రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ రహదారుల వెంబడి తొలిసారిగా తేనె టీగల పెంపకం... జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) వినూత్న ప్రయోగం

నాడు పోస్టు చేయడమైనది: 17 FEB 2026 3:10PM by PIB Hyderabad

సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, జాతీయ రహదారుల వెంబడి మొట్టమొదటి పరాగసంపర్క కీటకాలు ముఖ్యంగా తేనెటీగల కోసం తేనెటీగల క్షేత్రాలను అభివృద్ధి చేసే వినూత్న కార్యక్రమాన్ని భారత జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా - ఎన్హెచ్ఏఐ) ప్రకటించింది.

అలంకారప్రాయమైన మొక్కల నుంచి పర్యావరణహితమైన మొక్కల పెంపకం వైపు దృష్టి సారిస్తూ ఎన్హెచ్ఏఐ  ఈ 'బీ-కారిడార్‌' పేరుతో ఒక ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా రహదారుల వెంబడి ఏడాది పొడవునా తేనె, పుప్పొడి లభించేలా పూల చెట్లు, మొక్కలతో కూడిన నిరంతర హరిత శ్రేణిని ఏర్పాటు చేస్తారు. జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటడం పరపరాగ సంపర్క కీటకాల సంరక్షణకు ఒక అద్భుతమైన అవకాశం. ఈ చొరవ వల్ల తేనెటీగలు, ఇతర కీటకాలపై పర్యావరణపరమైన ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం ఈ కీటకాల సంఖ్య తగ్గడం వల్ల పరపరాగ సంపర్క సేవలు, వ్యవసాయ, ఉద్యానవన పంటల దిగుబడి, మొత్తం పర్యావరణ సమతుల్యతపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

ఎన్హెచ్ఏఐ తన మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రత్యేక   పరపరాగ సంపర్కాలు లేదా 'బీ కారిడార్ల'  ఏర్పాటు దిశగా మలిచింది. ఈ వినూత్న చొరవలో భాగంగా మకరందం, పుప్పొడి అధికంగా ఉండే చెట్లు, పొదలు, మూలికలు, గడ్డి జాతులను కలిపి పెంచుతారు. ఇది ఒక సహజమైన అడవి వాతావరణాన్ని తలపిస్తుంది. పరపరాగ సంపర్కానికి మేలు చేసే పూలకు మేలు చేసే కలుపు మొక్కల్నీ, జీవం లేని కలప, బోలుగా ఉండే కలపలను ఉపయోగిస్తారు. కారిడార్లలో నాటే మొక్కల ఎంపిక చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. ఏడాది పొడవునా ఏదో ఒక రకమైన పూలు వికసిస్తూనే ఉండేలా వివిధ కాలాల్లో పూలు పూసే పూల జాతులను ఎంపిక చేస్తారు. దీనివల్ల తేనెటీగలకు నిరంతరం ఆహారం అందుబాటులో ఉంటుంది. వేప, కరంజ్, మహువా, పలాష్, బాటిల్ బ్రష్, జామూన్, సిరిస్ వంటి స్థానిక జాతుల చెట్లు, మొక్కలను జాతీయ రహదారుల వెంబడి నాటుతారు.

ఆయా ప్రాంతాల వ్యవసాయ శీతోష్ణస్థితి పరిస్థితులు,  స్థానిక అనుకూలతను బట్టి, జాతీయ రహదారులు, ఎన్హెచ్ఏఐ పరిధిలోని ఖాళీ భూముల్లో ఈ బీ-కారిడార్లను అభివృద్ధి చేస్తారు. తేనెటీగలు, అడవి ఈగలు ఆహారం కోసం ప్రయాణించే సగటు దూరాన్ని (సుమారు 500 మీటర్ల నుంచి న 1 కి.మీ.) పరిగణనలోకి తీసుకుని, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్హెచ్ఏఐ  క్షేత్ర కార్యాలయాలు తగిన రహదారి విభాగాలను గుర్తిస్తాయి. ఈ దూరానికి అనుగుణంగా నిర్ణీత విరామాల్లో పూల చెట్ల సమూహాలను నాటుతారు. అంతేకాకుండా, ప్రతి ఫీల్డ్ ఆఫీస్ 2026–27 ఆర్థిక సంవత్సరంలో కనీసం మూడు పరాగసంపర్క కారిడార్లను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్హెచ్ఏఐ  తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా 2026–27 సంవత్సరంలో జాతీయ రహదారుల వెంబడి సుమారు 40 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దాదాపు 60 శాతం మొక్కలను (అంటే సుమారు 24 లక్షలు) ప్రత్యేకంగా ఈ 'బీ-కారిడార్'  చొరవ కిందనే నాటనుండడం విశేషం. 

వినూత్నమైన  ఈ 'బీ-కారిడార్'  కార్యక్రమం  పర్యావరణ ఫలితాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పరాగసంపర్క కీటకాల సంరక్షణకు దోహదపడటమే కాకుండా, పర్యావరణ బాధ్యతాయుతమైన జాతీయ రహదారుల అభివృద్ధి పట్ల ఎన్హెచ్ఏఐ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2229374) సందర్శకుల సూచీ సంఖ్య : : 83
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam