రక్షణ మంత్రిత్వ శాఖ
10వ రక్షణ దళాల పూర్వ సైనికుల దినోత్సవం సందర్భంగా మాజీ సైనికుల పరాక్రమం, త్యాగాలు, అంకితభావంతో కూడిన సేవలకు నివాళులర్పించిన దేశం
ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మాజీ సైనికుల ర్యాలీలు, పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించే కార్యక్రమాలు, ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు
మాజీ సైనికులు జాతీయ చైతన్యానికి సజీవ స్తంభాలని, సామూహిక ధైర్యానికి చిహ్నాలని, భావి తరాలకు స్ఫూర్తి ప్రదాతలని కొనియాడిన రక్షణ మంత్రి
భారత్ బలమైన, స్వావలంబన కలిగిన అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు మాజీ సైనికుల అనుభవం, నాయకత్వం, విలువలు అమూల్యమైన ఆస్తులన్న రక్షణ మంత్రి
40 ఏళ్ల క్రితం శ్రీలంకలో జరిగిన 'ఆపరేషన్ పవన్'లో ఐపీకేఎఫ్‌లో భాగమైన ధైర్యవంతులైన మాజీ సైనికులకు నివాళులర్పించిన రక్షణ మంత్రి
మాజీ సైనికులకు అర్హమైన గౌరవాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అందిస్తోందన్న రక్షణ మంత్రి
प्रविष्टि तिथि:
14 JAN 2026 3:35PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా 14 జనవరి 2026న 10వ రక్షణ దళాల పూర్వ సైనికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ సైనికుల ర్యాలీలు, పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించే కార్యక్రమాలు, ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు, సహాయక డెస్క్‌లు వంటి వరుస కార్యక్రమాలు జరిగాయి. ఢిల్లీ లేదా ఎన్‌సీఆర్ ప్రాంతానికి చెందిన సుమారు 2,500 మంది మాజీ సైనికులు పాల్గొన్న ఢిల్లీ కాంట్‌లోని మానేక్షా సెంటర్‌లో జరిగిన ప్రధాన వేడుకలకు రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ.. మాజీ సైనికులను జాతీయ చైతన్యానికి సజీవ స్తంభాలుగా, సామూహిక ధైర్యానికి చిహ్నాలుగా, భావి తరాలకు స్ఫూర్తి ప్రదాతలుగా అభివర్ణించారు. వారి పరాక్రమానికి, త్యాగాలకు, అంకిత భావంతో కూడిన సేవలకు ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. తమ అనుభవాల ద్వారా యువతకు మార్గనిర్దేశం చేయటం, అగ్నివీరులు- యువ సైనికులకు సరైన దిశానిర్దేశం చేయటం, అత్యవసర పరిస్థితుల్లో ప్రజా పాలనకు అండగా నిలవటం, సామాజిక సామరస్యాన్ని పెంపొందించటం, క్షేత్రస్థాయిలో దేశభక్తి స్ఫూర్తిని మరింత బలోపేతం చేయటం ద్వారా బలమైన భవిష్యత్తు గల భారత్‌కు పునాది వేయాలని ఆయన వారిని కోరారు.
