భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పీఎం ఈ డ్రైవ్ పథకం
నాడు పోస్టు చేయడమైనది:
03 FEB 2026 4:41PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్’ (పీఎం-ఈ-డ్రైవ్) పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు (ఈ-రిక్షాలు, ఈ-కార్టులు, ఎల్5 వర్గం), ఈ-అంబులెన్సులు, ఈ-ట్రక్కులు వంటి అనేక ఈవీ విభాగాలకు డిమాండ్ ఆధారిత ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోంది. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ప్రారంభ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడానికి తోడ్పడుతోంది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు (కొనుగోలుదారులు లేదా తుది వినియోగదారులు) ముందస్తు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే వాహనం ధర తగ్గుతుంది. ఈ ప్రోత్సాహక మొత్తాన్ని భారత ప్రభుత్వం వాహన తయారీదారులకు (ఓఈఎమ్ లు) తిరిగి చెల్లిస్తుంది.
ఈ పథకం ద్వారా 28 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు లభిస్తోంది. 2026 జనవరి 27 నాటికి ఈ పథకం కింద మొత్తం 22.12 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయి. వీటిలో 19.19 లక్షల ఈ-ద్విచక్ర వాహనాలు.. 2.93 లక్షల ఈ-త్రి చక్ర వాహనాలు ఉన్నాయి.
ఈ పథకం కింద 14,028 ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం కోసం రూ. 4,391 కోట్లను కేటాయించారు. వీటిలో 40 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన ఏడు నగరాల్లో (బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, సూరత్) 13,800 ఈ-బస్సులను రెండు దశల్లో కేటాయించారు. మొదటి దశలో కేటాయించిన 10,900 ఈ-బస్సుల కోసం సీఈఎస్ఎల్ ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయగా.. రెండో దశలో కేటాయించిన మిగిలిన 2,900 ఈ-బస్సుల కోసం 09.01.2026న టెండర్లను పిలిచారు.
ఈ పథకం ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటునకు, టెస్టింగ్ సౌకర్యాల ఆధునీకరణకు కూడా మద్దతు అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ప్రజా ఛార్జింగ్ స్టేషన్లు (ఈవీపీసీఎస్) ఏర్పాటు కోసం రూ. 2,000 కోట్లను కేటాయించారు.
ఈ చర్యలు దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేశాయి. వినియోగదారుల్లోలో నమ్మకాన్ని పెంచాయి. స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా పరిష్కారాలను స్వీకరించేలా ప్రోత్సహించాయి.
డిసెంబర్ 31, 2025 నాటికి పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహన కొనుగోలుదారులకు అందించిన డిమాండ్ ప్రోత్సాహక రీయింబర్స్‌మెంట్ కింద మొత్తం రూ. 1,703 కోట్లను సంబంధిత వాహన తయారీదారులకు ప్రభుత్వం తిరిగి చెల్లించింది.
ఈ సమాచారాన్ని నేడు లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2222821)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20