ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్‌లోని నాగపట్నం - శ్రీలంకలోని కంకేసంతురై మధ్య ఫెర్రీ సేవల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
14 OCT 2023 8:21AM by PIB Hyderabad
గౌరవనీయులారా, సోదరీ సోదరులారా... నమస్కారం, ఆయుబోవన్, వణక్కమ్!
మిత్రులారా,
ఈ ముఖ్యమైన సందర్భంలో మీతో పాటు ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు లభించిన ఒక విశేష గౌరవం. భారత్-శ్రీలంక మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాల్లో మనం ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. నాగపట్నం-కంకేసంతురై మధ్య ఫెర్రీ సేవల ప్రారంభం మన సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక కీలక ముందడుగు అవుతుంది.
మిత్రులారా,
భారత్-శ్రీలంక దేశాలు సంస్కృతి, వాణిజ్యం, నాగరికతల లోతైన చరిత్రను పంచుకుంటాయి. నాగపట్నంతో పాటు సమీపంలోని పట్టణాలు శ్రీలంక సహా అనేక దేశాలతో సముద్ర వాణిజ్యానికి చాలా కాలంగా ప్రసిద్ధి చెందాయి. పురాతన తమిళ సాహిత్యంలో చరిత్రాత్మక పూంపుహార్ ఓడరేవు గురించి ప్రధానంగా ప్రస్తావించారు. పట్టినప్పలై, మణిమేకలై వంటి సంగం యుగ సాహిత్యం భారత్-శ్రీలంక మధ్య పడవలు, ఓడల ప్రయాణం గురించి చెబుతుంది. ప్రముఖ కవి సుబ్రమణ్య భారతి తన 'సింధు నదియిన్ మిసై' పాటలో మన రెండు దేశాలను కలిపే వంతెన గురించి అద్భుతంగా వర్ణించారు. ఈ ఫెర్రీ సేవలు ఆ చరిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలన్నింటినీ మరింత ముందుకు తీసుకెళ్తాయి.
మిత్రులారా,
అధ్యక్షుడు విక్రమసింఘే ఇటీవలి పర్యటన సందర్భంలో మా ఆర్థిక భాగస్వామ్యం కోసం మేం ఒక దార్శనిక పత్రాన్ని సంయుక్తంగా ఆమోదించాం. ఈ భాగస్వామ్యంలో అనుసంధానం కీలకాంశం. అనుసంధానం అంటే కేవలం రెండు నగరాలను దగ్గర చేయడం మాత్రమే కాదు... ఇది మన దేశాలను, మన ప్రజలను, మన హృదయాలనూ దగ్గర చేస్తుంది. అనుసంధానం వాణిజ్యం, పర్యాటకంతో పాటు, ప్రజల మధ్య సంబంధాలనూ మెరుగుపరుస్తుంది. ఇది ఇరు దేశాల యువతకు అవకాశాలనూ సృష్టిస్తుంది.
మిత్రులారా,
2015లో నేను శ్రీలంకను సందర్శించిన తర్వాత ఢిల్లీ-కొలంబో మధ్య ప్రత్యక్ష విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత శ్రీలంక నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖుషీనగర్‌కు తొలి అంతర్జాతీయ విమానం ప్రారంభమైంది. చెన్నై-జాఫ్నా మధ్య ప్రత్యక్ష విమాన సేవలూ 2019లో ప్రారంభమయ్యాయి. ఇప్పుడు నాగపట్నం-కంకేసంతురై మధ్య ఫెర్రీ సేవల ప్రారంభం ఈ దిశగా మరో ముఖ్యమైన ముందడుగు.
మిత్రులారా,
అనుసంధానం విషయంలో మా దృక్పథం రవాణా రంగానికి మించి విస్తరించింది. ఫిన్-టెక్, ఇంధనం వంటి బహుళ రంగాల్లోనూ భారత్-శ్రీలంకలు పరస్పర సహకారంతో పనిచేస్తాయి. యూపీఐ కారణంగా భారత్‌లో డిజిటల్ చెల్లింపులు ఒక ప్రజా ఉద్యమంగా, జీవన విధానంగా మారాయి. యూపీఐ, లంకా పే సేవలను అనుసంధానించడం ద్వారా మేం ఫిన్-టెక్ రంగ అనుసంధానం దిశగా పని చేస్తున్నాం. మన ఇరు దేశాల అభివృద్ధి ప్రయాణంలో ఇంధన భద్రత చాలా ముఖ్యమైనది. ఇంధన భద్రత, విశ్వసనీయతను పెంపొందించడానికి మేం మా ఇంధన గ్రిడ్‌లనూ అనుసంధానిస్తున్నాం.
మిత్రులారా,
పురోగతి, అభివృద్ధి కోసం భాగస్వామ్యం... మా ద్వైపాక్షిక సంబంధాలకు అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి. ఎవరూ వెనుకబడిపోకుండా అభివృద్ధిని అందరికీ సమానంగా తీసుకెళ్లడమే మా దార్శనికత. ఈ దార్శనికతకు అనుగుణంగానే శ్రీలంకలో భారత్ సహాయంతో పలు ప్రాజెక్టులు అమలు చేశాం. ఉత్తర ప్రావిన్స్‌లో గృహనిర్మాణం, నీరు, ఆరోగ్యం, జీవనోపాధికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కంకేసంతురై నౌకాశ్రయం అప్‌గ్రేడ్‌కూ మేం మద్దతునివ్వడం సంతోషం కలిగించింది. ఉత్తరం నుంచి దక్షిణానికి అనుసంధానించే రైల్వే లైన్ల పునరుద్ధరణ... ఐకానిక్ జాఫ్నా సాంస్కృతిక కేంద్రం నిర్మాణం... శ్రీలంక అంతటా అత్యవసర అంబులెన్స్ సేవలను ప్రారంభించడం... డిక్ ఓయాలోని మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రి... ఇలా అభివృద్ధి పనులన్నింటి కోసం మేం ‘సబ్కా సాథ్- సబ్కా వికాస్- సబ్కా విశ్వాస్- సబ్కా ప్రయాస్’ దార్శనికతతో పనిచేస్తున్నాం.
మిత్రులారా,
భారత్ ఇటీవలే జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిందని మీ అందరికీ తెలుసు. వసుధైక కుటుంబం అనే మా దృక్పథాన్ని అంతర్జాతీయ సమాజం స్వాగతించింది. పొరుగు దేశాలకు ప్రాధాన్యమివ్వడం, పురోగతిని-శ్రేయస్సును పంచుకోవడం ఈ దృక్పథంలో ఒక భాగం. జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్‌నూ ప్రారంభించాం. ఇది ఒక ముఖ్యమైన కనెక్టివిటీ కారిడార్. ఇది ఈ మొత్తం ప్రాంతంపై భారీ ఆర్థిక ప్రభావాన్ని సృష్టిస్తుంది. మన రెండు దేశాల మధ్య బహుళ-రవాణా అనుసంధానాన్ని మనం బలోపేతం చేస్తున్నందున... శ్రీలంక ప్రజలూ దీని నుంచి ప్రయోజనం పొందుతారు. ఈ రోజు ఫెర్రీ సేవలను విజయవంతంగా ప్రారంభించుకున్న సందర్భంలో గౌరవనీయ శ్రీలంక అధ్యక్షునికి, ప్రభుత్వానికి, ప్రజలకూ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ నాటి ప్రారంభం స్ఫూర్తిగా... రామేశ్వరం-తలైమన్నార్ మధ్య ఫెర్రీ సేవలను తిరిగి ప్రారంభించేందుకూ మేం కృషి చేస్తాం.
మిత్రులారా,
ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం శ్రీలంకతో కలిసి పని చేస్తూ... మా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉంది. ధన్యవాదాలు!
***
(रिलीज़ आईडी: 2210621)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam