ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ)

ఒడిశాలో అంచుల చదును సహా 2 వరుసల జాతీయ రహదారి-326 విస్తరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

ఈపీసీ విధానంలో 68.600 కిలోమీటరు నుంచి 311.700 కిలోమీటరు వరకు రూ.1526.21 కోట్లతో విస్తరణ.. బలోపేతం పనులు

प्रविष्टि तिथि: 31 DEC 2025 3:11PM by PIB Hyderabad

ఒడిశా రాష్ట్రంలో ‘ఎన్‌హెచ్(ఓ)’ కింద ‘ఈపీసీ’ పద్ధతిలో ప్రస్తుత 2 వరుసల జాతీయ రహదారిని అంచుల చదును సహా విస్తరణ-బలోపేతం చేసే పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌-326 పరిధిలో 68.600 కిలోమీటరు నుంచి 311.700 కిలోమీటరు వరకూ రహదారిని రెండు వైపులా అంచుల చదును (పేవ్డ్‌ షోల్టర్స్‌) సహా ఉన్నతీకరిస్తారు.

ఆర్థిక ప్రణాళిక:

ఈ ప్రాజెక్టు మూలధన వ్యయం రూ.1,526.21 కోట్లు కాగా, ఇందులో రూ.966.79 కోట్ల విలువైన సివిల్‌ నిర్మాణ పనులు కూడా భాగంగా ఉంటాయి.

ప్రయోజనాలు:

ఈ ఉన్నతీకరణ పనులు పూర్తయితే జాతీయ రహదారి-326పై  ప్రయాణం వేగంగా, సురక్షితంగా విశ్వసనీయంగా సాగడమే కాకుండా దక్షిణ ఒడిశా ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా గజపతి, రాయగడ, కోరాపుట్ జిల్లాలు లబ్ధి పొందుతాయి. రహదారి అనుసంధానం మెరుగుతో స్థానిక ప్రజలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, పర్యాటక కేంద్రాలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుంది. మార్కెట్ల విస్తరణతోపాటు ఆరోగ్య సంరక్షణ ఇనుమడిస్తుంది. ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా ఈ ప్రాంత సార్వజనీన ప్రగతికి బాటలు పడతాయి.

వివరాలు:

·         ఈ జాతీయ రహదారి పరిధిలోగల మోహన-కోరాపుట్ విభాగం భౌగోళిక స్థితి (ఇంటర్మీడియట్ లేన్/2-లేన్, అనేక లోపభూయిష్ట ప్రదేశాలు, నిటారుగా, వాలుగా ఉన్న ప్రాంతాల వల్ల) ప్రమాణాలకు అనుగుణంగా లేదు. అలాగే రహదారి సంధానం, క్యారేజ్‌వే వెడల్పులో నిర్దిష్ట ప్రమాణాలకు సరితూగని లోపాలున్నాయి. దీనివల్ల భారీ వాహనాల రాకపోకలు సురక్షితంగా, సమర్థంగా సాగడం కష్టతరమవుతోంది. ఫలితంగా ఓడరేవులు, తీరప్రాంత పారిశ్రామిక కూడళ్లకు సరకుల రవాణా మందగిస్తోంది. ఈ లోపాలను (వక్రతలను పునర్నిర్మానం, వాలు మెరుగుదల) సరిదిద్ది రహదారి ఇరువైపులా అంచులను కూడా చదును చేయాల్సి ఉంది. ఇది ప్రస్తుతం 2 వరుసల రహదారి అయినప్పటికీ, ఇందులోని లోపాలను సరిదిద్ది అంచులను చదును చేయడం ద్వారా ఉన్నతీకరించడం తప్పనిసరి. దీనివల్ల ముప్పు ప్రదేశాల తొలగింపు, కాలిబాటను బలోపేతం అవుతాయి. ప్రయాణిక, వస్తు రవాణా సురక్షితంగా, నిరంతరాయంగా కొనసాగుతూ వాహన నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది.

·         ఈ ఉన్నతీకరణ పనులు పూర్తయితే, మోహన-కోరాపుట్ నుంచి ప్రధాన ఆర్థిక-రవాణా కారిడార్లకు మెరుగైన, ప్రత్యక్ష అనుసంధానం కలుగుతుంది. ఆ మేరకు జాతీయ రహదారులు-26, 59,16 సహా రాయ్‌పూర్-విశాఖపట్నం కారిడార్‌లకు సంధానం మెరుగవుతుంది. అంతేగాక గోపాల్‌పూర్ ఓడరేవు, జైపూర్ విమానాశ్రయం, చివరి అంచెలోగల వివిధ రైల్వే స్టేషన్లకూ వెళ్లే మార్గం సుగమమవుతుంది. కీలకమైన పారిశ్రామిక-రవాణా కేంద్రాలు (జేకే పేపర్, మెగా ఫుడ్ పార్క్, నాల్కో, ఐఎంఎఫ్‌ఏ, ఉత్కళ్‌ అల్యూమినా, వేదాంత, హెచ్‌ఏఎల్‌) సహా విద్యా, పర్యాటక (ఒడిశా సెంట్రల్ యూనివర్సిటీ, కోరాపుట్ మెడికల్ కాలేజ్, తప్తపాణి, రాయగడ) కేంద్రాలను ఈ కారిడార్‌ సంధానిస్తుంది. తద్వారా సరకు రవాణా వేగం పుంజుకుని,  ప్రయాణ సమయం ఆదా కావడంతోపాటు ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.

·         దక్షిణ ఒడిశా (గజపతి, రాయగడ, కోరాపుట్ జిల్లాలు) పరిధిలోకి వచ్చే ఈ ప్రాజెక్ట్ వాహన రాకపోకలను వేగిరపరచడంతోపాటు సురక్షితం చేస్తుంది. పారిశ్రామిక, పర్యాటక వృద్ధికి ఉత్తేజమిస్తూ ఆకాంక్షాత్మక-గిరిజన ప్రాంతాల్లో సేవా ప్రదానాన్ని మెరుగుపరుస్తుంది. రాష్ట్ర, అంతర్రాష్ట్ర సంధానం గణనీయంగా మెరుగవుతుంది. ఆర్థిక విశ్లేషణ ప్రకారం ఈ ప్రాజెక్టు ‘ఇఐఆర్‌ఆర్‌’ 17.95 శాతం (మూలం వద్ద) ఉంటుంది... అయితే, ఆర్థిక రాబడి (ఎఫ్‌ఐఆర్‌ఆర్‌) ప్రతికూల (-2.32 శాతం) విలువను చూపుతోంది. ఆర్థిక అంచనాలు వివరించే సామాజిక-మార్కెటేతర ప్రయోజనాలు... అంటే- ప్రయాణ సమయం (మోహన-కోరాపుట్ మార్గంలో 2.5–3.0 గంటల సమయం, రమారమి 12.46 కిలోమీటర్ల దూరం ఆదా), వాహన నిర్వహణ వ్యయం ఆదా సహా భద్రత ఇనుమడించడం వల్ల ఆర్థిక ఫలితం మెరుగ్గా ఉంటుంది.

అమలు వ్యూహం.. లక్ష్యాలు:

·         ఈ పనులను ‘ఈపీసీ’ విధానంలో చేపడతారు. తదనుగుణంగా నిర్దిష్ట నిర్మాణ-నాణ్యత-భరోసా సాంకేతిక పరిజ్ఞానాలను కాంట్రాక్టర్లు అనుసరించాల్సి ఉంటుంది. ఈ మేరకు ‘ప్రీకాస్ట్ బాక్స్’ తరహా అమరికలు సహా డ్రెయిన్లు, వంతెనలు, గ్రేడ్ సెపరేటర్ల కోసం ప్రీకాస్ట్ ఆర్‌సీసీ/పీఎస్‌సీ గిర్డర్లు, రీన్ఫోర్స్డ్-ఎర్త్ వాల్ భాగాలపై ప్రీకాస్ట్ క్రాష్ బారియర్లు, ఒత్తిడి తట్టుకునే స్లాబ్‌లు, పేవ్‌మెంట్ లేయర్‌లలో సిమెంట్ ట్రీటెడ్ సబ్-బేస్ (సీటీఎస్‌బీ) వంటి పద్ధతులను పాటించాలి. నెట్‌వర్క్ సర్వే వెహికల్ (ఎన్‌ఎస్‌వీ), పీరియాడిక్ డ్రోన్-మ్యాపింగ్ వంటి ప్రత్యేక అధ్యయన, పర్యవేక్షణ సాధనాలతో నాణ్యత, పనుల ప్రగతిని ధ్రువీకరిస్తారు. నిర్దిష్ట అథారిటీ ఇంజనీర్ దైనందిన పర్యవేక్షణ బాధ్యతను నిర్వర్తిస్తారు. అలాగే ప్రాజెక్ట్ మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (పీఎంఐఎస్‌) ద్వారానూ ప్రాజెక్టును పర్యవేక్షిస్తారు.

