రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతి భవన్‌లో చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని ఆవిష్కరించిన భారత రాష్ట్రపతి... రాజాజీ ఉత్సవంలో పాల్గొన్న శ్రీమతి ద్రౌపది ముర్ము
· 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా మనం ముందుకు సాగుతున్న తరుణంలో.. రాజాజీ వంటి మహనీయుల ఆలోచనలు, ఆదర్శాలు మనలో స్ఫూర్తిని నింపుతాయి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
· రాజాజీ ఉత్సవ్‌లో భాగంగా ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకు ప్రజల కోసం ప్రదర్శన
నాడు పోస్టు చేయడమైనది:
23 FEB 2026 6:16PM by PIB Hyderabad
స్వతంత్ర భారత తొలి, ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ శ్రీ చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని.. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (2026 ఫిబ్రవరి 23) రాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కరించారు. భారత ఉపరాష్ట్రపతి కూడా పాల్గొన్న ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. అశోక మండపం సమీపంలోని ప్రధాన మెట్ల దారి వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి ఎదురుగా ఉన్న ఎడ్విన్ లూట్యెన్స్ విగ్రహం స్థానంలో సి. రాజగోపాలాచారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వలసవాద మనస్తత్వపు అవశేషాలను తొలగించి.. సుసంపన్నమైన భారతీయ సంస్కృతి, వారసత్వం, శాశ్వత సంప్రదాయాలను గర్వంగా స్వీకరించే దిశగా చేపడుతున్న వరుస చర్యల్లో భాగమిది.

అనంతరం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన రాజాజీ ఉత్సవ్‌లో రాష్ట్రపతి పాల్గొన్నారు. అక్కడ ఆయన జీవితం, సేవలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో, పుస్తక ప్రదర్శనను ఆమె వీక్షించారు. ఈ సందర్భంగా రాజాజీ జీవిత విశేషాలతో కూడిన ఒక చలన చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలను రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు వీక్షించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, రాజాజీ నాటి ప్రభుత్వ బంగ్లా (ప్రస్తుత రాష్ట్రపతి భవన్)కు వచ్చిన సమయంలో.. రామకృష్ణ పరమహంస, మహాత్మాగాంధీ చిత్రపటాలను తన గదిలో పెట్టారని గుర్తుచేశారు. ఆ సమయానికి భారత్ సాంకేతికంగా ఇంకా అధినివేశ హోదాలోనే ఉన్నప్పటికీ.. సంపూర్ణ స్వరాజ్య భావన భారతీయుల హృదయాల్లో నాటుకుపోయిందన్న స్పష్టమైన సందేశాన్ని రాజాజీ అందించారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆ విధంగా మానసిక వలసవాద నిర్మూలనకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. భారతీయ వారసత్వాన్ని గర్వంగా చాటుకోవడం, వలసవాద మనస్తత్వపు ఆనవాళ్లను తుడిచిపెట్టడం కోసం నేడు భారతీయులు చేపట్టిన జాతీయ ఉద్యమంలో రాజాజీ ఆదర్శాలు ప్రతిబింబిస్తున్నాయని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. భారతీయులందరితో, ముఖ్యంగా బలహీన వర్గాలతో ఆయన అనుబంధం, భారతీయ స్పృహ రాజాజీ ఆలోచనల్లోనూ, చర్యల్లోనూ స్పష్టంగా కనిపిస్తాయని ఆమె వివరించారు.

గతంలో రాష్ట్రపతి భవన్ కారిడార్లలో భారతదేశాన్ని దోచుకున్న బ్రిటిష్ సామ్రాజ్యవాద అధికారుల చిత్రపటాలు గోడలకు వేలాడుతూ ఉండేవని రాష్ట్రపతి గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ‘పరమ వీర దీర్ఘ’గా పిలుచుకుంటున్న గ్యాలరీని.. పరమ వీర చక్ర గ్రహీతల చిత్రపటాలతో అలంకరించామన్నారు. అలాగే, భారత ప్రాచీన భాషల గ్రంథాల్లో, రాతప్రతుల్లో నిక్షిప్తమై ఉన్న గొప్ప విజ్ఞాన పరంపరను పరిరక్షించడం లక్ష్యంగా రాష్ట్రపతి భవన్‌లో ‘గ్రంథ కుటీర్’ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
రాష్ట్రపతి భవన్ అంటే ‘దేశ భవనం’ అనీ, ఇది దేశ ప్రజలందరిదీ అనీ రాష్ట్రపతి అన్నారు. భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలు, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం గురించి తెలుసుకోవాలనుకునే వారందరికీ స్వాగతం పలికేలా.. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌తోపాటు షిమ్లా, హైదరాబాద్, డెహ్రాడూన్‌లలోని రాష్ట్రపతి నిలయాలను ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తెచ్చినట్టు ఆమె తెలిపారు.

బ్రిటిష్ పాలనలో భారత్ అనేకసార్లు కరువు కాటకాల వంటి విపత్తులను ఎదుర్కొందని రాష్ట్రపతి గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో కూడా మన ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొన్నారన్నారు. తోటి ప్రజలపై కరుణతో, రైతుల్లో స్ఫూర్తిని నింపేందుకు.. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోనే ధాన్యపు సాగును రాజాజీ ప్రారంభించారని ఆమె తెలిపారు. స్వయంగా ఆయనే పొలం దున్ని ఒక అద్భుత ఉదాహరణగా నిలిచారని కొనియాడారు. రాజాజీ బహుముఖ ప్రజ్ఞాశాలి అనీ, ఆయనలో అనేక పార్శ్వాలున్నాయనీ రాష్ట్రపతి అన్నారు. న్యాయవాద వృత్తి, స్వాతంత్ర్య పోరాటం, సామాజిక, ఆర్థిక సంస్కరణలు, ప్రాచీన భారతీయ గ్రంథాలు, తమిళ, ఆంగ్ల రచనలు, కవిత్వం, సంగీతం, రాజకీయం, పరిపాలన వంటి అనేక అంశాల్లో ఆయన సేవలు ఆయా రంగాలను సుసంపన్నం చేశాయని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. రాజాజీ వివరించిన ‘స్వరాజ్య’ భావనను.. నేడు మన దేశం అనుసరిస్తున్న స్వదేశీ, ఆత్మనిర్భర అంశాలు ముందుకు తీసుకెళ్తున్నాయని రాష్ట్రపతి వివరించారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా మనం ముందుకు సాగుతున్న తరుణంలో.. రాజాజీ వంటి మహనీయుల ఆలోచనలు, ఆదర్శాలు మనకు స్ఫూర్తినిస్తాయని వ్యాఖ్యానించారు. రాజాజీ స్వప్నాలను సాకారం చేసేలా, ప్రతి ఒక్కరూ వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించుకోవాలని ఆమె కోరారు. రాజాజీ వ్యక్తిత్వం, ఆయన సేవల స్ఫూర్తితో.. ‘దేశమే ప్రథమం’ భావనతో భారతీయులంతా నిరంతరం ముందుకు సాగుతారని రాష్ట్రపతి ధీమా వ్యక్తం చేశారు.

భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్, విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు శ్రీ హరివంశ్, న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, మరికొందరు ప్రముఖులు రాజాజీ ఉత్సవ్‌లో పాల్గొన్నారు.
ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ.. వలసవాదం నుంచి విముక్తి దిశగా మన ప్రయాణంలో నేటి రాజాజీ ఉత్సవ్ ద్వారా మరొక మైలురాయిని చేరుకున్నామన్నారు. వలసవాద ప్రభావం నుంచి భారత్ క్రమంగా విముక్తమవుతోందన్నారు. ఇది కేవలం ఒక సంఘటనకే పరిమితం కాదన్నారు. పరిపాలన, చట్టం, విద్య, సంస్కృతి, దేశ అస్తిత్వాల్లో వస్తున్న సమూల పరివర్తనగా దీనిని పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లు లోక్ భవన్‌లుగా, ప్రధానమంత్రి కార్యాలయం సేవా తీర్థగా, కేంద్ర సచివాలయం కర్తవ్య భవన్‌గా మారడం, అలాగే వలస కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకురావడం, ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నెలకొల్పడం, జాతీయ యుద్ధ స్మారక నిర్మాణం... ఇవన్నీ ఇందులో భాగమేనని ఆయన వివరించారు. ఈ మార్పులు కేవలం ప్రతీకాత్మకమైనవి మాత్రమే కావనీ, ప్రభుత్వ ‘సేవా భావన’ను ఇవి ప్రతిబింబిస్తున్నాయనీ వ్యాఖ్యానించారు.

భరతమాత ముద్దు బిడ్డకు సరైన గుర్తింపునిస్తూ, ఆయన ఘనతను చాటే వేడుక ఈ రాజాజీ ఉత్సవమని ఉపరాష్ట్రపతి అన్నారు. దేశ చరిత్రలో రాజాజీ విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారనీ, ఆయన అసాధారణ ప్రజ్ఞాశాలి అనీ కొనియాడారు. ఆర్థిక స్వాతంత్ర్యం గురించి ఆయన ఎల్లప్పుడూ చెబుతుండేవారనీ, దేశ ఆర్థిక విధానం స్వతంత్రంగానూ ఉదారంగానూ ఉండాలని ఆయన బలంగా విశ్వసించారనీ ఉపరాష్ట్రపతి తెలిపారు. నిజమైన గొప్పతనం పదవితోనో అధికారం వల్లో రాదనీ, అంతర్గత సంస్కారం, నైతిక బలం, విలువలకు కట్టుబడి ఉండడం వల్లే అది లభిస్తుందనీ రాజాజీ జీవితం మనకు గుర్తు చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంపించిన సందేశాన్ని.. సాంస్కృతిక మంత్రి ప్రేక్షకుల ఎదుట చదివి వినిపించారు.
ప్రధానమంత్రి తన సందేశంలో ఇలా పేర్కొన్నారు: - “చారిత్రక రాష్ట్రపతి భవన్ సెంట్రల్ కోర్ట్‌యార్డ్‌లో.. రాజాజీగా అందరికీ సుపరిచితులైన శ్రీ చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని గౌరవ రాష్ట్రపతి ఆవిష్కరించడం భారతీయులందరికీ గర్వకారణం.
మహాత్మా గాంధీతో రాజాజీకి ఉన్న సన్నిహిత సంబంధం, వారి మధ్య బలమైన పరస్పర విశ్వాసం, స్నేహం అందరికీ తెలిసిందే. అందుకే, మహాత్మాగాంధీ విగ్రహానికి సరిగ్గా ఎదురుగా రాజాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అత్యంత సముచితం. అంతేకాకుండా గతంలో ఎడ్విన్ లూట్యెన్స్ విగ్రహం ఉన్న చోటే ఇప్పుడు రాజాజీ విగ్రహాన్ని నెలకొల్పడం కీలకమైన అంశం. మానసిక వలసవాద నిర్మూలనలో ఇది అత్యంత ముఖ్యమైన చర్య.
నేడు రాష్ట్రపతి భవన్ ఒక అధికార కేంద్రంగా మాత్రమే కాకుండా, భారతీయ నాగరికతలో వేళ్ళూనుకున్న ప్రజాస్వామ్య ఆత్మవిశ్వాసానికి ఒక ప్రత్యక్ష రూపంగా నిలుస్తోంది. రాజాజీ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు, శ్రీ సి. రాజగోపాలాచారి గారి విగ్రహావిష్కరణ వంటి చర్యలు దీనిని పునరుద్ఘాటిస్తున్నాయి. దేశ గమనాన్ని తీర్చిదిద్దిన మహనీయులనూ, వారి స్మృతినీ గౌరవించుకోవడం ద్వారానే స్వాతంత్ర్యం సుస్థిరమవుతుందని ఇవి మనకు గుర్తు చేస్తున్నాయి.”
వలసవాద మనస్తత్వ ఆనవాళ్లను తొలగించే దిశగా మరో ముందడుగు రాజాజీ విగ్రహావిష్కరణ అని నిన్నటి తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాజాజీ ఉత్సవ్‌లో భాగంగా.. ఆయన జీవితం, సేవలపై 2026 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకు అమృత్ ఉద్యాన్‌లో ప్రదర్శన నిర్వహించనున్నారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
(రిలీజ్ ఐడి: 2232319)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10