ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్ణాటకలోని బెళగావిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, పీఎం-కిసాన్ 13వ విడత విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 27 FEB 2023 8:25PM by PIB Hyderabad

భారత్ మాతాకీ - జై!

భారత్ మాతాకీ - జై!

నమస్కారం, సబ్‌కా సాథ్ సబ్ కా వికాస్ మంత్రానికి స్ఫూర్తి అయిన భగవాన్ బసవేశ్వరునికి నమస్కారాలు.

బెళగాం కుంద, బెళగావి ప్రజల ప్రేమ ఈ రెండూ ఎప్పటికీ మరచిపోలేని మధురమైనవి. బెల్గాంలోని నా సోదరీసోదరులందరరికీ నమస్కారం.

బెళగావి ప్రజలు అందించే ప్రేమ, ఆశీర్వాదాలు సాటి లేనివి. ఈ ప్రేమ, ఆశీర్వాదాలే.. రేయింబవళ్లూ మీకు సేవ చేసేలా మాకు స్ఫూర్తినిస్తున్నాయి. మీ ఆశీర్వాదాలే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. బెళగావికి రావడం తీర్థయాత్రకు వెళ్లడం లాంటిదే. ఇది కిత్తూరు రాణి చెన్నమ్మ, క్రాంతివీర సంగోళ్లి రాయన్నల భూమి ఇది. వారి ధైర్యాన్ని, బానిసత్వానికి వ్యతిరేకంగా వినిపించిన వారి స్వరాన్ని ఈ దేశం ఇప్పటికీ స్మరించుకుంటోంది.

స్నేహితులారా, భారత స్వాతంత్ర్య ఉద్యమంలోనైనా లేదా ఆ తర్వాత భారత దేశ ‘నవనిర్మాణ్’లో అయినా.. బెళగావి కీలకపాత్ర పోషించింది. ఇటీవలి కాలంలో కర్ణాటకలోని అంకుర సంస్థల గురించి బాగా చర్చ జరుగుతోంది. కానీ, 100 ఏళ్ల క్రితమే బెళగావిలో అంకుర సంస్థలు ప్రాంరభమయ్యాయి. అవును 100 ఏళ్ల క్రితం! మీకు దాని గురించి గుర్తు చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. వందేళ్ల క్రితం శ్రీ బాబూరావు పుసల్కర్ ఇక్కడ ఓ చిన్న సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది వివిధ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మారింది. ఈ దశాబ్దంలో డబుల్ ఇంజిన్ సర్కార్ బెళగావి పాత్రను మరింత బలోపేతం చేయాలనుకుంటోంది.

సోదరీసోదరులారా, ఈ రోజు ప్రారంభించిన లేదా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు బెళగావి అభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి. రవాణా సౌకర్యాలు, నీటి సరఫరాకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు వందల కోట్ల రూపాయల విలువైనవి. ఈ సందర్భంగా, ఈ ప్రాంత వృద్ధిని వేగవంతం చేసే ఈ అభివృద్ధి ప్రణాళికలన్నింటికీ సంబంధించి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఈ రోజు, బెళగావి నుంచి దేశమంతా ఓ బహుమతిని పొందింది. ఈ రోజు దేశంలోని ప్రతి రైతు కర్ణాటకలోని బెళగావితో అనుసంధానమయ్యారు. ఎందుకంటే, ఈ రోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన మరో విడతను ఇక్కడి నుంచే విడుదల చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్క బటన్ నొక్కితే రూ. 16,000 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి.

ఇక్కడ కూర్చున్న నా రైతు బంధు సోదరుల మొబైల్ ఫోన్లకు సందేశం వచ్చి ఉండాలి. ఎలాంటి మధ్యవర్తులు, అవినీతి లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇంత పెద్ద మొత్తంలో రూ. 16,000 కోట్లు క్షణంలో ఎలా జమ అవుతాయని ఈ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. కేంద్ర ప్రభుత్వం రూపాయి పంపితే లబ్ధిదారులకు చేరేది 15 పైసలేనని అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి చెప్పారు. అదే రూ.16,000 కోట్లు అయితే అందులో 12,000 – 13,000 కోట్ల రూపాయలు ఎక్కడో ఓ చోట మాయమైపోయి ఉండేవని మీరు ఊహించుకోవచ్చు. కానీ ఇది మోదీ ప్రభుత్వం. ప్రతి పైసా మీకు చెందినదే, మీదే! కర్ణాటకతో సహా దేశంలోని రైతు సోదరీసోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది హోలీ పర్వదినానికి ముందు రైతులకు అందిస్తున్న పండగ కానుక.

