లోక్‌సభ సచివాలయం
చట్టసభల పనితీరులో ప్రమాణాలు నెలకొల్పాల్సిన ఆవశ్యకతను పునరుద్ఘాటించిన లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా
86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు (ఏఐపీఓసీ) రెండో రోజున అజెండాలోని అంశాలపై విస్తృత చర్చలు
పారదర్శక.. సమర్థ.. పౌర ప్రాధాన్య శాసన ప్రక్రియలలో సాంకేతికత వినియోగం.. శాసనసభ్యుల సామర్థ్య వికాసం.. ప్రజలకు శాసనసభల జవాబుదారీతనంపై చర్చ
प्रविष्टि तिथि:
20 JAN 2026 8:23PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్వహిస్తున్న 86వ అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు (ఏఐపీఓసీ) రెండో రోజున కింద పేర్కొన్న మూడు కీలకాంశాలపై చర్చించింది.
1. పారదర్శక, సమర్థ, పౌర ప్రాధాన్య ప్రక్రియలలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం.
2. ప్రజాస్వామ్య పాలన బలోపేతం, సమర్థత పెంపు, శాసనసభ్యుల సామర్థ్య వికాసం
3. ప్రజలకు శాసనసభల జవాబుదారీతనం
గౌరవనీయ లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్లీనరీ చర్చలకు హాజరు కాగా, గౌరవనీయ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ చర్చల సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రసంగిస్తూ- దేశంలోని వివిధ రాష్ట్రాల శాసనసభల్లో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ కార్యకలాపాలతో సమన్వయం చేసే దిశగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ సతీష్ మహానా కృషిని ప్రశంసించారు. అలాగే శాసనసభ్యుల విద్యార్హతలతోపాటు వారి వృత్తిగత అనుభవాలను గుర్తించి, వాటిని అర్థవంతంగా వినియోగించడంలో శ్రీ మహానా చొరవను కూడా కొనియాడారు.
మునుపటి ‘ఏఐపీఓసీ’లలో కీలకాంశాలపై చర్చలను గుర్తుచేస్తూ- సామర్థ్యం, ఆవిష్కరణాత్మకత, సాంకేతికతల వినియోగం వంటి ప్రమాణాలను నెలకొల్పడంలో రాష్ట్ర శాసనసభల మధ్య ఆరోగ్యకర పోటీ ఎంతయినా అవసరమని శ్రీ బిర్లా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డెహ్రాడూన్‌లో 2019నాటి ‘ఏఐపీఓసీ’లో చర్చలను ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర శాసనసభల సామర్థ్యం, పనితీరు మెరుగుపై చిరకాలం నుంచీ తన మదిలో మెదలుతున్న ఆలోచనలను పునరుద్ఘాటించారు. ఈ అంశాలపై ఒక కమిటీని ఏర్పాటు చేశామని, అది దేశంలోని శాసనసభల విధివిధానాల ప్రామాణీకరణ సంబంధిత విషయాలను పరిశీలిస్తున్నదని తెలిపారు.
శాసనసభల సామర్థ్యం పెంపులో కృత్రిమ మేధ (ఏఐ) పాత్రను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సముచితం, విశ్వసనీయంగా రూపొందించేందుకు చేపట్టాల్సిన వివిధ చర్యల గురించి కూడా ఆయన వివరించారు. పార్లమెంటులో ‘ఏఐ’ ఆచరణాత్మక వినియోగం-అమలు సంబంధిత వివిధ పద్ధతులను ఉటంకిస్తూ, పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల మధ్య మరింత సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. తద్వారా శాసనసభల సంస్థాగత పరిజ్ఞానాన్ని పార్లమెంటు-శాసనసభలు రెండింటా సమర్థంగా ఉపయోగించుకునే వీలుంటుందని చెప్పారు.
మూడు రోజుల ఈ సదస్సు రేపటితో సమాప్తం కానున్న నేపథ్యంలో గౌరవనీయ లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ముగింపు ప్రసంగం చేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు.
***
(रिलीज़ आईडी: 2216734)
आगंतुक पटल : 9