ప్రధాన మంత్రి కార్యాలయం
జనవరి 23న కేరళలో పర్యటించనున్న ప్రధానమంత్రి
తిరువనంతపురంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధానమంత్రి
రైలు అనుసంధానం, పట్టణ జీవనోపాధి, విజ్ఞానం, ఆవిష్కరణలు, పౌర కేంద్రీయ సేవలు, అధునాతన ఆరోగ్య సేవలు వంటి కీలక రంగాల్లో ప్రాజెక్టుల విస్తరణ
పీఎం శ్రీ స్వానిధి క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి.. లక్ష మంది లబ్ధిదారులకు పీఎం శ్రీ స్వానిధి రుణాల పంపిణీ
కేరళలో రైలు అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
తిరువనంతపురంలో సీఎస్ఐఆర్-ఎన్ఐఐఎస్ టీ ఆవిష్కరణ, సాంకేతికత, వ్యవస్థాపక కేంద్రానికి శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
22 JAN 2026 2:08PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 23న కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తిరువనంతపురంలో ఉదయం 10.45 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయడంతోపాటు కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగిస్తారు.
ఈ ప్రాజెక్టుల్లో రైలు అనుసంధానం, పట్టణ జీవనోపాధి, విజ్ఞానం, ఆవిష్కరణలు, పౌర కేంద్రీయ సేవలు, అధునాతన ఆరోగ్య సేవలు లాంటి కీలక రంగాలు ఉన్నాయి. ఇవి సమగ్ర వృద్ధి, సాంకేతిక పురోగతి, పౌరుల జీవన ప్రమాణాల మెరుగుదలపై ప్రధానమంత్రి నిరంతర దార్శనికతను ప్రతిబింబిస్తాయి.
రైలు అనుసంధానానికి ప్రధాన ప్రోత్సాహకంగా.. నాలుగు కొత్త రైళ్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. వీటిలో మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఒక ప్యాసింజర్ రైలు ఉన్నాయి. వీటిలో నాగర్‌కోయిల్-మంగళూరు, తిరువనంతపురం-తాంబరం, తిరువనంతపురం-చర్లపల్లి మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, అలాగే త్రిస్సూర్–గురువాయూర్ మధ్య ప్యాసింజర్ రైలు ఉన్నాయి. ఈ సేవల ప్రారంభంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సుదూర, ప్రాంతీయ అనుసంధానం గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రయాణీకులకు ఇది మరింత చౌకగా, సురక్షితంగా, సమయపాలనతో కూడిన ప్రయాణాన్ని అందిస్తుంది. మెరుగైన అనుసంధానంతో స్థానికంగా పర్యాటకం, వాణిజ్యం, విద్య, ఉపాధి, సాంస్కృతిక మార్పిడికి బలమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
పట్టణ జీవనోపాధిని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా పీఎం స్వానిధి క్రెడిట్ కార్డును ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఇది వీధి వ్యాపారుల ఆర్థిక మెరుగుదలకు సహాయపడనుంది. యూపీఐతో అనుసంధానించిన వడ్డీ లేని ఈ రివాల్వీంగ్ క్రెడిట్ సదుపాయం తక్షణ నగదు లభ్యతను అందిస్తూ, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుంది. లబ్ధిదారులు అధికారిక క్రెడిట్ చరిత్రను నిర్మించుకోవడంలో సహాయపడుతుంది. కేరళకు చెందిన వీధి వ్యాపారులు సహా లక్ష మంది లబ్ధిదారులకు పీఎం స్వానిధి రుణాలను కూడా ప్రధానమంత్రి పంపిణీ చేయనున్నారు. 2020లో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం స్వానిధి పథకం ద్వారా అధిక సంఖ్యలో లబ్ధిదారులకు తొలిసారిగా అధికారిక రుణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. పట్టణ అసంఘటితరంగ కార్మికుల్లో పేదరిక నిర్మూలనకు, జీవనోపాధి భద్రతకు ఈ పథకం కీలక పాత్ర పోషించింది.
విజ్ఞానం, ఆవిష్కరణల రంగంలో తిరువనంతపురంలోని పీఎస్ఐఆర్-ఎన్ఐఐఎస్‌టీ ఆవిష్కరణ, సాంకేతికత, వ్యవస్థాపక కేంద్రానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇధి లైఫ్ సైన్సెస్, బయో-ఎకానమీపై దృష్టి సారిస్తుంది. ఆయుర్వేదం వంటి సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను ఆధునిక బయోటెక్నాలజీ, స్థిరమైన ప్యాకేజింగ్, గ్రీన్ హైడ్రోజన్‌తో అనుసంధానిస్తుంది. అలాగే అంకుర సంస్థల ఏర్పాటు, సాంకేతిక బదిలీ, ప్రపంచ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది పరిశోధనలను మార్కెట్‌కు అనుగుణమైన పరిష్కారాలు, పరిశ్రమలుగా మార్చడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
ఆరోగ్య మౌలిక సదుపాయాల బలోపేతం కూడా ప్రధానమంత్రి పర్యటనలో మరో ముఖ్యమైన అంశం.. తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాల్ వైద్య విజ్ఞాన, సాంకేతిక సంస్థలో అత్యాధునిక రేడియో సర్జరీ కేంద్రానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కేంద్రం సంక్లిష్టమైన మెదడు సంబంధిత వ్యాధులకు అత్యంత ఖచ్చితమైన, అతి తక్కువ శస్త్రచికిత్సతో కూడిన చికిత్సను అందించి, ప్రాంతీయ ఆరోగ్య సేవల సామర్థ్యాన్ని మరింత పెంపొందించనుంది.
అదేవిధంగా తిరువనంతపురంలో కొత్తగా నిర్మించిన పూజప్పుర ప్రధాన తపాలా కార్యాలయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ కార్యాలయం తపాలా, బ్యాంకింగ్, బీమా, డిజిటల్ సేవలను సమగ్రంగా అందిస్తుంది. తద్వారా పౌర కేంద్రీకృత సేవల పంపిణీని మరింత బలోపేతం చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2217287)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam