రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
రాహ్-వీర్: భయం లేకుండా ప్రాణాన్ని కాపాడండి
సామాజిక సేవాపరమైన రక్షణ ఉండగా...దేని గురించీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
प्रविष्टि तिथि:
04 JAN 2026 2:17PM by PIB Hyderabad
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు, ముఖ్యంగా కీలకమైన 'గోల్డెన్ అవర్'లో సకాలంలో అందే సహాయం ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. అలాంటి క్షణాల్లో సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారిని ఆదుకోవడానికి, చట్టపరమైన రక్షణ వారికి కల్పించడానికి రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 2020లో మోటార్ వాహనాల (సవరణ) చట్టం-2019లోని సెక్షన్ 134A కింద గుడ్ సమారిటన్ నియమాలను ప్రకటించింది. ఈ నియమాలు ఒక సాధారణ నమ్మకం ఆధారంగా రూపొందించారు. వీటి కారణంగా ప్రమాద బాధితుడికి సహాయం చేసేందుకు ఎవరూ భయపడాల్సిన అవసరం ఉండదు. గాయపడిన అపరిచితుడిని వారి వివరాలేవీ తెలియకపోయినా చికిత్స కోసం ధైర్యంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించే వ్యక్తులను రాహ్-వీర్స్ అని పిలుస్తారు.
ప్రమాద బాధితుడికి సహాయం చేసే గుడ్ సమారిటన్ (రాహ్-వీర్) చట్టపరమైన చిక్కులు ఎదుర్కొనే పరిస్థితి రాకూడదు. వ్యక్తిగత వివరాలను వెల్లడించమని వారిని బలవంతం చేయకూడదు. వారిని అనవసరంగా నిర్బంధించకూడదు. సహాయం చేయడానికి వచ్చిన వారి సంసిద్ధతను గౌరవించడంతో పాటు వారి గౌరవానికి, గోప్యతకు రక్షణ కల్పించాలి.
గోల్డెన్ అవర్‌లో ప్రాణాలను కాపాడడం
తీవ్రమైన గాయం తర్వాత మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్‌గా చట్టం నిర్వచిస్తుంది. ఇది వైద్య సహాయం పొందేందుకు అత్యంత కీలక సమయం. ఈ కాలంలో అందించే త్వరిత సహాయంతో శాశ్వత వైకల్యాలు, గాయాలు, అనేక మరణాలనూ నివారించవచ్చు.
ముఖ్యంగా మీరు రాహ్-వీర్ కావడం కోసం మీకు వైద్య శిక్షణ అవసరం లేదు. మీకు ప్రత్యేక పరికరాలేవీ అవసరం లేదు. కొన్నిసార్లు సహాయం చేయాలనే మీ సంకల్పమే అన్నింటికంటే గొప్ప సహాయం అవుతుంది.
గుడ్ సమారిటన్‌గా ఉండటానికి: మీరు చేయాల్సిన, చేయకూడని పనులు
చేయాల్సినవి: మీ హక్కులు - బాధ్యతలు
· భయం లేకుండా సహాయం చేయండి: మీరు మంచి ఉద్దేశంతో సహాయం చేసినప్పుడు మీరు సివిల్ లేదా క్రిమినల్ చట్టాల నుంచి రక్షణ పొందుతారు.
· మీ వివరాలు తెలపాల్సిన అవసరం లేదని తెలుసుకోండి: మీరు సాక్షిగా ఉండాలని ఎంచుకుంటే తప్ప మీ వ్యక్తిగత వివరాలను పంచుకోవాల్సిన అవసరం లేదు.
· ఒక పోలీసు స్టేట్‌మెంట్‌ను మాత్రమే అనుమతించండి: మీరు సాక్షిగా స్వచ్ఛందంగా ముందుకు వస్తే, మీకు అనుకూలమైన సమయంలో, ప్రదేశంలో ఒకసారి మాత్రమే మీరు మీ స్టేట్‌మెంట్ ఇవ్వవచ్చు.
· ఆసుపత్రి నుంచి రసీదును అభ్యర్థించండి: బాధితుడిని చికిత్స కోసం మీరు తీసుకువచ్చారని నిర్ధారిస్తూ రసీదు పొందడానికి మీరు అర్హులు.
చేయకూడనివి: మీరు నమ్మకూడని అపోహలు
· చట్టపరమైన ఇబ్బందుల కారణంగా వెనుకాడకండి: ఈ వ్యవస్థ రాహ్-వీర్‌లను రక్షించడానికి రూపొందించారు.
· ఆసుపత్రిలో ఉండాల్సిన బాధ్యత మీది కాదు: రోగిని ఆసుపత్రిలో చేర్పించిన వెంటనే మీరు అక్కడి నుండి వెళ్లిపోవచ్చు.
· చికిత్స కోసం డబ్బు చెల్లించవద్దు: ఆసుపత్రులు అత్యవసర సంరక్షణ కోసం మీ నుంచి చెల్లింపును డిమాండ్ చేయకూడదు.
· ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి లేదా సాక్ష్యం ఇవ్వడంలో బలవంతం ఏమీ ఉండదు: సాక్షిగా మారడం మీ వ్యక్తిగత ఎంపిక.
· మీరు అజ్ఞాతంగా ఉండటానికి ఇష్టపడితే వ్యక్తిగత వివరాలను వెల్లడించవద్దు: అది మీ హక్కు.
· అధికారుల నిర్బంధాన్ని అనుమతించవద్దు: దీనికి అనుమతి ఉండదు.
మనకు మరింత మంది రాహ్-వీర్‌లు అవసరం
మెరుగైన రహదారులు, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ దేశంలో రోడ్డు ప్రమాద గాయాలు, మరణాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఐఐటీ ఢిల్లీ నివేదికలో పేర్కొన్న విధంగా వాస్తవానికి ఈ ప్రమాదాల వల్ల కలిగే ఆర్థిక ప్రభావం అపారమైనదనీ, దేశపు జీడీపీలో దాదాపు 3 శాతం నష్టానికి ఇవి కారణమవుతున్నాయని గౌరవ కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
రహదారులు ప్రజలను అనుసంధానించడానికి, వారి కోసం అవకాశాలను సృష్టించడానికి ఉద్దేశించినవి. అయినప్పటికీ అవి చాలా తరచుగా విషాదకరమైన, నివారించదగిన నష్టాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ మరణాల్లో చాలా వరకు సహాయం సాధ్యం కాకపోవడం వల్ల కాదు... కేవలం సహాయం సకాలంలో అందకపోవడం వల్లనే సంభవిస్తున్నాయి. పోలీసుల విచారణ, ఆసుపత్రి విధానాలు, చట్టపరమైన సమస్యల భయం కారణంగా ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రజలు తరచుగా వెనుకాడతారు. సకాలంలో వైద్య సంరక్షణ ద్వారా ప్రాణాలను కాపాడగలిగే "గోల్డెన్ అవర్" సమయంలో ఈ సంకోచం వల్ల విలువైన సమయం వృధా అవుతోంది.
రాహ్-వీర్స్‌కు గుర్తింపు, ఆర్థిక సహాయం
‘రాహ్-వీర్’ (గుడ్ సమారిటన్) పథకం ఆర్థిక గుర్తింపును కూడా అందిస్తుంది. సంకోచానికి బదులుగా కరుణను ఎంచుకున్న ఈ వ్యక్తులను నిజ జీవిత హీరోలుగా గుర్తిస్తుంది.
ఈ పథకం కింద గోల్డెన్ అవర్ సమయంలో ప్రమాద బాధితుడికి వైద్య సహాయం అందేలా సహాయం చేసిన వారికి రూ.25,000 రివార్డు, ప్రశంసా పత్రం అందిస్తారు. ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ సహాయం చేయడం కోసం ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి సంవత్సరానికి ఐదు సార్లు వరకు ఈ గుర్తింపు లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ పథకం ఆత్మవిశ్వాసాన్ని, భరోసాను కలిగించడంతో పాటుగా... రహదారి ప్రమాదానికి గురైన వారికి సహాయం చేయడం సమష్టి బాధ్యతగా, దేశానికి గర్వకారణంగా మారే సంస్కృతిని ప్రేరేపిస్తుంది.
రాహ్-వీర్ ఒక పథకం లేదా విధానం కంటే ఎక్కువ. ఇది ధైర్యం, సహానుభూతి, సమష్టి బాధ్యతల ఉద్యమం.
మీరు ఏదైనా ప్రమాదాన్ని చూసిన తరువాత తప్పనిసరిగా గుర్తుంచుకోండి: విషాదం, మనుగడల మధ్య ఉన్న ఏకైక ఆశ మీరే కావచ్చు. ఒక ప్రాణాన్ని కాపాడటానికి మీరు డాక్టర్ కానవసరం లేదు, మీరు మానవత్వం గల మనిషిగా ఉంటే చాలు.
***
(रिलीज़ आईडी: 2211503)
आगंतुक पटल : 23