ఆయుష్
azadi ka amrit mahotsav

ఆయుర్వేద ఆధారిత అంకుర సంస్థల కోసం గల ఎమ్ఎస్ఎమ్ఈ అవకాశాలపై అవగాహన కార్యక్రమంతో జాతీయ అంకుర సంస్థల దినోత్సవం-2026ను జరుపుకొంటున్న ఏఐఐఏ

प्रविष्टि तिथि: 17 JAN 2026 1:10PM by PIB Hyderabad

  ‘జాతీయ అంకుర సంస్థల దినోత్సవం 2026’ సందర్భంగా... ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ), దాని స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ అయిన ‘ఇంక్యుబేషన్ సెంటర్ ఫర్ ఆయుర్వేద ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్’ ఆధ్వర్యంలో ఆయుర్వేద ఆధారిత అంకుర సంస్థల కోసం గల ఎమ్ఎస్ఎమ్ఈ అవకాశాలపై అవగాహన కార్యక్రమాన్ని న్యూఢిల్లీ క్యాంపస్‌లో విజయవంతంగా నిర్వహించారు. భారత ప్రభుత్వ ఎమ్ఎస్ఎమ్ఈ–డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ కార్యాలయ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, అంకుర సంస్థలను ప్రారంభించువారు, ఔత్సాహిక వ్యవస్థాపకులను ఒకచోట చేర్చి.... ఎమ్ఎస్ఎమ్ఈ, అంకుర సంస్థల వ్యవస్థ బలోపేతంపై చర్చించింది. ఆయుర్వేదం, సమగ్ర ఆరోగ్య ఆవిష్కరణలపై సమావేశం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వ మద్దతు గల పథకాలు, ఆవిష్కరణలకు సంస్థాగత విధానాలు, మేధో సంపత్తి రక్షణ, ధ్రువీకరణ-ప్రామాణీకరణ అవసరాలు, ప్రారంభ దశ అంకుర సంస్థల కోసం అవసరమైన ఆర్థిక విధానాలను గురించి ప్రధానంగా చర్చించారు.

ఆయుర్వేదంలో ఆవిష్కరణ-ఆధారిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సందర్భాన్ని నిర్దేశిస్తూ డాక్టర్ అరుణ్ కుమార్ చేసిన స్వాగత ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్ఎస్ఎమ్ఈ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆయుర్వేద ఆధారిత సంస్థలకు సంబంధించిన ఎమ్ఎస్ఎమ్ఈ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అవలోకనాన్ని అందించారు. ఆయుర్వేద సంస్థల్లో ఆవిష్కరణలను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో విద్యాసంబంధిత, సంస్థాగత దృక్పథాన్ని ప్రొఫెసర్ మంజూష రాజగోపాల పంచుకున్నారు.

ఎమ్ఎస్ఎమ్ఈ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. కె. భారతి మాట్లాడుతూ... ముఖ్యంగా సాంప్రదాయ వైద్యం, వెల్నెస్ రంగాల్లో అంకురసంస్థలు, ఎమ్ఎస్ఎమ్ఈలను ప్రోత్సహించడానికి బలమైన విధాన-మద్దతు గల వ్యవస్థ అవసరాన్ని స్పష్టం చేశారు.

ఈ సాంకేతిక సమావేశాల్లో మేధో సంపత్తి హక్కులు, అంకుర సంస్థల కోసం వాటి ప్రాముఖ్యతను గురించి డీపీఐఐటీ మాజీ సీనియర్ సైంటిస్ట్ శ్రీమతి సంగీత నాగర్ ప్రసంగించారు. అంకుర సంస్థలు, ఎమ్ఎస్ఎమ్ఈల కోసం అందుబాటులో ఉన్న ఆర్థిక సహాయ విధానాలు, నిధులకు గల అవకాశాలను గురించి ఎస్ఐడీబీఐ సీనియర్ మేనేజర్ శ్రీమతి జ్యోతి నీరజ్ తన ప్రసంగంలో వివరించారు. ఏఐఐఏ-ఐసీఏఐఎన్ఈ సీఈవో శ్రీ సుజిత్ ఎరనేజాత్, ఎమ్ఎస్ఎమ్ఈ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ నవీన్ కుమార్ ధన్యవాదాలతో కార్యక్రమం ముగిసింది.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎమ్ఎస్ఎమ్ఈల ఎదుగుదల, సుస్థిరమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం ఆయుర్వేదంతో ముడిపడిన బలమైన, ఆవిష్కరణ-ఆధారిత అంకురసంస్థల వ్యవస్థను జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లడం పట్ల ఏఐఐఏ-ఐసీఏఐఎన్ఈ నిబద్ధతను ఈ కార్యక్రమం పునరుద్ఘాటించింది. భారత ప్రభుత్వ ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖ ద్వారా ఆతిథ్య సంస్థగా గుర్తింపు పొందిన ఏఐఐఏ-ఐసీఏఐఎన్ఈ... ఆలోచనలను ప్రభావవంతమైన వ్యాపార సంస్థలుగా మార్చడం కోసం నిర్మాణాత్మక వేదికను అందించడం ద్వారా ఆవిష్కర్తలకు సాధికారత కల్పిస్తూనే ఉంది.

ఆధారాల ఆధారితమైన, సుస్థిరమైన, సమగ్ర ఆరోగ్య పరిష్కారాలకు దోహదపడే ఆధునిక వెంచర్లకు మద్దతునిస్తూ ఆయుర్వేదంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, ఆవిష్కరణలను ప్రోత్సహించడం పట్ల తన అంకితభావాన్ని ఈ జాతీయ అంకుర సంస్థల దినోత్సవ సందర్భంగా ఏఐఐఏ-ఐసీఏఐఎన్ఈ పునరుద్ఘాటించింది.

 

***


(रिलीज़ आईडी: 2215580) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil