సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బెర్లిన్‌ ‘ఐరోపా ఫిల్మ్ మార్కెట్-2026’లో భారత్ పెవిలియన్: భారతీయ సినిమా.. సంస్కృతి.. ఆవిష్కరణల ప్రదర్శన


· భారత చలనచిత్ర దర్శకులు-నిర్మాతల చురుకైన భాగస్వామ్యంతో భారతీయ సినిమాపై ప్రపంచంలో పెరుగుతున్న ఆసక్తి ప్రస్ఫుటం

· అంతర్జాతీయ వేదికపై సృజనాత్మక సామర్థ్యం ప్రదర్శించనున్న ‘క్రియేట్ ఇన్ ఇండియా’ పోటీ విజేతలు... రాష్ట్రాలు

· ‘ఈఎఫ్‌ఎం’ ఇన్నొవేషన్ హబ్-2026లో అధునాతన సృజనాత్మక-సాంకేతిక ఆవిష్కరణలు.. ఏవీజీసీ-ఎక్స్‌ఆర్‌ సామర్థ్యాన్ని ప్రదర్శించనున్న భారత్‌

నాడు పోస్టు చేయడమైనది: 13 FEB 2026 5:30PM by PIB Hyderabad

బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సహా ఐరోపా ఫిల్మ్ మార్కెట్-2026 (ఈఎఫ్‌ఎం)లో భారత్ తన అధికారిక వేదికను ప్రారంభించింది. భారతీయ సినిమా, సంస్కృతి, సృజనాత్మక సాంకేతికతలలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న భారత్‌ పాత్రను ఈ పెవిలియన్‌ ప్రతిబింబిస్తుంది. ఈ మేరకు తన శక్తిమంతమైన, బహుముఖ ఉనికిని చాటుకోనుంది. ప్రముఖ అంతర్జాతీయ మార్కెట్ అగ్రగాములు, సాంస్కృతిక ప్రతినిధులు, భారత చలనచిత్ర-ఆవిష్కరణ రంగాల ప్రతినిధి బృందం సమక్షంలో జర్మనీలోని  భారత రాయబారి శ్రీ అజిత్ వినాయక్ గుప్తే ఈ పెవిలియన్‌ను ప్రారంభించారు.

భారత్‌-జర్మనీల మధ్య సృజనాత్మక-సాంస్కృతిక రంగాల్లో సంబంధాల విస్తృతిని ఈ ప్రారంభోత్సవం ప్రస్ఫుటం చేసింది. అత్యంత ప్రభావశీల అంతర్జాతీయ చలనచిత్ర మార్కెట్లలో ఒకటైన ‘బెర్లినేల్ ప్రో’  డైరెక్టర్-ఐరోపా ఫిల్మ్ మార్కెట్ అధిపతి శ్రీమతి తంజా మెయిస్నర్, అంతర్జాతీయ భాగస్వామ్యం- వ్యూహాత్మక పరిశ్రమ సంబంధాల రూపకల్పన కీలక పాత్ర పోషించిన శ్రీమతి పీటర్ డోమ్ష్, భారత్‌- జర్మనీ మధ్య కళా-సాంస్కృతిక సంబంధాల బలోపేతంలో కీలకంగా వ్యవహరించిన ఠాగూర్ సెంటర్ డైరెక్టర్ శ్రీమతి త్రిష సఖ్లేచా వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ) సీనియర్ అధికారులు, బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది, వర్ధమాన దేశీయ సృజనాత్మక వ్యవస్థ ప్రతినిధి బృందం కూడా ఇందులో పాల్గొంది.

ప్రపంచ భాగస్వామ్యాలను విస్తృతం చేస్తున్న భారత దర్శకులు-నిర్మాతలు

ఈ ఏడాది ‘ఈఎఫ్‌ఎం’లో కథన నైపుణ్యం, ఆవిష్కరణ చోదిత భాగస్వామ్యాల బలమైన సమ్మేళనంగా  భారత్‌ తన ఉనికిని ఘనంగా చాటనుంది. అంతర్జాతీయ నిర్మాతలు-అమ్మకాల ఏజెంట్లు, పంపిణీదారులు-ఉత్సవ ప్రోగ్రామర్లతో చురుకైన భాగస్వామ్యంగల 9 మంది భారత దర్శక-నిర్మాతలు ఇందులో పాల్గొనడం ఒక విశేషం. భారత ప్రపంచ సహ-నిర్మాణ నెట్‌వర్క్‌లో ఇనుమడిస్తున్న ఏకీకరణను వారి పాత్ర స్పష్టం చేస్తుంది. అలాగే భాషలు-శైలి రీత్యా భారతీయ కథలపై పెరుగుతున్న అంతర్జాతీయ ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. నిర్మాణాత్మక మార్కెట్ సమావేశాలు, ప్రాజెక్ట్ చర్చల ద్వారా  సంప్రదాయ చలనచిత్ర వాణిజ్యానికి మించి సరిహద్దు సహకారం, దీర్ఘకాలిక సృజనాత్మక కూటమిగా విస్తరించేందుకు వీలున్న భాగస్వామ్యాలను వీరు అన్వేషిస్తారు.

భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న మీడియా-సృజనాత్మక సాంకేతిక రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు వర్ధమాన అంకుర సంస్థల ప్రతినిధి బృందం కూడా ఇందులో పాల్గొంటుండటం గమనార్హం. ఈ కంపెనీలు కథన నైపుణ్యం, సాంకేతికత, డిజిటల్ ఉత్పత్తుల సమ్మేళన సహిత పరిష్కారాలను ప్రదర్శిస్తాయి. భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణల ద్వారా రూపుదిద్దుకుంటున్న తీరును విశదీకరిస్తాయి. భారత్‌ ప్రధానంగా కంటెంట్-ఉత్పత్తిదారు దేశంగా మాత్రమే పరిగణనలోగల పరిస్థితి నుంచి ప్రపంచ వినోదావరణ వ్యవస్థలో సాంకేతిక పురోగతికి కూడలిగా గుర్తింపు పొందడాన్ని వీరి హాజరు సూచిస్తుంది.

భారత్‌కు యువ ఆవిష్కర్తల ప్రాతినిధ్యం

భారతీయ ప్రతినిధి బృందంలో ఇద్దరు ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’ (సీఐసీ) విజేతలున్నారు.  ఆవిష్కరణాధారిత కథన నైపుణ్య స్ఫూర్తిని ప్రతిబింబించే యువ సృజనాత్మక వ్యవస్థాపకుల ఉనికిని, వినూత్న ఆలోచనలను వీరి హాజరు స్పష్టం చేస్తుంది.

అంతేకాకుండా వినూత్న ప్రతిభను ప్రోత్సహించడం వర్ధమాన కళాకారులను ప్రపంచానికి పరిచయం చేయడంపై భారత్‌ ప్రాధాన్యాన్ని కూడా వీరి భాగస్వామ్యం ప్రముఖంగా వివరిస్తుంది. ఇక ఈ ఉత్సవాల్లో మహారాష్ట్ర నుంచి ఒక సాంస్కృతిక ప్రతినిధి బృందం కూడా పాల్గొంటోంది. ప్రపంచ చలనచిత్ర పటంలో ప్రముఖ స్థానంగల మహారాష్ట్ర స్థానాన్ని బలోపేతం చేస్తూ- సానుకూల  విధానాలు, విస్తృత నిధుల సౌలభ్యం, చలనచిత్ర నిర్మాణానికి భారీ వనరుల శ్రేణి ద్వారా దర్శక-నిర్మాతలకు మద్దతివ్వడంలో రాష్ట్రం నిబద్ధతను ఈ బృందం చాటిచెబుతుంది. మరోవైపు దేశ రాజధాని నుంచి వచ్చిన బృందం ఢిల్లీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ప్రాచుర్యం దిశగా కృషి చేస్తుంది. దీంతోపాటు ప్రత్యేక చిత్రీకరణ ప్రోత్సాహకాలు, అనుమతి-ఆమోదాల ప్రక్రియలను ప్రముఖంగా వివరిస్తూ- నగర పరిధిలోని అద్భుత చిత్రీకరణ ప్రదేశాలను ప్రపంచ ప్రేక్షకులకు ప్రదర్శిస్తుంది.

పెవిలియన్‌లో చర్చల సందర్భంగా- భారత్‌లో నిర్వహించబోయే ప్రధాన ఉత్సవాల గురించి ‘ఎన్‌ఎఫ్‌డీసీ’ యాజమాన్యం వివరించింది. వీటిలో ఈ ఏడాది జూన్‌లో నిర్వహించే ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-2026 (ఎంఐఎఫ్ఎఫ్‌), నవంబరు 20 నుంచి 28 వరకు నిర్వహించే వార్షిక భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఉన్నాయి. ఇవన్నీ చలచనిత్ర రంగ ఆదానప్రదానం, సహ-నిర్మాణం, మార్కెట్ సంబంధాలకు కీలక ప్రపంచ వేదికలుగా ఉంటాయి. ఇందులో అధికశాతం  అంతర్జాతీయ భాగస్వామ్యం, సహకార విస్తృతికి తోడ్పడతాయి.

జర్మనీలో భారత రాయబారి శ్రీ అజిత్ వినాయక్ గుప్తే ప్రసంగిస్తూ- సినిమా, సృజనాత్మకతలు అంతర్జాతీయ సంబంధాలకు శక్తిమంతమైన సాధనాలని స్పష్టం చేశారు. ‘ఈఎఫ్‌ఎం'లో భారత్‌ ఉనికిని, దాని సుదీర్ఘ కథన నైపుణ్య సంప్రదాయాన్ని మాత్రమేగాక ప్రపంచ సృజనాత్మక పరిశ్రమలలో విస్తరిస్తున్న దేశం పాత్రను కూడా ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌-జర్మనీల మధ్య చలనచిత్ర, సాంస్కృతిక, ఆవిష్కరణ రంగాల్లో ఇనుమడిస్తున్న సమన్వయాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. శాశ్వత సృజనాత్మక, ఆర్థిక భాగస్వామ్యాలను కుదుర్చుకోవడంలో ‘ఈఎఫ్‌ఎం' వంటి వేదికల ప్రాధాన్యాన్ని విశదీకరించారు.

సృజనాత్మక భాగస్వాములను ఏకం చేసే భారత పెవిలియన్

‘ఎన్‌ఎఫ్‌డీసీ’ నిర్వహించే భారత్ పెవిలియన్ అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమకు చురుకైన సమావేశ కూడలిగా పనిచేస్తుంది. మార్కెట్ నిర్వహణలో భాగంగా వ్యాపార సదస్సులు, సహ-నిర్మాణ చర్చలు, నెట్‌వర్కింగ్ పరస్పర సంభాషణలు, పరిశ్రమల మధ్య చర్చలకు పెవిలియన్‌ సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది. అంతేగాక భారత్‌ను ఆకర్షణీయ చిత్ర నిర్మాణ గమ్యంగా, సహకార కంటెంట్ భాగస్వామిగా ప్రోత్సహిస్తుంది. ఇది చిత్ర దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక ఆవిష్కర్తలు, సాంస్కృతిక ప్రతినిధులు, ప్రపంచ వాటాదారులు భాగస్వామ్యాల అన్వేషణ కూడలిగానూ పనిచేస్తుంది.

ఈ ఏడాది ‘ఈఎఫ్‌ఎం’లోనే కాకుండా అందులో భాగమైన ఇన్నవొవేషన్‌ హబ్‌లో భారత్‌ పాల్గొనడం కీలక కోణం. తాదాత్మ్య కథన నైపుణ్యం, డిజిటల్ ఉత్పాదన, మీడియా వ్యవస్థలలో ఆధునిక అవసరాలను తీర్చే అత్యాధునిక ఉపకరణాలు, వేదికలను నాలుగు భారతీయ సాంకేతిక అంకుర సంస్థలు ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి. ఈ మేరకు ‘ఏవీజీసీ-ఎక్స్‌ఆర్‌’ సహా సృజనాత్మక ఆవిష్కరణలలో భారత్‌ ప్రాధాన్యం పెరుగుతుండటాన్ని ప్రముఖంగా వివరిస్తాయి. భవిష్యత్‌ కథన నైపుణ్యంలో సాంకేతిక వ్యవస్థాపన ఎంత సమగ్ర భాగం కాగలదో విశదీకరిస్తాయి. అంకుర సంస్థలకు మద్దతు, సృజనాత్మక పరిశ్రమలలో ఆవిష్కరణలకు ప్రోత్సాహంపై భారత్‌ విస్తృత జాతీయ దృష్టిని ఇది ప్రతిబింబిస్తుంది.

‘ఈఎఫ్‌ఎం-2026’లో భారత్‌ నిర్మాణాత్మక, భవిష్యత్‌ దృక్పథంతో పాలుపంచుకుంటోంది. ఈ మేరకు కంటెంట్ సృష్టిలో మాత్రమేగాక సృజనాత్మక వ్యవస్థాపన, సాంస్కృతిక ఆదానప్రదానం, ఆవిష్కరణాధారిత వృద్ధిలోనూ దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలిపే విస్పష్ట వ్యూహాత్మక దృక్కోణం ప్రస్ఫుటమవుతోంది. చిత్ర దర్శక-నిర్మాతలు, అంకుర సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, అంతర్జాతీయ పరిశ్రమ అగ్రగాములను ఏకతాటిపైకి తెస్తుంది. ఇక ప్రపంచ చలనచిత్ర, మీడియా రంగాలతో భారత్‌ భాగస్వామ్యం విస్తరణకు భారత్‌ పెవిలియన్‌ ఒక ప్రతీకగా నిలుస్తుంది. అలాగే ‘ఈఎఫ్‌ఎం'  కొనసాగినంత కాలం భారత్ పెవిలియన్ కార్యకలాపాలు, చర్చలు, సహకార విస్తృతికి శక్తిమంతమైన కూడలిగా తనవంతు పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ చలనచిత్ర సమాజంతో భారత్‌ సంబంధాలను పటిష్ఠం చేయడంతోపాటు ప్రపంచ వినోద రంగం భవిష్యత్తు రూపకల్పనలోనూ దేశం పోషించాల్సిన పాత్రను బలోపేతం చేస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2228199) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Malayalam