ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనువాదం: 'భారత్-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి' మొదటి సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 11 SEP 2023 3:34PM by PIB Hyderabad

గౌరవనీయులైన యువరాజు గారూ.. 

ఉభయ దేశాల విశిష్ట ప్రతినిధులారా.. 

మీడియా మిత్రులారా!

నేటి భారత్-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి నాయకుల మొదటి సమావేశంలో పాల్గొనడం నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. 

2019లో నేను సౌదీ అరేబియాలో పర్యటించిన సమయంలో ఈ మండలి ఏర్పాటును ప్రకటించాం.

మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గత నాలుగు సంవత్సరాలుగా ఇది ఒక ప్రభావవంతమైన సాధనంగా ఆవిర్భవించింది. 

అన్ని రంగాల్లో మన సహకారాన్ని నిరంతరం మెరుగుపరుస్తూ ఈ మండలి పరిధిలో రెండు కమిటీల సమావేశాలు పలుమార్లు జరగడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా మన సంబంధానికి కొత్త, ఆధునిక అంశాలను మనం జోడిస్తున్నాం. 

భారత్‌కు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములలో సౌదీ అరేబియా ఒకటి.

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా మొత్తం ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి మన పరస్పర సహకారం అత్యంత కీలకం. 

మన సన్నిహిత భాగస్వామ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి గౌరవనీయులైన యువరాజుతో జరిగిన నా సమావేశంలో అనేక కార్యక్రమాలను గుర్తించాం.

మానవాళి సంక్షేమం కోసం నిరంతరం కలిసి పనిచేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ మన సంబంధాలకు నేటి సమావేశం కొత్త శక్తి, తాజా దిశను అందిస్తుంది. భారత్, పశ్చిమ ఆసియా, ఐరోపా మధ్య ఆర్థిక కారిడార్‌ను ఏర్పాటు చేసే దిశగా నిన్న మనం ఒక చరిత్రాత్మక ప్రారంభోత్సవాన్ని చేశాం. 

ఈ కారిడార్ కేవలం మన రెండు దేశాలను అనుసంధానించడమే కాకుండా ఆసియా, పశ్చిమ ఆసియా, ఐరోపా మధ్య డిజిటల్ అనుసంధానత, ఇంధన అభివృద్ధి, ఆర్థిక సహకారాన్ని కూడా బలపరుస్తుంది. 

గౌరవనీయులైన యువరాజు గారూ.. మీ నాయకత్వంలో, మీ 'విజన్ 2030' ద్వారా సౌదీ అరేబియా సాధిస్తున్న అద్భుతమైన ఆర్థిక, సామాజిక పురోగతి పట్ల నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 

సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయుల ప్రయోజనాలు, సంక్షేమాన్ని కాపాడటంలో మీ నిబద్ధతకు మేం ఎంతో కృతజ్ఞులం. 

మానవ సంక్షేమం - శ్రేయస్సు, ప్రాంతీయ - ప్రపంచ స్థిరత్వం విషయంలో భారత్, సౌదీ అరేబియా మధ్య స్నేహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 

జీ-20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడానికి అందించిన విలువైన సహకారానికి గాను గౌరవనీయులైన యువరాజ్‌ గారితో పాటు మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

ఇప్పుడు మాట్లాడాల్సిందిగా గౌరవనీయులైన యువరాజు గారిని ఆహ్వానిస్తున్నాను.

 

***


(रिलीज़ आईडी: 2210763) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam