ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో భాషిణి జాతీయ భాషా మౌలికసదుపాయాల వేదికపై వాయిసెరా ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 6:02PM by PIB Hyderabad
డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ), ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలోని డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డీఐబీడీ)... ఓపెన్ సోర్స్, ఎండ్ టు ఎండ్ వాయిస్ ఏఐ స్టాక్ వాయిసెరాను ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రారంభించింది. తద్వారా భారత డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాల (డీపీఐ) ప్రయాణంలో కీలక విజయాన్ని నమోదు చేసింది. ఏక్‌స్టెప్ ఫౌండేషన్‌తో కలిసి సీవోఎస్‌ఎస్, ఐఐఐటీ బెంగళూరు, ఏఐ4భారత్‌ల సహకారంతో నిర్వహించిన ఈ ప్రారంభోత్సవానికి డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ సీఈవో శ్రీ అమితాబ్ నాగ్ నాయకత్వం వహించారు.
భాషిణి జాతీయ భాషా మౌలికసదుపాయాల్లో అమలు చేసిన వాయిసెరా... బహుభాషా వాయిస్, లాంగ్వేజ్ ఏఐ కోసం ప్రామాణికమైన, ప్రభుత్వ-మద్దతుగల దేశవ్యాప్త డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తుంది. ఓపెన్, ప్లగ్గెబుల్, ఇంటర్ఆపరెబుల్, క్లౌడ్ డిప్లాయెబుల్, ప్రిమైస్ రెడీగా రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్ ప్రభుత్వం, పరిశోధనా సంస్థలు, ఆవిష్కరణ వ్యవస్థల్లో వాయిస్ సిస్టమ్‌ల సురక్షితమైన, గణనీయ విస్తరణను అనుమతిస్తుంది. వాయిస్ స్టాక్‌ను మాడ్యులరైజ్ చేయడం ద్వారా ఇది ఓపెన్ స్టాండర్డ్స్, మాడ్యులర్ ఆర్కిటెక్చర్, అవసరమైనప్పుడు మల్టీ-వెండర్ వ్యూహాలనూ ఉపయోగించడం ద్వారా సామర్థ్యం, సౌలభ్యం, స్వాతంత్య్రాన్ని ప్రోత్సహిస్తుంది..
వాయిసెరా ఏకీకరణ భారత జాతీయ భాషా మౌలిక సదుపాయాల వ్యవస్థగా భాషిణి పాత్రను బలోపేతం చేస్తుంది. అనువాదం, భాషా సాంకేతికతల నుంచి రియల్ టైమ్ స్పీచ్ సిస్టమ్‌లు, సంభాషణలు చేయగల ఏఐ, జనాభా స్థాయిలో బహుభాషా టెలిఫోనీ వరకు దాని సామర్థ్యాలను విస్తరిస్తుంది. వ్యవసాయ సలహాలు, విద్యా మద్దతు, జీవనోపాధి సేవలు, ఫిర్యాదుల పరిష్కారం, పౌరుల అభిప్రాయం, పథకాల ఆవిష్కరణ వంటి రంగాల్లోని విభాగాలు వాయిస్ ఎనేబుల్డ్ పౌర సేవలను వేగంగా నిర్వహించగలదు.
డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అమితాబ్ నాగ్ ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, "భాషిణి జాతీయ భాషా మౌలిక సదుపాయాల వ్యవస్థగా, వాయిసెరా ఓపెన్ ఎగ్జిక్యూషన్ స్టాక్‌గా ఉండడం ద్వారా భారత డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాల కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడ వాయిస్ భారత్‌కు అత్యంత సహజమైన ఇంటర్‌ఫేస్‌గా మారుతుంది. ఈ విధాన ప్రణాళిక సురక్షితమైన, గణనీయ బహుభాషా వ్యవస్థలను అనుమతిస్తుంది, అదే సమయంలో ఉమ్మడి జాతీయ పునాదిని నిర్మించడానికి ఆవిష్కర్తలకు సాధికారత కల్పిస్తుంది. ఇది గౌరవం, అందుబాటులో ఉండడం, ప్రతి పౌరుడు దేశంలో అందరితో మాట్లాడగలరనీ, వారు చెప్పేది అర్థం చేసుకోగలరనీ నిర్ధారించడం గురించినది. ఇది కొత్త వాయిస్ యుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ యుగంలో భారత్ తనదైన గుర్తింపును కలిగి ఉంది." అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంతో అనుబంధం గల వాయిస్ ఏఐ వ్యూహకర్త, సలహాదారు శ్రీ సంతోష్ కెవ్లాని మాట్లాడుతూ, “వాయిసెరాను మొత్తం టెక్నాలజీ స్టాక్‌లను పునర్నిర్మించకుండా ఇంటర్ఆపరబుల్, ఎగ్జిక్యూషన్ రెడీ విస్తరణను అనుమతిస్తూ వాయిస్ కోసం ప్రజా ప్రయోజనం కలిగిన ఉత్పత్తిగా రూపొందించారు.” అని తెలిపారు.
"గత మూడు సంవత్సరాలుగా డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాల వ్యవస్థగా భాషకు గల శక్తిని భాషిణి ప్రదర్శించింది. వాయిసెరాతో, ఆ విజన్ ఇప్పుడు వాయిస్‌నకు విస్తరించింది. జాతీయ స్థాయిలో పౌరులందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా ఇది వ్యవస్థను బలోపేతం చేస్తుంది" అని ఏక్‌స్టెప్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ శంకర్ మరువాడా అన్నారు.
"వాయిసెరాతో అనుసంధానమైన భాషిణి నిరంతర విస్తరణ... స్థానిక భాష, వాయిస్ సామర్థ్యాలను వేగవంతం చేస్తుంది. సమ్మిళిత ఏఐ ఆవిష్కరణలను మరింతగా ప్రోత్సహిస్తుంది" అని ఐఐటీ మద్రాస్‌కు చెందిన శ్రీ మితేష్ కాప్రా అన్నారు.
ఈ ప్రయోగం భారత జనాభా స్థాయిలో భాష, వాయిస్ మౌలిక సదుపాయాల వ్యవస్థగా భాషిణి స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇది ఆయా రంగాల్లో, భౌగోళిక ప్రాంతాల్లో తదుపరి తరం ప్రజా సేవల పంపిణీని బలోపేతం చేయగల సురక్షితమైన, సమగ్రమైన, ఇంటర్ఆపరెబుల్ ఏఐ వ్యవస్థలను ఆవిష్కరిస్తుంది.
వాయిసెరా గురించిన లైవ్ ప్రదర్శన... భాషిణి పెవిలియన్, ఏక్‌స్టెప్ పెవిలియన్, హాల్ నంబర్ 3, మొదటి అంతస్తు, భారత్ మండపం వద్ద అందుబాటులో ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2230017)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7