సోదరీసోదరులారా,

మారుతున్న నేటి భారత దేశం.. అభివృద్ధిలో ముందుకు సాగుతూనే.. అణగారిన ప్రతి వ్యక్తికీ ప్రాధాన్యమిస్తుంది. దశాబ్దాల తరబడి మన దేశంలో చిన్నకారు రైతులు నిర్లక్ష్యానికి గురయ్యారు. భారత దేశంలో 80-85 శాతం మంది చిన్నకారు రైతులు ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు వీరికి ప్రాధాన్యమిస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇప్పటి వరకు చిన్నకారు రైతుల బ్యాంకు ఖాతాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. 2.5 లక్షల కోట్ల రూపాయలు! వీటిలో 50,000 కోట్ల రూపాయలకు పైగా సాగుతో సంబంధం ఉన్న తల్లులు, ఆడపడుచుల ఖాతాలకు బదిలీ అయ్యాయి. రైతుల చిన్న చిన్న అవసరాలను ఈ డబ్బు తీరుస్తోంది. ఇప్పుడు వారు ఖర్చుల కోసం ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. లేదా వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు.

మిత్రులారా,

2014 నుంచి వ్యవసాయంలో అర్థవంతమైన మార్పు దిశగా ఈ దేశం ముందుకు వెళుతోంది. ఆధునికతతో వ్యవసాయాన్ని బీజేపీ ప్రభుత్వం అనుసంధానిస్తోంది. భవిష్యత్తుకు తగినట్టుగా వ్యవసాయ రంగాన్ని సిద్ధం చేస్తోంది. 2014లో దేశానికి సేవ చేసే అవకాశం మాకు లభించినప్పుడు వ్యవసాయ బడ్జెట్ రూ. 25,000 కోట్లు ఉంది. ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయానికి ఎంత కేటాయించామో మీకు గుర్తుందా? మీకు గుర్తుందా? గట్టిగా చెప్పండి, మీకు గుర్తుందా? చూడండి, 2014లో మీరు మాకు అవకాశం ఇచ్చే నాటికి వ్యవసాయ బడ్జెట్ రూ.25,000 కోట్లు. ఎంత? రూ. 25,000 కోట్లు! ప్రస్తుతం మన వ్యవసాయ బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్లకు పైమాటే. అంటే అయిదు రెట్లు పెరిగింది. ఇది రైతులకు సాయం చేయడంలో బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని, స్పందించే వేగాన్ని తెలియజేస్తుంది. రైతులకు ప్రయోజనం అందించే సాంకేతికతపై కూడా మేం దృష్టి సారించాం.

జన్ ధన్ బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్లు, ఆధార్ లేకపోతే ఇది సాధ్యమయ్యేదా? అనేక మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను మా ప్రభుత్వం అందిస్తోంది. బ్యాంకుల నుంచి రైతులకు ఎల్లప్పుడూ సాయం అందించే సౌకర్యాలను కల్పించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. స్నేహితులారా, ప్రస్తుత వ్యవసాయ స్థితిని అలాగే భవిష్యత్తు అవసరాలను ఈ ఏడాది బడ్జెట్ తెలియజేస్తుంది.

వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడానికి, చిన్నకారు రైతులను వ్యవస్థీకరించడానికి తక్షణమే నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే.. ఈ ఏడాది బడ్జెట్లో వందల కొద్దీ గిడ్డంగులను ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యమిచ్చాం. వీటితో పాటుగా, సహకార సంఘాలను విస్తరించడంపై గతంలో ఎన్నడూ లేని విధంగా దృష్టి సారించాం. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు సైతం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. సహజ వ్యవసాయం రైతుల సాగు వ్యయాన్ని తగ్గిస్తుంది. సహజ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఎరువులు, పురుగుమందులే. ఈ విషయంలో రైతులకు సహాయం చేసేందుకు వేల సంఖ్యలో సహాయ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. రసాయన ఎరువులు వ్యవసాయ ఖర్చులను పెంచుతాయి. పీఎం- ప్రణామ్ పథకాన్ని మనం ఇప్పుడు ప్రారంభించాం. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించడంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అదనపు తోడ్పాటు లభిస్తుంది. సోదరీసోదరులారా, భవిష్యత్తులో దేశంలో వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నూతనోత్తేజాన్ని అందించాలనే అంకితభావంతో మేం ఉన్నాం.

వాతావరణ మార్పుల కారణంగా రైతులు ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కాబట్టి, మన పురాతన సంప్రదాయాల బలాన్ని మనం తిరిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రుతువునైనా, ఏ పరిస్థితినైనా మన చిరుధాన్యాలు తట్టుకోగలవు. ఈ చిరుధాన్యాల్లో చాలా పోషకాలుంటాయి. అందుకే ఈ ఏడాది బడ్జెట్లో ఈ చిరుధాన్యాలకు శ్రీ అన్న అనే కొత్త గుర్తింపును ఇచ్చాం. ఈ శ్రీ అన్న విషయంలో కర్ణాటక ప్రపంచంలోనే ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఇక్కడ శ్రీ అన్నను సిరి ధాన్యంగా పిలుస్తారు. ఇక్కడ విభిన్న రకాల శ్రీ అన్నను రైతులు సాగు చేస్తున్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో రైతులకు సాయం చేస్తుంది. శ్రీ అన్నను ప్రోత్సహించడానికి రైతు బంధు యడియూరప్ప చేపట్టిన భారీ కార్యక్రమం నాకు గుర్తుంది. ఇప్పుడు ఈ శ్రీ అన్నను అంతర్జాతీయంగా తీసుకెళ్లాలి. శ్రీ అన్న సాగుకయ్యే ఖర్చు తక్కువ. నీటి వినియోగం కూడా తక్కువే ఉంటుంది. అంటే, ఇది చిన్నకారు రైతులకు రెట్టింపు ప్రయోజనాలను అందిస్తుంది.

స్నేహితులారా,

ఈ ప్రాంతంలో చెరకు సమృద్ధిగా ఉత్పత్తి అవుతోంది. చెరకు రైతుల ప్రయోజనాలకు బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తుంది. ఈ ఏడాది బడ్జెట్లో చెరకు రైతులకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. 2016-17కు ముందు చక్కెర సహకార సంఘాలు చేసిన చెల్లింపులకు పన్ను మినహాయింపులు ఇచ్చాం. ఫలితంగా, గత యూపీఏ ప్రభుత్వం వేసిన రూ.10,000 కోట్ల భారం నుంచి చక్కెర సహకార సంఘాలు ఉపశమనం పొందుతాయి. ఇథనాల్ ఉత్పత్తిపై మా ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మీ అందరికీ తెలుసు. ఇథనాల్ ఉత్పత్తి పెరగితే.. చెరకు రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. గడచిన తొమ్మిదేళ్లలో పెట్రోల్లో ఇథనాల్ కలపడం 1.5 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. ఇప్పుడు దీనిని 20 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ దిశగా దేశం ముందుకెళుతూ ఉంటే.. మన చెరకు రైతుల ఆదాయం అంతగా పెరుగుతుంది.

సోదరీసోదరులారా, వ్యవసాయం, పరిశ్రమవలు, పర్యాటకం, విద్యారంగాల్లో మెరుగైన రవాణా సదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే, గత కొన్ని సంవత్సరాలుగా కర్ణాటకలో అనుసంధానతపై మేం దృష్టి సారించాం. 2014కు ముందు అయిదేళ్లలో కర్ణాటకలో రైల్వేల కోసం కేటాయించిన మొత్తం బడ్జెట్ రూ.4,000 కోట్ల రూపాయలు. ఈ ఏడాది కర్ణాటకలో రైల్వేల కోసం రూ. 7,500 కోట్ల రూపాయలు కేటాయించాం. ప్రస్తుతం కర్ణాటకలో రూ.45,000 కోట్ల రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా కర్ణాటకలో ఎంత మందికి ఉపాధి లభిస్తుందో మీరు ఊహించుకోవచ్చు.

బెళగావిలో ఆధునిక రైల్వే స్టేషన్ అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా గర్వపడేలా చేస్తోంది. ఆధునిక రైల్వే స్టేషన్ వల్ల సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా.. రైల్వేలపై ప్రజల విశ్వాసం కూడా పెరుగుతోంది. గతంలో, విదేశాల్లో మాత్రమే ఇలాంటి గొప్ప రైల్వే స్టేషన్లను ప్రజలు చూసేవారు. ఇప్పుడు భారత్‌లో కూడా అలాంటి స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం. కర్ణాటకలోని అనేక రైల్వే స్టేషన్లు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. లోండా-ఘటప్రభ లైనును డబ్లింగ్ చేయడం ద్వారా ప్రయాణం వేగవంతం, సులభతరమవుతుంది. అదేవిధంగా, ఈ రోజు ప్రారంభమైన కొత్త రైల్వే లైన్లు కూడా ఈ ప్రాంతంలో రైల్వే వ్యవస్థను బలోపేతం చేస్తాయి. విద్య, ఆరోగ్యం, పర్యాటకానికి బెళగావి ప్రధాన కేంద్రంగా ఉంది. కాబట్టి.. ఈ రంగాలు మెరుగైన రైలు సదుపాయాల నుంచి ప్రయోజనం పొందుతాయి.

సోదరీసోదరులారా, వేగవంతమైన అభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం హామీ ఇస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చెప్పడానికి జల్ జీవన్ మిషన్ ఓ ఉదాహరణగా నిలుస్తుంది. 2019 నాటికి కర్ణాటకలో 25 శాతం ఇళ్లకు మాత్రమే కుళాయి నీటి సౌకర్యం ఉండేది. ఇప్పడు అది 60 శాతానికి పెరిగింది. దీనికి ముఖ్యమంత్రి, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేస్తున్న క్రియాశీలక ప్రయత్నాలే కారణం. బెళగావిలో కూడా 2 లక్షల లోపు ఇళ్లకే కుళాయి నీటి సౌకర్యం ఉండేది. ఇప్పడు ఆ సంఖ్య 4.5 లక్షలను దాటింది. నీటి కోసం మన గ్రామీణ సోదరీమణులు ఇబ్బంది పడకుండా ఈ ఏడాది బడ్జెట్లో తాగునీరు అందించేందుకు రూ.60,000 కోట్లను కేటాయించాం.

సోదరీసోదరులారా, గత ప్రభుత్వాలు విస్మరించిన సమాజంలోని ప్రతి చిన్న వర్గాన్ని సాధికారపరచడంలో బీజేపీ ప్రభుత్వం నిమగ్నమై ఉంది. కళాకారులు, చేతివృత్తి నిపుణుల నగరం బెళగావి. ఇది వేణుగ్రామ్ అంటే వెదురు గ్రామంగా పేరుగాంచింది. గత ప్రభుత్వాలు చాలా కాలం ఈ వెదురు సాగును నిషేధించడం మీకు గుర్తుండే ఉంటుంది. మేము ఈ చట్టాన్ని మార్చి.. వెదురు సాగును, వ్యాపారానికి ద్వారాలు తెరిచాం. ఇది వెదురు పని చేసే కళాకారులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చింది. వెదురుతో పాటు ఇతర హస్తకళలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాంటి మిత్రుల కోసం ఈ ఏడాది బడ్జెట్లో మొదటిసారిగా పీఎం విశ్వకర్మ యోజనను తీసుకొచ్చాం. ఈ మిత్రులకు అన్ని విధాలా ఈ పథకం సాయం చేస్తుంది.

స్నేహితులారా, ఈ రోజు బెళగావికి వచ్చిన నేను.. మరో సమస్య గురించి నేను కచ్చితంగా ప్రస్తావించదలుచుకున్నాను. కర్ణాటకను కాంగ్రెస్ ఎలా ద్వేషించేదో మీకు గుర్తు చేస్తున్నాను. కర్ణాటక నాయకులను అవమానించడం కాంగ్రెస్ పాత సంప్రదాయాల్లో ఓ భాగం. కాంగ్రెస్‌ ప్రత్యేక కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించిన వారికి ఆ పార్టీలోనే అవమానాలు ఎదురవుతాయి.

ఎస్ నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్ లాంటి కాంగ్రెస్ నాయకులను ఆ పార్టీ ఎలా అవమానించిందో చరిత్ర చెబుతుంది. కర్ణాటక ప్రజలకు దీని గురించి తెలుసు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ ప్రత్యేక కుటుంబం ముందు మరో కర్ణాటక నేత అవమానాలకు గురవుతున్నారు. స్నేహితులారా, 50 ఏళ్ల రాజకీయానుభవం ఉన్న కర్ణాటక పుత్రుడు శ్రీ మల్లిఖార్జున ఖర్గే అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ప్రజలకు సేవ చేసేందుకు ఆయన అన్ని రకాలుగా ప్రయత్నించారు. కానీ, చత్తీస్‌గఢ్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాజకీయాల్లో సుదీర్ఘానుభవం ఉన్న శ్రీ ఖర్గే పట్ల వ్యవహరించిన తీరు చూస్తే నాకు బాధ కలుగుతోంది. ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు కూడా. ఆ రోజు ఎండ ప్రభావం పడకుండా పెద్దవారు, సీనియర్ అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన శ్రీ ఖర్గేకు గొడుగు ఏర్పాటు చేయలేదు. కానీ ఆయన పక్కనే ఉన్న మరో వ్యక్తికి మాత్రం గొడుగు పట్టారు.

కాంగ్రెస్ పార్టీకి ఖర్గేజీ అధ్యక్షడు అయి ఉండొచ్చు. కానీ ఆయనకు ఎలాంటి మర్యాదనిస్తున్నారో, పార్టీ రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉందో ప్రపంచం మొత్తం చూస్తోంది. ప్రస్తుతం చాలా పార్టీలు ఇదే తరహా బంధుప్రీితి కోర్లలో చిక్కుకొని ఉన్నాయి. కాబట్టి, కర్ణాటక ప్రజలు సైతం కాంగ్రెస్ లాంటి పార్టీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాంగ్రెస్ వారికి మోదీ బతికున్నంత వరకు ఏమీ చేయలేమనే అసహనం ఉంది. అందుకే వారు ‘‘మోదీ చచ్చిపోవాలి, మోదీ చచ్చిపోవాలి’’ అని నినాదాలిస్తున్నారు. కొంత మంది నా సమాధిని తవ్వే పనిలో నిమగ్నమై ఉన్నారు. వారు ‘‘మోదీ మీ సమాధి తవ్వుతాం, మీ సమాది తవ్వుతాం’’ అంటున్నారు. అయితే, ఈ దేశం మాత్రం ‘మోదీ మీ కమలం వికసిస్తుంది’’ అని చెబుతోంది.

స్నేహితులారా, మంచి ఉద్దేశంతో పని చేస్తేనే సరైన అభివృద్ధి జరుగుతుంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉద్దేశం కూడా నిజమైనదే. అభివృద్ధి పట్ల దాని అంకితభావం దృఢంగా ఉంది. ఈ విశ్వాసాన్ని మేం కొనసాగిస్తాం. కర్ణాటక, దేశాభివృద్ధిని వేగవంతం చేసే దిశగా మనం ముందుకు సాగాలి. ‘సబ్ కా ప్రయాస్’ (సమష్టి కృషి)తో దేశాన్ని అభివృద్ధి చేయాలనే కలను సాకారం చేసుకుందాం. నేను ఈ కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా వచ్చాను. హెలికాప్టర్ దిగినప్పటి నుంచి బెళగావికి వచ్చే దారి పొడవునా తల్లులు, అక్కాచెల్లెళ్లు, పెద్దలు, చిన్నారులందరూ నన్ను స్వాగతించడం అపురూపమైన దృశ్యం.

ఈ ప్రేమకు బెళగావి, కర్ణాటక ప్రజలకు శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కర్ణాటకలో నా పర్యటన ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఈ ఉదయం శివమొగ్గలో విమానాశ్రయాన్ని ప్రారంభించాను. అలాగే అక్కడ కర్ణాటక ప్రజలతో ముచ్చటించే అవకాశం నాకు లభించింది. అదే సమయంలో, మన సీనియర్ నాయకుడు శ్రీ యడియూరప్ప జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిజేశాను. శివమొగ్గ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మీ ప్రేమను, ఆశీర్వాదాలను నాపై కురిపించారు. కర్ణాటకను, బెళగావిని అభివృద్ది చేసి ఆ ప్రేమను, ఆశీర్వాదాన్ని మీకు తిరిగి అందిస్తానని హామీ ఇస్తున్నాను. మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు. నాతో కలసి చెప్పండి. భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై.

ధన్యవాదాలు! 

సూచన: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***


(రిలీజ్ ఐడి: 2210451) సందర్శకుల సూచీ సంఖ్య : : 21