వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గల్ఫుడ్ 2026లో 161 మంది ప్రదర్శనకారులతో విభిన్న వ్యవసాయ, ఆహార ఉత్పత్తులను ప్రదర్శించనున్న భారత్


ఏపీఈడీఏ భారతి పెవిలియన్‌లో ఎనిమిది అత్యుత్తమ అంకుర సంస్థల ప్రదర్శన

గల్ఫుడ్ 2026లో తొలిసారి భాగస్వామ్య దేశంగా భారత్

प्रविष्टि तिथि: 23 JAN 2026 11:45AM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) గల్ఫుడ్ 22026లో అత్యంత శక్తిమంతమైన, విస్తృతమైన భాగస్వామ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇది ప్రపంచ వ్యవసాయ, ఆహార వాణిజ్యంలో భారత్ ఎదుగుతున్న తీరును చాటిచెబుతోంది. గల్ఫుడ్ 2026లో భారత్ భాగస్వామ్య దేశంగా వ్యవహరిస్తోంది. నమ్మకమైన ఆహార వనరు దేశంగా, ప్రపంచ ఆహార భద్రతలో పటిష్టమైన సరఫరా నిర్వహణలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఈ హోదా స్పష్టం చేస్తుంది.

గత ఎడిషన్లతో పోలిస్తే ఈసారి భారత్ తన ఉనికిని గణనీయంగా పెంచుకుంది. వ్యవసాయ, ఆహార ఎగుమతుల విస్తరణ, భారతీయ ఉత్పత్తులకు పెరుగుతున్న అంతర్జాతీయ డిమాండ్, ఎగుమతిదారులు, అంకుర సంస్థలు, ఉత్సాహభరిత భాగస్వామ్యం కారణంగా భారత పెవిలియన్ పరిమాణం గత ఏడాది కంటే రెట్టింపు అయ్యింది.

ప్రదర్శనలో మొతం 1,434 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారత్ తన ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. వివిధ విభాగాలకు చెందిన 161 ప్రదర్శనకారులు ఇందులో పాల్గొంటున్నారు

శుద్ధి చేసిన ఆహార పదార్ధాలు, తాజా, ఫ్రోజెన్ ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, పానీయాలు, విలువ జోడించిన ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ ఎగుమతి అంకుర సంస్థలు వంటి ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. భారత పెవిలియన్ ఎగుమతిదారులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు, అంకుర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ సంస్థలను ఒకే వేదికపై తీసుకువచ్చింది. ఇది భారత వ్యవసాయ, ఆహార రంగ సమగ్ర రూపాన్ని, ఎగుమతులకు మన దేశం ఎంత సిద్ధంగా ఉందో ప్రపంచానికి తెలియజేస్తోంది.

ఈ భాగస్వామ్యం ఆయా ప్రాంతాల ప్రత్యేక వ్యవసాయ ఉత్పత్తులు, భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు, సేంద్రీయ ఉత్పత్తులు, విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులను ప్రముఖంగా ప్రదర్శిస్తోంది. ఇది అంతర్జాతీయ వ్యవసాయ వాణిజ్యంలో దేశం విస్తరిస్తున్న తీరును చాటి చెబుతోంది.

గల్ఫుడ్ 2026లో దేశ భాగస్వామ్యం మరింత బలపడుతోంది. ఇందుకు కీల జాతీయ సంస్థలు, ప్రభుత్వ విభాగాల భాగస్వామ్యం ప్రధాన కారణం. వీటిలో నాఫెడ్‌, జాతీయ సహకార ఎగుమతుల సంస్థ, జాతీయ ఉద్యానవన బోర్డు, ఉత్తరాఖండ్ ఉద్యానవన బోర్డు, భారత మసాలా దినుసుల బోర్డు, భారత టీ బోర్డు, జాతీయ పసుపు బోర్డు, భారత బియ్యం ఎగుమతిదారుల సంస్థ, దేశవ్యాప్త బియ్యం ఎగుమతిదారుల సంఘం, ఐఓపీఈపీసీ, ఛత్తీస్‌గఢ్ బియ్యం ఎగుమతిదారుల సంఘం, కామ్‌ఫెడ్- బీహార్ రాష్ట్ర పాల సహకార సమాఖ్య లిమిటెడ్, పంజాబ్ రాష్ట్ర సహకార సరఫరా, మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్, డైరెక్టరేట్ ఆఫ్ హార్టికల్చర్-బీహార్ ప్రభుత్వం, సిక్కిం సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధి సంస్థ, ది సెంట్రల్ అరెకానట్ అండ్ కోకో మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ కోఆపరేటివ్ లిమిటెడ్ తదితర సంస్థలు ఉన్నాయి.

దేశ భాగస్వామ్యంలో ప్రధాన ఆకర్షణగా భారతి పెవిలియన్ నిలుస్తోంది. ఇది ఎగుమతులకు సిద్ధంగా ఉన్న వ్యవసాయ-ఆహార, వ్యవసాయ-సాంకేతిక అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి ఏపీఈడీఏ చేపట్టిన ఓ ప్రధాన కార్యక్రమం. దుబాయ్ ప్రపంచ వాణిజ్య కేంద్రంలోని స్టార్టప్ జోన్‌లో ఉన్న ఈ భారతి పెవిలియన్ ద్వారా దేశవ్యాప్తంగా 100కు పైగా దరఖాస్తుల నుంచి జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన ఎనిమిది అత్యుత్తమ భారతీయ అంకుర సంస్థలు పాల్గొంటున్నాయి. ఏపీఈడీఏ ‘ఫామ్ టు ఫారిన్’ దార్శనికతకు అనుగుణంగా ఈ అంకుర సంస్థలు వినూత్న ఉత్పత్తులు, సాంకేతిక పరిష్కారాలు, ఎగుమతి ఆధారిత సేవలను ప్రదర్శిస్తున్నాయి.

భారతీయ పెవిలియన్‌లో ప్రత్యేకంగా ఒక వంటల ప్రదర్శన ప్రాంతం కూడా ఉంది. ఇక్కడ ఒక ప్రముఖ చెఫ్ భారతీయ వంటకాలను ప్రత్యక్షంగా తయారు చేసి చూపిస్తారు. ఈ ప్రాంతం దేశపు గొప్ప పాక శాస్త్ర వారసత్వాన్ని, వైవిధ్యభరితమైన ప్రాంతీయ రుచులను, భారతీయ దినుసుల బహుముఖ వినియోగాన్ని చాటి చెబుతుంది. ఇది కొనుగోలుదారులను ఆకట్టుకోవడమే కాకుండా, భారతీయ ఆహార ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్త గుర్తింపును పెంపొందించడానికి తోడ్పడుతుంది.

ఉత్పత్తుల ప్రదర్శనలో భాగంగా పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, చిరుధాన్యాల కోసం ఒక సమగ్ర విభాగం ఉంది. ఇది దేశంలోని విభిన్న రకాల ఉత్పత్తులను ప్రదర్శించడమే కాకుండా, ప్రధాన ఆహార ధాన్యాల ఉత్పత్తిలో, ఎగుమతుల్లో ప్రపంచ అగ్రగామిగా దేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నాణ్యత, స్థిరత్వం, ట్రేసిబిలిటీ, అంతర్జాతీయ ప్రమాణాల పాటింపుపై ఈ ప్రదర్శనలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.

గల్ఫుడ్ 2026 రెండు ప్రధాన వేదికల్లో జరుగుతోంది, ఈ రెండు చోట్లా భారత్‌ తన శక్తిమంతమైన ఉనికిని చాటుతోంది. దుబాయ్ ఎక్స్‌పో సిటీలో వరల్డ్ ఫుడ్ హాల్, పప్పుధాన్యాలు, తృణధాన్యాల హాల్, గల్ఫుడ్ గ్రీన్ ఉన్నాయి. ఇవి ప్రధానంగా సుస్థిరత, ఆవిష్కరణలు, భవిష్యత్తు ఆహార వ్యవస్థలపై దృష్టి సారిస్తాయి. దుబాయ్ ప్రపంచ వాణిజ్య కేంద్రంలో పానీయాల విభాగం, స్టార్టప్ హాల్ ఉన్నాయి. ఇందులో భాగంగా భారతి పావిలియన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

గల్ఫుడ్ 2026లో భారత్‌ భాగస్వామ్యం.. భారత్‌-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా లభిస్తున్న అవకాశాలకు అనుగుణంగా సాగుతోంది. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, గల్ఫ్ ప్రాంతంలో భారతీయ వ్యవసాయ, ఆహార ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలను మరింత మెరుగుపరిచింది.

ప్రదర్శనలో పాల్గొనడమే కాకుండా గల్ఫుడ్ 2026లో భాగస్వామ్య దేశం హోదాలో భాగంగా దుబాయ్‌లోని ప్రముఖ ప్రాంతాల్లో ఏపీఈడీఏ విస్తృతమైన ప్రత్యేక బ్రాండింగ్, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వీటిలో భాగంగా మెట్రో స్టేషన్లు, బస్సులపై ప్రకటనలు, గ్యాస్ స్టేషన్లు,ప్యానెల్ బ్రాండింగ్, ఇతర బహిరంగ ప్రచార పద్ధతులు ఉన్నాయి. ఈ భారీ ప్రచార కార్యక్రమాలు అంతర్జాతీయ స్థాయిలో దేశ ఉనికిని, బ్రాండ్ గుర్తింపును గణనీయంగా పెంచుతున్నాయి.

సమగ్ర, విస్తృత భాగస్వామ్యం ద్వారా ఏపీఈడీఏ పలు లక్ష్యాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో కొనుగోలుదారు-అమ్మకందారుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ప్రపంచవ్యాప్తంగా భారతీయ బ్రాండ్‌లను ప్రోత్సహించడం, అంకుర సంస్థలు,ఎగుమతిదారులకు మద్దతునివ్వడం, భారతదేశపు వ్యవసాయ-ఆహార వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం వంటివి ఉన్నాయి. అంతర్జాతీయ వ్యవసాయ-ఆహార విలువ వ్యవస్థలో దేశాన్ని నమ్మకమైన, ఆవిష్కరణలతో కూడిన,స్థిరమైన భాగస్వామిగా నిలబెట్టడం ఈ ప్రయత్నాల ప్రధాన ఉద్దేశ్యం.

 

***


(रिलीज़ आईडी: 2217916) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Malayalam