రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కవచ్ 4.0 భద్రతా వ్యవస్థ ఏర్పాటును వేగవంతం చేసిన భారతీయ రైల్వే: మూడు సెక్షన్లలో 472 కి.మీ. మేర ప్రారంభం


ఒకే రోజులో రికార్డు స్థాయిలో 'కవచ్' ప్రారంభం

వడోదర–విరార్ (344 కి.మీ.), తుగ్లకాబాద్ జంక్షన్ క్యాబిన్–పల్వాల్ (35 కి.మీ.), మాన్‌పూర్–సర్మాటాండ్ (93.3 కి.మీ.) సెక్షన్లలో అమల్లోకి కవచ్ 4.0

భారతీయ రైల్వేలోని ఐదు జోన్లలో 1,300 కిలోమీటర్లకు పైగా రైల్వే మార్గాల్లో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన కవచ్ 4.0

నాడు పోస్టు చేయడమైనది: 30 JAN 2026 8:06PM by PIB Hyderabad

భారతీయ రైల్వే ఈరోజు తన నెట్‌వర్క్‌లోని మూడు సెక్షన్లలో 472.3 కిలోమీటర్ల మేర కవచ్ వెర్షన్ 4.0 (ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్)ను అందుబాటులోకి తెచ్చింది. రైలు ప్రయాణ భద్రతను బలోపేతం చేసే దిశగా ఇది మరో కీలక మైలురాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సెక్షన్లలో వెస్ట్రన్ రైల్వే పరిధిలోని వడోదర–విరార్ (344 కి.మీ.), ఉత్తర రైల్వేలోని తుగ్లకాబాద్ జంక్షన్ క్యాబిన్–పల్వాల్ (35 కి.మీ.), తూర్పు మధ్య  రైల్వేలోని మాన్‌పూర్–సర్మాటాండ్ (93.3 కి.మీ.) ఉన్నాయి. ఈ పనుల పూర్తితో, ఎక్కువ రద్దీ ఉండే మార్గాల్లో రైళ్ల రక్షణ, భద్రత,  నమ్మకాన్ని పెంచడానికి భారతీయ రైల్వే స్వదేశీ కవచ్ వ్యవస్థ విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది.

 

ఒకే రోజులో, ఒకే నెలలో అత్యధికంగా 472.3 కిలోమీటర్ల మేర కవచ్ వెర్షన్ 4.0ను అందుబాటులోకి తెచ్చి రైల్వే శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో పశ్చిమ మధ్య రైల్వేలోని కోటా–మథుర సెక్షన్‌లో సాధించిన 324 కిలోమీటర్లే ఇప్పటివరకు అత్యధికం. ఈ తాజా విస్తరణతో, భారతీయ రైల్వేలోని ఐదు జోన్లలో ఇప్పుడు కవచ్ వెర్షన్ 4.0 అందుబాటులోకి వచ్చింది.

ఈ తాజా విస్తరణతో భారతీయ రైల్వేలో మొత్తం 1,306.3 కిలోమీటర్ల మేర కవచ్ వెర్షన్ 4.0 అందుబాటులోకి వచ్చింది. దీని కంటే ముందు 834 కిలోమీటర్ల మార్గంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో ఢిల్లీ–ముంబై మార్గంలోని పల్వాల్–మథుర–నాగ్దా సెక్షన్ (633 కి.మీ.), ఢిల్లీ–హౌరా రూట్‌లోని హౌరా–బర్థమాన్ సెక్షన్ (105 కి.మీ.) ఉన్నాయి. ఇవే కాకుండా, గుజరాత్‌లోని మొదటి సెక్షన్ అయిన బాజ్వా (వడోదర)–అహ్మదాబాద్ మార్గంలో 96 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు.

 

 ఉత్తర రైల్వేలో కవచ్ 4.0 అమలు పురోగతి

ఢిల్లీ–ముంబై మార్గంలోని నాలుగు లైన్ల సెక్షన్‌లో 152 మెయిన్ లైన్ ట్రాక్ కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 35 కిలోమీటర్ల తుగ్లకాబాద్ జంక్షన్ క్యాబిన్–పల్వాల్ మధ్య భారతీయ రైల్వే కవచ్ 4.0ను విజయవంతంగా ప్రారంభించింది. ప్రధాన స్టేషన్ యార్డులు, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్న రెండు మెయిన్ లైన్లు,  అబ్సల్యూట్ బ్లాక్ సిగ్నలింగ్ ఉన్న మరో రెండు లైన్లతో కలిపి ఈ కారిడార్ మొత్తం పొడవునా కవచ్ ఏర్పాటు చేశారు.

ఢిల్లీ సబర్బన్,  లాంగ్ డిస్టెన్స్ రైల్వే నెట్‌వర్క్‌లో భాగంగా, అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటైన ఈ సెక్షన్‌లో కవచ్ ఏర్పాటు చేయడం భద్రత పరంగా ఒక కీలక అడుగు. ప్రయాణికుల రైళ్లు, సబర్బన్ రైళ్లు,  సరుకు రవాణా రైళ్లు నిరంతరం తిరిగే ఈ మార్గంలో కవచ్ అందుబాటులోకి రావడం వల్ల రైళ్ల నిర్వహణ భద్రత, నమ్మకం ప్రయాణికుల విశ్వాసం మరింత పెరుగుతాయి.

తూర్పు మధ్య  రైల్వేలో కవచ్ 4.0 అమలు పురోగతి

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ (డీడీయూ) డివిజన్‌కు చెందిన 93.3 కిలోమీటర్ల మన్‌పూర్–సర్మాతాన్ర్ సెక్షన్‌లో కూడా భారతీయ రైల్వే 'కవచ్ 4.0'తో రైలు కార్యకలాపాలను ప్రారంభించింది. మొట్టమొదటి 'కవచ్' ఆధారిత రైలు నెం. 13305 ససారం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఈ సెక్షన్‌లో విజయవంతంగా నడిచింది. ఇది సోనే నగర్ నుంచి  ఉదయం 07:42 గంటలకు బయలుదేరి, ఉదయం 09:35 గంటలకు మన్‌పూర్ చేరుకుంది. ఈ ప్రయాణ సమయంలో, ఒక హెడ్-ఆన్ కొలిజన్ (ఎదురెదురుగా ఢీకొట్టే) పరీక్షను నిర్వహించగా, రైలు తనంతట తానుగా ఆగింది. ఇది ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని ధృవీకరించింది.

తూర్పు మధ్య  రైల్వేలో మొత్తం 4,235 కిలోమీటర్ల మేర కవచ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల మీదుగా వెళ్లే ఢిల్లీ-హౌరా ప్రధాన మార్గంలో అత్యంత కీలకమైన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్–మాన్‌పూర్ మధ్య ఉన్న 417 కిలోమీటర్ల సెక్షన్ కూడా ఉంది. అన్ని రకాల రైళ్లు తిరిగే ఈ మార్గంలో ప్రస్తుతం గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుమతి ఉంది. అయితే, మిషన్ రఫ్తార్ కింద ఈ వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పెంచే పనులు వేగంగా జరుగుతున్నాయి.

పశ్చిమ రైల్వేలో కవచ్ 4.0 అమలు పురోగతి

ఢిల్లీ-ముంబై మార్గంలోని వడోదర–సూరత్–విరార్ సెక్షన్‌లో జనవరి 2023లో పనులు ప్రారంభం కాగా, 30 జనవరి 2026న ఈ 344 కిలోమీటర్ల మార్గంలో కవచ్ విజయవంతంగా అందుబాటులోకి వచ్చింది. ముంబై నుంచి  బయలుదేరిన 'ట్రైన్ నంబర్ 20907 దాదర్ -  భుజ్ సాయాజీనగరి ఎక్స్‌ప్రెస్' కవచ్ సౌకర్యంతో నడిచిన మొదటి రైలుగా నిలిచి ఈ చారిత్రక మైలురాయిని చేరుకుంది.

 

వడోదర–నాగ్దా సెక్షన్‌లో పనులు వేగంగా జరుగుతున్నాయి, వీటిని మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే విరార్ -  ముంబై సెంట్రల్ సెక్షన్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి, వీటిని సెప్టెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో, రైలు ఇంజిన్లలో (లోకోమోటివ్స్) కవచ్ ఏర్పాటు చేసే పనులు కూడా స్థిరంగా సాగుతున్నాయి. పశ్చిమ  రైల్వేలో ఇప్పటివరకు 364 ఇంజిన్లకు కవచ్ అమర్చారు. ఇవే కాకుండా, పశ్చిమ  రైల్వేలోని ఇతర సెక్షన్లలో మొత్తం 2,667 కిలోమీటర్ల మేర పనులకు అనుమతులు లభించాయి. ప్రస్తుతం ఈ అన్ని ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి.

కవచ్ గురించి

భారతదేశ స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్‌లో అత్యంత ఆధునికమైన కవచ్ వెర్షన్ 4.0, క్షేత్రస్థాయిలో వచ్చిన ఫీడ్‌బ్యాక్, స్వతంత్ర భద్రత అంచనాల ఆధారంగా నిరంతర సాంకేతిక మార్పులతో రూపొందింది. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డిఎస్ఓ) ఆమోదం పొందిన ఈ కవచ్ 4.0, రైల్వే భద్రతలో ఒక గొప్ప ముందడుగు.

భారతదేశంలోని వైవిధ్యమైన, అత్యంత రద్దీగా ఉండే మార్గాల,  బహుళ మార్గాల రైల్వే నెట్‌వర్క్ అవసరాలను తీర్చేలా దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఇది మరింత నమ్మకమైన పనితీరు, వేగవంతమైన ప్రతిస్పందనను అందిస్తూనే, ప్రస్తుతం ఉన్న సిగ్నలింగ్, ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలతో సులభంగా అనుసంధానమవుతుంది. ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఇండిపెండెంట్ సేఫ్టీ అసెసర్ (ఐఎస్ఏ) ధృవీకరణ పొందిన కవచ్ 4.0, ఇప్పుడు భారతీయ రైల్వే అంతటా భారీ స్థాయిలో ఏర్పాటు చేయడానికి పూర్తి సిద్ధంగా ఉంది. 

రైలు ప్రయాణాలను సురక్షితం చేయడానికి కవచ్ వ్యవస్థ మైక్రోప్రాసెసర్లు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్),  రేడియో కమ్యూనికేషన్ సాంకేతికతలను అనుసంధానిస్తుంది. నిర్ణీత దూరంలో అదే పట్టాపై మరొక రైలు ఉన్నట్లు గుర్తించినప్పుడు, ఈ వ్యవస్థ లోకో పైలట్‌ను అప్రమత్తం చేస్తుంది. ఒకవేళ అవసరమైతే, రైలులోని పరికరాల ద్వారా ఇది దానంతట అదే బ్రేకులను వేస్తుంది.

సిగ్నల్ దాటి ముందుకు వెళ్లడం వంటి పొరపాట్ల నుండి కవచ్ ఆటోమేటిక్ రక్షణను కల్పిస్తుంది. ఇది రైళ్లు పక్కనుంచి, , ఎదురెదురుగా,  వెనుక నుంచి ఢీకొనే ప్రమాదాలను సమర్థవంతంగా నివారిస్తుంది. రైలు మితిమీరిన వేగంతో వెళ్లకుండా ఇది నిరంతరం పర్యవేక్షిస్తూ నియంత్రిస్తుంది.   పొగమంచు లేదా ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కంటిచూపు సరిగ్గా ఆనని సమయాల్లో కూడా సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది.  రైలు పొరపాటున తప్పుడు దిశలో లేదా వెనక్కి కదిలినప్పుడు ఈ వ్యవస్థ వెంటనే హెచ్చరికలను జారీ చేస్తుంది.  లెవెల్ క్రాసింగ్ గేట్ల గురించి సమాచారాన్ని ఆటోమేటిక్‌గా అందిస్తుంది.  

కవచ్ వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయి భద్రత ప్రమాణమైన సేఫ్టీ ఇంటిగ్రేట్ లెవెల్ 4 (ఎస్ఐఎల్)-4) కు అనుగుణంగా రూపొందించారు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తక్కువ ఖర్చుతో కూడిన వ్యవస్థ కావడంతో, విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇది భారతీయ సిగ్నలింగ్ పరిశ్రమను బలోపేతం చేస్తూ మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు ఊతమిస్తుంది.

భారతీయ రైల్వే క్రమంగా కవచ్ వ్యవస్థ పరిధిని విస్తరిస్తూ, కోట్లాది మంది ప్రయాణికులకు సురక్షితమైన,  నమ్మకమైన ప్రయాణాన్ని అందించాలనే తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది. ఈ తాజా విస్తరణ మరింత సురక్షితమైన, ఆధునికమైన, స్వావలంబన కలిగిన  భారతీయ రైల్వే అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు.

 

***


(రిలీజ్ ఐడి: 2221308) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Kannada