·         ప్రతి ప్యాకేజీలో నిర్దేశిత తేదీ నుంచి 24 నెలల్లోగా పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా, (మొత్తం కాంట్రాక్ట్ వ్యవధి 7 సంవత్సరాలు: నిర్మాణం 2 ఏళ్లు, 5 సంవత్సరాల డీఎప్‌పీ) తదుపరి ఐదేళ్ల పాటు లోపాలు సరిదిద్దడం సహా నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే. చట్టబద్ధ అనుమతులు, అవసరమైన భూమి సేకరణ తర్వాత కాంట్రాక్టు ప్రదానం చేస్తారు.

ఉపాధి కల్పన సామర్థ్యం సహా కీలక ప్రభావం:

·         ఒడిశాలోని తూర్పు-దక్షిణ ప్రాంతాల మధ్య వాహన రాకపోకల్లో వేగం, భద్రత పెంపుతోపాటు అనుసంధానాన్ని మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ రహదారి ముఖ్యంగా గజపతి, రాయగడ, కోరాపుట్ జిల్లాలను రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతోనే కాకుండా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తోనూ కలుపుతుంది. మెరుగైన రహదారి నెట్‌వర్క్ పారిశ్రామిక వృద్ధికి దోహదం చేస్తూ, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది, విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు పెరగడం సహా దక్షిణ ఒడిశాలోని గిరిజన, వెనుకబడిన ప్రాంతాల సార్వజనీన సామాజిక-ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.

·         నిర్మాణం-నిర్వహణ వ్యవధిలో చేపట్టే వివిధ కార్యకలాపాలతో నిపుణ, పాక్షిక నిపుణ, కార్మికులకు గణనీయ ప్రత్యక్ష-పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. అలాగే నిర్మాణ సామగ్రి సరఫరా, రవాణా, పరికరాల నిర్వహణ సంబంధిత సేవలలో స్థానిక పరిశ్రమల పాత్ర కూడా పెరిగి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు చేయూత లభిస్తుంది.

·         ఇది ఒడిశా రాష్ట్ర పరిధిలో గజపతి, రాయగడ, కోరాపుట్ జిల్లాల గుండా సాగుతుంది. అలాగే మోహన, రాయగడ, లక్ష్మీపూర్, కోరాపుట్ వంటి ప్రధాన పట్టణాలను ఈ కారిడార్ సంధానిస్తుంది. ఒడిశాలో అనుసంధానం పెరగడమే కాకుండా జాతీయ రహదారి-326 చివరి దక్షిణ ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్‌తో అంతర్రాష్ట్ర సంబంధాన్ని పెంచుతుంది.

నేపథ్యం:

“ఒడిశా రాష్ట్రంలోని అస్కా సమీపాన ఎన్‌హెచ్-59 కూడలి నుంచి మోహన, రాయపనక, అమలభట, రాయగడ, లక్ష్మీపూర్ మీదుగా చింతూరు సమీపంలోని ఎన్‌హెచ్-30 కూడలి వద్ద ముగిసే ఈ మార్గాన్ని” కేంద్రం ప్రభుత్వం 2012 ఆగస్టు 14న ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఎన్‌హెచ్-326గా ప్రకటించింది.


(रिलीज़ आईडी: 2210286) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam