వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ 108వ సమావేశం... పీఎం గతిశక్తి కింద మల్టీమోడల్ కనెక్టివిటీని పెంపొందించేలా, రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సమీక్ష
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఏడు ప్రాజెక్టులను సమీక్షించిన ఎన్‌పీజీ
నాడు పోస్టు చేయడమైనది:
04 FEB 2026 12:20PM by PIB Hyderabad
నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్పీజీ) 108వ సమావేశాన్ని.. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) నిర్వహించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్ప్రణాళిక (పీఎంజీఎస్ఎన్ఎంపీ)కు అనుగుణంగా బహువిధ అనుసంధాన, రవాణా సామర్థ్యాన్ని పెంచడంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది. సమీకృత బహువిధ మౌలిక సదుపాయాలు, ఆర్థిక - సామాజిక కేంద్రాలకు క్షేత్రస్థాయి వరకు అనుసంధానం, ఏకోన్ముఖ ప్రభుత్వ విధానం అన్న ప్రధానమంత్రి గతిశక్తి సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తూ.. ఏడు రోడ్డు ప్రాజెక్టులను ఎన్‌పీజీ సమీక్షించింది.
ఈ ప్రాజెక్టుల వల్ల లాజిస్టిక్స్ సామర్థ్యం పెరుగుతుందని, ప్రయాణ సమయం తగ్గుతుందని, ఆయా ప్రాజెక్టు ప్రాంతాల్లో గణనీయమైన సామాజిక - ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల సమీక్ష, అవి చూపే ప్రభావాల వివరాలు ఇలా ఉన్నాయి:
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ
6 వరుసలుగా జాతీయ రహదారి 544లోని సేలం – కుమారపాళయం రోడ్డు (తమిళనాడు) – తమిళనాడులోని సేలం నుంచి కుమారపాళయం వరకు 102.035 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల రహదారి కారిడార్‌ను అభివృద్ధి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. అత్యంత రద్దీ కలిగిన కొచ్చి- కోయంబత్తూరు- బెంగళూరు సరుకు, ప్రయాణికుల రవాణా కారిడార్‌లో ఇది భాగంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జనావాసాలు, పారిశ్రామిక ప్రాంతాలు ఉన్న చోట అంతరాయం లేకుండా కొనసాగే సర్వీస్ రోడ్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడం కోసం జంక్షన్లు, ఇంటర్‌ఛేంజ్‌లు, గ్రేడ్ సెపరేటర్‌ల అప్‌గ్రేడ్‌తోపాటు.. వాహనాల ప్రవేశ, నిష్క్రమణల క్రమబద్ధీకరణ అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రధాన, చిన్న వంతెనలు, ఫ్లైఓవర్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణం, విస్తరణ పనులను కూడా ఈ ప్రాజెక్టులో చేర్చారు.
ప్రతిపాదిత కారిడార్.. పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ కేంద్రాలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లతోపాటు రైల్వే టెర్మినళ్లు, అంతర్గత కంటైనర్ డిపోలు, లాజిస్టిక్స్ పార్కుల వంటి కీలక రవాణా మౌలిక సదుపాయాలకు మార్గాన్ని సులభతరం చేస్తూ.. ప్రాంతీయ అనుసంధానాన్ని విశేషంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. కొచ్చి- కోయంబత్తూర్- బెంగళూరు ఆర్థిక కారిడార్‌తో సమన్వయాన్ని పటిష్టం చేయడం ద్వారా.. సమర్థమైన సరుకు రవాణానూ, సుదూర రవాణానూ, రోడ్డు-రైలు-విమాన-ఓడరేవుల అనుసంధానం ద్వారా బహువిధ రవాణా సదుపాయాలనూ ఇది మెరుగుపరుస్తుంది. అలాగే సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, హోసూర్ నగరాలను కలిపే జాతీయ, రాష్ట్ర రహదారులపై.. ఆరంభ, తుది దశ అనుసంధాన మార్గాలను (ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ యాక్సెస్), విమానాశ్రయాలతో అనుసంధానాన్ని, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల జౌళి, వ్యవసాయ ప్రాసెసింగ్, ఉత్పాదక రంగాలు, కంటైనర్‌ల ద్వారా సరుకు రవాణా రంగాలకు విశేష ప్రయోజనం లభిస్తుంది.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం (ఆంధ్రప్రదేశ్) – విజయవాడ, గుంటూరు, తెనాలి సహా అమరావతి రాజధాని ప్రాంతంలోని పట్టణాల్లో రద్దీని తగ్గించడానికి, ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్‌లోని 189.93 కి.మీ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)ను సరికొత్త ప్రాజెక్టుగా (గ్రీన్‌ఫీల్డ్) అభివృద్ధి చేయాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఓఆర్ఆర్ అందుబాటులోకి వస్తే నగర కేంద్రాల నుంచి అది ట్రాఫిక్‌ను మళ్లిస్తుంది. విజయవాడ విమానాశ్రయానికి సులభంగా చేరుకునేలా ప్రత్యేక ఇంటర్‌ఛేంజ్‌ల ఏర్పాటుతోపాటు.. భవిష్యత్తులో వేగవంతమైన రవాణా కారిడార్ల అనుసంధానానికి వీలుగా దీనిని రూపొందిస్తున్నారు.
కీలకమైన మల్టీమోడల్ లాజిస్టిక్స్ కారిడార్‌గా రూపుదిద్దుకోనున్న ఈ ఓఆర్ఆర్.. జాతీయ జలమార్గం-4తో అనుసంధానం కానుంది. ఇది మచిలీపట్నం, కృష్ణపట్నం వంటి ప్రధాన ఓడరేవులను రాష్ట్రంలోని పట్టణ, పారిశ్రామిక కేంద్రాలతో అనుసంధానిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రయాణ సమయం 30-40 శాతం వరకు తగ్గడమే కాకుండా.. ఇంధన పొదుపు, కాలుష్య నివారణకూ దోహదపడుతుంది. తద్వారా వేగవంతమైన సరుకు రవాణాకు, పర్యావరణ సుస్థిరతకు ఈ కారిడార్ బాటలు వేయనుంది.
రఫీయాబాద్- కుప్వారా- చౌకిబాల్- తంగ్ధార్ (జమ్మూ-కాశ్మీర్) మధ్య రెండు వరుసల రహదారి నిర్మాణం (విస్తరణ/ బలోపేతం) – సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మక, ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో.. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని రఫీయాబాద్ నుంచి తంగ్ధార్ వరకు 62.10 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారి నిర్మాణాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. కుప్వారా, చౌకిబాల్, తంగ్దర్, టీట్వాల్ వంటి కీలక ప్రాంతాలను ఈ కారిడార్ కలుపుతుంది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడంతోపాటు.. భద్రతా దళాల కదలికలు, అత్యవసర సరుకుల సరఫరాకు ఆటంకం లేకుండా చూడడం ద్వారా రక్షణ పరమైన రవాణా వ్యవస్థను ఈ ప్రాజెక్టు బలోపేతం చేస్తుంది.
వ్యూహాత్మక ప్రాధాన్యంతోపాటు, మారుమూల ప్రాంతాలలో ఆరోగ్యం, విద్య, నిత్యావసర సేవలను మరింత అందుబాటులోకి తేవడం ద్వారా.. సామాజిక-ఆర్థిక ప్రయోజనాలనూ ఈ ప్రాజెక్టు చేకూరుస్తుందని భావిస్తున్నారు. పర్యాటకం, ఉద్యాన రంగం, స్థానికుల జీవనోపాధికి తోడ్పడటమే కాకుండా.. ఈ ప్రాంతాన్ని జాతీయ రహదారి-01, శ్రీనగర్ విమానాశ్రయాలతోనూ, అలాగే సోపూర్, బారాముల్లాలోని రైలు నెట్‌వర్క్‌తోనూ అనుసంధానిస్తూ సమగ్ర ప్రాంతీయాభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది.
(i) ఫియాంగ్ గ్రామ సమీపంలోని హెచ్‌పీసీఎల్ ప్లాంటు వద్ద ప్రారంభమై, లేహ్-మనాలీ హైవే (లేహ్) వద్ద కలిసే.. లేహ్ బైపాస్‌ను పేవ్డ్ షోల్డర్ ప్రమాణాలతో 2 వరుసల రహదారిగా నిర్మించడం కోసం సంప్రదింపు సేవలు (భూసేకరణ, ప్రజా మౌలిక సదుపాయాల తరలింపు సహా) – లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో జాతీయ రహదారి -01 (శ్రీనగర్-లేహ్), జాతీయ రహదారి-03 (లేహ్-మనాలీ)లను కలుపుతూ.. ఫియాంగ్ నుంచి ప్రారంభమయ్యే 48.108 కిలోమీటర్ల పొడవైన లేహ్ బైపాస్-1 నిర్మాణాన్ని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. కొత్తగా నిర్మిస్తున్న (గ్రీన్ ఫీల్డ్ కారిడార్) ఈ వ్యూహాత్మక రహదారి.. లేహ్ నగరంలోని రద్దీ ప్రాంతాల నుంచి ట్రాఫిక్‌ను మళ్లించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రవాణా సామర్థ్యాన్ని పెంచడంతోపాటు సరుకుల తరలింపు, ప్రయాణ సదుపాయాలు, మారుమూల ప్రాంతాలకు అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అదే సమయంలో స్థానిక వాణిజ్యం, పర్యాటక రంగానికి ఊతమిస్తుంది.
ఈ ప్రాజెక్టు జాతీయ రహదారి -01, జాతీయ రహదారి-03, లేహ్ విమానాశ్రయాలను నేరుగా అనుసంధానిస్తుంది. దీనివల్ల రవాణా సామర్థ్యం పెరగడమే కాకుండా ప్రాంతీయ మార్కెట్లలోకి ప్రవేశ సౌలభ్యమూ మెరుగుపడుతుంది. ఫ్యాంగ్, లేహ్ పారిశ్రామిక వాడలకు రవాణా సదుపాయం మెరుగుపడడం వల్ల ప్రయాణ సమయం, రవాణా ఖర్చులు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇది పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడంతోపాటు కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుంది. తద్వారా సమీప గ్రామాలకు ఆర్థిక అవకాశాలను అందిస్తూ.. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది.
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని చిత్రకూట్ – మజ్గవాన్ – సత్నా సెక్షన్‌లో ప్రస్తుత 2 వరుసల రహదారిని ఇరువైపులా పొడిగిస్తూ (పేవ్డ్ షోల్డర్‌తో) డివైడర్‌తో కూడిన 4 వరుసల రహదారిగా విస్తరించడం: - మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళ్లే 77.102 కిలోమీటర్ల పొడవైన చిత్రకూట్ – సత్నా కారిడార్‌ను.. ప్రస్తుతమున్న రెండు వరుసల నుంచి డివైడర్‌తో కూడిన నాలుగు వరుసల రహదారిగా విస్తరించాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ, అంతర్రాష్ట్ర అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది. ఇది సరుకు రవాణాను మెరుగుపరచడమే కాకుండా.. ప్రయాణ సమయాన్ని, వాహన నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక, పట్టణ కేంద్రాలను కలుపుతూ.. మొత్తంగా ఈ కారిడార్ రవాణా సామర్థ్యాన్ని ఇది పెంపొందిస్తుంది.
ఈ రహదారి విస్తరణ ద్వారా సమీపంలోని విమానాశ్రయాలు, రైల్వే వ్యవస్థలు, లాజిస్టిక్స్ సదుపాయాలు మరింతగా అందుబాటులోకి రావడం ద్వారా.. బహువిధ అనసంధానం (మల్టీమోడల్ కనెక్టివిటీ) మెరుగుపడుతుంది. అలాగే సత్నా ప్రాంతంలోని ప్రధాన సిమెంటు కర్మాగారాల నుంచి వచ్చే భారీ పారిశ్రామిక రవాణాకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ప్రస్తుత అవరోధాలను తొలగించడం ద్వారా.. పారిశ్రామిక సరుకు రవాణాను ఈ ప్రాజెక్టు సులభతరం చేస్తుంది. చిత్రకూట్‌లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలకు రాకపోకలను మెరుగుపరచడంతోపాటు.. రెండు రాష్ట్రాల్లో సమతౌల్యంతో కూడిన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది.
ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలను కలుపుతూ రూర్కెలా నుంచి సిథియో వరకు నాలుగు వరుసల ప్రావేశిక నియంత్రిత గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం: - ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల గుండా వెళ్లే 156.10 కిలోమీటర్ల పొడవైన, నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేను రూర్కెలా నుంచి సిథియో వరకు నిర్మించాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ కారిడార్ అయిదు జిల్లాల గుండా వెళ్తుంది. పీఎం గతిశక్తి ఆర్థిక కేంద్రాలను.. ముఖ్యంగా ఒక సీఫుడ్ క్లస్టరునూ, ప్రత్యేక ఆర్థిక మండలినీ (సెజ్) అనుసంధానించేలా వ్యూహాత్మకంగా దీన్ని రూపొందించారు. ఇది ప్రాంతీయ, అంతర్రాష్ట్ర అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
కీలకమైన సామాజిక, రవాణా కేంద్రాలతో ఈ ప్రతిపాదిత హైవే అనుసంధానమవుతుంది. ఇది ఏషియన్ హైవే నెట్‌వర్క్, జాతీయ రహదారి-53, జాతీయ రహదారి-19, రాయ్‌పూర్-ధన్‌బాద్ కారిడార్, స్వర్ణ చతుర్భుజి వంటి ప్రధాన జాతీయ, అంతర్జాతీయ రహదారి వ్యవస్థలతో కలుస్తుంది. ఈ ప్రాజెక్టు రవాణా సౌకర్యాన్ని గణనీయంగా పెంచుతుందనీ, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందనీ, ఒడిశా - జార్ఖండ్‌లతోపాటు పొరుగు రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
బీహార్‌లోని కన్హౌలీ నుంచి షేర్‌పూర్ వరకు ఆరు వరుసల సరికొత్త పాట్నా రింగ్ రోడ్ హైవే (జాతీయ రహదారి-131జీ) నిర్మాణం: - పాట్నా రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా.. బీహార్‌లోని కన్హౌలీ నుంచి షేర్‌పూర్ వరకు 9.98 కిలోమీటర్ల పొడవైన, ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ కారిడార్ జాతీయ రహదారి-30, జాతీయ రహదారి-922లతో కలుస్తుంది. ఇది ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేయడంతోపాటు.. పాట్నా నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తోడ్పడుతుంది.
సమీపంలోని రైల్వే స్టేషన్లు, త్వరలో అందుబాటులోకి రాబోయే బిహ్తా విమానాశ్రయం, ప్రతిపాదిత కన్హౌలీ బస్ టర్మినల్‌లకు మెరుగైన ప్రవేశ సదుపాయాన్ని కల్పించడం ద్వారా.. బహువిధ రవాణా అనుసంధానాన్ని ఈ ప్రాజెక్టు పెంపొందిస్తుంది. బిహ్తా ప్రాంతంలోని పారిశ్రామిక, లాజిస్టిక్స్ కేంద్రాలతో అనుసంధానాన్ని మెరుగుపరచడం ద్వారా.. సమర్థంగా సరుకు రవాణాకు ఈ కారిడార్ తోడ్పడుతుందనీ, పాట్నా మెట్రోపాలిటన్ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందనీ భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2228675)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13