ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో పొంగల్ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పొంగల్ ప్రపంచ పండుగలా మారింది: పీఎం
తమిళ సంస్కృతి యావద్దేశపు ఉమ్మడి వారసత్వం
జీవనానికి మూలస్తంభంగా రైతును పరిగణించేది తమిళ సంస్కృతి
వ్యవసాయానికీ, రైతుల ప్రాముఖ్యానికీ అద్దం పట్టే తిరుక్కురల్
ప్రకృతి పట్ల గౌరవాన్ని జీవన విధానంగా మార్చుకోవడానికి పొంగల్ మనకు స్ఫూర్తి
అద్భుతమైన తమిళ సంస్కృతి దేశానికి గర్వకారణం: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
14 JAN 2026 12:11PM by PIB Hyderabad
ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. తమిళంలో శుభాకాంక్షలు చెప్పిన శ్రీ మోదీ... “ఈ రోజు పొంగల్ ఒక ప్రపంచ పండుగలా మారింది” అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు, తమిళ సంస్కృతిని ప్రేమించే వారంతా ఉత్సాహంగా పొంగల్ని నిర్వహించుకుంటున్నారనీ, తానూ వారిలో ఒకడినని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రత్యేక పండుగను అందరితో కలిసి జరుపుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. తమిళుల జీవితంలో ఒక ఆహ్లాదకరమైన అనుభూతి లాంటిదనీ... ఇది రైతుల శ్రమకు, భూమికి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ అని శ్రీ మోదీ తెలిపారు. అదే సమయంలో ప్రకృతిలో, కుటుంబంలో, సమాజంలో సమతుల్యత దిశగా మనకు ఈ పండుగ మార్గనిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలూ లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ బిహు, ఇతర పేర్లతో ఈ పండుగ చేసుకుంటున్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. పొంగల్ పండుగ సందర్భంగా దేశవిదేశాల్లో ఉన్న తమిళ సోదరీ సోదరులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
గత సంవత్సరంలో తమిళ సంస్కృతికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. తమిళనాడులోని వెయ్యేళ్ల నాటి గంగైకొండ చోళపురం ఆలయంలో తాను పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. వారణాసిలో జరిగిన కాశీ తమిళ సంగమం సందర్భంలోనూ తాను సాంస్కృతిక ఐక్యతా శక్తిని నిరంతరం అనుభూతి చెందానని, దానితో అనుసంధానమై ఉన్నాననీ ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పంబన్ వంతెన ప్రారంభోత్సవం కోసం తాను రామేశ్వరాన్ని సందర్శించిన సందర్భంలో మరోసారి తమిళ చరిత్ర గొప్పతనాన్ని చూశానని ఆయన గుర్తు చేసుకున్నారు. తమిళ సంస్కృతి యావత్ దేశానికి, నిజానికి మానవాళి అందరికీ ఉమ్మడి వారసత్వమని స్పష్టం చేసిన ప్రధానమంత్రి... తాను తరచుగా ప్రస్తావించే 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తి పొంగల్ వంటి పండుగల ద్వారా మరింత బలపడుతుందని ఉద్ఘాటించారు.
ప్రపంచంలోని దాదాపు అన్ని నాగరికతల్లోనూ పంటలకు సంబంధించి ఏదో ఒక పండుగను జరుపుకొంటారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తమిళ సంస్కృతిలో రైతును జీవనానికి మూలస్తంభంగా భావిస్తారని ఆయన తెలిపారు. తిరుక్కురల్లో వ్యవసాయం, రైతుల గురించి విస్తృతంగా ప్రస్తావించారని శ్రీ మోదీ పేర్కొన్నారు. రైతులు దేశ నిర్మాణంలో బలమైన భాగస్వాములని, వారి కృషి ఆత్మనిర్భర్ భారత్ కు గొప్ప బలాన్నిస్తోందని ఆయన ఉద్ఘాటించారు. రైతులకు సాధికారత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేయడానికి కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ప్రకృతి పట్ల కృతజ్ఞత కేవలం మాటలకే పరిమితం కాకుండా... అది మన జీవనశైలిలో భాగంగా మారేలా చూసుకోవడానికి పొంగల్ పండుగ మనకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. భూమి మనకు ఇంతగా ఇస్తున్నప్పుడు, దానిని పరిరక్షించడం మన బాధ్యత అవుతుందని ఆయన స్పష్టం చేశారు. నేలను ఆరోగ్యంగా ఉంచడం, నీటిని సంరక్షించడం, భవిష్యత్ తరాల కోసం వనరులను సమతుల్య పద్ధతిలో ఉపయోగించడం అత్యంత ఆవశ్యకమని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ వంటి ప్రచారాలు ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తున్నాయని ఆయన వివరించారు. వ్యవసాయాన్ని మరింత సుస్థిరంగా, పర్యావరణ హితంగా మార్చడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాబోయే కాలంలో సుస్థిర వ్యవసాయ పద్ధతులు, నీటి యాజమాన్యం (తానిచ్చిన 'పర్ డ్రాప్- మోర్ క్రాప్' పిలుపును పునరుద్ఘాటించారు), ప్రకృతి వ్యవసాయం, అగ్రిటెక్, విలువ జోడింపులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అన్ని రంగాల్లో యువత కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. కొన్ని నెలల కిందట తాను తమిళనాడులో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఒక సదస్సుకు హాజరైనప్పుడు... వృత్తి జీవితంలోని ముఖ్యమైన అంశాలను వదిలి పొలాల్లో పనిచేస్తున్న తమిళ యువత చేస్తున్న అద్భుత కృషిని తాను చూశానని ఆయన గుర్తు చేసుకున్నారు. సుస్థిర వ్యవసాయంలో విప్లవం తీసుకురావడానికి ఉద్దేశించిన ఈ ప్రచారాన్ని మరింత విస్తరించాలని... వ్యవసాయ రంగంలో నిమగ్నమైన తన యువ తమిళ మిత్రులను ప్రధానమంత్రి కోరారు. మన పళ్ళెం నిండుగా ఉండాలి... మన జేబు నిండుగా ఉండాలి... మన భూమి సురక్షితంగా ఉండాలి అనేవి మన లక్ష్యంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
"ప్రపంచంలోని అత్యంత పురాతనమైన సజీవ నాగరికతల్లో తమిళ సంస్కృతి ఒకటి" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. తమిళ సంస్కృతి శతాబ్దాలను పరస్పరం అనుసంధానిస్తోందని... చరిత్ర నుంచి నేర్చుకుంటుందని... వర్తమానాన్ని భవిష్యత్తు దిశగా నడిపిస్తుందని ఆయన వివరించారు. దీని నుంచి స్ఫూర్తి పొందిన నేటి భారత్ తన మూలాల నుంచి బలాన్ని పొంది కొత్త అవకాశాల దిశగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పవిత్రమైన పొంగల్ పండుగ సందర్భంగా, దేశాన్ని ముందుకు నడిపించే విశ్వాసాన్ని మనం అందిపుచ్చుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఇది తన సంస్కృతితో అనుసంధానమైన, తన భూమిని గౌరవించే, తన భవిష్యత్తు పట్ల విశ్వాసంతో నిండిన దేశమని శ్రీ మోదీ తెలిపారు. తమిళంలో పొంగల్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***
(रिलीज़ आईडी: 2214993)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam