ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ‘ఇన్నోవేషన్ టు ఇంపాక్ట్: ఏఐ యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ గేమ్-ఛేంజర్’ అంశంపై జరిగిన సమాశంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్... ప్రజారోగ్యంలో కృత్రిమ మేధ పరివర్తన పాత్రను వివరించిన కేంద్రమంత్రి
‘భారత్ కు ఏఐ కేవలం కృత్రిమ మేధ మాత్రమే కాదు, అందరినీ కలుపుకునిపోయే మేధస్సు’.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ప్రస్తావిస్తూ శ్రీమతి అనుప్రియా పటేల్
వైద్య రంగంలో కృత్రిమ మేధ విజయాన్ని జీవితాలపై దాని ప్రభావం, ఆరోగ్య అసమానతల తగ్గింపు అంశాల ఆధారంగానే కొలవాలి: శ్రీమతి అనుప్రియ పటేల్
ఏఐ వైద్యులకు ప్రత్యామ్నాయం కాదు, వారి సామర్థ్యాన్ని పెంచడానికి ఉద్దేశించినది.. వైద్యులు సంక్లిష్టమైన కేసులపై మరింత దృష్టి సారించేందుకు సహాయపడుతుంది: కేంద్ర సహాయ మంత్రి
కృత్రిమ మేధతో అత్యధిక ప్రయోజనం పొందేది ఆరోగ్య రంగమే: రాయల్ ఫిలిప్స్ సీఈఓ రాయ్ జాకబ్స్
ఏఐ పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి ఆయుష్మాన్ భారత్ యోజన కింద నిర్మించిన బలమైన డిజిటల్ ఆరోగ్య మౌలిక సదుపాయాలు కీలకం: రాయ్ జాకబ్స్
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 12:53PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నేడు జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026’లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఇన్నోవేషన్ టు ఇంపాక్ట్: ప్రజారోగ్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న ఏఐ’ అంశంపై జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు. ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో, దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంలో కృత్రిమ మేధ పోషించబోయే కీలక పాత్రను ఈ సమావేశంలో చర్చించారు.
విధాన నిర్ణేతలు, ఆరోగ్య సంరక్షణ రంగ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ ప్రసంగించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించినట్లుగా.. భారత్ కు ఏఐ అంటే కేవలం కృత్రిమ మేధ మాత్రమే కాదు, అది అందరినీ కలుపుకునిపోయే మేధస్సు అని చేశారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ గురించి మాట్లాడేటప్పుడు అది కేవలం సంక్లిష్టమైన అల్గారిథమ్‌లు లేదా ఖచ్చితత్వానికి సంబంధించినది మాత్రమే కాదని పేర్కొన్నారు. సాంకేతికత సామాన్యుల జీవితాలను ఎంతవరకు స్పృశించింది, దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవల్లో ఉన్న అసమానతలను ఎంతవరకు తగ్గించిందనే దాని ఆధారంగానే ఏఐ విజయాన్ని లెక్కించాలని ఆమె చెప్పారు.

‘వికసిత్ భారత్’ లక్ష్యం వైపు ముందుకు సాగుతున్న కొద్దీ దేశ అభివృద్ధికి ఆరోగ్యం అత్యంత కీలకమని శ్రీమతి అనుప్రియా పటేల్ స్పష్టం పేర్కొన్నారు. భారతదేశంలోని విస్తారమైన, వైవిధ్యభరితమైన జనాభా, గ్రామీణ, పట్టణ వ్యత్యాసాలు, సంక్రమణ, సంక్రమణేతర వ్యాధుల రెట్టింపు భారం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో సాంకేతికత, ముఖ్యంగా కృత్రిమ మేధ ఒక అనివార్యమైన సాధనంగా మారుతుందని ఆమె స్పష్టం చేశారు.
వ్యాధి నిఘా, నివారణ నుంచి రోగ నిర్ధారణ చికిత్స వరకు ఆరోగ్య సంరక్షణలోని ప్రతి దశలోనూ కృత్రిమ మేధను అనుసంధానించినట్లు ఆమె గుర్తించారు. ఏఐ ఆధారిత సాధనమైన మీడియా డిసీజ్ సర్వైలెన్స్ సిస్టమ్ గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ వ్యవస్థ సుమారు 13 భాషల్లో వ్యాధి ధోరణులను నిరంతరం పర్యవేక్షిస్తుందని, తక్షణం అప్రమత్తం చేసే హెచ్చరికలను జారీ చేస్తుందని తెలిపారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు సన్నద్ధతను బలోపేతం చేస్తుందని, దేశ వ్యాధి నియంత్రణ ప్రయత్నాలను మెరుగుపరచడంలో, నిఘా సామర్థ్యాన్ని పెంచడంలో కృత్రిమ మేధ శక్తికి ఈ వ్యవస్థ ఒక నిదర్శనమని ఆమె కొనియాడారు.

వన్ హెల్త్ మిషన్ కింద భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) జన్యు నిఘా కోసం కృత్రిమ మేధ ఆధారిత సాధనాలను ప్రారంభించిందని ఆమె తెలిపారు. ఇవి జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకకముందే జన్యూ వ్యాధులను ముందే అంచనా వేయగలవని పేర్కొన్నారు. ఇటువంటి ముందస్తు అంచనా సామర్థ్యం ప్రజారోగ్య నివారణా చర్యల్లో ఒక విప్లవాత్మక మార్పుగా ఆమె అభివర్ణించారు.
చేతితో పట్టుకోగలిగే ఏఐ ఆధారిత ఎక్స్ రే యంత్రాలు, కంప్యూటర్-ఎయిడెడ్ డిటెక్షన్ సాధనాల ద్వారా రోగ నిర్ధారణ సేవలను ప్రజలకు మరింత చేరువ చేశారని కేంద్ర సహాయ మంత్రి చెప్పారు. ఈ ఆవిష్కరణల వల్ల క్షయవ్యాధి కేసుల గుర్తింపులో సుమారు 16 శాతం అదనపు వృద్ధి నమోదైందన్నారు. క్షయ వ్యాధి చికిత్సలో ఎదురయ్యే ప్రతికూల ఫలితాలను ముందే అంచనా వేసే కృత్రిమ మేధ సాధనాల వల్ల ప్రతికూల చికిత్స ఫలితాల్లో 27 శాతం తగ్గుదల కనిపించిందని తెలిపారు. ఇది క్షయవ్యాధిపై భారత్ చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పారు.
స్థోమత, విస్తృతి గురించి మాట్లాడుతూ.. భారత్ వంటి అధిక జనాభా, పరిమిత వనరులున్న దేశంలో పరిష్కారాలు విస్తరించగలిగే విధంగా తక్కువ ఖర్చుతో ఉండే విధంగా వ్యవస్థలో ఉన్న లోపాలను సమర్థవంతంగా పరిష్కరించేలా రూపుదిద్దుకోవాలని శ్రీమతి అనుప్రియా పటేల్ అన్నారు. ఆరోగ్య రంగంలో బలమైన కృత్రిమ మేధ వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఏఐ నైపుణ్యాన్ని ప్రజా ఆరోగ్య సేవలలో సమగ్రంగా అనుసంధానించేందుకు ఎయిమ్స్ ఢిల్లీ, పీజీఐఎంఈఆర్ చండీగఢ్, ఎయిమ్స్ రిషికేశ్‌లలో మూడు ‘ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ కేంద్రాలు స్థాపించినట్లు వివరించారు.

సాంకేతికత పాత్రను వివరిస్తూ.. కృత్రిమ మేధ వైద్యులకు సహాయం చేయడానికి, వారి సామర్థ్యాన్ని పెంచడానికి మాత్రమేనని, వైద్యుల స్థానాన్ని భర్తీ చేయడానికి కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. రోజువారీ సాధారణ పనుల భారాన్ని ఏఐ తగ్గించడం ద్వారా వైద్యులు సంక్లిష్టమైన కేసులు, కీలకమైన చికిత్సా నిర్ణయాలపై ఎక్కువ సమయం కేటాయించడానికి వీలు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు.
