రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌లో హైస్పీడు రైలు వ్యవస్థకు బలమైన పునాది వేసిన ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు


భారత్‌లో ఉత్పాదక సామర్థ్యాలను పెంచుతున్న భారీ నిర్మాణ యంత్రాల స్వదేశీకరణ,
దేశీయంగా తయారైన స్లాబ్ ట్రాక్ భాగాలు, ప్రత్యేక ట్రాక్ యంత్రాలు

జపనీస్ విధానంలో శిక్షణ పొందిన దాదాపు 1000 మంది భారతీయ ఇంజినీర్లు, నిపుణులు
ప్రస్తుత రైలు/విమాన ధరలకు పోటీనిస్తూ.. అత్యధిక కార్యకలాపాల నిర్వహణ కోసం రూపొందించిన ఎంఏహెచ్ఎస్ఆర్

సంప్రదాయ రైల్వే వ్యవస్థకు అదనపు సామర్థ్యాన్ని జోడిస్తూ ఈడీఎఫ్‌సీ, డబ్ల్యూడీఎఫ్‌సీల్లో
ప్రతిరోజూ నడుస్తున్న రైళ్ల సంఖ్య 406

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2026 6:53PM by PIB Hyderabad

జపాన్ ప్రభుత్వ సాంకేతిక, ఆర్థిక సాయంతో చేపడుతున్న ముంబయి-అహ్మదాబాద్ హై స్పీడు రైలు (ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టు (508 కిమీ) ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఎలివేటెడ్ వయాడక్ట్‌పై నిర్మించేలా ఎంఏహెచ్ఎస్ఆర్ ప్రాజెక్టును రూపొందించారు. ఈ కారిడార్లోని స్టేషన్లలో నియంత్రిత ప్రవేశ మార్గాలు, బ్యాగేజీ స్కానర్లు, డీఎఫ్ఎండీలు (డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు), సీసీటీవీ (క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్) కెమెరాలు తదితరమైన భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు.

ట్రాకు నిర్మాణం, అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ, కోచ్‌ల తయారీ - నిర్వహణ, ప్రాజెక్టు నిర్వహణ తదితరమైన అంశాల్లో ఎంఏహెచ్ఎస్ఆర్ ప్రాజెక్టు ద్వారా అనుభవం, సాంకేతిక సామర్థ్యాలు మెరుగయ్యాయి. ఇవి భారత్‌లో హై-స్పీడు రైలు కారిడార్ల నిర్మాణానికి బలమైన పునాదిని అందిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ తరహా నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా హెచ్ఎస్ఆర్ రంగంలో ప్రణాళిక, నిర్ణయాలను తీసుకోవడంలో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది.

స్వదేశీకరణ, సామర్థ్య నిర్మాణం:

• భారత్‌లో హెచ్ఎస్ఆర్ నమూనా సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి, విశ్లేషణాత్మక నమూనా విధానం, క్షేత్రస్థాయి కొలతల సాయంతో దేశంలోని వర్క్‌షాపుల్లో లాంగ్-స్పాన్ స్టీల్ ట్రస్ గర్డర్లను తయారు చేస్తున్నారు.

• ఫుల్-స్పాన్ లాంఛింగ్ ప్రక్రియలో వాడే భారీ నిర్మాణ యంత్రాలను ఇప్పుడు దేశీయ అవసరాలకు తగినట్లుగా భారత్‌లోనే రూపొందిస్తున్నారు.

• చాలా వరకు స్లాబ్ ట్రాకు సామగ్రి, ప్రత్యేకమైన ట్రాకు యంత్రాలను భారతీయ తయారీదారులే అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తున్నారు. ఇది దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుతోంది.

• వివిధ రకాల డిజైన్లు, డైనమిక్ అనాలసిస్‌కు సంబంధించిన వివరాలను ఐఐటీల సహకారంతో భారతీయ సంస్థలు నిర్వహిస్తున్నాయి. దీర్ఘకాలంలో హెచ్ఎస్ఆర్ నైపుణ్యాలను పెంపొందించేందుకు అధునాతన డైనమిక్ అనాలసిస్ పరికరాలను, నమూనా చార్టులను అభివృద్ధి చేశాయి.

ఆవిష్కరణ:

• 40 మీటర్ల పొడవైన ప్రిస్ట్రెస్డ్ బాక్స్ గర్డర్లు (సుమారుగా1000 మెట్రిక్ టన్నులు) ఏర్పాటు చేయడానికి భారతదేశంలోనే మొదటిసారిగా ఫుల్-స్పాన్ లాంఛింగ్ పద్ధతిని అమలు చేస్తున్నారు. దీనివల్ల కేవలం 16 గంటల్లోనే ఈ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.

• ఎలివేటెడ్ కారిడార్‌ను ఆనుకొని నివసించే వారికి శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన శబ్ధ నిరోధకాలను ఏర్పాటు చేస్తున్నారు.

• ఖచ్చితమైన డిజైన్, ప్రణాళిక కోసం ఐఐటీ ఢిల్లీ సహకారంతో, ఓహెచ్‌ఈ-పాంటోగ్రాఫ్ ఇంటరాక్షన్, సిమ్యులేషన్ నమూనాల కోసం అధునాతన పరికరాలను అభివృద్ధి చేశారు.

• భవిష్యత్తు కోసం ఒకే పునాదిపై 90 మీటర్ల ఎత్తయిన భవనాన్ని నిర్మించేలా భూగర్భ స్టేషన్ను నిర్మిస్తున్నారు.

• పట్టాలు తప్పినప్పుడు భద్రతను పెంపొందించడానికి దేశీయంగా అభివృద్ధి చేసిన రైల్ టర్నోవర్ ప్రివెన్షన్ డివైజ్ (ఆర్టీపీడీ)ను ప్రవేశపెట్టారు.

శిక్షణ:

• జపనీస్ మెథడాలజీలో భారతీయ ఇంజినీర్లు, నిపుణులు (సుమారుగా 1000 మంది) శిక్షణ పొందారు. ఇప్పుడు వారి సమక్షంలోనే ట్రాకు పనులు కొనసాగుతున్నాయి.

• శిక్షణ కోసం, తరచూ నిర్వహించే రిఫ్రెషర్ కోర్సుల కోసం ప్రత్యేక ట్రాకు శిక్షణా కేంద్రాన్ని సూరత్‌లో ఏర్పాటు చేశారు.

స్టేషన్లు:

• నగరాల ప్రాంతీయతను ప్రతిబింబించే స్వాగత తోరణంలా హెచ్ఎస్ఆర్ స్టేషన్లను రూపొందిస్తున్నారు. వీటిలో నియంత్రిత ప్రవేశ మార్గాలు, బ్యాగేజి స్కానర్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ (డీఎఫ్ఎండీ)లు, క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (సీసీటీవీ) కెమెరాలు వంటి అత్యాధునిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

• భద్రతపై దృష్టి సారిస్తూ.. కంపనాలను నియంత్రించేలా, స్టేషన్ పైకప్పుల్లో గాలి పీడనాన్ని తట్టుకొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికోసం కంపనాలను నియంత్రించే పరికరాలు, క్లాంపులు, బోల్టింగ్ ప్లేట్లను నిర్మాణ సమయంలోనే ఏర్పాటు చేస్తున్నారు.

• నగర మాస్టర్ ప్రణాళికతో సమన్వయం చేసుకుంటూ.. విశాలమైన పార్కింగ్, డ్రాప్-ఆఫ్ ప్రాంతాలు, బహుళ విధ రవాణా అనుసంధానం ద్వారా ప్రయాణికుల సౌలభ్యానికి హామీ ఇస్తున్నారు.

• ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్లాటినం ప్రమాణాలకు అనుగుణంగా సుస్థిరత, ఇంధన సామర్థ్యంతో కూడిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.

భౌగోళిక-సాంకేతిక పరిశోధన:

• నిర్మాణ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి, భూగర్భ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశాన్ని ముందే గుర్తించడానికి జియో టెక్నికల్ పరిశోధన (జీటీఐ)కు అత్యంత ప్రాధాన్యమిచ్చారు.

• ప్రతి 100 మీ.ల దూరానికి జీటీఐ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కట్టడాలున్న చోట మరింత తక్కువ దూరాలకే పరీక్షలు చేపడుతున్నారు.

• కొత్త జియో టెక్ ప్రయోగశాలను కూడా ప్రారంభించారు.

రక్షణ, భద్రత:

• ప్రయాణికులకు భద్రతకు హామీ ఇస్తూ.. కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాలు, సున్నితమైన పరికరాలుండే భవనాల కోసం అత్యున్నత స్థాయి భద్రతను అమలు చేస్తున్నారు.

• అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలను రూపొందించి, నిర్మించారు. ఈ డిజైన్లను జపనీస్ అత్యున్నత స్థాయి కమిటీ ధ్రువీకరించింది.

• ఆయా భూకంప జోన్లకు అనుగుణంగా.. భూకంపాల నుంచి రక్షణ అందించేలా ఈ నిర్మాణాలు రూపొందించారు. దీనికోసం వయాడక్టులు, బ్రిడ్జిలపై ప్రభావం పడకుండా స్టీలు, డాంపర్ స్టాపర్లు ఏర్పాటు చేశారు. అలాగే ముందస్తు భూకంప హెచ్చరికల వ్యవస్థ (ఈక్యూఈడబ్ల్యూఎస్)ను ఏర్పాటు చేశారు.

ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడు రైలు ప్రాజెక్టు పురోగతి

గుజరాత్, మహారాష్ట్రతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా, నగర్ హవేలీ గుండా ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడు రైలు (ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టు (508 కి.మీ.) వెళుతుంది. ముంబయి, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, బారుచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి మొత్తం 12 స్టేషన్లు నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు.

ఎంఏహెచ్ఎస్ఆర్ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం భూ సేకరణ (1389.5 హెక్టార్లు) పూర్తయింది. అన్ని చట్టబద్ధమైన అనుమతులు వచ్చాయి. అలాగే మొత్తం 1651 ప్రజోపయోగ వస్తువులను తరలించారు. 2021 వరకు మహరాష్ట్రలో భూసేకరణలో జరిగిన జాప్యం కారణంగా ప్రాజెక్టుపై ప్రభావం పడింది. ఆ రాష్ట్రంలో 2022లో భూసేకరణ ప్రారంభమైంది.

ఇప్పటి వరకు సాధించిన పురోగతి:

గుజరాత్:      

Item

Progress

Foundation

352 kms.

Piers

352 kms.

Girder Casting

342 kms.

Girder Launching

331 kms.

Track Bed Construction

152 kms.

OHE Masts Erection

121 kms.

మహారాష్ట్ర:

Item

Progress

Foundation

74 kms.

Piers

65 kms.

Girder Casting

9 kms.

Girder Launching

3 kms.

మొత్తం 12 స్టేషన్లకు గాను 8 స్టేషన్లు (వాపి, బిలిమోరా, సూరత్, బారుచ్, ఆనంద్, వడోదర, అహ్మదాబాద్, సబర్మతి)లో పునాది పనులు పూర్తయ్యాయి. మహారాష్ట్ర విభాగంలో మూడు స్టేషన్లు (థానే, విరార్, బోయిసార్)లో పునాది పనులు కొనసాగుతున్నాయి. బీకేసీ స్టేషన్ వద్ద తవ్వకం పనులు పూర్తి కాగా, బేస్ స్లాబు కాస్టింగ్ పనులు ప్రారంభమయ్యాయి. 

17 రివర్ బ్రిడ్జిలు పూర్తయ్యాయి. గుజరాత్‌లో మరో నాలుగు ప్రధాన రివర్ బ్రిడ్జిలు (నర్మద, మహి, తపతి, సబర్మతి) పనులు తుది దశలో ఉన్నాయి. మహారాష్ట్రలో 4 రివర్ బ్రిడ్జిల పనులు పురోగతిలో ఉన్నాయి. డిపోలు (థానే, సూరత్, సబర్మతి) పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) వద్ద కొనసాగుతున్న నిర్మాణ పనులు సంతృప్తికరంగా ఉన్నాయి. సుమారు 91 శాతం మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. కాంక్రీట్ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. లెవల్-4 వద్ద బేస్‌మెంట్ స్లాబ్ 100 శాతం పూర్తయింది. సముద్ర గర్భ సొరంగం (సుమారు 21 కి.మీ.ల పొడవు) పనులు ప్రారంభమయ్యాయి. అందులో మహారాష్ట్రలోని ఘన్సోలి, శిల్ఫాటా మధ్య 4.8 కి.మీ.ల సొరంగం పనులు పూర్తయ్యాయి.

మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు అనుగుణంగా, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేలా దేశీయంగా హై-స్పీడు రైలు వ్యవస్థలు, విడిభాగాల తయారీని భారతీయ రైల్వే ప్రోత్సహిస్తోంది. వందేభారత్ సాధించిన విజయం ఆధారంగా, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) సహకారంతో గంటలకు 280 కి.మీ.ల వేగంతో ప్రయాణించే హైస్పీడు రైలు సెట్లను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) రూపొందించి, తయారుచేస్తోంది.

చట్టానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిగింది. భూసేకరణలో నష్టపోయిన వ్యక్తులకు భూసేకరణ, పునరుద్ధరణ, పునరావాసంలో సరైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టంతో పాటు సంబంధిత రాష్ట్ర విధానాల ప్రకారం పరిహారం అందింది. అదనపు ప్రయోజనాలు, నష్ట పరిహారంతో కూడిన పునరావాస, పునరుద్ధరణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కొనసాగుతున్నాయి.

గణనీయ స్థాయిలో ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తూ అత్యంత వేగంగా కార్యకలాపాలు నిర్వహించేలా ఎంఏహెచ్ఎస్ఆర్ కారిడార్‌ను రూపొందించారు. ప్రస్తుత రైలు/విమాన ధరలకు అనుగుణంగా, పోటీనిచ్చేలా టికెట్ ధరలను ప్రతిపాదించారు. ప్రయాణికుల డిమాండ్, ఆర్థిక ప్రయోజనాలు, సమయం ఆదా, ప్రాంతీయ అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని దీర్ఘకాలిక ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని అంచనా వేశారు.

జపాన్ ప్రభుత్వ సాంకేతిక, ఆర్థిక సహకారంతో ప్రస్తుతం అమల్లో ఉన్న ఏకైక హెచ్ఎస్ఆర్ ప్రాజెక్టు ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు (508 కి.మీ.). ఈ ప్రాజెక్టు కోసం 31.12.2025 నాటికి రూ. 86,939 కోట్లు ఖర్చయ్యాయి.

సరకు రవాణా కోసం ఏర్పాటు చేసిన కారిడార్లు

సరకు రవాణా నిమిత్తం రెండు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీ)ల నిర్మాణాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టింది. అవి లూథియానా నుంచి సోన్ నగర్ వరకు (1337 కి.మీ.) ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఈడీఎఫ్‌సీ), జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ టెర్మినల్ (జేఎన్‌పీటీ) నుంచి దాద్రీ వరకు (1506 Km) వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డబ్ల్యూడీఎఫ్‌సీ). వీటి మొత్తం వ్యయం రూ.1,24,005 కోట్లు. పనులు పూర్తయిన ఈడీఎఫ్‌సీలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. డబ్ల్యూడీఎఫ్‌సీలో మొత్తం 1506 ఆర్‌కేఎంల్లో 1404 ఆర్‌కేఎం పూర్తయిది. ఈ భాగంలో కార్యకలాపాలు మొదలయ్యాయి. డబ్ల్యూడీఎఫ్‌సీలో మిగిలిన వైతర్ణ-జేఎన్‌పీటీ విభాగం (102 ఆర్‌కేఎం) పనులు ప్రారంభమయ్యాయి.

సరుకు రవాణాను ట్రాఫిక్‌ను ఈడీఎఫ్‌సీ, డబ్ల్యూడీఎఫ్‌సీ వైపు మళ్ళించడం ద్వారా, సంప్రదాయ రైల్వే వ్యవస్థలో అదనపు మార్గాల ఏర్పాటుకు డీఎఫ్‌సీ దోహదపడింది. ప్రస్తుతం, ఈ కారిడార్లలో రోజుకు సగటున 406 రైళ్లు నడుస్తున్నాయి.

ఈ సమాచారాన్ని రైల్వేలు, సమాచార-ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఈ రోజు లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2227049) సందర్శకుల సూచీ సంఖ్య : : 85
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Kannada