భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
పర్యావరణ, ఆర్థిక భద్రతకు అండమాన్, నికోబార్ దీవుల జీవ వైవిధ్యం అత్యంత కీలకం: డాక్టర్ జితేంద్ర సింగ్
శ్రీ విజయపురంలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐ) సందర్శన సందర్భంగా అండమాన్, నికోబార్ దీవులను 'జీవవైవిధ్య సజీవ ప్రయోగశాల'గా అభివర్ణించిన కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ద్వీప జీవవైవిధ్యం వాతావరణ స్థితిస్థాపకతకు కీలకం.. భారత జీవవైవిధ్య విజ్ఞానాన్ని బలోపేతం చేసిన ఐదు దశాబ్దాల జడ్ఎస్ఐ పరిశోధనలు: డాక్టర్ జితేంద్ర సింగ్
భారతదేశ నీలి ఆర్థిక వ్యవస్థ దార్శనికతకు, పర్యావరణ లక్ష్యాలకు జడ్ఎస్ఐ వంటి శాస్త్రీయ సంస్థల బలోపేతమే కీలకం: డాక్టర్ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
19 JAN 2026 12:15PM by PIB Hyderabad
పర్యావరణ, ఆర్థిక భద్రతకు అండమాన్, నికోబార్ దీవుల జీవ వైవిధ్యం అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత), పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
శ్రీ విజయపురంలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐ) అండమాన్, నికోబార్ ప్రాంతీయ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ద్వీపాల్లోని జీవవైవిధ్య వ్యూహాత్మక ప్రాధాన్యతను మంత్రి వివరించారు.
శాస్త్రవేత్తలు, అధికారులను ఉద్దేశించి మాట్లాడిన డాక్టర్ జితేంద్ర సింగ్.. అండమాన్, నికోబార్ దీవులను "జీవవైవిధ్య సజీవ ప్రయోగశాల"గా అభివర్ణించారు. ఇక్కడ ఆత్యాధునిక విజ్ఞాన శాస్త్రం, సంరక్షణ, స్థిరమైన జీవనోపాధి పరస్పరం ముందుకు సాగాలని తెలిపారు. జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ స్థితిస్థాపకత, సముద్రయాన ఆర్థిక వృద్ధిపై జాతీయ విధానాలను రూపొందించటంలో జెడ్ఎస్ఐ వంటి సంస్థల ప్రామాణిక శాస్త్రీయ గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని వ్యాఖ్యానించారు.
జెడ్ఎస్ఐ శాస్త్రవేత్త-ఎఫ్, ఆఫీసర్ ఇన్ ఛార్జి డాక్టర్ సి. శివపెరుమాన్ మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రాంతీయ కేంద్రం ముఖ్య ఉద్దేశాలను, ప్రస్తుత పరిశోధనా కార్యక్రమాలను మంత్రికి వివరించారు. అండమాన్, నికోబార్ దీవుల్లోని విలక్షణమైన జంతు వైవిధ్యాన్ని నమోదు చేసి, పరిరక్షించి, పర్యవేక్షించటంలో ఈ కేంద్రం కీలక పాత్రను పోషిస్తుందని తెలిపారు. టాక్సానమీ, మాలిక్యులర్ సిస్టమాటిక్స్, డీఎన్ఏ బార్ కోడింగ్, జీవవైవిధ్య అంచనా, సామర్థ్య పెంపు వంటి అంశాల్లో జెడ్ఎస్ఐ కృషిని ప్రముఖంగా ప్రస్తావించారు.
1977లో ప్రారంభమైన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐ) అండమాన్, నికోబార్ ప్రాంతీయ కేంద్రం.. ఐదు దశాబ్దాలుగా శాస్త్రీయ సేవలను అందిస్తుంది. పలు రకాల జంతు సమూహాలపై దాదాపు 90 పరిశోధనా కార్యక్రమాలను పూర్తిచేసి, ఉష్ణమండల ద్వీప జీవవైవిధ్య పరిశోధనల్లో కీలక సంస్థగా ఎదిగింది. ఇక్కడి శాస్త్రవేత్తలు ఇప్పటివరకు 85 పుస్తకాలను, ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో 850కిపైగా పరిశోధనా పత్రాలను ప్రచురించటం ద్వారా భారత జీవవైవిధ్య విజ్ఞాన సంపదను పెంపొందించటానికి గణనీయంగా కృషి చేశారు.
అండమాన్, నికోబార్ దీవుల్లోని ప్రముఖ పర్యాటక, విద్యా కేంద్రాల్లో ఒకటైన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐ) మ్యూజియాన్ని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సందర్శించారు. ఈ మ్యూజియంలో 22 జంతు సమూహాలకు చెందిన సుమారు 3,500 నమూనాలున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించటంలో, విద్యార్థులు, పరిశోధకులకు జ్ఞానాన్ని అందించటంలో మ్యూజియం పాత్రను మంత్రికి వివరించారు. ఏటా సుమారు 75,000 నుంచి 1,00,000 మంది విద్యార్థులు, పరిశోధకులు, పర్యాటకులు ఈ మ్యూజియాన్ని సందర్శిస్తున్నట్లు చెప్పారు. ఈ దీవుల్లో మాత్రమే కనిపించే జీవులు, అంతరించిపోతున్న, ప్రమాదంలో ఉన్న జంతుజాలానికి సంబంధించిన నమూనాలను, ప్రదర్శనలను మంత్రి ఎంతో ఆసక్తిగా పరిశీలించారు.
సైన్స్ లో 20కి పైగా కొత్త జాతులను, నార్కొండమ్ ట్రీ ష్రూ వంటి వాటిని ఈ కేంద్రంలోని శాస్త్రవేత్తలు గుర్తించారని.. అండమాన్, నికోబార్ దీవులు, భారత్, ఆగ్నేయాసియా ప్రాంతాల నుంచి దాదాపు 900 కొత్త జంతుజాల రికార్డులను నమోదు చేసినట్లు మంత్రికి తెలిపారు. ఈ ఆవిష్కరణలు ఆ ప్రాంత జీవవైవిధ్యానికున్న ప్రపంచస్థాయి ప్రాముఖ్యతను స్పష్టం చేస్తాయి.
భారతదేశపు మొదటి నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్ సీఆర్ఆర్ఐ)కి నోడల్ సెంటర్‌గా పోర్ట్ బ్లెయిర్‌లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐ) వ్యవహరిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్‌కు వివరించారు. భారత జలాల్లో పగడపు దిబ్బల పరిశోధన, పర్యవేక్షణను బలోపేతం చేయటం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలను రక్షించటానికి, సముద్ర పాలనను ప్రోత్సహించటానికి ఇటువంటి ప్రత్యేక పరిశోధనా సంస్థలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాలు, పరిరక్షణ ప్రణాళికలు, సామాజిక అవగాహనతో శాస్త్రీయ పరిశోధనలను అనుసంధానించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు, సిబ్బందితో మాట్లాడిన అనంతరం కేంద్రమంత్రి స్పష్టం చేశారు. భారతదేశ పర్యావరణ లక్ష్యాలను సాధించటంలో, బ్లూ ఎకానమీ సామర్థ్యాన్ని స్థిరంగా వినియోగించుకోవటంలో పటిష్టమైన శాస్త్రీయ సంస్థల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.
సర్వే కేంద్రంలో జరుగుతున్న పనుల పట్ల అభినందనలు వ్యక్తం చేస్తూ, అక్కడి అంశాలను వివరించినందుకు, మ్యూజియం అంతా చూపించినందుకు డాక్టర్ శివపెరుమాన్, జడ్ఎస్ఐ బృందానికి డాక్టర్ జితేంద్ర సింగ్ ధన్యవాదాలు తెలిపారు. "అత్యంత సమాచారభరితమైన, విద్యాప్రదమైన అనుభవం"గా ఈ పర్యటనను అభివర్ణించారు. అక్కడున్న జంతుశాస్త్ర సేకరణలు శాస్త్రీయ అవగాహనను పెంచటమే కాక, భారతదేశపు గొప్ప, అమూల్యమైన జీవవైవిధ్యం పట్ల ప్రజల్లో చైతనాన్ని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు.




***
(रिलीज़ आईडी: 2216193)
आगंतुक पटल : 6