ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ పట్ల అంతర్జాతీయంగా ఉన్న బలమైన విశ్వాసాన్ని


వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలియజేసిన కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌

భారత్‌తో భాగస్వామ్యాలను విస్తరించటానికి అంతర్జాతీయ పరిశ్రమల దిగ్గజాలు ఆసక్తి కనబరుస్తున్న తరుణంలో కీలక చర్చలు

కీలక ఖనిజాల విషయంలో భారతదేశ వాణిజ్య కార్యకలాపాలను సురక్షితం చేయడంలో

అంతర్జాతీయ భాగస్వామ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్న కేంద్ర మంత్రి


భారత్ నిర్వహించనున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు'లో చురుగ్గా పాల్గొనాలని

ఏఐ రంగంలోని అగ్రగాములను కోరిన కేంద్ర మంత్రి

प्रविष्टि तिथि: 22 JAN 2026 8:59PM by PIB Hyderabad

భారత్ పట్ల పెరుగుతున్న ప్రపంచ విశ్వాసాన్ని, నమ్మకమైన వాణిజ్య కార్యకలాపాల భాగస్వామిగా దేశం ఎదుగుతున్న తీరును దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో (డబ్ల్యూఈఎఫ్) కేంద్ర ఎలక్ట్రానిక్స్- ఐటీ, రైల్వేలు, సమాచార ప్రసార శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రధానంగా పేర్కొన్నారు.

 

మౌలిక సదుపాయాలు, సాంకేతికత, సరకు రవాణా, తయారీ రంగం, ఇతర వర్ధమాన రంగాల్లో భారత్‌తో భాగస్వామ్యం కోసం అంతర్జాతీయ నాయకులు చూపుతున్న నిరంతర ఆసక్తి దేశ వృద్ధి గాథను మరింత బలోపేతం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.

 

చర్చల సందర్భంగా భారత్‌లో కార్యకలాపాలను విస్తరించేందుకు టెమాసెక్ చైర్మన్ మిస్టర్ టియో చీ హీన్ ఆసక్తిని కనబరిచారు. భారత భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలతో పాటు డీప్-టెక్ అంకురాల్లో పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్ నిబద్ధతతో ఉన్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. కృత్రిమ మేధ, రోబోటిక్స్, సైబర్ భద్రత రంగాల నాయకులతో జరిపిన చర్చలు.. వాణిజ్య కార్యకలాపాల విషయంలో నమ్మకమైన భాగస్వామిగా భారత్ ఎదుగుతున్న తీరును తెలియజేశాయి. 

 

ప్రతి చర్చలోనూ భారత్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. నౌకాయానం, ఓడరేవులు, రైల్వేలలో రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మెర్స్క్ సంస్థ భారత్‌తో చురుగ్గా పని చేస్తోంది. సెమీకండక్టర్ పదార్థాల విషయంలో కూడా ఈ సంస్థ భారత్‌తో కలిసి పని చేస్తోంది. రైల్వే ఆధునికీకరణలో భారత్‌తో కలిసి హనీవెల్ సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థ దేశంలో తయారీ కార్యకలాపాలను విస్తరించడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది.

 

దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్‌లో గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ-సహ వ్యవస్థాపకులు డెమిస్ హసాబిస్, ఓపెన్ ఏఐ చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ క్రిస్ లెహనేలతో శ్రీ అశ్వినీ వైష్ణవ్ సమావేశమయ్యారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఏఐ‌ని రూపొందించడంలో పెరుగుతున్న భారత్‌ పాత్ర గురించి మంత్రి చర్చించారు. ఫిబ్రవరి 2026లో ఢిల్లీలో జరగనున్న 'ఏఐ ఇంపాక్ట్ సదస్సు'లో చురుగ్గా పాల్గొనాలని ఆయన ఏఐ రంగ నాయకులను కోరారు. 

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో పాత నిబంధనలు, కూటములు మారుతున్న వేళ భారత్‌ ఒక నమ్మకమైన భాగస్వామిగా సమర్థవంతంగా పనిచేస్తూ సమ్మిళిత వృద్ధిపై దృష్టి సారించిన నాయకత్వాన్ని అందించే శక్తిమంతమైన ప్రజాస్వామ్యంగా గుర్తింపు పొందుతోందని శ్రీ అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రపంచ భాగస్వాములు సౌకర్యవంతంగా కలిసి పనిచేయడానికి, కొత్త సాంకేతికతలను కలిసి సృష్టించడానికి- అభివృద్ధి చేయడానికి భారత్ ఒక నమ్మకమైన దేశమన్న ఏకాభిప్రాయం చర్చల్లో వ్యక్తమైందని ఆయన తెలిపారు. 

 

కీలకమైన ఖనిజాల విషయంలో వాణిజ్య కార్యకలాపాలు చాలా క్లిష్టమైనవని.. ముఖ్యంగా శుద్ధి- ప్రాసెసింగ్ వంటి వివిధ దశల్లో సమన్వయంతో కూడిన భాగస్వామ్యం అవసరమని మంత్రి తెలిపారు. కీలకమైన ఖనిజాల విషయంలో దృఢమైన వాణిజ్య కార్యకలాపాలు ఉండేలా చూసుకునేందుకు అర్థవంతమైన అంతర్జాతీయ భాగస్వామ్యాలు అత్యవసరమని ఆయన ఉద్ఘాటించారు.

 

జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఐరోపా, అమెరికాతో భారత్‌ ఇప్పటికే సహకారాన్ని కలిగి ఉందని.. ఈ భాగస్వామ్యాలు కీలకమైన ఖనిజాల వ్యవస్థను బలోపేతం చేయడంలో గణనీయమైన పాత్ర పోషిస్తాయని శ్రీ అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 

 

కృత్రిమ మేధకు సంబంధించిన అప్లికేషన్లు, మోడల్స్ నుంచి చిప్స్, మౌలిక సదుపాయాలు, ఇంధనం వరకు 'ఏఐ స్టాక్'‌లోని అన్ని విభాగాల్లో భారత్‌ అనుసరిస్తున్న విధానాన్ని శ్రీ అశ్వినీ వైష్ణవ్ వివరించారు. భారత ఐటీ పరిశ్రమ ఇప్పుడు ఉత్పాదకత, విలువను పెంచే ఏఐ-ఆధారిత పరిష్కారాలను అందించే దిశగా మలుపు తీసుకుందని ఆయన అన్నారు. 

 

రాబోయే ఏఐ ఇంపాక్ట్ సదస్సు.. ఉత్పాదకత- రాబడిని మెరుగుపరచడంలో ఏఐ వాస్తవ ప్రభావాన్ని అంచనా వేయడం, సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించడం ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, ఏఐ ప్రయోజనాలను పొందుతూనే అందులోని ముప్పులను ఎదుర్కొనేందుకు తగిన రక్షణ కవచాలను ఏర్పాటు చేయడం అనే మూడు ప్రధాన లక్ష్యాలపై దృష్టి సారిస్తుందని మంత్రి చెప్పారు. 

 

సెమీకండక్టర్ల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఆమోదించిన పలు కేంద్రాల్లో ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు. వీటిలో త్వరలోనే వాణిజ్యపరమైన ఉత్పత్తి మొదలవుతుందన్న్నారు. ఈ కీలక రంగంలో భారత దీర్ఘకాలిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, పటిష్ఠమైన సెమీకండక్టర్ వ్యవస్థను తయారుచేసేందుకు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా క్రమబద్ధమైన పద్ధతిలో ముందుకు వెళ్తోందని ఆయన చెప్పారు. ప్రయోగాత్మక ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైన నాలుగు సెమీకండక్టర్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకదానిలో త్వరలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుందని తెలిపిన ఆయన.. మొదటి కేంద్రంలో ఫిబ్రవరిలో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఆధారభూతమైన సాంకేతికతలను (ఫౌండేషనల్ టెక్నాలజీ) తయారుచేయటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూపిస్తోన్న బలమైన ఆసక్తికి ఇది నిదర్శమని ఆయన వ్యాఖ్యానించారు. ఆరు దశాబ్దాల ప్రయత్నం తర్వాత సాధించిన ఒక ప్రధాన ఘట్టంగా దీనిని ఆయన అభివర్ణించారు. 

దేశంలో ప్రస్తుతం బలమైన, పరిణతి చెందిన ఎలక్ట్రానిక్స్ వ్యవస్థ అందుబాటులో ఉన్నందున భారత్ సొంత దేశీయ మొబైల్ ఫోన్ బ్రాండ్‌లను అభివృద్ధి చేసుకోవడానికి ఇదే సరైన సమయమని మంత్రి పేర్కొన్నారు. ఈ పురోగతి ఎంతో ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా ఉందని వివరించిన ఆయన.. రాబోయే 12 నుంచి 18 నెలల్లో దేశం నుంచి సొంత మొబైల్ ఫోన్ బ్రాండ్లు ఉద్భవిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

 

దావోస్‌లో అంతర్జాతీయ పరిశ్రమల దిగ్గజాలతో జరిపిన చర్చలు భారత్‌ పట్ల ఉన్న బలమైన ఆశావాదాన్ని తెలియజేస్తున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. తాను కలిసిన దాదాపు ప్రతి ప్రధాన సంస్థ దేశ వృద్ధి పథంపై విశ్వాసాన్ని వ్యక్తం చేసిందని.. ముఖ్యంగా కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, అధునాతన ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలలో కార్యకలాపాలను విస్తరించేందుకు అవి ఉత్సాహంగా ఉన్నాయని తెలిపారు. 

 

భారతదేశం సాధిస్తోన్న నిరంతర ఆర్థిక వృద్ధి, చేపడుతున్న భారీ సంస్కరణలు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తయారీపై పెట్టిన దృష్టిని ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారని శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారు. అధునాతన సాంకేతికతలను కలిసి సృష్టించగల, అభివృద్ధి చేయగల నమ్మకమైన భాగస్వామిగా భారత్‌ను ప్రపంచం చూస్తోందని ఆయన పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 2217520) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Khasi , English , Marathi , हिन्दी , Odia , Kannada