ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలో 'సేవా తీర్థ్', 'కర్తవ్య భవన్-1, 2' ప్రారంభోత్సవ విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 FEB 2026 7:46AM by PIB Hyderabad

ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన 'సేవా తీర్థ్', కర్తవ్య భవన్-1, 2' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు మనమందరం ఒక కొత్త చరిత్ర నిర్మాణాన్ని వీక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. సేవా తీర్థ్‌తో పాటు ఈ నూతన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా పీఎంఓ బృందం, క్యాబినెట్ కార్యదర్శి, వివిధ విభాగాల ఉద్యోగులతో సహా అందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. వీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, కార్మిక మిత్రులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్ట్‌లలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ విధంగా పేర్కొన్నారు:

“భారత ప్రజలకు సేవ చేయాలనే అచంచలమైన సంకల్పంతో నాగరిక దేవో భవ అనే పవిత్ర భావనతో సేవా తీర్థ్‌ను వినమ్రంగా దేశానికి అంకితం చేస్తున్నాను.

సేవా తీర్థ్ ఎల్లప్పుడూ కర్తవ్యానికి, కరుణకు, దేశమే ప్రథమం అనే సూత్రబద్ధమైన నిబద్ధతకు ఒక ప్రకాశవంతమైన చిహ్నంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. నిస్వార్థ సేవ, సర్వజన సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేసే మార్గంలో నడవడానికి ఇది రాబోయే తరాలకు స్ఫూర్తినివ్వాలి.”

 

“అలాగే ఈరోజు 'సేవా తీర్థ్' వద్ద పేదలు, అణగారిన వర్గాలు, కష్టపడి పనిచేసే మన రైతులు, యువశక్తి, నారీశక్తి సాధికారతకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశాను. ఆ కీలక నిర్ణయాలు ఇవే:

ప్రమాద బాధితులకు రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించే పీఎం రహత్ పథకానికి ఆమోదం. ఇది ప్రమాదానికి గురైన ఎవరికైనా తక్షణ వైద్య సహాయం అందేలా చేస్తుంది.

లఖ్‌పతి దీదీ పథకం లక్ష్యాన్ని 6 కోట్లకు రెట్టింపు చేయడం. ఇది మహిళా సాధికారత, స్వయం సమృద్ధిని పెంచుతుంది.

వ్యవసాయ మౌలిక సదుపాయల నిధి లక్ష్యాన్ని రూ. 1 లక్ష కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్లకు రెట్టింపు చేశారు. ఇది మన రైతులు, వారి ఆదాయాన్ని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది.

రూ. 10,000 కోట్ల మూలధనంతో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కు ఆమోదం. ఇది ప్రారంభ దశలో ఉన్న అంకురాలు, అధునాతన సాంకేతిక పరిశోధనలను ప్రోత్సహిస్తుంది.”

 

“దేశప్రజల సేవ పట్ల అచంచలమైన సంకల్పం, 'నాగరిక దేవో భవ' అనే పవిత్ర భావనతో ఈ రోజు సేవా తీర్థ్‌ను దేశానికి అంకితం చేసే భాగ్యం నాకు లభించింది.

‘సేవా తీర్థ్’ అనేది కర్తవ్యం, కరుణ, దేశమే ప్రథమం అనే మన నిబద్ధతకు ఒక శక్తిమంతమైన చిహ్నం. ఇది రాబోయే తరాలకు నిస్వార్థ సేవ, జనోద్ధరణ కోసం అంకితభావంతో ముందుకు సాగడానికి స్ఫూర్తినిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.”

 

“ఢిల్లీలో ఈ రోజు 'సేవా తీర్థ్', 'కర్తవ్య భవన్' ప్రారంభోత్సవం సందర్భంగా సేవా తీర్థ్ స్మారక తపాలా బిళ్ల, నాణేన్ని విడుదల చేయడం గర్వంగా ఉంది.”

 

“నేను ఏ అమృత భావనతో అయితే 'సేవా తీర్థ్', ‘కర్తవ్య భవన్‌’ను దేశానికి అంకితం చేశానో అది 140 కోట్ల దేశప్రజల ఆకాంక్షలు, అంచనాలను నెరవేర్చడానికి ఒక బలమైన పునాదిగా మారుతుంది.”

 

“గత 11 ఏళ్లుగా మనం బానిసత్వ మనస్తత్వాన్ని మార్చే ఉద్యమంలో నిమగ్నమై ఉన్నాం. మన మంత్రం ఒక్కటే..  'స్వతంత్ర భారతానికి స్వతంత్ర గుర్తింపు, బానిసత్వ ఆనవాళ్ల నుంచి విముక్తి!”

 

'సేవా తీర్థ్' అనే పేరులోనే ఒక గొప్ప సందేశం ఉంది. అది దేశ ప్రజల సేవ అనే సంకల్పాన్ని లక్ష్యం వరకు తీసుకెళ్లే ఒక పవిత్ర స్థలం!”

 

“కర్తవ్యం అనేది ఈ సజీవ దేశానికి ప్రాణవాయువు వంటిది. ఇది కోట్లాది మంది దేశ ప్రజల కలలను సాకారం చేయాలనే మన సంకల్పానికి సరికొత్త శక్తిని ఇస్తోంది.”

 

“ ‘నాగరిక దేవో భవ’ అనేది మన పని సంస్కృతి. 'సేవా తీర్థ్'లో తీసుకొనే ప్రతి నిర్ణయం 140 కోట్ల దేశప్రజల జీవితాలను మరింత మెరుగుపరుస్తుంది."

 

***


(రిలీజ్ ఐడి: 2228204) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada