మంత్రిమండలి
azadi ka amrit mahotsav

భారతీయ అంకుర వ్యవస్థలోకి వెంచర్ క్యాపిటల్‌ను సమీకరించేందుకు ఉద్దేశించిన 'స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0'కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం


డీప్ టెక్, సాంకేతిక ఆధారిత వినూత్న తయారీ అంకురాలు, ప్రారంభ వృద్ధి దశలో ఉన్న అంకురాలకు మద్దతుగా రూ. 10,000 కోట్లు కేటాయింపు

నాడు పోస్టు చేయడమైనది: 14 FEB 2026 1:11PM by PIB Hyderabad

భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న అంకుర వ్యవస్థకు భారీ ఊతమిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ 'స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0'కు ఆమోదం తెలిపింది. దేశంలోని అంకుర రంగానికి వెంచర్ క్యాపిటల్‌ను సమీకరించే లక్ష్యంతో రూ. 10,000 కోట్ల మొత్తం నిధితో దీనిని ప్రారంభించారు.

దీర్ఘకాలిక స్వదేశీ మూలధనాన్ని సమీకరించడం, వెంచర్ క్యాపిటల్ వ్యవస్థను బలోపేతం చేయడం, దేశవ్యాప్తంగా ఆవిష్కరణల ఆధారిత వ్యవస్థాపకతను ప్రోత్సహించడం ద్వారా భారత అంకుర ప్రయాణంలో తదుపరి దశను వేగవంతం చేసేలా ఈ పథకాన్ని రూపొందించారు. 

'స్టార్టప్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఎఫ్ఓఎఫ్ 2.0 భారత్‌ను ప్రపంచంలోని అగ్రగామి అంకుర దేశాలలో ఒకటిగా నిలబెట్టడానికి దశాబ్ద కాలంగా జరుగుతున్న నిరంతర ప్రయత్నాలకు కొనసాగింపుగా నిలుస్తుంది. 2016లో స్టార్టప్ ఇండియా ప్రారంభమైనప్పటి నుంచి భారత అంకుర రంగం అసాధారణ మార్పులకు లోనైంది. అప్పట్లో 500 కంటే తక్కువగా ఉన్న అంకురాల సంఖ్య నేడు 2 లక్షల  (డీపీఐఐటీ గుర్తింపు పొందినవి) పైకి చేరుకుంది. విశేషమేమిటంటే 2025 సంవత్సరంలో అత్యధికంగా వార్షిక అంకురాల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.

ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ 1.0 పునాదిపై నిర్మాణం

స్టార్టప్ ఇండియా ఎఫ్ఓఎఫ్ 2.0 అనేది 2016లో ప్రారంభించిన 'ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్' (ఎఫ్ఎఫ్ఎస్ 1.0) అద్భుతమైన పనితీరుకు కొనసాగింపుగా వస్తోంది. అంకురాలకు నిధుల కొరతను తీర్చడానికి, దేశీయ వెంచర్ క్యాపిటల్ మార్కెట్‌ను ప్రోత్సహించడానికి దీనిని తీసుకొచ్చారు. 

ఎఫ్ఎఫ్ఎస్ 1.0 కింద మొత్తం రూ. 10,000 కోట్ల మూలధనాన్ని 145 ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్‌కు (ఏఐఎఫ్) కేటాయించారు. ఈ నిధుల మద్దతుతో సదరు ఏఐఎఫ్‌లు దేశవ్యాప్తంగా ఉన్న 1,370 కంటే ఎక్కువ అంకురాల్లో ఇప్పటివరకు రూ. 25,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. ఈ పెట్టుబడులు వ్యవసాయం, కృత్రిమ మేధ, రోబోటిక్స్, వాహనాలు, హరిత సాంకేతికత, ఈ-కామర్స్, విద్యా సాంకేతికత, ఆర్థిక సాంకేతికత, ఆరోగ్య రంగం, అంతరిక్ష సాంకేతికత, జీవ సాంకేతికత వంటి వివిధ కీలక రంగాలలో విస్తరించి ఉన్నాయి.

తొలిసారిగా అంకురాలు ప్రారంభించే వ్యవస్థాపకులను ప్రోత్సహించడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, భారత వెంచర్ క్యాపిటల్ వ్యవస్థకు బలమైన పునాది వేయడంలో ఎఫ్ఎఫ్ఎస్ 1.0 కీలక పాత్ర పోషించింది.

పథకానికి ఉన్న ముఖ్య లక్షణాలు:

మొదటి దశ అంకుర వ్యవస్థను నిర్మించగా.. భారతీయ ఆవిష్కరణలను తదుపరి స్థాయికి తీసుకెళ్లేలా ఈ స్టార్టప్ ఇండియా ఎఫ్ఓఎఫ్ 2.0ను రూపొందించారు. ఇది ఈ కింది అంశాలకు మద్దతుగా లక్ష్యిత, వేరువేరు నిధుల విధానాన్ని అనుసరిస్తుంది:

అ. డీప్ టెక్, సాంకేతిక ఆధారిత వినూత్న తయారీ: దీర్ఘకాలిక మూలధనం అవసరమయ్యే హై-టెక్ రంగాలలో వినూత్న ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం.

ఆ. ప్రారంభ వృద్ధి దశ వ్యవస్థాపకుల సాధికారత: కొత్త- వినూత్న ఆలోచనలకు భరోసా కల్పించడం, నిధుల కొరత కారణంగా ప్రారంభ దశలోనే అంకురాలు విఫలం కాకుండా నివారించడం.

ఇ. దేశవ్యాప్త విస్తరణ: కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా దేశంలోని నలుమూలలా ఆవిష్కరణలు వృద్ధి చెందేలా పెట్టుబడులను ప్రోత్సహించడం.

ఈ. అధిక-రిస్క్ మూలధన లోటును తీర్చడం: స్వయం సమృద్ధి, ఆర్థిక వృద్ధికి కీలకమైన ప్రాధాన్యత రంగాలకు ఎక్కువ మూలధనాన్ని మళ్లించడం.

ఉ. దేశీయ వెంచర్ క్యాపిటల్ పునాదిని బలోపేతం చేయడం: ముఖ్యంగా చిన్న ఫండ్స్‌ను ప్రోత్సహించటం ద్వారా దేశీయ పెట్టుబడి వాతావరణాన్ని మరింత మెరుగుపరచడం.

భారత ఆర్థిక పథాన్ని తీర్చిదిద్దడం, పరివర్తనాత్మక ప్రభావాన్ని చూపడంలో స్టార్టప్ ఇండియా ఎఫ్ఓఎఫ్ 2.0 కీలక పాత్ర పోషిస్తుందన్న అంచనా ఉంది.

భారతదేశ ఆవిష్కరణల ఆధారిత వృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో ఈ ఫండ్ అత్యంత కీలకం కానుంది. ప్రపంచ స్థాయిలో పోటీ పడే సామర్థ్యం ఉన్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలను రూపొందించే అంకురాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ ఫండ్.. దేశ ఆర్థిక దృఢత్వాన్ని బలోపేతం చేయడానికి, తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడానికి, ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉద్యోగాల సృష్టికి, భారత్‌ను 'ప్రపంచ ఆవిష్కరణల కేంద్రం'గా నిలబెట్టడానికి దోహదపడుతుంది.

వికసిత్ భారత్- 2047 జాతీయ దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన ఈ ఫండ్ వ్యవస్థాపకులను సాధికారత వైపు నడిపించడానికి, ఆవిష్కరణలను పెంపొందించడానికి, భారత అంకుర వ్యవస్థలోని పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వ నిరంతర నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2228209) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada