రైల్వే మంత్రిత్వ శాఖ
వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జోన్లకు 26 పతకాలు, 100 మంది రైల్వే అధికారులకు 70వ అతి విశిష్ట రైల్ సేవా పురస్కారాలను (2025) అందించిన శ్రీ అశ్వినీ వైష్ణవ్
2047 నాటికి 'వికసిత్ భారత్, వికసిత్ రైల్వేలు' లక్ష్యాన్ని సాకారం చేయడానికి
భారతీయ రైల్వేలు సరికొత్త స్థాయికి చేరుకోవాలన్న శ్రీ అశ్వినీ వైష్ణవ్
తదుపరి తరం రైల్వేలను బలోపేతం చేయడానికి వ్యవస్థాగత సంస్కరణలు
సాంకేతికత, భద్రతపై దృష్టి, అధునాతన శిక్షణ, నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు
ఆలోచనలో మార్పు... 'ఆరు సూత్రాల తీర్మాన ప్రణాళిక'ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
భారతదేశ రవాణా పరివర్తనకు అంకితభావంతో పనిచేసే రైల్వే శ్రామిక శక్తే వెన్నెముక: మంత్రి శ్రీ వీ. సోమన్న
ఆధునికీకరణ, భద్రత, ప్రయాణికులపై దృష్టి సారించడం వంటి అంశాలతో…
భారతీయ రైల్వేలకు సరికొత్త నిర్వచనం: సీఈవో శ్రీ సతీష్ కుమార్
प्रविष्टि तिथि:
09 JAN 2026 8:30PM by PIB Hyderabad
ఢిల్లీలోని ద్వారకలో ఉన్న ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్, ఎక్స్పో సెంటర్‌లో (యశోభూమి) కేంద్ర రైల్వే, సమాచార - ప్రసార, ఎలక్ట్రానిక్స్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ నేడు 100 మంది రైల్వే అధికారులకు 70వ 'అతి విశిష్ట రైల్ సేవా పురస్కారాల'ను, వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జోన్లకు 26 పతకాలను అందించారు. రైల్వే బోర్డు సభ్యులు, వివిధ రైల్వే జోన్లు- ఉత్పత్తి కేంద్రాల జనరల్ మేనేజర్లతో పాటు రైల్వే- జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న, రైల్వే బోర్డు ఛైర్మన్ - సీఈవో శ్రీ సతీష్ కుమార్ సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. 2047 నాటికి 'వికసిత్ భారత్, వికసిత్ రైల్వేలు' దార్శనికతను సాకారం చేయడానికి భారతీయ రైల్వేలు పూర్తిగా ఒక సరికొత్త స్థాయికి చేరుకోవాలని అన్నారు. రైల్వే ఉద్యోగుల అంకితభావాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఉద్యోగుల ఉమ్మడి కృషితోనే రైల్వే దీర్ఘకాలిక సవాళ్లను అధిగమించగలిగిందని, సామర్థ్యాన్ని విస్తరించిందని, పనితీరును మెరుగుపరుచుకుందని, ప్రధాన మౌలిక సదుపాయాలు- కార్యాచరణ విషయంలో కీలక విజయాలను సాధించిందని ఆయన పేర్కొన్నారు.
రైల్వే లైన్ల నిర్మాణ పనులు విస్తృతంగా జరగడం వల్ల రైల్వే సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారు. దీపావళి-ఛఠ్, క్రిస్మస్, వేసవి కాలం వంటి అన్ని ప్రధాన రద్దీ సమయాల్లో ప్రత్యేక రైళ్లను నడపడం ద్వారా ప్రయాణికులకు చక్కటి ప్రయాణాన్ని అందించినట్లు తెలిపారు. ఈ విషయంలో గత ఏడాదిలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పినట్లు పేర్కొన్నారు.
వినియోగదారుల సేవలు, నిర్వహణ, ఉత్పత్తి, నాణ్యత నిర్వహణ, ఆరోగ్య వ్యవస్థలు, కార్యకలాపాలు వంటి కీలక రంగాల్లో ప్రతి వారం ఒక ప్రధాన సంస్కరణను అమలు చేసేలా భారతీయ రైల్వే '52 వారాలు- 52 సంస్కరణలు' పేరుతో 2026 కోసం ఒక ప్రతిష్ఠాత్మక సంస్కరణ ప్రణాళికను తీసుకుందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రమాణాలను పునర్నిర్వచించడానికి, అడ్డంకులను గుర్తించడానికి, స్పష్టమైన- కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేందుకు అన్ని విభాగాల అధికారుల క్రియాశీల భాగస్వామ్యంతో వరుస వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
రాబోయే కాలంలో భారతీయ రైల్వేలకు మార్గనిర్దేశం చేసే ఆరు ప్రధాన తీర్మానాలను ఆయన వివరించారు.
జవాబుదారీతనం, పటిష్ట అమలుతో కూడిన వినియోగదారుల సేవలు.. నిర్వహణ, ఉత్పత్తి, నాణ్యత, ఆరోగ్య వ్యవస్థల‌్లో కాలపరిమితితో కూడిన మార్పుల కోసం నిర్ణయాత్మకమైన వ్యవస్థాగత సంస్కరణలను చేపట్టడం మొదటిది.
విశ్వసనీయత, ఉత్పాదకతను పెంచడానికి నూతన తరం బోగీలు, అధునాతన పట్టాల వ్యవస్థలు, ఆధునిక సిగ్నలింగ్, మెరుగైన నిర్వహణ పద్ధతులతో సహా సాంకేతికత, ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సును (ఏఐ) మరింత సమర్థవంతంగా, విస్తృతంగా స్వీకరించడం రెండోది.
పాత పద్ధతులను విడిపెట్టటం వల్ల స్వల్పకాలిక అసౌకర్యం కలిగినా దీర్ఘకాలిక భద్రత, పనితీరు కోసం నిర్వహణ ప్రమాణాలను ఆధునికీకరించడం అత్యవసరమని గుర్తించడం మూడోది.
మెరుగైన శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, క్రమశిక్షణతో కూడిన కార్యకలాపాలు, అన్ని స్థాయిల నాయకత్వంలో రోజువారీ పర్యవేక్షణ ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో భద్రతపై రాజీలేకుండా దృష్టి సారించడం నాలుగోది.
నిరంతర నైపుణ్యాభివృద్ధిని తప్పనిసరి చేయడం, శిక్షణను ఉద్యోగ జీవన పురోగతితో అనుసంధానించడం, అత్యంత సమర్థవంతమైన శ్రామిక శక్తిని తయారుచేసేందుకు సిమ్యులేటర్లు- డిజిటల్ వేదికల వంటి ఆధునిక సాధనాలను ఉపయోగించి శిక్షణ, నైపుణ్య వికాసాన్ని మార్చడం అయిదోది.
కొత్త ఆలోచనల పట్ల సానుకూలంగా ఉండటం, యువ అధికారులు- క్షేత్రస్థాయి సిబ్బందికి సాధికారత కల్పించటం, భారతీయ పరిష్కారాలను ప్రోత్సహించటం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న 'భారత్‌లో తయారీ' విజయాల పట్ల గర్విస్తూ.. వలసవాద మనస్తత్వాన్ని పూర్తిగా నిర్మూలించడం ఆరోది.
అంకురాలు- ఆవిష్కర్తలను భాగస్వామ్యం చేయడం, సంస్కరణల కోసం రైల్వే ఉద్యోగుల నుంచి ఆలోచనలను స్వీకరించడం, విజయవంతమైన ఆవిష్కరణలను నెట్‌వర్క్ అంతటా విస్తరించేలా చూడటానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రధానంగా చెప్పారు. ప్రధాన జాతీయ సంస్కరణలతో సరిపోల్చిన ఆయన.. మార్పు దిశగా భారతీయ రైల్వేలు కూడా అదే విధమైన ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాలని అన్నారు. యువ శ్రామిక శక్తి, పారదర్శక వ్యవస్థలు, సంస్కరణల పట్ల సానుకూల మనస్తత్వంతో 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో రైల్వేలు అంతర్జాతీయ ప్రమాణంగా మారేందుకు, ఒక కీలక స్తంభంగా నిలవడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
సభను ఉద్దేశించి రైల్వే- జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ వీ.సోమన్న మాట్లాడుతూ... భారతీయ రైల్వేను ప్రపంచంలోని అతిపెద్ద సేవా సంస్థలలో ఒకటిగా అభివర్ణించారు. ప్రతిరోజూ లక్షలాది మందికి సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంలో 'రైల్వే కుటుంబం' కృషిని ప్రశంసిస్తూ ఉద్యోగుల, అధికారులకు అభినందనలు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు వంటి ప్రాంతాలకు రైల్వే అనుసంధానం విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. జాతీయ సమగ్రతను బలపరిచిన ప్రధాన ఇంజనీరింగ్ విజయాలను ఈ సందర్భంగా ఉదహరించారు. మెరుగైన అనుసంధానత కోసం తీసుకొచ్చిన అమృత్ భారత్, నమో భారత్ రైళ్ల గురించి ప్రస్తావించిన ఆయన.. రాబోతున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు సుదూర ప్రయాణ అనుభూతిని మరింత మెరుగుపరుస్తాయని చెప్పారు.
