రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ప్రజలకు కీలక ఉపశమనాన్ని ప్రకటించిన ఎన్‌హెచ్‌ఏఐ: 2026 ఫిబ్రవరి 1 తర్వాత జారీ చేసే కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ల కోసం కార్లకు కేవైవీ ప్రక్రియ నిలిపివేత
प्रविष्टि तिथि:
01 JAN 2026 4:54PM by PIB Hyderabad
ప్రజల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, రహదారుల వినియోగదారులు ఎదుర్కొంటున్న యాక్టివేషన్ అనంతర సమస్యల్ని తొలగించడానికి కీలక చర్యలు చేపట్టిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ)... 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జారీ చేసే అన్ని కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ల (కారు/జీప్/వ్యాన్ కేటగిరీ ఫాస్ట్‌ట్యాగ్) కోసం 'నో యువర్ వెహికల్' (కేవైవీ) ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించింది.
చెల్లుబాటు అయ్యే వాహన పత్రాలు ఉన్నప్పటికీ... ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్ అనంతర కేవైసీ అవసరాల కారణంగా అసౌకర్యం, జాప్యంతో ఇబ్బందిపడుతున్న లక్షలాది సాధారణ రహదారి వినియోగదారులకు ఈ సంస్కరణ గణనీయ ఉపశమనాన్ని కలిగిస్తుంది.
ఇప్పటికే కార్లకు జారీ చేసిన ఫాస్ట్‌ట్యాగ్‌ల కోసం కేవైవీ ఇకపై తప్పనిసరి కాదు. లూజ్ ఫాస్ట్‌ట్యాగ్‌లు, తప్పుగా జారీ చేసినవి, దుర్వినియోగం చేసినవిగా ఫిర్యాదులు అందిన నిర్దిష్ట సందర్భాల్లో మాత్రమే కేవైవీ అవసరం అవుతుంది. ఎలాంటి ఫిర్యాదులు లేనట్లయితే, ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌లకు ఎలాంటి కేవైవీ అవసరం లేదు.
బలమైన ప్రీ-యాక్టివేషన్ భద్రతా చర్యలు ప్రారంభం
వినియోగదారుల కోసం ఈ ప్రక్రియను సులభతరం చేస్తూ అదే సమయంలో కచ్చితత్వం, సమ్మతి, సాంకేతిక వ్యవస్థ సమగ్రతను నిర్ధారించడానికి ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీచేసే బ్యాంకుల కోసం ప్రీ-యాక్టివేషన్ ధ్రువీకరణ నిబంధనలను ఎన్‌హెచ్ఏఐ మరింత బలోపేతం చేసింది:
· తప్పనిసరి వాహన్ ఆధారిత ధ్రువీకరణ: వాహన్ డేటాబేస్ నుంచి వాహన వివరాలను ధ్రువీకరించిన తర్వాత మాత్రమే ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్‌కు అనుమతి ఉంటుంది.
· యాక్టివేషన్ అనంతర ధ్రువీకరణ లేదు: యాక్టివేషన్ అనంతర ధ్రువీకరణకు అనుమతించే మునుపటి నిబంధనను నిలిపివేశారు.
· అసాధారణ సందర్భాల్లో మాత్రమే ఆర్‌సీ-ఆధారిత ధ్రువీకరణ: వాహన వివరాలు వాహన్‌లో అందుబాటులో లేనప్పుడు, ఫాస్ట్‌ట్యాగ్‌ను జారీచేసే బ్యాంకులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ)ని ఉపయోగించి యాక్టివేషన్‌కు ముందే వివరాలను పూర్తి జవాబుదారీతనంతో ధ్రువీకరించాలి.
· కవర్ అయ్యే ఆన్‌లైన్ ఫాస్ట్‌ట్యాగ్‌లు: ఆన్‌లైన్ ద్వారా విక్రయించే ఫాస్ట్‌ట్యాగ్‌లను కూడా బ్యాంకుల పూర్తి ధ్రువీకరణ తర్వాత మాత్రమే యాక్టివేట్ చేయవచ్చు.
ఈ చర్యలు అన్ని వాహన ధ్రువీకరణలను ముందుగానే పూర్తి చేసేలా చూస్తాయి. ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్ తర్వాత వినియోగదారులతో పదేపదే ఫాలో-అప్ చేయాల్సిన అవసరాన్నీ తొలగిస్తాయి.
అనుమతి ప్రక్రియను బలోపేతం చేయడం, ఫిర్యాదులను తగ్గించడంతో పాటు ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థను పౌరులకు అనుకూలంగా, పారదర్శకంగా, సాంకేతికత ఆధారితంగా పనిచేసేలా చేయడంలో ఎన్‌హెచ్ఏఐ నిరంతర నిబద్ధతను ఈ సంస్కరణలు ప్రతిబింబిస్తాయి. యాక్టివేషన్‌కు ముందు ధ్రువీకరణ బాధ్యతను పూర్తిగా వాటిని జారీచేసే బ్యాంకులకు బదిలీ చేయడం ద్వారా జాతీయ రహదారి వినియోగదారులకు ఇబ్బంది లేని అనుభవాన్ని అందించడం ఎన్‌హెచ్ఏఐ లక్ష్యం.
***
(रिलीज़ आईडी: 2210614)
आगंतुक पटल : 11