కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
చిన్న కంపెనీల పెయిడ్ అప్: షేర్ క్యాపిటల్, టర్నోవర్ గరిష్ట పరిమితులు పెంపు
కంపెనీల (రిజిస్టర్ నుంచి పేర్ల తొలగింపు) నిబంధనలు (2016)ను మారుస్తూ 31 డిసెంబర్, 2025న సవరణలు చేశారు. దీని ద్వారా సెక్షన్ 248(2) కింద ప్రభుత్వ కంపెనీలు తమ పేరును తొలగించుకోవడానికి రిజిస్ట్రార్ సీ-పీఏసీఈకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దీని వల్ల ప్రభుత్వ కంపెనీల మూసివేత ప్రక్రియ వేగవంతం, సులభతరం అవుతుంది
కంపెనీల చట్టం 2013 ప్రకారం ఉన్న వార్షిక కేవైసీ స్థానంలో మూడేళ్లకు ఒకసారి సంక్షిప్త కేవైసీతో భర్తీ
విలీనం, స్వాధీనాల వ్యవస్థలో సంస్కరణలు
ఐఈపీఎఫ్‌ఏ ద్వారా సమగ్ర పోర్టల్, ప్రత్యేక కాల్ సెంటర్ ప్రారంభం
ఎంసీఏ వీ3 వేదికకు సజావుగా మారడానికి అదనపు రుసుములను సడలించడానికి ఫైలింగ్ గడువులను పొడిగించడానికి, వీడియో కాన్ఫరెన్సింగ్ లేదా ఇతర ఆడియో-విజువల్ పద్ధతుల ద్వారా ఏజీఎంలు/ఈజీఎంలు నిర్వహించేందుకు అనుమతించడానికి సాధారణ సర్క్యులర్ల జారీ
దివాలా, దివాలా చట్టం కింద సెప్టెంబర్ 2025 వరకు మొత్తం 1300 పరిష్కార ప్రణాళికలు ఆమోదం... రుణదాతలు మొత్తం రూ. 3.99 లక్షల కోట్లు వసూలు... ఇది లిక్విడేషన్ విలువతో పోలిస్తే 170.09%, సరసమైన విలువలో 93.79 శాతానికి సమానం
2026 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా చండీగఢ్, నవీ ముంబై, బెంగళూరులో 3 కొత్త ప్రాంతీయ డైరెక్టరేట్లు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, నోయిడా, నాగ్‌పూర్, చండీగఢ్‌లో 6 కొత్త రిజిస్ట్రార్ కంపెనీలు ఏర్పాటు
प्रविष्टि तिथि:
01 JAN 2026 2:13PM by PIB Hyderabad
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2025లో చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు, సాధించిన విజయాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
విలీనాలు, స్వాధీనాల వ్యవస్థలో సంస్కరణలు
కేంద్ర బడ్జెట్ 2025–26లోని పారా 101కు అనుగుణంగా కంపెనీలు (సర్దుబాట్లు, ఏర్పాటు, విలీనాలు) నిబంధనలు (2016)ను ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 4న సవరించింది.
ఈ సవరణల ద్వారా కంపెనీల చట్టం 2013 లోని సెక్షన్ 233 కింద కంపెనీల విలీనాలు, విడిపోయే ప్రక్రియల పరిధిని విస్తరించారు.
ఈ సవరణల ప్రకారం కింద వివరించిన అదనపు కంపెనీలు ఫాస్ట్ ట్రాక్ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు.
· నిర్దేశిత పరిమితులను పాటించే రెండు లేదా అంతకంటే ఎక్కువ జాబితా కాని కంపెనీలు (సెక్షన్ 8 కంపెనీలు మినహాయించి).
· ప్రధాన సంస్థ, అనుబంధ సంస్థల వీలినం.. అయితే బదిలీ చేసే సంస్థ లిస్టెడ్ కంపెనీ అయి ఉండకూడదు.
· ఒకే మాతృ సంస్థకు చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ అనుబంధ సంస్థలు ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే బదిలీ చేసే సంస్థ లిస్టెడ్ కంపెనీ అయి ఉండకూడదు.
ఈ మార్పులు కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో సమయం, ఖర్చును గణనీయంగా తగ్గిస్తాయని భావిస్తున్నారు.
భారత్‌లో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి, నిబంధనల అమలును సులభతరం చేయడానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2025లో అనేక విధాన, నియంత్రణ, సంస్థాగత, సాంకేతిక కార్యక్రమాలను చేపట్టింది. వాటిలో
1. నిబంధనల నోటిఫికేషన్
2025లో నిబంధనలను హేతుబద్ధీకరించడం, కంపెనీల పనితీరులో పారదర్శకతను పెంచడం కోసం కంపెనీల చట్టం 2013 కింద ఉన్న పలు నిబంధనలను మంత్రిత్వ శాఖ సమీక్షించి, సవరణలను ప్రకటించింది.
2. జారీ చేసిన సర్క్యులర్లు
ఎంసీఏ వీ3 పోర్టల్‌కు మారే సమయంలో కంపెనీలకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడానికి మంత్రిత్వ శాఖ పలు జనరల్ సర్క్యులర్లను జారీ చేసింది. కొత్త సాంకేతిక పోర్టల్‌లోకి సులభంగా మారడానికి వెసులుబాటు కల్పించారు. అదనపు రుసుములను సడలించడానికి దాఖలు చేసే గడువును పొడిగించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ లేదా ఇతర ఆడియో విజువల్ సాధనాల ద్వారా వార్షిక సాధారణ సమావేశాలు, అసాధారణ సాధారణ సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతిని కొనసాగించారు.ఈ చర్యలు పరివర్తన దశలో కంపెనీలపై ఉన్న భారాన్ని గణనీయంగా తగ్గించాయి.
3. డిసెంబర్ 1, 2025న విడుదల చేసిన ఎంసీఏ నోటిఫికేషన్ నెంబర్ (జీఎస్‌ఆర్ 880(ఈ) ద్వారా చిన్న కంపెనీల షేర్ క్యాపిటల్ పరిమితిని రూ. 10 కోట్ల వరకు, టర్నోవర్ పరిమితిని రూ. 100 కోట్ల వరకు పెంచారు.
4. ప్రభుత్వ కంపెనీల మూసివేత ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ 31 డిసెంబర్ 2025న కంపెనీల (రిజిస్టర్ నుంచి పేర్ల తొలగింపు) నిబంధనలు 2016లో సవరణలు చేశారు. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 248(2) ప్రకారం కార్యకలాపాలు లేని కంపెనీలు తమ పేరును తొలగించుకోవడానికి రిజిస్ట్రార్ సీ-పీఏసీఈకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ సవరణ ప్రకారం సాధారణంగా కంపెనీని మూసివేసేటప్పుడు డైరెక్టర్లు వ్యక్తిగత బాధ్యతతో కూడిన ఇండెమ్నిటీ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన లేదా నామినేట్ చేసిన డైరెక్టర్ల విషయంలో ఒక మినహాయింపు ఇచ్చారు. ఆయా డైరెక్టర్ల తరపున సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ లేదా రాష్ట్ర ప్రభుత్వ విభాగంలోని ఒక అధికార ప్రతినిధి కంపెనీ తరపున ఈ ఇండెమ్నిటీ బాండ్‌ను సమర్పించవచ్చు. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 248(2) నిబంధనల ప్రకారం కంపెనీల రిజిస్టర్ నుంచి తమ పేర్లను తొలగించుకోవడానికి అర్హత ఉన్న ప్రభుత్వ కంపెనీలను వేగంగా మూసివేయడమే ఈ సవరణ లక్ష్యం.
5. కంపెనీల (డైరెక్టర్ల నియామకం, అర్హతలు) నియమాలు 2014 లోని నిబంధన 1 కింద కంపెనీల డైరెక్టర్లకు వర్తించే వార్షిక కేవైసీ అవసరాన్ని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జరిగిన పరిశీలన, ఆర్థికేతర నియంత్రణ సంబంధిత సంస్కరణలపై ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులు, వాటాదారుల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా సమీక్షించారు. ఈ విషయంలో సంబంధించిన మంత్రిత్వ శాఖలు/విభాగాలతో సంప్రదింపులు జరిపి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంబంధిత నిబంధనలను సవరించింది. 2025 డిసెంబర్ 31న నోటిఫై చేసిన నిబంధనల సవరణ (2026 మార్చి 31 నుంచి అమల్లోకి వస్తుంది) ప్రకారం ఇప్పటివరకు ఉన్న వార్షిక కేవైసీ దాఖలు అవసరాన్ని రద్దు చేసి, మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చేయాల్సిన సరళమైన కేవైసీ సమాచారంతో భర్తీ చేశారు.ఈ సవరణ ద్వారా అన్ని కంపెనీల డైరెక్టర్లకు నిబంధనలు పాటించడంలో గణనీయమైన సౌలభ్యాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్‌ఏ) సాధించిన విజయాలు
2025 ఆగస్టులో వేగవంతమైన దావా పరిష్కారం, మెరుగైన పెట్టుబడిదారుల సహాయాన్ని అందించేందుకు ఐఈపీఎఫ్‌ఏ ఒక సమగ్ర పోర్టల్, ప్రత్యేక కాల్ సెంటర్‌ను ప్రారంభించింది.
· ఎంసీఏ-21, ఎన్‌ఎస్‌డీఎల్/సీడీఎస్‌ఎల్, పీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థలను ఒకే స్వయంచాలిత కార్యప్రవాహంలో సమగ్రపరుస్తుంది. దీని వల్ల షేర్లు, డివిడెండ్ల బదిలీకి ఆమోదం తర్వాత పట్టే సమయం కొన్ని నెలల నుంచి కేవలం ఒకటి రెండు రోజులకు తగ్గిస్తుంది.
· ఈ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 24,026కు పైగా దావాలు ఆమోదం పొందాయి. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆమోదిత దావాల సంఖ్య 27,231కి పెరిగింది.
· రీ-నోటిఫైడ్ ఫారం ఐఈపీఎఫ్-5, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ రిపోర్టును 2025 అక్టోబర్ 6 న ప్రవేశపెట్టారు. ఇది బ్యాంకు వివరాలు స్వయంచాలకంగా పొందడం, వాటాదారుల సమాచారాన్ని ముందుగానే ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది.
· ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడిదారుల సహాయం మరింత వేగంగా అందుతుంది.
ఈ సంస్కరణలతో దావాల పరిష్కార ప్రక్రియ పూర్తిగా డిజిటల్, పారదర్శక, పెట్టుబడిదారులకు అనుకూలమైన వ్యవస్థగా మారింది.
దివాలా, రుణాల పరిష్కార చట్టం 2016 ద్వారా సాధించిన విజయాలు, సంస్కరణలు
కాలపరిమితులను తగ్గించడానికి, విలువను గరిష్ఠంగా పెంచడానికి,పాలనను బలోపేతం చేయడానికి దివాలా, రుణ పరిష్కార చట్టం (సవరణ) బిల్లు 2025ను ఆగస్టు 12న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రుణదాతలు ప్రారంభించే దివాలా ప్రక్రియ, గ్రూప్ దివాలా, సరిహద్దులు దాటిన దివాలా ప్రక్రియల కోసం కూడా విధివిధానాలను ప్రతిపాదిస్తుంది. ప్రస్తుతం ఈ బిల్లు లోక్‌సభ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉంది.
2025 సెప్టెంబర్ వరకు ఈ చట్టం కింద మొత్తం 1300 పరిష్కార ప్రణాళికలు ఆమోదం పొందాయి. దీని ద్వారా రుణదాతలు రూ. 3.99 లక్షల కోట్లు రాబట్టుకున్నారు. ఇది ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే విలువతో పోలిస్తే 170.09 శాతం, ఫెయిర్ విలువకు 93.79 శాతానికి సమానం.ఆస్తుల ఫెయిర్ విలువతో పోలిస్తే రుణదాతల నష్టం సుమారు 6 శాతం కాగా, వారు అంగీకరించిన దావాలతో పోలిస్తే ఇది సుమారు 67 శాతంగా ఉంది.
సాంకేతిక ఆధారిత సంస్కరణల్లో ప్రధానంగా దివాలా, రుణ పరిష్కార చట్టం కోసం ప్రభుత్వం ఏకీకృత డిజిటల్ వేదికను ప్రస్తుతం అభివృద్ధి చేస్తోంది. దివాలా పరిష్కార ప్రక్రియలో పాల్గొనే అన్ని కీలక సంస్థలను ఒకే వ్యవస్థకు కిందకు తీసుకురావడం దీని ముఖ్య లక్ష్యం. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ), ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), ఇన్ఫర్మేషన్ యుటిలిటీస్ (ఐయూఎస్), ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ (ఐపీఎస్) వంటి ప్రధాన సంస్థలు ఉన్నాయి. ఈ సమగ్ర సాంకేతిక వేదిక ద్వారా సమన్వయం, పారదర్శకత, డేటా అందుబాటు, ప్రక్రియ సమర్థత, దివాలా విలువ వ్యవస్త గణనీయంగా మెరుగుపడనుంది. తద్వారా వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని మెరుగుపరచడం, రుణదాతల నమ్మకాన్ని బలోపేతం చేయడం సాధ్యమవుతుంది.
ఈ విషయంలో ఐపీఐఈ ప్రాజెక్టు కోసం ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌ను 16 డిసెంబర్ 2025న ప్రారంభించారు. అలాగే సిస్టమ్ ఇంటిగ్రేటర్ ఎంపిక కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) జారీ చేశారు. ఆర్‌ఎఫ్‌పీకి ప్రతిస్పందనగా వచ్చిన సాంకేతిక బిడ్‌ల పరిశీలన ప్రస్తుతం జరుగుతోంది.
ఈ సంస్కరణలు, ముఖ్యంగా దివాలా వ్యవస్థ డిజిటల్ ఏకీకరణ, వ్యాపారాలకు రుణ లభ్యతను మెరుగుపరుస్తాయి. లావాదేవీ ఖర్చులను తగ్గించి, వేగవంతమైన మరింత అంచవేయదగిన ఫలితాలను నిర్ధరిస్తాయి. ఈ చర్యలు భారత్‌ను వ్యాపారాన్ని సులభతరం చేయడంలో ప్రపంచ స్థాయిలో ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వ ప్రభుత్వ నిబద్ధతను పునరుద్దరించనున్నాయి.
పోటీ చట్టం విజయాలు
యాంటీట్రస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్: కొత్తగా 35 యాంటీట్రస్ట్ కేసులు నమోదు అయ్యాయి. గతంలో ఉన్న, కొత్తగా వచ్చిన కేసుల్లో కలిపి మొత్తం 19 కేసులను విచారించిన భారత పోటీ కమిషన్ తుది తీర్పునిచ్చింది.
విలీనాలు, స్వాధీనం: కంపెనీల విలీనం లేదా స్వాధీనానికి సంబంధించి మొత్తం 76 కాంబినేషన్ నోటీసులు దాఖలయ్యాయి. వేగవంతమైన విచారణ ద్వారా 78 నోటీసులను పరిష్కరించారు.
కృత్రిమ మేధపై మార్కెట్ అధ్యయనం: కృత్రిమ మేధ, ఇంటెలిజెన్స్, పోటీపై మార్కెట్ అధ్యయాన్ని భారత పోటీ కమిషన్ అక్టోబర్ 6, 2025న విడుదల చేసింది. ఈ అధ్యయనం ఏఐ మార్కెట్ నిర్మాణాలు, ధోరణులు, పోటీ సంబంధిత సమస్యలపై లోతైన అవగాహన అందిస్తుంది.
అడ్వకేసీ, సామర్థ్య పెంపు: పోటీ చట్టం, ప్రభుత్వ కొనుగోళ్లపై రాష్ట్రస్థాయి నిపుణుల ద్వారా మొత్తం 108 అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా సాధించిన విజయాలు
2024–25 బడ్జెట్‌లో ప్రకటించిన ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం.. ఐదు సంవత్సరాల్లో కోటి కంటే ఎక్కువ ఇంటర్న్‌షిప్‌లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
· 2024 అక్టోబర్‌లో ఈ పథకం ప్రయోగాత్మక దశ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న యువత నుంచి విశేష స్పందన లభించింది. రెండు రౌండ్లలో కలిపి మొత్తం 7.3 లక్షల మంది అభ్యర్థులు తమ ప్రొఫైల్‌లను పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు.
· వివిధ ప్రముఖ కంపెనీల నుంచి మొత్తం 1.65 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలు ప్రకటించారు. ఫలితంగా దాదాపు 16,000 మంది యువత ఇంటర్న్‌షిప్‌లలో చేరారు. అక్టోబర్ 2024 నుంచి ఇప్పటివరకు సుమారు 16,000 మంది యువత విజయవంతంగా తమ ఇంటర్న్‌షిప్‌లలో చేరి శిక్షణను ప్రారంబించారు.
· ఇంటర్న్‌లకు ప్రతి నెలకు రూ. 5,000 స్టైపెండ్‌ను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. వీటితోపాటు ఇంటర్న్‌షిప్‌లో చేరినప్పుడు అయ్యే ఇతర ఖర్చుల కోసం ఒకేసారి రూ. 6,000 అదనపు నగదు సహాయం అందిస్తారు.
· ఇంటర్న్‌లకు ప్రభుత్వం ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తుంది. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన రెండూ పొందుతారు.
· అందరినీ కలుపుకొని పోయేలా రూపొందించిన ఈ పథకం 12 నెలల పాటు సాగే పకడ్బందీ శిక్షణా కార్యక్రమం. 25 రంగాల్లో ఇంటర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆటోమోబైల్స్, పర్యాటక రంగం, బ్యాంకింగ్, తయారీ రంగం, నిత్యవసర వస్తువుల రంగంతోపాటు మరిన్ని ఉన్నాయి.
సంస్థాగత మౌలిక సదుపాయాల బలోపేతం
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన పరిధిని విస్తరించడానికి, సేవలను మరింత వేగంగా అందించడానికి 1 జనవరి 2026 నుండి కొత్త కార్యాలయాలను ప్రారంభించనుంది. చండీగఢ్, నవీ ముంబై, బెంగళూరు నగరాల్లో 3 కొత్త ప్రాంతీయ డైరెక్టరేట్లను.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, నోయిడా, నాగ్‌పూర్, చండీగఢ్‌లలో 6 కొత్త రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలను ప్రారంభిస్తోంది. ఈ కార్యాలయాలను కార్పొరేట్ సంస్థల సంఖ్యలో వేగంగా పెరుగుతున్న వృద్ధి, భవిష్యత్తు నియంత్రణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేశారు.
***
(रिलीज़ आईडी: 2210613)
आगंतुक पटल : 8