వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు భారత్‌-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) పరిధిలోకి... ప్రపంచ ‘జీడీపీ’లో 25 శాతంపై ప్రభావం: కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌


· “నాలుగేళ్లలో భారత్‌ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ప్రతిభ.. వాణిజ్యాల కోసం అంతర్జాతీయ అవకాశాలకు బాటలు వేసింది”

· “కీలక ఖనిజాల లభ్యత పెంపు దిశగా చిలీతో భారత్‌ భవిష్యత్‌ ‘ఎఫ్‌టీఏ’లు”

· “బలమైన స్థూల ఆర్థిక శాస్త్ర ప్రాథమిక పునాది ఫలితంగా అంతర్జాతీయ అనిశ్చితి నడుమన కూడా భారత్‌ నుంచి ఎగుమతులు పెరుగుతున్నాయి”

· “దేశవిదేశాల్లోని 184 చాప్టర్లలో భారత వృత్తి నైపుణ్యం ప్రదర్శిస్తున్న 5.25 లక్షల మంది చార్టర్డ్‌ అకౌంటెంట్లు”

నాడు పోస్టు చేయడమైనది: 30 JAN 2026 6:10PM by PIB Hyderabad

భారత్‌-ఐరోపా యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మానవాళిలో దాదాపు మూడింట ఒక వంతుకు వర్తిస్తుందని కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఈ రోజు గ్రేటర్ నోయిడాలో ‘ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ (ఐసీఏఐ) నిర్వహించిన ‘వరల్డ్ ఫోరం ఆఫ్ అకౌంటెంట్స్‌’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో గణనీయ వాటా సహా ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతాన్ని కూడా ఈ ఒప్పందం ప్రభావితం చేస్తుందని మంత్రి చెప్పారు. ఐరోపా కమిషన్ అధ్యక్షుడు ఈ ‘ఎఫ్‌టీఏ’ను ‘ఒప్పందాలను మించిన ఒప్పంద’మని అభివర్ణించడం వెనుక ప్రధాన కారణం ఇదేనని ఆయన పేర్కొన్నారు.

ఐరోపా మార్కెట్ విస్తృత సామర్థ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఐరోపా సమాఖ్యలోని సభ్యదేశాలు దాదాపు 7 ట్రిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులతోపాటు 3 ట్రిలియన్‌ డాలర్ల విలువైన సేవలను దిగుమతి చేసుకుంటున్నాయని వెల్లడించారు. ఆ మేరకు మొత్తం మీద 10 ట్రిలియన్‌ డాలర్ల  సామర్థ్యంగల మార్కెట్‌ భారత్‌కు అందుబాటులోకి వస్తుందని శ్రీ గోయల్ అన్నారు. ఇంత విస్తృత సామర్థ్యంగల మార్కెట్‌కు భారత్‌ నుంచి ప్రస్తుత ఎగుమతులు కొద్దిశాతం మాత్రమేనని పేర్కొన్నారు. అందువల్ల తాజా ఒప్పందంతో మన ఎగుమతిదారులకు అపార అవకాశాలు అందివస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

భారత్‌ గడచిన నాలుగేళ్లలో 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నదని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత్‌ సంబంధాల్లో ప్రాథమిక మార్పులకు ఇది ప్రతిబింబిమని మంత్రి అన్నారు. ఈ ఒప్పందాలన్నీ ఐరోపా సహా ఇతర దేశాల ప్రధాన ఆర్థిక వ్యవస్థలకూ విస్తరించగలవని ఆయన అన్నారు. వీటిలో 27 దేశాల ఐరోపా సమాఖ్య సహా స్విట్జర్లాండ్, లీచెన్‌స్టెయిన్, నార్వే, ఐస్‌లాండ్‌ సహిత నాలుగు దేశాల ‘ఈఎఫ్‌టీఏ'’కూటమి, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాలు ఉన్నాయని తెలిపారు. భారతీయ ప్రతిభ, నైపుణ్యానికి, యువ నిపుణులకు సరికొత్త, కీలక అవకాశాలను ఈ ఒప్పందాలు సృష్టిస్తాయన్నారు. అలాగే ప్రపంచ విలువ వ్యవస్థతో భారత్‌ ఏకీకరణను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

కీలక ఖనిజాల కోసం భారత్‌ త్వరలోనే చిలీతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనుందని, ఇది వాటి సులభ లభ్యతకు తోడ్పడుతుందని మంత్రి అన్నారు. అలాగే, ‘ఈఎఫ్‌టీఏ’ దేశాలతో ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ- మౌలిక సదుపాయాల కల్పన, ఆవిష్కరణ, అత్యాధునిక తయారీ రంగాలకు మద్దతు లక్ష్యంగా భారత్‌లో 100 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఇది హామీ ఇస్తుందన్నారు. ఈ పెట్టుబడులతో మన దేశంలో దాదాపు 50 లక్షల ఉద్యోగాల సృష్టికి వీలుంటుందని తెలిపారు. గత 25 ఏళ్లలో మొత్తం ‘ఎఫ్‌డీఐ’ 70 మిలియన్‌ డాలర్లకు పరిమితం కాగా, రాబోయే 15 ఏళ్లలో 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడికి ఒక్క న్యూజిలాండ్‌ అంగీకరించిందని గుర్తుచేశారు.

భారత ఆర్థిక వృద్ధి పథం, యువజన లబ్ధి, నైపుణ్య పునాది, సమగ్రతలపై ప్రపంచానికి పెరుగుతున్న విశ్వాసాన్ని ఈ పెట్టుబడుల హామీలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని శ్రీ గోయల్ అన్నారు. అలాగే భారతీయ నిపుణులు విద్యావంతులు, శ్రమించగల వారు మాత్రమేగాక తమ ఆకాంక్షల సాకారానికి కృషి చేస్తూ అంతర్జాతీయంగా విశ్వసనీయత పొందారని ఆయన వ్యాఖ్యానించారు.

మన దేశం 2047 నాటికి సుసంపన్న, వికసిత భారత్‌గా రూపొందే క్రమంలో చార్టర్డ్ అకౌంటెంట్లకు కీలక పాత్ర ఉంటుందన్నారు. దేశ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా సంబరాలు చేసుకునే వేళకు వికసిత, సుసంపన్న భారత్‌ సాకారంలో తామూ భాగస్వాములం కావాలని వారు నిశ్చయించుకున్నట్లు శ్రీ గోయల్ అన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్లు దేశీయంగానే కాకుండా భారత్‌కు-మిగిలిన ప్రపంచానికి మధ్య వారధిగానూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రపంచ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ- అంతర్జాతీయ అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్ట, అస్పష్ట పరిస్థితుల నడుమ అనేక దేశాలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయని మంత్రి గుర్తుచేశారు. నేటి పరిస్థితులను  వాస్తవిక అల్లకల్లోల, అనూహ్య దశగా అభివర్ణించారు. ప్రపంచ వ్యాప్తంగా మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఆత్మవిశ్వాసం, ప్రతిభ, నైపుణ్యాలు, భారీ ఆకాంక్షలు ఏర్పరచుకుని-సాధించే సామర్థ్యం, భవిష్యత్‌ ప్రణాళిక రచనా ధైర్యంగల వారు మాత్రమే విజయాన్ని అందుకుంటారని శ్రీ గోయల్‌ వ్యాఖ్యానించారు. ఇటువంటి అనిశ్చితి నడుమ స్థిరత్వానికి నిలయంగా భారత్‌ దృఢంగా నిలుస్తుందని చెప్పారు.

భారత్‌ స్థూల ఆర్థిక మూలాలు బలమైనవి కావడం వల్ల అధిక వృద్ధి, స్వల్ప ద్రవ్యోల్బణంతో ప్రపంచంలో శరవేగంగా పురోగమిస్తున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పరిగణనలోకి వచ్చిందని మంత్రి చెప్పారు. శక్తిమంతమైన బ్యాంకింగ్ వ్యవస్థ, బలమైన విదేశీ మారక నిల్వలు కూడా మన ఆర్థిక వ్యవస్థను దృఢంగా నిలుపుతున్నాయని తెలిపారు. ప్రపంచ వాణిజ్య మార్కెట్లలో కల్లోలం, మందగమనం ఉన్నప్పటికీ భారత వస్తుసేవల ఎగుమతులు ఈ ఏడాదిలోనూ పెరుగుతూనే ఉంటాయన్నారు. దేశంలోని 140 కోట్లమంది పౌరుల సామర్థ్యంపై విశ్వాసం వెలిబుచ్చుతూ- భారత్‌ నిరంతరం ప్రగతి పథంలో సాగుతుందని చెప్పారు. ఈ క్రమంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశ ప్రజానీకం ఆలోచన ధోరణిలో మార్పులను ప్రస్తావిస్తూ- భారత్‌ 2014లో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని శ్రీ గోయల్ గుర్తుచేశారు. ఆర్థిక వ్యవస్థ వేగం పెంచడం, పౌరులలో విశ్వాసం కలిగించడంతోపాటు వృద్ధిని వేగిరపరచేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వం ఎంతయినా అవసరమని వ్యాఖ్యానించారు. ఆయన సారథ్యంలో భారత్‌ మునుపటి అంచనాలకు మించి ఎంతో ముందుగానే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ఈ ధోరణి ప్రస్ఫుటం అవుతున్నదని పేర్కొన్నారు. భారత్‌ ఇకపై ప్రపంచంతో సంకోచం లేదా రక్షణాత్మక శైలిలో వ్యవహరించబోదని, నమ్మకం-ఆత్మవిశ్వాసంతో నడచుకుంటుందని పేర్కొన్నారు. దేశం ఇప్పుడు కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సముచిత, సమాన, సమతుల రీతిలో ఉన్నాయని చెప్పారు.

దేశంలోని వృత్తి నిపుణుల పాత్రను ప్రస్తావిస్తూ- మన చార్టర్డ్ అకౌంటెంట్లకు దేశవిదేశాల్లోని ప్రపంచ సామర్థ్య వికాస కేంద్రాలు, పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలలో గణనీయ అవకాశాలు ఉన్నాయని శ్రీ గోయల్ అన్నారు. వాస్తవిక, నిష్పాక్షిక ఖాతాల ధ్రువీకరణలో ఈ వృత్తి కీలక పాత్ర పోషిస్తుందని, దీంతో పెట్టుబడిదారులలో విశ్వాసం పెరిగి, దేశం మూలధనాన్ని ఆకర్షించగలదని పేర్కొన్నారు.

దేశంలోని 184 చాప్టర్లతోపాటు 47 దేశాల కార్యకలాపాల్లో 4.25 లక్షల మందికిపైగాక్రియాశీల నిపుణులు సహా 5.25 లక్షల మందికి పైగా చార్టర్డ్ అకౌంటెంట్లు తమ ప్రతిభా నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారని శ్రీ గోయల్‌ అన్నారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా శక్తిసామర్థ్యాలు ప్రదర్శించగల స్థానంలో భారత్‌ దృఢంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. భారత చార్టర్డ్ అకౌంటెంట్ల కఠిన శిక్షణ, విస్తృత పరిజ్ఞానం ప్రపంచంలో ఎక్కడైనా రాణించేలా వారిని సన్నద్ధం చేస్తాయన్నారు.

నిపుణుల ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉండాలని సూచిస్తూ- తదనుగుణంగా చార్టర్డ్ అకౌంటెంట్లు మరింత ఉన్నత స్థాయికి ఎదగి, విస్తృత భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని శ్రీ గోయల్ ఆకాంక్షించారు. కార్యకలాపాల విస్తరణతోపాటు అంతర్జాతీయ అవకాశాలను అన్వేషించాల్సిందిగా ప్రోత్సహించారు. నైపుణ్యాభివృద్ధి దిశగా సులభ మార్గాల నుంచి ఉజ్వల పథంవైపు సాగాలని, అమృత కాల అవకాశాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ వాణిజ్యం, తయారీ, సేవా రంగాల సహితంగా వృత్తిపరమైన శిక్షణ, పాఠ్యాంశాల్లో ప్రపంచ స్థాయిని అందుకోవాల్సిన అవసరాన్ని మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచంతో మమేకం కానిదే ఏ దేశమూ పురోగమించజాలదని, అంతర్జాతీయ అవకాశాలను పెంచుకోవడానికి తగినట్లు ఈ వృత్తి తననుతాను సన్నద్ధం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.

చివరగా... భారత వృద్ధి పథంలో నిపుణులు సమష్టిగా కీలక పాత్ర పోషించడానికి నిబద్ధత చూపితే చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగల సామర్థ్యాన్ని ప్రదర్శించగలదని చెప్పారు. అమృత కాలంలో దేశాన్ని సమున్నత శిఖరాలకు చేర్చాలంటే ఇదెంతో అవసరమని చెప్పారు. దేశాన్ని వికసిత భారత్‌గా, అంతర్జాతీయ అగ్రగామిగా నిలపడంలో ఈ వృత్తి గణనీయంగా దోహదం చేస్తుదని విశ్వాసం వెలిబుచ్చుతూ శ్రీ గోయల్‌ తన ప్రసంగం ముగించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2221307) సందర్శకుల సూచీ సంఖ్య : : 27
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Malayalam