతో గ్రామం స్వావలంబనను సాధించిందని వెల్లడించారు. పంచాయతీలో శిక్షణ పొందిన స్థానిక స్వచ్ఛంద సేవకుల బృందం ఉందని, వారు క్రమం తప్పకుండా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారని, సరఫరా అవుతున్న తాగునీరు సురక్షితంగా, విశ్వసనీయంగా ఉండేలా చూస్తారని తెలిపారు.
కోజికోడ్ జిల్లా సబ్ కలెక్టర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటి సరఫరా, సేవా అవసరాలను వాస్తవ సమయంలో ట్రాక్ చేయడానికి జిల్లావ్యాప్తంగా వాట్సాప్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఉపయోగిస్తున్నామని వివరించారు. హర్ ఘర్ జల్ సర్టిఫైడ్ పంచాయతీలుగా మరిన్ని పంచాయతీలను ప్రకటించడానికి చురుగ్గా ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు. సురక్షితమైన తాగునీటిని అందరికీ అందించడంలో, క్షేత్ర స్థాయి సరఫరా విధానాలను బలోపేతం చేయడంలో కేరళ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో ఇచ్చిన వివరణాత్మక ప్రజెంటేషన్‌ను ఎన్‌జేజేఎం ఏఎస్ అండ్ ఎండీ కమల్ కిషోర్ సోన్ తన ముగింపు ఉపన్యాసంలో ప్రశంసించారు. అలాగే పంచాయతీ, జిల్లా అధికారులు చేపట్టిన సమగ్ర ప్రయత్నాలను అభినందించారు. భాగస్వామ్య విధానాన్ని, జల్ జీవన్ క్లబ్‌ల వంటి అవగాహన కార్యక్రమాలను, ఇతర ఫిర్యాదు పరిష్కార వ్యవస్థల ఏర్పాటును ఆయన మెచ్చుకున్నారు.
ఈ వేదిక ఉత్తమ పద్ధతులను ప్రదర్శించడానికి మాత్రమే కాకుండా సవాళ్లను చర్చించి వాటిని సమిష్టిగా పరిష్కరించేందుకు కూడా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే జల్ మహోత్సవ్ (మార్చి 8–22)లో అన్ని గ్రామ పంచాయతీలు చురుకుగా పాల్గొనాలని సూచించారు. సమాజ యాజమాన్యాన్ని బలోపేతం చేయడానికి, నీటి పంపిణీని సంస్థాగతీకరించడానికి, నీటి నాణ్యత పర్యవేక్షణ ప్రయత్నాలను మరింత మెరుగుపరచడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
ఇలాంటి ఉత్తమ పద్ధతులను విస్తరించడానికి, మరిన్ని పంచాయతీలను బోర్డులోకి తీసుకురావడానికి నిరంతర ప్రయత్నాలు చేపట్టాలన్నారు. తద్వారా పారదర్శకత, పౌర భాగస్వామ్యం, జవాబుదారీతనం నిండి ఉన్న ఈ తరహా నమూనాలను ఇతర ప్రాంతాలలో కూడా అవలబించవచ్చని తెలియజేశారు.
సుజల్ గ్రామ్ సంవాద్ నాలుగో సంచిక ఉద్దేశాన్ని వివరిస్తూ ఎన్‌జేజేఎం డిప్యూటీ కార్యదర్శి డాక్టర్ అంకిత చక్రబర్తి ఈ కార్యక్రమాన్ని ప్రారభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వాగతం పలికారు. ఎన్‌జేజేఎం, డైరెక్టర్ శ్రీ వైకే సింగ్ ధన్యవాదాలు తెలపడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
నాలుగో సంచికను ఇక్కడ వీక్షించండి:
Ministry of Jal Shakti | Webcast Services of National Informatics Centre, Government of India
***
(రిలీజ్ ఐడి: 2232876)
సందర్శకుల సూచీ సంఖ్య : : 56