ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ 2026-27 అనంతరం దేశంలోని యువతతో సంభాషించనున్న కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి
ఫిబ్రవరి 1, 2026న పార్లమెంటు కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించనున్న 30 మంది విద్యార్థులు
प्रविष्टि तिथि:
30 JAN 2026 7:07PM by PIB Hyderabad
కేంద్ర బడ్జెట్ 2026–27ను ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది కళాశాల విద్యార్థులతో ముఖాముఖి సంభాషిస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు లోక్‌సభ గ్యాలరీ నుంచి కేంద్ర బడ్జెట్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని పొందుతారు. దీనివల్ల సంవత్సరంలో అత్యంత కీలకమైన పార్లమెంటు కార్యకలాపాల్లో ఒకదానిని ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం లభిస్తుంది.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ విద్యార్థులు.. వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, వైద్య విద్య, వృత్తిపర కోర్సులు వంటి వివిధ విభాగాలకు చెందిన వారు.
కర్తవ్య భవన్-1లో ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా విద్యార్థులు సందర్శిస్తారు. అక్కడ వివిధ స్థాయిల్లోని సీనియర్ అధికారులతో ముఖాముఖి సంభాషించి, మంత్రిత్వ శాఖ పనితీరు, విధాన రూపకల్పన ప్రక్రియలు, దేశ నిర్మాణంలో సంస్థల పాత్ర గురించి అవగాహన పొందుతారు.
అనంతరం సాయంత్రం వేళ శ్రీమతి నిర్మలా సీతారామన్ విద్యార్థులతో ముచ్చటిస్తారు. బడ్జెట్ ప్రాధాన్యతలు, భారత భవిష్యత్తు కోసం బడ్జెట్ దార్శనికత,యువతపై దాని ప్రభావం వంటి అంశాలపై వారితో స్వేచ్ఛయుత చర్చలో పాల్గొంచారు. ఈ సందర్భంగా విద్యార్థులు కూడా తమ ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను పంచుకుంటారు. యువతకు, దేశ ప్రగతికి సంబంధించి తమ అభిప్రాయాలను తెలియజేస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక శాస్త్రం, పరిపాలన, ప్రజాస్వామ్య ప్రక్రియలపై అవగాహన పెంపొందించడం ప్రధాన ఉద్దేశం. దేశ ఆర్థిక, పార్లమెంటరీ విధానాల్లో యువతకు సరైన సమాచారంతో కూడిన సానుకూల భాగస్వామ్యాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.
బడ్జెట్ రూపకల్పన సమయంలో వివిధ వేదికల ద్వారా యువతతో సహా పౌరలందరి నుంచి అనేక సూచనలు, అభిప్రాయాలను సేకరించారు. అవన్నీ రాబోయే కేంద్ర బడ్జెట్ 2026–27లో ప్రతిబింబిస్తాయి.
***
(रिलीज़ आईडी: 2221062)
आगंतुक पटल : 12