హోం మంత్రిత్వ శాఖ
ఎన్ఎస్‌జీకి చెందిన జాతీయ ఐఈడీ సమాచార నిర్వహణ వ్యవస్థను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో.. గత ఆరేళ్లుగా వ్యవస్థీకృత విధానంలో సేకరించిన వివిధ రకాలకు చెందిన సమాచారం
ఉగ్రవాదం నుంచి రక్షణ అందించే అత్యాధునిక కవచంగా ఎన్ఐడీఎంస్
ఉగ్రవాద కార్యకలాపాల దర్యాప్తు చేయడం, పేలుళ్లలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడం, వాటిని ఎదుర్కొనేలా సమర్థమైన వ్యూహాలను సిద్ధం చేసుకోవడానికి తోడ్పాటు
ఇప్పటి వరకు దేశంలో జరిగిన బాంబు పేలుళ్ల పోకడలను మోడస్ ఆపరెండీని, ఉపయోగించిన పేలుడు పదార్థాలను కచ్చితంగా విశ్లేషించే విస్తృత వేదికగా పనిచేసే ఎన్ఐడీఎంస్
దర్యాప్తు, ఉగ్రవాద నిరోధక సంస్థలకు వివిధ కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఒక్క క్లిక్కుతో అందించే ఎన్ఐడీఎంఎస్
దేశంలో బలమైన భద్రతా వ్యవస్థను రూపొందించేందుకు ఇతర డేటా సోర్సులతో ఏఐ సహకారంతో ఎన్ఐడీఎంస్ అనుసంధానవమవుతుంది
‘ఒకే దేశం-ఒకే డేటా రిపోజిటరీ’ ద్వారా వివిధ విభాగాలకు చెందిన సమాచారం ఇప్పుడు జాతీయ సంపదగా ప్రతి పోలీసు విభాగానికి అందుబాటులోకి రానుంది
ప్రపంచ స్థాయిలో ఉన్న, పొరపాట్లకు తావు లేని భారత ఎన్‌ఎస్‌జీ అత్యుత్తమ ప్రదర్శనతో.. ఉగ్రవాద వ్యతిరేక, విమాన హైజాక్ నిరోధక, బాంబు నిర్వీర్య విభాగాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది
‘ఒక డేటా - ఒక్కసారి మాత్రమే ఎంట్రీ’తో అత్యాధునిక సమాచార వ్యవస్థగా ఐసీజేఎస్-2
प्रविष्टि तिथि:
09 JAN 2026 3:24PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ)కి చెందిన జాతీయ ఐఈడీ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఎన్ఐడీఎంఎస్)ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం కార్యదర్శి, ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్, ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల డైరెక్టర్ జనరళ్లు, వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసు డైరెక్టర్ జనరళ్లు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గడచిన ఆరేళ్లుగా వివిధ రకాలకు చెందిన సమాచారాన్ని వ్యవస్థీకృత పద్ధతిలో సేకరించేందుకు గణనీయమైన కృషి జరిగిందని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. దేశంలో జరుగుతున్న అన్ని రకాల ఉగ్రవాద ఘటనలను దర్యాప్తు చేసేందుకు, వివిధ రకాల అంశాలను విశ్లేషించేందుకు భవిష్యత్తులో ఎన్ఐడీఎంస్ అవసరం చాలా ఉందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే అత్యాధునిక రక్షణ కవచంగా ఇది మారనుందని కేంద్ర మంత్రి అన్నారు. గతంలో వివిధ రకాల సమాచారాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సేకరించిందని, అవన్నీ విడివిడిగా ఉన్నాయని శ్రీ షా అన్నారు. ఇప్పుడు ఆ సమాచారాన్నంతా ఒకదానితో ఒకటి అనుసంధానించేందుకు, కృత్రిమ మేధ సహాయంతో విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఈ రోజు ప్రారంభమవుతున్న ఎన్ఐడీఎంస్ ఈ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఉగ్రవాదం నుంచి దేశాన్ని సురక్షితంగా మార్చే దిశగా చేస్తున్న ప్రయాణంలో కీలకమైన విజయంగా నిలుస్తుందన్నారు.
ఎన్ఐఏతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద నిరోధక బృందాలు (ఏటీఎస్), రాష్ట్రాల పోలీసు దళాలు, అన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్) సమగ్రమైన, సమీకృతమైన ఆన్‌లైన్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనేందుకు ఎన్ఐడీఎంఎస్ వీలు కల్పిస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. ఏ ప్రాంతంలోనైనా పేలుడు లేదా ఐఈడీ ఘటన సంభవిస్తే.. దానికి సంబంధించిన సమాచారాన్ని ఈ వ్యవస్థలో పొందుపరచాలని వివరించారు. ఈ సమాచారం ద్వారా ప్రతి రాష్ట్రంలోనూ చేపట్టే దర్యాప్తు సమయంలో అవసరమైన మార్గనిర్దేశం లభిస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలను దర్యాప్తు చేయడంలో, పేలుళ్ల తీరును అర్థం చేసుకోవడంలో, వాటిని ఎదుర్కొనేలా వ్యూహాలను సిద్ధం చేసుకోవడంలో ఎన్ఐడీఎంఎస్ సహకరిస్తుందని అన్నారు.