‘‘వైద్యం కేవలం శాస్త్రీయం మాత్రమే కాదు.. ఒక కళ కూడా’’ అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఆరోగ్య సంరక్షణ కేవలం అల్గారిథంల మీద మాత్రమే కాకుండా మానవీయ స్పర్శ, సానుభూతి, కరుణ, సమాచారం వంటి లక్షణాలపై ఆధారపడి ఉంటుందని, వీటిని యంత్రాలు ఎప్పటికీ భర్తీ చేయలేవని ఆమె స్పష్టం చేశారు.
భవిష్యత్తు వైద్య రంగ నిపుణులు తప్పనిసరిగా కృత్రిమ మేధ పరిజ్ఞానం కలిగి ఉండాలని మంత్రి సూచించారు. ఇందుకోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్ బీఈఎంఎస్) ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల కోసం కృత్రిమ మేధపై ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆమె వెల్లడించారు. దీని ద్వారా భారతీయ వైద్య రంగం సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తూ కేంద్ర సహాయ మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
దేశ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు, సార్వత్రిక ఆరోగ్య భద్రతా లక్ష్య సాధన కోసం కృత్రిమ మేధ ఒక వ్యూహాత్మక అవకాశమని నీతి ఆయోగ్ సభ్యులు ప్రొఫెసర్ వీకే పాల్ తెలిపారు. భారత్ వంటి విస్తారమైన జనాభా, వైవిధ్యం సంక్రమణ, సంక్రమణేతర వ్యాధుల ద్వంద్వ భారాన్ని దృష్టిలో ఉంచుకుని.. సేవలను బలోపేతం చేయడానికి, ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి సాంకేతికతతో కూడిన జోక్యం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో, వ్యాధులను ముందుగానే గుర్తించడంలో, నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంలో, డేటా ఆధారిత విధానాల రూపకల్పనలో కృత్రిమ మేధ గణనీయమైన పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. దేశంలో పెరుగుతున్న డిజిటల్ ప్రజారోగ్య మౌలిక సదుపాయాలతో ఏఏఐని అనుసంధానించడం ద్వారా వైద్య రంగంలో పరస్పర అనుసంధానం, తక్షణ విశ్లేషణలు, వనరుల కేటాయింపు మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు.
భద్రత, ప్రజల నమ్మకాన్ని కాపాడటానికి పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ, నైతిక రక్షణలు ఉండాలని ప్రొఫెసర్ పాల్ సూచించారు. ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. దీని ద్వారా విస్తరించదగిన, తక్కువ ఖర్చుతో కూడిన, స్వదేశీ కృత్రిమ మేధ పరిష్కారాలను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. విస్తృత జనాభా స్థాయిలో అమలు చేసినప్పుడు వాటి ప్రభావాన్ని స్పష్టంగా కొలవగలిచే స్థాయిలో ఉండాలన్నారు.
ఈ సందర్భంగా రాయల్ ఫిలిప్స్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి శ్రీ రాయ్ జాకబ్స్ మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణ రంగంలో కృత్రిమ మేధ అత్యధిక ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలో పెరుగుతున్న డిమాండ్, సిబ్బంది కొరత, చికిత్సలో సంక్లిష్టత వంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయని.. ఈ నేపథ్యంలో ఏఐని విలీనం చేయడం ఒక అవకాశం మాత్రమే కాదని అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
కేవలం కృత్రిమ మేధ మాత్రమే ఆరోగ్య రంగాన్ని మార్చలేదని, దానికి పటిష్టమైన డేటా పాలన, అడ్డంకులు లేని డేటా నిర్వహణ, బలమైన క్లినికల్ విధానాలతో అనుసంధానం తోడవ్వాలని ఆయన చెప్పారు. ‘‘సాంకేతికత అనేది వైద్య అవసరాలకు, పనితీరుకు అనుగుణంగా ఉండాలి’’ అని పేర్కొన్నారు. నాణ్యమైన డేటా, పరస్పర సమాచార మార్పిడి స్పష్టమైన వినియోగ సందర్భాలు ఉన్నప్పుడే ఏఐ వినియోగం అర్థవంతంగా ఉంటుందని వివరించారు.

వైద్య రంగం నమ్మకం మీద నడుస్తుందని, అందుకే క్లినికల్ విశ్వాసాన్ని, రోగుల భద్రతను కాపాడటానికి కృత్రిమ మేధ వ్యవస్థలు పారదర్శకంగా, వివరణాత్మకమైనవిగా, నిరంతరం ధృవీకరించేవిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
దేశ డిజిటల్ హెల్త్ కార్యక్రమాలను అభినందిస్తూ.. ఆయుష్మాన్ భారత్ యోజన వంటి పథకాలు భారీ స్థాయిలో సమాచార వ్యవస్థలను అనుసంధానించడానికి, నిరంతర వైద్య సేవలు అందించడానికి పునాది వేస్తున్నాయని కొనియాడారు. అర్థవంతమైన, శాశ్వతమైన ప్రభావాన్ని చూపడానికి కృత్రిమ మేధకు కావాల్సిన అసలైన పునాది ఇదేనని ఆయన తెలిపారు.
దేశంలో రూపొందించిన పరిష్కారాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వినియోగిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. భారీ జనాభా, వైవిధ్యం, సంక్లిష్టతలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సాంకేతికతలు ప్రపంచవ్యాప్తంగా ఏ పరిస్థితులకైనా తట్టుకోగలవని, సులభంగా అనువదించుకోదగ్గవిగా ఉంటాయని ఇది నిరూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆవిష్కరణలకు రాయల్ ఫిలిప్స్ సంస్థకున్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ.. ప్రభుత్వం, పరిశ్రమల మధ్య కుదిరే భాగస్వామ్యాలు ఏఐ ఆధారిత పరివర్తనను వేగవంతం చేస్తాయని శ్రీ రాయ్ జాకబ్స్ ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఫలితాలను మెరుగుపరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా, నైతికంగా, భారీ స్థాయిలో అమలు చేసినప్పుడు ప్రజారోగ్య రంగంలో ఒక శక్తిమంతమైన మార్పును తీసుకువస్తుందని ఈ చర్చా కార్యక్రమం స్పష్టం చేసింది. ఏఐ అనేది కేవలం ప్రయోగాత్మక ప్రాజెక్టులకే పరిమితం కాకుండా, వ్యవస్థాగత స్థాయిలో విలీనం కావాలని వక్తలు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. దీనికి పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ మౌలిక సదుపాయాలు, నాణ్యమైన డేటా, పటిష్టమైన నియంత్రణ విధానాలు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల మద్దతు అవసరమని వారు చెప్పారు. వ్యాధి నిఘా, రోగ నిర్ధారణ, క్లినికల్ నిర్ణయాలు తీసుకోవడం, ఆరోగ్య వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కృత్రిమ మేధను గణనీయంగా తోడ్పడినప్పటికీ, అది అంతిమంగా వైద్యుల సామర్థ్యాన్ని పెంచే ఒక సాధనం మాత్రమేనని, వారి స్థానాన్ని భర్తీ చేసేది కాదని ఈ చర్చలు స్పష్టం చేశాయి. దేశంలోని సంక్లిష్టమైన వైద్య సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఏఐని అందరికీ అందుబాటులో ఉండే, రోగి-కేంద్రిత పరిష్కారంగా ఉపయోగించుకుంటామనే ఉమ్మడి నిబద్ధతతో ఈ సమావేశం ముగిసింది.
***
(రిలీజ్ ఐడి: 2229345)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5