ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సమ్మిళిత, బాధ్యతాయుత, స్థితిస్థాపక ఏఐ కోసం దేశాలు, ఆవిష్కర్తలు, పౌరులను ఏకం చేసే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్
‘డిజిటల్ ఇండియా ఆస్క్ అవర్ ఎక్స్‌పర్ట్స్’ కార్యక్రమంలో పంచుకున్న కీలక విషయాలు
నాడు పోస్టు చేయడమైనది:
07 FEB 2026 2:00PM by PIB Hyderabad
కృత్రిమ మేధ (ఏఐ) అనేది ఇకపై భవిష్యత్తుకు సంబంధించినది మాత్రమే కాదు.. ఇప్పటికే మన జీవనశైలిలో భాగమైన అంశం. భారతీయులు నేర్చుకునే విధానాన్ని, పని చేసే పద్ధతిని, సేవలను పొందే రీతిని రోజువారీ సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారనే విధానాన్ని ఏఐ మార్చివేస్తోంది. ఈ సందేశమే 2026 ఫిబ్రవరి 6న నిర్వహించిన ‘డిజిటల్ ఇండియా- ఆస్క్ అవర్ ఎక్స్‌పర్ట్స్’ తాజా తాజా ఎపిసోడ్‌లో ప్రధాన అంశంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో త్వరలో జరగబోయే ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’(భారత కృత్రిమ మేధ ప్రభావ సదస్సు) గురించి ఇండియా-ఏఐ మిషన్ సీఈఓ శ్రీ అభిషేక్ సింగ్‌తో ఆసక్తికరమైన, ఆలోచనాత్మకమైన చర్చ జరిగింది.
సదస్సు కేవలం సాంకేతిక చర్చలకే పరిమితం కాకుండా ఒక ప్రజా-కేంద్రీకృత వేదికగా ఎలా పనిచేస్తుందో ఈ ఎపిసోడ్ వివరించింది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పాలన, అంకుర సంస్థలు, సేవలు, ఉపాధి వంటి రంగాలలో పౌరులు తమ ప్రయోజనం కోసం కృత్రిమ మేధను ఎలా ఉపయోగించుకోవచ్చనే దానిపై ఈ సదస్సు దృష్టి సారించనుంది.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృత్రిమ మేధ చర్చలను క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడే, నిజమైన ఫలితాలుగా మార్చడమే ఈ సదస్సు లక్ష్యం. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, దేశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు’ ద్వారా భారత్ ప్రపంచ కృత్రిమ మేధ చర్చను ఆలోచన నుంచి ఆచరణ వైపు మళ్లిస్తోంది. ఏఐ ఆవిష్కరణలు, నైపుణ్యాలు, ప్రయోజనాలు అందరికీ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందుబాటులో ఉండేలా చూస్తోంది.’’ అని శ్రీ సింగ్ పేర్కొన్నారు.
రైతులకు పంట ప్రణాళికను మెరుగుపరచడంలో ఏఐ సహాయపడగలదని.. వైద్యులు వేగంగా, మరింత ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణకు వీలు కల్పిస్తుందని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులకు వ్యక్తిగతీకరించిన బోధనా సాధనాలు అందించగలదని, చిన్న వ్యాపారాలు, అంకుర సంస్థలు వేగంగా విస్తరించేందుకు సహాయపడుతుందని చెప్పారు. అలాగే ఉద్యోగార్థులు కొత్త వృత్తి మార్గాలను గుర్తించేందుకు దోహదపడుతుందని ప్రస్తావించారు. ఈ సదస్సు అటువంటి ఆచరణాత్మక వినియోగ సందర్భాలను ప్రదర్శిస్తుంది. కృత్రిమ మేధ కేవలం ఆటోమేషన్ మాత్రమే కాకుండా చేరిక, సామర్థ్యం, సాధికారతకు ఎలా ఒక సాధనంగా ఉంటుందో ప్రదర్శిస్తుంది. ‘‘కృత్రిమ మేధ ప్రజలను భర్తీ చేయడానికి కాదు..ఇది వారిని శక్తిమంచేయడానికి ఉద్దేశించినది. రోజువారీ జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుందో, కొత్త అవకాశాలను ఎలా సృష్టించగలదో, భారత్‌ను భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచగలదో పౌరులు అర్థం చేసుకోవడానికి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు సహాయపడుతుంది’’ అని శ్రీ సింగ్ పేర్కొన్నారు.
ప్రజల్లో ఉన్న సాధారణ భయాలు, అపోహలను తొలగిస్తూ.. కృత్రిమ మేధ (ఏఐ) మనుషులను భర్తీ చేయడం కోసం కాదని, మానవ సామర్థ్యాన్ని మరింత పెంపొందించడం కోసమేనని శ్రీసింగ్ స్పష్టం చేశారు. కొన్ని రకాల పనులు మారినప్పటికీ, ఏఐ ద్వారా కొత్త ఉద్యోగాలు, కొత్త నైపుణ్యాలు, కొత్త అవకాశాలు వస్తాయని.. ముఖ్యంగా భారతీయ యువతకు, నిపుణులకు, పరిశోధకులకు, పారిశ్రామికవేత్తలకు ఇది ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మార్పులకు భయపడకుండా, నిరంతర అభ్యాసం, మారుతున్న పరిస్థితులకు అలవాటు పడటం, ఏఐ అవగాహనపై దృష్టి సారించాలని పౌరులను ఆయన ప్రోత్సహించారు.
సదస్సు ద్వారా ఏయే వర్గాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఈ ఎపిసోడ్ వివరించింది.
· విద్యార్థులు భవిష్యత్తు వృత్తి మార్గాలను అన్వేషించవచ్చు.
· నిపుణులు నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాలను అర్థం చేసుకోవచ్చు.
· రైతులు: పంట ప్రణాళిక, వాతావరణ వివరాలు, ఇతర అంశాల్లో కృత్రిమ మేధ ఎలా సహాయపడుతుందో తెలుసుకోవచ్చు.
· అంకుర సంస్థలు: నెట్‌వర్క్‌లు, విధానపరమైన అవగాహన, అంతర్జాతీయ సహకారాన్ని పొందవచ్చు.
· పరిశోధకులు, విద్యావేత్తలు అత్యాధునిక ఏఐ పరిశోధనలతో మమేకమయ్యే అవకాశం
· విధాన నిర్ణేతలు, సంస్థలు బాధ్యతాయుత ఏఐ మార్గదర్శకాలను కలిసి రూపొందించవచ్చు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పౌరులు ఆసక్తిగా పాల్గొనాలని నిపుణులు పిలుపునిచ్చారు. ప్రజలు కృత్రిమ మేధను అర్థం చేసుకుని, విశ్వసించి, బాధ్యతాయుతంగా వినియోగించినప్పుడే భారత్ ఏఐ ప్రయాణం విజయవంతమవుతుందని ఆయన హితవు పలికారు. ఈ సదస్సు కేవలం సాంకేతికత గురించే కాకుండా ప్రతి భారతీయుడికి ఉపయోగపడే కృత్రిమ మేధ భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలుపుతూ చర్చను ముగించారు.
ఈ ప్రత్యక్ష ప్రసారానికి దేశవ్యాప్తంగా ఉన్న వీక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. నిపుణులు అందించిన స్పష్టమైన, సులభంగా అర్థమయ్యే వివరణలను వారు అభినందించారు. ఈ 41వ ఎపిసోడ్ పూర్తి రికార్డింగ్ https://www.youtube.com/live/Bvf1CMQNIVA?si=BeOO5F7dugTXWiJ1.లో అందుబాటులో ఉంది.
డిజిటల్ ఇండియా - ఆస్క్ అవర్ ఎక్స్‌పర్ట్స్ కార్యక్రమం పౌరులకు, ఆయా రంగాల నిపుణులకు మధ్య ప్రత్యక్ష సంభాషణకు వేదికగా కొనసాగుతోంది. ఇది సమాచారంతో కూడిన భాగస్వామ్యాన్ని, డిజిటల్ సాంకేతికతలపై అవగాహనను, బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ సిరీస్ డిజిటల్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది: https://www.youtube.com/@DigitalIndiaofficial. రాబోయే ఎపిసోడ్‌లు, డిజిటల్ ఇండియా కార్యక్రమాల తాజా సమాచారం కోసం www.digitalindia.gov.in , www.negd.gov.in వెబ్‌సైట్‌లను సందర్శించండి.
***
(రిలీజ్ ఐడి: 2224999)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7