1999 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని బాంబు పేలుళ్లకు సంబంధించిన సమాచారం ఎన్ఎస్‌జీ డేటాబేస్‌లో అందుబాటులో ఉందని కేంద్ర హోం మంత్రి చెప్పారు. ఇప్పుడు ఈ సమాచారం దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలు, సంబంధిత ఏజెన్సీలకు ఎన్ఐడీఎంఎస్ ద్వారా అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన బాంబు పేలుళ్ల తీరును, మోడస్ ఆపరెండీ (ఎంవో)ను, ఉపయోగించిన పేలుడు పదార్థాలను కచ్చితంగా విశ్లేషించే విస్తృత వేదికగా ఎన్ఐడీఎంఎస్ మారనుంది. ఎంవో, సర్క్యూట్ విధానాలతో పాటు మొత్తం తీరుతెన్నులను అర్థం చేసుకోవడం ద్వారా సంఘటనల మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడంలో గణనీయమైన సహకారాన్ని అందిస్తుందని శ్రీ షా తెలియజేశారు.
దేశవ్యాప్తంగా జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలకు సంబంధించిన కచ్చితమైన, క్రమబద్ధమైన విశ్లేషణను ఎన్ఐడీఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చని శ్రీ అమిత్ షా అన్నారు. దీనిని సురక్షితమైన జాతీయ స్థాయి డిజిటల్ వేదికని చెప్పారు. ఐటీడికి సంబంధించిన సమచారాన్ని సేకరించే, ప్రామాణికంగా మార్చే, ఏకీకృతం చేసే, సురక్షితంగా పంచుకొనే ప్రక్రియను ఈ వేదిక బలోపేతం చేస్తుందన్నారు. దర్యాప్తు సంస్థలు, ఉగ్రవాద వ్యతిరేక సంస్థలకు వివిధ కేసులకు సంబంధించిన సమచారాన్ని ఒక్క చోటే ఎన్ఐడీఎంఎస్ అందిస్తుందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, ఉగ్రవాద నిరోధక సంస్థలు, సీఏపీఎఫ్లకు అవసరమైన సమాచారాన్ని తక్షణమే అందిస్తుంది. దేశ అంతర్గత భద్రతకు ఈ వేదిక మూడు మార్గాల్లో ప్రయోజనం చేకూరుస్తుందని శ్రీ షా చెప్పారు.
‘ఒక దేశం, ఒక డేటా రిపోజిటరీ’ ద్వారా వివిధ విభాగాలు చెందిన సమాచారం ఇప్పుడు జాతీయ సంపదగా ప్రతి పోలీసు విభాగానికి అందుబాటులో ఉంటుందని హోం మంత్రి చెప్పారు. దీనివల్ల విచారణ ప్రక్రియ వేగం, నాణ్యతలో సానుకూలమైన మార్పులు వస్తాయి. అలాగే నేరాల పోకడలను సులభంగా గుర్తించగలుగుతాం. ఈ పోకడలను అర్థం చేసుకోవడం ద్వారా శాస్త్రీయపరమైన ఆధారాలకు అనుగుణంగా విచారణ చేపట్టేందుకు వీలు కలుగుతుందని ఆయన వివరించారు. అలాగే సంస్థల మధ్య సమన్వయం మెరుగవుతుంది. సరైన సమయంలో సరైన సమాచారాన్ని అవసరమైన చోటకి చేర్చడానికి ఇది చాలా ముఖ్యమైన ప్రయత్నమని శ్రీ షా పేర్కొన్నారు.
దేశ అంతర్గత భద్రతలో ఎన్ఎస్‌జీ కీలకమైన సంస్థ అని శ్రీ అమిత్ షా అన్నారు. ఎన్ఎస్జీ సిబ్బందికి ఉన్న ధైర్యం, ప్రత్యేక నైపుణ్యాలు, అచంచలమైన నిబద్ధత కారణంగా మన ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఎక్కడైనా దాడి జరిగితే సత్వరమే స్పందించడం, యాంటీ-హైజాక్ ఆపరేషన్ల కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం, బాంబు నిర్వీర్య ఆపరేషన్లను నిర్వహించడం, ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడం - ఇలా క్షేత్రస్థాయిలో ఎన్ఎస్‌జీ ఉత్తమ ప్రదర్శన కనబరచడమే కాకుండా.. ప్రతిసారి విజయం సాధిస్తోంది.
ప్రపంచంలోనే అత్యుత్తమమైన, ఎలాంటి పొరపాట్లకు చోటివ్వని భారతీయ భద్రతా దళం ఎన్ఎస్‌జీ అని కేంద్ర హోం శాఖ మంత్రి చెప్పారు. 1984లో ఎన్ఎస్జీ ఏర్పాటైందని, అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద సంఘటనలను వాటి స్వభావంతో సంబంధం లేకుండా విశ్లేషిస్తూనే ఉంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉంది. ఉగ్రవాద నిరోధక, హైజాకింగ్ వ్యతిరేక కార్యకలాపాలు, బాంబు నిర్వీర్యంతో పాటుగా సమాచారాన్ని పంచుకొనేందుకు అధునాతన వ్యవస్థలను రూపొందించడంతో సహా అన్ని ముఖ్యమైన బాధ్యతలను ఎన్ఎస్జీ నిర్వహిస్తోందన్నారు. ఎన్ఎస్జీ అధికారులు, కమాండోలు వారు చూపిన ధైర్యసాహసాలకు వివిధ స్థాయుల్లో గౌరవాన్ని అందుకుంటున్నారని హోం మంత్రి చెప్పారు. వీటిలో మూడు అశోక చక్ర, రెండు కీర్తి చక్ర, మూడు శౌర్య చక్ర పురస్కారాలు 10 పోలీసు పతకాలు, 44 సేనా పతకాలున్నాయి.
మారుతున్న భద్రతా పరిస్థితులకు అనుగుణంగా గడచిన నాలుగు దశాబ్దాలుగా ఎన్ఎస్‌జీ తనను తాను నిరంతరం మార్చుకుంటోందని శ్రీ అమిత్ షా అన్నారు. ముంబయి, చెన్నై, కోల్కత, హైదరాబాద్, అహ్మదాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఎన్ఎస్‌జీ ప్రాంతీయ కేంద్రాలు పని చేస్తున్నాయి. అదనంగా అయోధ్యలో మరో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. వీటి వల్ల ఏదైనా ప్రాంతానికి తక్కువ సమయంలోనే ఎన్ఎస్జీ చేరుకోగలుగుతుంది. ఇవన్నీ కార్యకలాపాలను ఆరంభిస్తే, ముఖ్యంగా అయోధ్య కేంద్రం ప్రారంభమైతే అత్యవసర సమయాల్లో దేశంలో ఏ ప్రాంతానికైనా ఒకటి నుంచి ఒకటిన్నర గంటల సమయంలోనే ఎన్ఎస్‌జీ అక్కడికి చేరుకోగలుగుతుంది. ఉగ్రవాద నిరోధక, యాంటీ హైజాకింగ్ బృందాలు ప్రత్యేక కార్యాచరణ బృందాలుగా ఢిల్లీలో ఏర్పాటయ్యాయని హోం మంత్రి చెప్పారు. అదే విధంగా 24 గంటలూ, 365 రోజులూ ఎన్ఎస్‌జీ అప్రమత్తంగా ఉంటుందని, దీనివల్ల దేశానికి కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది.
దేశంలో మొత్తం పోలీసు స్టేషన్లు సుమారు 17,741 ఉండగా వీటిలో దాదాపు 100 శాతం సీసీటీఎన్ఎస్‌కు అనుసంధానమయ్యాయని కేంద్ర హోం మంత్రి తెలియజేశారు. తద్వారా వాటికి సంబంధించిన ఆన్‌లైన్ డేటా అందుబాటులోకి వచ్చిందన్నారు. ‘ఒక డేటా- ఒక్కసారి మాత్రమే ఎంట్రీ’ అనే విధానంపై ఆధారపడి.. అత్యాధునిక సమాచార మార్పిడి వ్యవస్థగా ఐసీజేఎస్-2 ఆవిర్భవించింది. సుమారు 22,000 కోర్టులకు చెందిన సమాచారానికి అదనంగా ఈ-ప్రిజన్ల ద్వారా 2 కోట్ల 20 లక్షల ఖైదీలు, ఈ-ప్రాసిక్యూషన్ ద్వారా 2 కోట్ల ప్రాసిక్యూషన్లు, ఈ-ఫోరెన్సిక్స్ ద్వారా 31 లక్షల శాంపిళ్ల ఫలితాలు, ఎన్ఏఎఫ్ఐఎస్ ద్వారా 1 కోటి 21 లక్షల వేలిముద్రలకు సంబంధించిన సమాచారమంతా ఇప్పుడు ఒక్క క్లిక్కు దూరంలో ఉన్నాయని ఆయన అన్నారు. ఈ వ్యవస్థకు ఎన్ఐడీఎంఎస్ కూడా అనుసంధానమవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా బలమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఏఐ సహకారంతో ఎన్ఐడీఎంఎస్ ఇతర సమాచార సోర్సులతో అనుసంధానమవుతుందని హోం మంత్రి అన్నారు.
***
(रिलीज़ आईडी: 2213652)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada