|
ప్రధాన మంత్రి కార్యాలయం
‘వికసిత భారత్ యువ సారథుల చర్చాగోష్ఠి-2026’ ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
12 JAN 2026 10:03PM by PIB Hyderabad
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు, ఎంపీలు, వికసిత భారత్ యువ సారథుల పోటీ విజేతలు, ఇతర ప్రముఖులు, దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి హాజరైన నా యువ మిత్రులందరూ ఇక్కడ ఓ కొత్త అనుభూతిని పొంది ఉంటారు. మీరంతా అలసిపోలేదా? ఇప్పటికి రెండు రోజుల నుంచి అదేపనిగా ప్రసంగాలు వింటూనే ఉన్న మీకు మరోసారి వినడం అలసట అనిపిస్తోందా? ఏదేమైనా, పత్రికా సమావేశం సందర్భంగా నేను చెప్పాల్సిందేమిటో ఇప్పటికే చెప్పేశాను. నేను తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి మీలో చాలామంది పుట్టి కూడా ఉండరని నేను అనుకుంటున్నా. ఇక 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి మీలో అధికశాతం ఇంకా పిల్లలుగానే ఉండి ఉంటారు. అయితే, ముఖ్యమంత్రిగా లేదా ఇవాళ ప్రధానమంత్రిగా యువతరంపై నాకు సదా అపారమైన నమ్మకం. మీ సామర్థ్యం, ప్రతిభ నుంచి నాకెప్పుడూ నవ్యోత్తేజం లభిస్తూంటుంది. ఈ నేపథ్యంలో వికసిత భారత్ స్వప్న సాకార సారథ్యం బాధ్యతను మీరు స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నా.
మిత్రులారా!
భారత్ 2047లో స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే ఘట్టం దిశగా ఈ ప్రయాణం దేశానికి అత్యంత ప్రధానం. అంతేగాక ఈ మధ్యలో గడిచే కాలం మీ జీవితాల్లోనూ ఎంతో కీలకం. మీకందరికీ ఇదొక అద్భుత, సువర్ణావకాశం. మీ సామర్థ్యమే దేశ సామర్థ్యం... భారత్ విజయాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేది మీ విజయాలే! ఈ నేపథ్యంలో వికసిత భారత్ యువ సారథుల చర్చాగోష్ఠి (వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్)లో పాల్గొన్న వారందరికీ నా అభినందనలు. ఈ అంశంపై నేను తర్వాత విశదంగా ప్రసంగిస్తాను... ఈ రోజుకు గల ప్రాధాన్యమేమిటో ముందుగా తెలుసుకుందాం.
మిత్రులారా!
నేడు స్వామి వివేకానంద జయంతి... ఆయన ఆలోచనలు ఇవాళ్టికీ ప్రతి యువకుడిలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నాయి. మన పుట్టుక ఉద్దేశమేమిటి? మన జీవిత లక్ష్యం ఏమిటి? “దేశమే ప్రధానం” అనే స్ఫూర్తితో జీవించడం ఎలా? మన ప్రతి చర్యకూ సామాజిక, దేశ సంక్షేమం కేంద్రకాంశాలు కావాలి. ఈ విషయంలో స్వామి వివేకానంద జీవితం మనకు గొప్పగా మార్గదర్శనం చేస్తుంది. మనం పునరుత్తేజం పొందడంలో స్ఫూర్తినిస్తుంది. ఆయనను స్మరించుకుంటూ మనం ఏటా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం నిర్వహించుకుంటాం. ఆయన ప్రబోధాల ప్రేరణతోనే వికసిత భారత్ యువ సారథుల చర్చాగోష్ఠి నిర్వహణ కోసం ఇదే తేదీని ఎంచుకున్నాం.
మిత్రులారా!
ఈ కార్యక్రమం అత్యంత స్వల్ప కాలంలోనే ఇంత విస్తృతమైనదిగా.. దేశ ప్రగతి దిశను నిర్దేశించడంలో యువతరం ప్రత్యక్షంగా పాలుపంచుకునే వేదికగా రూపాంతరం చెందడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలో పాల్గొనడానికి 50 లక్షల మందికిపైగా యువత పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 30 లక్షల మందికి పైగా ‘వికసిత భారత్ ఛాలెంజ్’లో చురుగ్గా పోటీపడటమేగాక దేశ భవిష్యత్తుపై తమ ఆలోచనలను పంచుకున్నారు. ఇంత భారీ స్థాయిలో యువతరం ఉత్సాహం ప్రకటించడం అసాధారణం. ప్రపంచంలో “థింక్ ట్యాంక్” (దార్శనిక బృందం) అనే పదం సాధారణంగా మనకు వినిపిస్తూంటుంది. ఈ బృందాలు చర్చలు నిర్వహిస్తాయి... జనాభిప్రాయాన్ని ప్రభావితం చేసి, సామూహిక నిర్ణయం వైపు నడిపిస్తాయి. అయితే, నేటి మీ వినూత్న ఆలోచనల ప్రదర్శన చూశాక.. మేధా మథనంతో మీరు ప్రస్తావించిన అనేక అంశాలను పరిశీలించాక నేనొక అభిప్రాయానికి వచ్చాను. అదేమిటంటే- ఈ వేదిక ఒక వ్యవస్థగా- ఒక విశిష్ట ‘ప్రపంచ దార్శనిక బృందం’గా రూపుదాల్చిందని నేను విశ్వసిస్తున్నాను. నిర్దిష్ట అంశాలపై విస్పష్ట లక్ష్యంతో లక్షలాది యువత సమ్మిళిత మేధా మథనం చేయడాన్ని మించిన గొప్ప దార్శనిక కసరత్తు మరేముంటుంది? దీన్ని వివరించాలంటే వాస్తవానికి “థింక్ ట్యాంక్” అనే పదం సరిపోదు. “ట్యాంక్” పరిమాణం చిన్నది కాబట్టి, నేటి యువత చొరవను సముద్రంకన్నా విశాలమైనదిగా, ఆలోచనలలో దానికన్నా లోతైనదిగా అభివర్ణించక తప్పదు. ఈ రోజు మీరు చర్చించిన అంశాల్లో ముఖ్యంగా... ‘మహిళల సారథ్యాన ప్రగతి, ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యం’పై ప్రసంగాల్లో అద్భుత పరిణతి కనిపించింది. వికసిత భారత్ రూపకల్పన దిశగా మన అమృత తరం సంకల్పం ఎంత దృఢమైనదో మీ ప్రదర్శనలు రుజువు చేశాయి. అవన్నీ సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నిబద్ధతలతో కూడిన భారత ‘జెన్-జీ’ (1990-2010 మధ్య జన్మించిన తరం) స్వభావాన్ని తేటతెల్లం చేశాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నా యువ మిత్రులతోపాటు యువ భారత్ సంస్థతో అనుసంధానితులైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.
మిత్రులారా!
ఇంతకుముందే నేను 2014 గురించి ప్రస్తావించాను... అప్పటికి మీలో చాలామంది 8 లేదా 10 సంవత్సరాల వారై ఉంటారుగనుక వార్తా పత్రికలు చదవడం మీకు అలవడి ఉండదు. కాబట్టి, ఆనాటి ‘విధాన స్తంభన’ శకం గురించి.. పర్యవసానంగా నిర్ణయాల్లో ప్రభుత్వాల విపరీత జాప్యం, ఒకవేళ తీసుకున్నా అమలు అస్తవ్యస్తంగా ఉండటం గురించి మీకు తెలిసే అవకాశం లేదు. ఆనాటి యువత ఏదైనా చేయాలంటే ఊహించజాలని నియమనిబంధనలు అవరోధాలయ్యేవి. అడుగడుగునా ఆంక్షల భారంతో యువతరం అనేక ఇక్కట్లకు గురైంది.
మిత్రులారా!
అప్పట్లో పరీక్షలు రాయడానికి దరఖాస్తు చేయాలన్నా, ఉద్యోగం కోసం సర్టిఫికెట్ల ధ్రువీకరణ చేయించుకోవాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఫీజులు చెల్లించడం కోసం బ్యాంకుల నుంచి డిమాండ్ డ్రాఫ్ట్, పోస్టల్ ఆర్డర్ల కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరగడం, వ్యాపార ఆరంభం కోసం కొద్దిపాటి రుణం పొందాలన్నా పూచీకత్తు కోసం నానా అగచాట్లూ పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇవన్నీ వింటుంటే మీకు నమ్మశక్యం కానివిగా అనిపించవచ్చు... కానీ, ఇవి కేవలం ఒక దశాబ్దం కిందటి వాస్తవాలు.
మిత్రులారా!
మీరిక్కడ అంకుర సంస్థల గురించి మాట్లాడుకున్నారు కాబట్టి, ఈ వ్యవస్థ రూపాంతరీకరణ గురించి నేనిప్పుడు వివరిస్తాను. ప్రపంచంలో దశాబ్దాల కిందటే అంకుర సంస్కృతి ఆరంభమైనా, భారత్‌లో దీనిపై చర్చ ఇటీవలి కాలందాకా అంతంతమాత్రమే. కాబట్టే, 2014 నాటికి దేశంలో నమోదిత అంకుర సంస్థల సంఖ్య 500 మించలేదు. ప్రతి రంగంపైనా ప్రభుత్వ నియంత్రణాధిపత్యం కొనసాగింది. ప్రతిభావంతులైన యువతరానికి ఆవిష్కరణలను అనుసరించే అవకాశం అతి స్వల్పంగా ఉండేది.
మిత్రులారా!
ఈ రోజున నా దేశ యువతరం నాకు అపార విశ్వాసం ఉంది... మీ సామర్థ్యాలపై నాకు ఎనలేని నమ్మకం ఉంది. అందుకే మేం మరో మార్గం ఎంచుకున్నా... యువతకు ప్రాధాన్యమిస్తూ ఒకదాని తర్వాత ఒకటిగా సంస్కరణలు తెచ్చాం. పర్యవసానంగానే దేశంలో అంకుర విప్లవం వాస్తవ రూపం దాల్చింది. వ్యాపార సౌలభ్య సంస్కరణలతోపాటు “అంకుర భారతం, డిజిటల్ భారతం, ఫండ్ ఆఫ్ ఫండ్స్, పన్నులు-నిబంధనల సరళీకరణ” వంటి అనేక కార్యక్రమాలు అమలు చేశాం. లోగడ ప్రభుత్వాధిపత్యం కొనసాగిన రంగాలన్నీ యువత సారథ్యంలో వాణిజ్యం, ఆవిష్కరణ కోసం బాటలు పరిచాయి. ఈ కృషి ప్రభావంతో భారత్ ఒక అసమాన విజయగాథను రచించింది.
మిత్రులారా!
భారత అంతరిక్ష రంగం ఇందుకు ఒక ఉదాహరణ... ఐదారేళ్ల కిందటిదాకా ఈ రంగం పురోగమన బాధ్యత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మీద మాత్రమే ఉండేది. అయితే, మేం ప్రైవేట్ రంగానికి తలుపులు తెరుస్తూ అవసరమైన చట్టాలు-చట్రాలను సృష్టించడమే కాకుండా సహాయక వ్యవస్థలను ఏర్పరచాం. ఫలితంగా నేడు భారత అంతరిక్ష రంగంలో 300కుపైగా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిలో ‘స్కైరూట్ ఏరోస్పేస్’ స్వల్ప వ్యవధిలోలోనే ‘విక్రమ్-ఎస్’ రాకెట్‌ను తయారుచేసింది. మరొక సంస్థ ‘అగ్నికుల్ కాస్మోస్’ ప్రపంచంలో తొలి 3డీ-ప్రింటెడ్ ఇంజిన్‌ను సృష్టించి ప్రపంచాన్ని అబ్బురపరచింది. ఇదంతా అంకుర సంస్థల సామర్థ్యం ప్రభావమే. దేశంలోని అంతరిక్ష రంగ సంస్థలు నేడు తమ సామర్థ్యాన్ని నిలకడగా రుజువు చేసుకుంటున్నాయి.
మిత్రులారా!
ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను... డ్రోన్ల వినియోగంపై అన్ని రకాల ఆంక్షలు నిరంతరం కొనసాగితే ఏమయ్యేదో ఒకసారి ఊహించుకోండి... గతంలో పరిస్థితి సరిగ్గా అదే. మన దేశంలో డ్రోన్ల తయారీ, వినియోగం రెండూ చట్టాల చట్రంలో చిక్కుకుపోయాయి. లైసెన్స్ పొందడమంటే పర్వతారోహణతో సమానం... అన్నిటినీ కేవలం భద్రత కోణంలోనే శల్యపరీక్ష చేసేవారు. కానీ, మేమొచ్చాక వాటిని సరళీకరంచడంతోపాటు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాం. ఫలితంగా నేటి యువతరంలో అధికశాతం డ్రోన్ సంబంధిత రంగంలో ముందడుగు వేయగలిగారు. అంతేకాదు... యుద్ధభూమిలో ‘మేడ్ ఇన్ ఇండియా’ డ్రోన్లు శత్రువులను మట్టి కరిపిస్తున్నాయి. మరోవైపు వ్యవసాయ రంగాన్నీ విప్లవాత్మకం చేస్తూ ‘నమో డ్రోన్ దీదీ’ పేరిట పల్లెల్లో మన అక్కచెల్లెళ్లు డ్రోన్ సాంకేతికతతో సరికొత్త జీవనోపాధిని కూడా ఏర్పరచుకున్నారు.
మిత్రులారా!
మునుపటి ప్రభుత్వాల హయాంలో రక్షణ రంగం పూర్తిగా ప్రభుత్వ కంపెనీలపై ఆధారపడి ఉండేది. మా ప్రభుత్వం ఈ పరిస్థితిని కూడా మార్చి, అంకుర సంస్థల కోసం భారత రక్షణావరణ వ్యవస్థ తలుపులు తెరిచింది. దీనివల్ల కూడా మన యువతకు గణనీయ ప్రయోజనాలను చేకూరాయి. దేశ రక్షణ రంగంలో ఇవాళ 1,000కి పైగా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయి. ఒక యువ పారిశ్రామికవేత్త డ్రోన్లు తయారుచేస్తే, మరొకరు యాంటీ-డ్రోన్ వ్యవస్థలను రూపొందిస్తున్నారు. ఇంకొందరు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కెమెరాలను సృష్టిస్తుండగా, మరికొందరు రోబోటిక్స్ రంగంలో కృషి చేస్తున్నారు.
మిత్రులారా!
దేశంలో సృజనాత్మకత సహిత నవ సమాజాన్ని డిజిటల్ ఇండియా సృష్టించింది. భారత్ నేడు ఆరెంజ్ ఎకానమీలో... అంటే- సంస్కృతి-సారాంశం-సృజనాత్మకతలో అద్భుత ప్రగతిని సాధిస్తోంది. మీడియా, సినిమా, గేమింగ్, సంగీతం, డిజిటల్ కంటెంట్, ‘విఆర్-ఎక్స్‌ఆర్’ వగైరా సాంకేతిక రంగాల్లో భారత్ ప్రపంచ ప్రధాన కూడళ్లలో ఒకటిగా ఆవిర్భవిస్తోంది. కాసేపటి కిందటే ఇక్కడ మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంపై ఒక ప్రదర్శన మనకు వివరించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ హాజరైన యువతరానికి నాదొక విజ్ఞప్తి. రామాయణం, మహాభారతం సహా ఎన్నెన్నో ఇతిహాసాలు, పురాణాల రూపంలో అపార సంస్కృతీ వారసత్వం మన సొంతం. మనం వీటిని గేమింగ్ ప్రపంచంలోకి తీసుకెళ్లగలమా? ప్రపంచంలో నేడు గేమింగ్ ఒక భారీ మార్కెట్ మాత్రమేగాక ఓ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. మన పౌరాణిక కథల ఆధారంగా వినూత్న గేమ్‌లను మనం సృష్టించవచ్చు. మన హనుమాన్ ప్రపంచవ్యాప్త గేమర్ల ఊహలను ఆకట్టుకోగలడు. ఈ విధంగా మన సాంకేతికత మాధ్యమంతో మన సంస్కృతి ఆధునిక రూపంలో ఎగుమతి అవుతుంది. ఇప్పటికే మన దేశంలో భారతీయ కథలను గేమింగ్ ద్వారా అందంగా ప్రదర్శిస్తున్న అనేక దేశీయ అంకుర సంస్థల గురించి నాకు తెలుసు. దీనివల్ల బాలలు ఆటపాటలతోపాటు భారత్‌పై సులువుగా అవగాహన పెంచుకోగలరు.
మిత్రులారా!
దేశంలోని యువ సృజనకర్తలకు “వరల్డ్ ఆడియో-విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్” (వేవ్స్) ఒక శక్తిమంతమైన వేదికగా మారింది. మీరు ఏ రంగంలో ఉన్నవారైనా భారత్ ఇవాళ అపార అవకాశాలకు బాటలు వేస్తోంది. అందుకే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితోపాటు దేశవ్యాప్తంగా యువతకు ఇదే నా పిలుపు: ఎన్నడూ వెనకడుగు వేయకుండా మీ ఆలోచనలతో ముందుకు సాగండి... మీతో భుజం కలిపి నడవడానికి ప్రభుత్వం సదా సిద్ధంగా ఉంటుంది.
మిత్రులారా!
గడచిన దశాబ్ద కాలంలో మేం తెచ్చిన మార్పులు, సంస్కరణల పరంపర నేడు సంస్కరణల ఎక్స్ ప్రెస్‌గా మారింది. ఈ సంస్కరణలకు కేంద్ర బిందువు మీరే.. అంటే- మన యువశక్తి. ‘జీఎస్‌టీ’లో భావితరం సంస్కరణలు వివిధ ప్రక్రియలను యువతకు, పారిశ్రామికవేత్తలకు పరిస్థితులను మరింత సరళం చేశాయి. దేశంలో నేడు రూ.12 లక్షల దాకా ఆదాయంపై పన్ను లేదు. దీంతో ఉద్యోగాల్లో చేరేవారికి, కొత్తగా వ్యాపారాలు పెట్టేవారికి పొదుపు చేసుకునే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
మిత్రులారా!
విద్యుత్తు అంటే- నేడు కేవలం చీకటిని తొలగించడానికి పరిమితమైన శక్తి కాదనే వాస్తవం మీకందరికీ తెలిసిందే. కృత్రిమ మేధ, డేటా సెంటర్లు తదితరాల నుంచి సెమీకండక్టర్లు, తయారీ రంగం దాకా ప్రతి ఆధునిక వ్యవస్థకూ ఇంధనం సమృద్ధిగా అవసరం. అందుకే, భారత్ సురక్షితమైన ఇంధన సరఫరాకు భరోసా ఇస్తోంది. ఈ లక్ష్యంతోనే పౌర అణుశక్తి సంబంధిత సంస్కరణలు, ‘శాంతి’ చట్టం తెచ్చాం. దీనివల్ల అణు రంగంలో వేలాది కొత్త ఉద్యోగాలు అందివస్తాయి. తద్వారా ఇతరత్రా రంగాలపైనా బలమైన బహుముఖ ప్రభావం ఉంటుంది.
మిత్రులారా!
ప్రపంచ దేశాల అవసరాలు, డిమాండ్లు వేర్వేరుగా ఉంటాయన్నది వాస్తవం. అలాగే వాటిలో శ్రామికశక్తి క్రమంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్త అవకాశాలకు భారత యువత సిద్ధంగా ఉండేలా చూడాలన్నదే మా తపన. అందుకు తగినట్లుగా నైపుణ్యాభివృద్ధి రంగాల్లో నిరంతర సంస్కరణలు అవశ్యం కనుక వాటిని చురుగ్గా చేపడుతున్నాం. కొత్త జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తెచ్చాక ఉన్నత విద్య సంబంధిత నిబంధనలు కూడా సంస్కరించబడుతున్నాయి. దీంతో విదేశీ విశ్వవిద్యాలయాలు ఇవాళ భారత్‌లో తమ ప్రాంగణాలను ప్రారంభిస్తున్నాయి. ఇటీవలే రూ.వేలాది కోట్లతో ‘పీఎం సేతు’ కార్యక్రమం ప్రారంభమైంది. దీనికింద వేలాది ఐటీఐల ఆధునికీకరణతోపాటు పరిశ్రమల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ లభిస్తుంది. ఇటీవలి కాలంలో భారత్ అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంతో దేశ యువతకు కొత్త అవకాశాలు కూడా అందివస్తాయి.
మిత్రులారా!
ఆత్మవిశ్వాసం లేని ఏ దేశంలోనైనా స్వావలంబన, అభివృద్ధి అసాధ్యం. మన సామర్థ్యాలు, సాధనాలు, వారసత్వంపై మనకు స్వాభిమానం లేకపోవడం మనల్ని బలహీనపరుస్తుంది. కాబట్టి, సగర్వ భావనతోపాటు నిబద్ధత కూడా అవసరం. ఆ మేరకు స్వీయ సామర్థ్యం, ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు సాగాలి. వలస పాలన కాలంలో, మానసిక బానిసత్వ ధోరణిగల భారత యువతరాన్ని సృష్టించడం లక్ష్యంగా విద్యా వ్యవస్థకు రూపకల్పన చేసిన బ్రిటిష్ రాజకీయ నాయకుడు మెకాలే గురించి మీరు చదివే ఉంటారు. ఆ విధానం మనవైన స్వదేశీ సంప్రదాయాలు, ఉత్పత్తులు, సామర్థ్యాలపై ఒక రకమైన ఆత్మన్యూనతా భావనను పెంచింది. విదేశీ లేదా దిగుమతి చేసుకున్న వస్తువులే మెరుగైనవిగా ఆనాడు మన మనోఫలకాలపై ఒక ముద్ర వేశారు. కానీ, ఇప్పుడు ఇలాంటి బానిస ధోరణి మనకు ఆమోదయోగ్యమా? మనమంతా ఏకమై దీన్ని రూపుమాపలేమా? ఇది కచ్చితంగా సాధ్యమే... మరో పదేళ్లకు మెకాలే విద్యావిధానానికి 200 ఏళ్లు నిండనున్న తరుణంలో ఆ 2 శతాబ్దాల అన్యాయాన్ని తుడిచిపెట్టడం ఈ తరం బాధ్యత. మనకింకా పదేళ్ల సమయం ఉందిగనుక, నేటి తరం ఈ లక్ష్యాన్ని సాధించగలదని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈ బానిస ధోరణి నుంచి దేశ విముక్తికి ప్రతి యువ పౌరుడూ సంకల్పబద్ధుడు కావాలి.
మిత్రులారా!
మన గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే- ఇక్కడి అంకుర సంస్థల ప్రదర్శనలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. “ఆ నో భద్రః క్రతవో యంతు విశ్వతః”... అంటే- మనకు అన్నివైపుల నుంచీ గొప్ప, శుభప్రదమైన, ఉపయోగకర ఆలోచనలు పుట్టుకురావాలి అని అర్థం. ఆ మేరకు మీరు ప్రపంచంలోని ఉత్తమ పద్ధతుల నుంచి నేర్చుకోవాలన్నది నిజమేగానీ, మీదైన వారసత్వాన్ని, ఆలోచనలను తక్కువగా పరిగణించే ధోరణి పొటమరించకుండా చూసుకోవాలి. స్వామి వివేకానందుని జీవితం మనకు నేర్పిన పాఠం ఇదే. ఆయన ప్రపంచాన్ని చుట్టివచ్చారు.. దాని బలాలను అభినందించారు... అయినప్పటికీ, భారత నాగరికతపై అపోహలను అనుక్షణం నిగ్గదీశారు. విశేష ప్రజాదరణ గలవారు కాబట్టి ఆయన ఆలోచనలను ప్రపంచం అంగీకరించలేదు; సామాజిక దురాచారాలను నిరసిస్తూ మెరుగైన భారతదేశం కోసం ఆయన కృషి చేశారు. అదే స్ఫూర్తితో నేటి మన యువశక్తి ఇప్పుడు ముందడుగు వేయాలి. అంతేకాకుండా మీ ఆరోగ్యం, శరీర దృఢత్వాలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమనే వాస్తవాన్ని మరువకండి. ఒళ్లు అలిసేలా ఆటలాడండి.. చక్కగా నవ్వుతూ మనోల్లాసంతో కాలం గడపండి... జీవితానందాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించండి!
మీ శక్తి, సామర్థ్యాలు సహా మీ అందరిమీదా నాకు చెక్కుచెదరని నమ్మకం ఉంది. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మీకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చివరగా- మీకు నాదొక విన్నపం: ఈ చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని రాష్ట్రాల స్థాయిలోనూ నిర్వహించి ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి గురించి కూలంకషంగా చర్చించండి. అదే తరహాలో దీన్ని జిల్లా స్థాయికి తీసుకెళ్దాం... ఇలా చేస్తే మనం ‘థింక్ ట్యాంక్’ అంటున్నది ‘థింక్ వెబ్’ స్థాయికి పరిణామం చెందుతుంది. ఈ కృషిలో నా శుభాకాంక్షలు సదా మీ వెన్నంటి ఉంటాయి.
అనేకానేక ధన్యవాదాలు మిత్రులారా!
***
(रिलीज़ आईडी: 2215012)
|