రైల్వే విద్యుదీకరణ, పర్యావరణ సుస్థిరతలో సాధించిన పురోగతిని ప్రముఖంగా పేర్కొన్న ఆయన.. భారతీయ రైల్వే పర్యావరణ హితమైన కార్యకలాపాల దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. తన క్షేత్రస్థాయి పర్యటనల అనుభవాలను ఆయన పంచుకున్నారు. అన్ని స్థాయుల్లోని రైల్వే సిబ్బందిని ఈ సంస్థకు వెన్నెముకగా అభివర్ణించారు. వారి అంకితభావం, నిబద్ధతను కొనియాడారు.
భారతీయ రైల్వే వేగవంతమైన పరివర్తనకు లోనైందని.. ఆధునిక- సురక్షితమైన, ప్రయాణికుల అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే సంస్థగా అవతరించిందని శ్రీ సతీష్ కుమార్ తెలిపారు. భద్రతకే అత్యున్నత ప్రాధాన్యత ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, మానవరహిత లెవల్ క్రాసింగ్‌ల తొలగింపు, మెరుగైన ట్రాక్ పర్యవేక్షణ, అనుబంధ భద్రతా చర్యల ద్వారా నిరంతరంగా భద్రతను మెరుగుపరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సరుకు రవాణా కార్యకలాపాల గురించి ప్రస్తావించిన ఆయన.. డోర్-టు-డోర్, బహుళ నమూనా సరుకు రవాణా ద్వారా భారతీయ రైల్వే కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని, దేశ ఆర్థిక పురోగతికి సహకారాన్ని అందిస్తోందని అన్నారు.
రైల్వే విద్యుదీకరణ శతాబ్దం పూర్తి చేసుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు. భారతీయ రైల్వే ప్రయాణంలో ఇదొక గర్వించదగ్గ కీలక ఘట్టంగా వర్ణించిన ఆయన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నట్లు తెలిపారు. రైల్వే ఉద్యోగులను ‘నిజమైన హీరోలు’గా పేర్కొన్న ఆయన.. ఈ పరివర్తనకు వారి క్రమశిక్షణ, అంకితభావం, సేవలే వెన్నెముకగా నిలిచాయని అన్నారు.
భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం తన ఉద్యోగులకు 'అతి విశిష్ట రైల్ సేవా పురస్కార్'ను ఇస్తోంది. ఈ అవార్డులను వ్యక్తిగత అవార్డులు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన రైల్వే జోన్లకు అందించే పతకాలు అనే రెండు విభాగాల్లో అందిస్తున్నారు. భారతీయ రైల్వేను మరింత సమర్థవంతమైన, సురక్షితమైన, ప్రయాణికులకు అనుకూలమైన సంస్థగా మార్చడంలో రైల్వే సిబ్బంది చూపించిన అంకితభావం, కష్టపడి పనిచేసే తత్వం, అసాధారణ సహకారాన్ని గుర్తించేందుకు, వేడుక చేసుకునేందుకు వ్యక్తిగత అవార్డులు ఒక వేదికగా ఉపయోగపడతాయి. భారతీయ రైల్వే పూర్తి పనితీరుకు జోన్లు అందించిన అత్యుత్తమ విజయాలు, సహకారాన్ని గుర్తిస్తూ వివిధ విభాగాలలో పతకాలను అందజేస్తారు.
70వ అతి విశిష్ట రైల్ సేవా అవార్డు (ఏవీఆర్‌ఎస్‌పీ)-2025 కు ఎంపికైన అధికారుల జాబితాను ఈ కింది లింకులో చూడొచ్చు.
List of Officials selected for 70th Ati Vishisht Rail Seva Puraskar (AVRSP)-2025
(रिलीज़ आईडी: 2213673)
आगंतुक पटल : 5