“నేడు భారత్ బలమైన, స్వావలంబన కలిగిన, అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇటువంటి సమయంలో పూర్వ సైనికుల అనుభవం, నాయకత్వం, విలువలు దేశానికి అమూల్యమైన ఆస్తులుగా ఉంటాయి. మన సమాజం ముఖ్యంగా యువత మీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. విద్య, నైపుణ్యాభివృద్ధి, విపత్తు నిర్వహణ, సామాజిక నాయకత్వం లేదా ఆవిష్కరణలు.. ఇలా మార్గం ఏదైనా సరే మీ భాగస్వామ్యం భావి తరాలపై సానుకూల, శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది” అని హాజరైన విశ్రాంత సైనికులతో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
దాదాపు 40 ఏళ్ల క్రితం శాంతి పరిరక్షణ కోసం భారత శాంతి పరిరక్షణ దళంలో (ఐపీకేఎఫ్) భాగంగా శ్రీలంకలో చేపట్టిన 'ఆపరేషన్ పవన్'లో పాల్గొన్న ధైర్యవంతులైన సైనికులను రక్షణ మంత్రి స్మరించుకున్నారు. “ఈ ఆపరేషన్ సమయంలో భారత దళాలు అసాధారణమైన ధైర్యసాహసాలను ప్రదర్శించాయి. చాలా మంది సైనికులు ప్రాణాలను అర్పించారు. వారి పరాక్రమం, త్యాగాలు, పోరాటాలకు దక్కాల్సిన గౌరవం అప్పట్లో అందలేదు. నేడు ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో మన ప్రభుత్వం ఆపరేషన్ పవన్‌లో పాల్గొన్న శాంతి పరిరక్షక సైనికుల సహకారాన్ని బహిరంగంగా గుర్తించడమే కాకుండా ప్రతి స్థాయిలోనూ వారి సేవలను గుర్తించే ప్రక్రియలో ఉంది. 2015లో ప్రధాని మోదీ శ్రీలంకను సందర్శించినప్పుడు అక్కడి ఐపీకేఎఫ్ స్మారక చిహ్నం వద్ద భారతీయ సైనికులకు నివాళులర్పించారు. ఇప్పుడు మేం ఢీల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కూడా ఐపీకేఎఫ్ సైనికులను గుర్తించటంతో పాటు వారికి అర్హమైన గౌరవాన్ని అందిస్తున్నాం.” అని ఆయన చెప్పారు.
జాతీయ భద్రత పట్ల నిస్వార్థ సేవ చేసినందుకు.. క్రమశిక్షణ, నాయకత్వం, ధైర్యంతో సమాజానికి మార్గనిర్దేశం చేస్తూ దేశ నిర్మాణానికి సహకరించినందుకు.. వివిధ రంగాలలో యువతను తీర్చిదిద్దినందుకు మాజీ సైనికులను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. “ మీరు మీ జీవితంలోని బంగారు కాలాన్ని పర్వత శిఖరాలు, మండుతున్న ఇసుక ఎడారులు, తేమతో కూడిన అడవులలో గడుపుతారు. మీరు మరే ఇతర రంగాన్నైనా ఎంచుకుని ఉండొచ్చు. బహుశా ఇన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండేది కాదు. మీ కుటుంబాలతో ఎక్కువ సమయం గడపగలిగేవారు. కానీ వీటన్నింటికీ మించి మీరు అన్ని పరిస్థితిలోనూ దృఢంగా నిలబడి దేశాన్ని రక్షించే బాధ్యతను నెరవేరుస్తారు. నిజానికి ఒక సైనికుడు ఎన్నటికీ పదవీ విరమణ చేయడు. యూనిఫాం రంగు మారొచ్చు. పని ప్రదేశం మారొచ్చు. చుట్టూ ఉన్న వ్యక్తులు మారొచ్చు.. కానీ దేశభక్తి, సేవా స్ఫూర్తి మాత్రం అలాగే ఉంటాయి. మీ సంక్షేమం, శ్రేయస్సు మా నైతిక, భావోద్వేగ బాధ్యత” అని ఆయన వ్యాఖ్యానించారు.
మాజీ సైనికుల సంక్షేమం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సంకల్పంతో ముందుకెళ్తోందన్న ఆయన ఈ దిశగా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుందని తెలిపారు. ఒక ర్యాంక్ ఒక పింఛను (ఓఆర్ఓపీ) వంటి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను నెరవేర్చడం, మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్‌ను (ఈసీహెచ్ఎస్) బలోపేతం చేయడం వంటి వాటిని ఆయన ప్రస్తావించారు.
“ఓఆర్ఓపీ (ఒక ర్యాంక్ ఒక పింఛను) అమలు మాజీ సైనికుల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడమే కాకుండా తమను దేశం న్యాయంగా చూస్తుందనే వారి నమ్మకాన్ని బలపరిచింది. జాతీయ ప్రయోజనాలను కాపాడటం కోసం జీవితాలను అంకితం చేసిన వారి ఆరోగ్యం విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదనేది మా స్పష్టమైన వైఖరి. ఆరోగ్య సౌకర్యాలు కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు కూడా చేరేలా చూడాలన్నదే మా ప్రయత్నం. దూరంగా ఉన్న వైద్యులను సంప్రదించే సదుపాయం టెలిమెడిసిన్ ద్వారా విస్తరిస్తోంది. తద్వారా అవసరమైన వారికి చికిత్స అందే విషయంలో వయస్సు లేదా దూరం అడ్డంకి కాకూడదు” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
పదవీ విరమణ తర్వాత ప్రారంభమయ్యే సైనికుల జీవితంలోని కొత్త అధ్యాయం గౌరవం, స్వయంప్రతిపత్తితో ఉండేలా చూడాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అని రక్షణ మంత్రి ఉద్ఘాటించారు. మాజీ సైనికుల పునరావాసం, ఉపాధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. “మాజీ సైనికులకు కొత్త నైపుణ్యాలను నేర్పిస్తున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలలో వారికి ప్రాధాన్యత ఇస్తున్నాం. వారి క్రమశిక్షణ, నాయకత్వం, చిత్తశుద్ధిని ప్రైవేట్ రంగం కూడా గుర్తిస్తోంది. సొంత వ్యాపారాలను ప్రారంభించాలనుకునే మాజీ సైనికులను మేం ప్రోత్సహిస్తున్నాం. గృహ నిర్మాణ పథకాలు, రుణ సదుపాయాలు, ఇతర సంక్షేమ పథకాలు.. ఇలా ఏవైనా సరే అవన్నీ మాజీ సైనికుల అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తున్నాం” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన సైనికులకు ప్రభుత్వం తగిన గౌరవం ఇస్తోందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మాతృభూమి సేవలో ప్రాణాలు అర్పించిన వీర జవానులను దేశంలోని ప్రతి ఒక్కరికి గుర్తు చేసేలా 'జాతీయ యుద్ధ స్మారకం’ వంటి ప్రతిష్ఠాత్మక కట్టడాలను నిర్మించినట్లు ఆయన తెలిపారు. “భవిష్యత్తు తరాల మనస్సులో గౌరవం, కృతజ్ఞతా భావం నిలిచి ఉండేలా చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలలో స్థానిక స్థాయిలో ఇటువంటి స్మారక చిహ్నాలను ప్రోత్సహిస్తున్నాం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒక దేశం నిజమైన బలాన్ని కేవలం పథకాల ద్వారా మాత్రమే కొలవలేమన్న రక్షణ మంత్రి.. ఇది తన సైనికులను, మాజీ సైనికులను చూసే సామాజిక చైతన్యంలో ప్రతిబింబిస్తుందని ప్రధానంగా చెప్పారు. “మన సమాజం మాజీ సైనికులకు ఇచ్చే గౌరవం మనకు ఒక గొప్ప సామాజిక మూలధనం. ఇది తరతరాలను అనుసంధానిస్తుంది.. దేశం ఆత్మను బలపరుస్తుంది. భారత్‌లో సైనికుల పట్ల ఉండే గౌరవం ప్రభుత్వ ఆదేశం నుంచి కాకుండా మన విలువల సహజ విస్తరణలో భాగంగా వచ్చాయని చెప్పుకోవడం మనకు గర్వకారణం. సైనికులతో మనకున్న బంధం హృదయపూర్వకమైనది.. నమ్మకంతో కూడినది.. గౌరవప్రదమైనది.. ఉమ్మడి భవిష్యత్తు కలలతో ముడిపడి ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్బంగా మాట్లాడిన మాజీ సైనికుల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి సుకృతి లిఖి.. మాజీ సైనికులు, వారి కుటుంబాల అజేయమైన స్ఫూర్తికి వందనం చేస్తున్నట్లు తెలిపారు. పూర్వ సైనికుల దినోత్సవం అనేది కేవలం ఒక ఉత్సవ కార్యక్రమం మాత్రమే కాదని దేశ సామూహిక చైతన్యాన్ని పునరుజ్జీవింపజేసే రోజని ఆమె అభివర్ణించారు. “సైనిక జీవితం ముగిసిన తర్వాత కూడా దేశానికి, దాని సైనికులకు మధ్య ఉండే బంధం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుందని ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది” అని ఆమె చెప్పారు.
ప్రతి సంవత్సరం సుమారు 60,000 మంది సైనికులు పదవీ విరమణ పొందుతున్నారన్న మాజీ సైనికుల సంక్షేమ శాఖ కార్యదర్శి.. దీనివల్ల ప్రస్తుతం సుమారు 35 లక్షల మంది మాజీ సైనికులు ఉన్నారని తెలిపారు. మాజీ సైనికుల సంక్షేమం అనేది దేశం నెరవేర్చవలసిన భారీ బాధ్యత అన్న విషయాన్ని ఇది తెలియజేస్తోందని ఆమె అన్నారు. మాజీ సైనికులు తమతో పాటు అపారమైన అనుభవం, నాయకత్వ లక్షణాలు, లోతైన విధి నిర్వహణ పట్ల నిబద్ధతను తీసుకువస్తారని.. వారు తమ జీవితాలను గౌరవం, ఆత్మగౌరవంతో గడిపేలా చూడటం అనేది దేశానికి ఉన్న సామూహిక బాధ్యత అని ఆమె ప్రముఖంగా చెప్పారు.
మాజీ సైనికులకు సకాలంలో సేవలు అందించే విషయంలో మాజీ సైనికుల సంక్షేమ శాఖ (డీఈఎస్‌డబ్ల్యూ) నిబద్ధతతో ఉన్నట్లు శ్రీమతి సుకృతి లిఖి తెలియజేశారు. వారి సేవ, త్యాగం, గౌరవమే తమ విధానాలకు పునాది అని ఆమె పేర్కొన్నారు. “మాజీ సైనికులు, వారిపై ఆధారపడిన వారికి అండగా నిలవడంలో మా శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. గత కొన్ని సంవత్సరాల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు అనేక పటిష్టమైన చర్యలు తీసుకున్నాం. వీటిలో సకాలంలో పింఛను పంపిణీ చేయటంలో మెరుగుదల, కేంద్రీయ సైనిక్ బోర్డు (కేఎస్‌బీ) నుంచి పెరిగిన గ్రాంట్లు, డీజీఆర్ పునరావాస- శిక్షణ కోర్సుల విస్తరణ వంటివి ఉన్నాయి. అదే సమయంలో ప్రస్తుతం ఈసీహెచ్ఎస్ ద్వారా 64 లక్షల మంది లబ్ధిదారులకు వైద్య సేవలు అందుతున్నాయి” అని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, నావికాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర సింగ్, మాజీ దళాధిపతులు, ఇతర సైనికులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ వెటరన్స్ డైరెక్టరేట్ ప్రచురించిన 'సమ్మాన్', నావల్ వెటరన్స్ డైరెక్టరేట్ ప్రచురించిన 'సాగర్ సంవాద్', ఎయిర్ వెటరన్స్ డైరెక్టరేట్ ప్రచురించిన 'వాయు సంవేదన' అనే వార్షిక మ్యాగజైన్‌లను విడుదల చేశారు.
మాజీ సైనికుల నిస్వార్థ విధి నిర్వహణ, దేశ సేవ, త్యాగానికి గౌరవ సూచికంగా రాజౌరీ, అమృత్‌సర్, లక్నో, రాంచీ, గౌహతి, పుణె, గోవా, కొచ్చితో సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మాజీ సైనికుల ర్యాలీలు, పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించే కార్యక్రమాలను కూడా నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ముప్పై నాలుగు (34) రాజ్య సైనిక్ బోర్డులు, 434 జిల్లా సైనిక బోర్డులు ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలను నిర్వహించాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యక్రమాల వేదికల వద్ద తక్షణ ఫిర్యాదుల పరిష్కారం, పిర్యాదుల పరిష్కారాన్ని సలభతరం చేసే ఏర్పాట్లతో పాటు అవగాహన కోసం మూడు రక్షణ దళాలు, రక్షణ- ప్రభుత్వ సంక్షేమ సంస్థలు, బ్యాంకులు, ఉపాధి సంస్థలు హెల్ప్ డెస్క్‌లు, స్టాళ్లు ఏర్పాటు చేశాయి.
1953లో ఇదే రోజున పదవీ విరమణ చేసిన భారత సైన్యపు మొట్టమొదటి కమాండర్-ఇన్-చీఫ్, ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప వారసత్వాన్ని, ఆయన చేసిన అద్భుతమైన సేవలను గౌరవించడానికి ప్రతి సంవత్సరం జనవరి 14న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
(रिलीज़ आईडी: 2214986)
आगंतुक पटल : 6