ప్రధాన మంత్రి కార్యాలయం
మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో ప్రతినిధి స్థాయి చర్చల సందర్భంలో ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
08 FEB 2026 11:41AM by PIB Hyderabad
నా మిత్రులు... గౌరవనీయ ప్రధానమంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకూ, నా ప్రతినిధి బృందానికి లభించిన స్వాగతం... కేవలం కొన్ని గంటల్లోనే సంప్రదాయాలను మించిన మలేషియా ప్రజల జీవన విధానాన్ని మాకు పరిచయం చేసిన విధానం... ప్రతి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం నా జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. దీనికి నేను మనస్ఫూర్తిగా నా ప్రశంసలు తెలియజేస్తున్నాను. స్నేహానికి నిజమైన అర్థాన్నీ, అలాగే దానిలోని గొప్పతనాన్నీ నేను నిజంగా అనుభూతి చెందాను. దాని కోసం మీకు నా కృతజ్ఞతలు.
గౌరవనీయులారా,
ప్రధానమంత్రిగా నేను మూడోసారి మలేషియాను సందర్శించే అవకాశం లభించడం నా అదృష్టం. మీ పదవీకాలంలో నేను మిమ్మల్ని నాల్గోసారి కలుస్తున్నాను. ఇది మన ఇరుదేశాల మధ్య సంబంధాల వేగాన్ని, చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. గత కొద్ది సంవత్సరాల్లో మన ద్వైపాక్షిక సంబంధాలు సాధించిన వేగం, పురోగతి నిజంగా స్ఫూర్తిదాయకం. దీని కోసం ఎంతో కృషి చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన పరస్పర సహకారం వ్యవసాయం, తయారీ రంగాల నుంచి పరిశుద్ధ ఇంధనాలు, సెమీకండక్టర్ల వరకూ విస్తరించి ఉంది. నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య నిర్మాణంలోనూ మనం కీలక భాగస్వాములుగా ఉన్నాం. మన రక్షణ, భద్రతా సహకారం మరింత బలోపేతం అవుతూనే ఉంది.
గౌరవనీయులారా,
విజయవంతంగా ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన మిమ్మల్ని మరోసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మలేషియా మద్దతుతోనే ఆసియాన్‌తో మా సంబంధాలు మరింత లోతుగా, విస్తృతంగా మెరుగవుతాయని మేం విశ్వసిస్తున్నాం.
గౌరవనీయులారా,
మన సంబంధాల నిజమైన బలం ఇరు దేశాల ప్రజల మధ్య గల అనుబంధంలోనే ఉంది. భారతీయ మూలాలున్న దాదాపు ముప్పై లక్షల మంది మలేషియా పౌరులు మన దేశాల మధ్య సజీవ వారధిగా ఉన్నారు. నిన్న మీతో పాటు ప్రవాస భారతీయులనూ కలిసే అవకాశం నాకు లభించింది. అది ఒక చాలా ప్రత్యేకమైన అనుభవం. వారు మీపై చూపించే అపారమైన గౌరవాన్నీ, ఆప్యాయతనూ నేను చూశాను. అది నాకూ గర్వాన్ని కలిగించింది. ఉగ్రవాదంపై మన పోరాటంలో మిత్ర దేశాల మద్దతుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది.
గౌరవనీయులారా,
భారత్-మలేషియా దేశాల శ్రేయస్సు పరస్పర అనుసంధానితమై ఉందని మేం దృఢంగా విశ్వసిస్తాం. అస్థిరతతో కూడిన నేటి ప్రపంచ వాతావరణంలో... నౌకా వాణిజ్య పరంగా పొరుగు దేశాలుగా భారత్-మలేషియాలు ఇరు దేశాల మధ్య సంబంధాల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం చాలా అవసరం. ఈ రోజు నా పర్యటన ప్రధాన సందేశం స్పష్టంగా ఉంది: మలేషియాతో తన భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చాలని, ప్రతి రంగంలోనూ సహకారాన్ని విస్తరించాలనీ, మరింత బలోపేతం చేయాలని భారత్ కోరుకుంటుంది. నాకూ, నా ప్రతినిధి బృందానికీ లభించిన హృదయపూర్వకమైన, అద్భుతమైన స్వాగతం పట్ల మీకూ, మీ మొత్తం బృందానికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
***
(రిలీజ్ ఐడి: 2225163)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2