ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలోని మరోల్‌లో అల్‌జామియా-తుస్-సైఫియా నూతన క్యాంపస్ ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
10 FEB 2023 8:22PM by PIB Hyderabad
గౌరవ సయేద్నా ముఫద్దల్ జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే జీ, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర జీ, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులందరికీ నమస్కారాలు!
మీ అందరి మధ్య ఇలా ఉండటం.. సొంత ఇంటికి వచ్చినట్లుగా, నా కుటుంబసభ్యులతో ఉన్నట్లుగా అనిపిస్తోంది. మీరు ప్రదర్శించిన వీడియోను నేను చూశాను. దీనిపై ఒక చిన్న ఫిర్యాదు చేయాలనుకుంటున్నా. అందులో కొన్ని మార్పులు చేయాలని కోరుతున్నా. మీరు నన్ను పదే పదే గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రధానమంత్రి అని సంబోధించారు. కానీ నేను మీ కుటుంబసభ్యుడిని. ఇక్కడ నేను ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని కాదు. బహుశా ఇలాంటి అదృష్టం చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. నాకు గత నాలుగు తరాలుగా ఈ కుటుంబంతో అనుబంధం ఉంది. నాలుగు తరాల వారు నా ఇంటికి విచ్చేశారు. అందుకే ఈ వీడియోలో 'ముఖ్యమంత్రి', 'ప్రధానమంత్రి' అనే పదాలను పదే పదే వాడటం కొంత అసౌకర్యంగా అనిపించింది. నేను మీ కుటుంబంలో ఒకడిని. కుటుంబసభ్యుడిలా ఇక్కడకు వచ్చే అవకాశం నాకు సంతోషాన్నిస్తుంది. కమ్యూనిటీ అయినా, సంస్థ అయినా కాలానికనుగుణంగా ప్రాధాన్యతను కాపాడుకోవటంపై ఆ సమాజ గుర్తింపు ఆధారపడి ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పును, అభివృద్ధిని స్వీకరిస్తుందని దావూదీ బోహ్రా కమ్యూనిటీ ఎప్పుడూ నిరూపించుకుంటుంది. ఇవాళ అల్‌జామియా-తుస్-సైఫియా వంటి విద్యాకేంద్రం విస్తరణ ఇందుకు నిదర్శనం. ముంబై శాఖను ప్రారంభించిన సందర్భంగా ఈ శాఖతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. దీనిద్వారా 150 ఏళ్ల నాటి కల నిజమైంది. మీరు ఆ కలను సాకారం చేశారు. మీకు అభినందనలు! హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను.
మిత్రులారా,
దావూదీ బోహ్రా కమ్యూనిటీతో నాకు ఎన్నో ఏళ్ల బంధం ఉందని అందరికీ తెలిసిందే. ప్రపంచంలో నేను ఎక్కడున్నా, వారు నాపై ప్రేమ చూపిస్తూనే ఉంటారు. నేను ఎల్లప్పుడూ ఒక మాట చెబుతుంటా. సయేద్నా సాహెబ్ కు అప్పుడు సుమారు 99 ఏళ్లు ఉంటాయి. భక్తితో నేను ఆయన దగ్గరకు వెళ్లిన సమయంలో 99 ఏళ్ల వయసులోనూ పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఆ సంఘటన నాకెంతో స్ఫూర్తిని కలిగించింది. కొత్త తరాన్ని తీర్చిదిద్దేందుకు ఆయన ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. 99 ఏళ్ల వయసులోనూ ఓపిగ్గా కూర్చొని, పిల్లలకు బోధిస్తున్నారు. 800-1000 మంది పిల్లలు అక్కడ చదువుకుంటున్న దృశ్యాలు నిజంగా నా హృదయాన్ని ఎప్పుడూ కదిలిస్తాయి. గుజరాత్ లో ఉన్నప్పుడు మేం కలిసి పనిచేశాం. ఎన్నో సృజనాత్మక ప్రయత్నాలు చేశాం. సయేద్నా సాహిద్ శత వసంత ఉత్సవాలను జరుపుకోవటం నాకు ఇంకా గుర్తుంది. సూరత్ లో జరిగిన భారీ బహిరంగ సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. "నేనేం చేయాలో చెప్పండి" అని అక్కడ సయేద్నా సాహిబ్ నన్ను అడిగారు. "మీరేం చేయాలో చెప్పటానికి నేనెవరు" అని అన్నాను. కానీ ఆయన చాలా పట్టుబట్టటంతో "గుజరాత్ లో నీటి సంక్షోభం ఉందని, దీని కోసం మీరు ఏదైనా చేయాలి" అని చెప్పాను. ఆ మాట చెప్పి ఏళ్లు గడిచినా, ఇప్పటికీ నీటి సంరక్షణకు బోహ్రా కమ్యూనిటీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. నీటి సంరక్షణ ప్రచారం, పోషకాహార లోపం వంటి సమస్యలపై పోరాటానికి సమాజం, ప్రభుత్వం ఒకరికొకరు పరస్పరం బలంగా మారవచ్చని ఈ కమ్యూనిటీ నిరూపించింది. అందుకు ఎంతో గర్వపడుతున్నా. గౌరవ సయేద్నా మహమ్మద్ బుర్హానుద్దీన్ సాహెబ్ తో గతంలో చర్చలు జరిపే అవకాశం లభించినప్పుడల్లా వారి కార్యకలాపాలు, సహకారం నాకు మార్గదర్శకంగా నిలిచేవి. వాటి ద్వారా నేను ఎంతో శక్తిని పొందేవాడిని. నేను గుజరాత్ నుంచి ఢిల్లీ వెళ్లిన సమయంలో మీరు పీఠాన్ని అధిష్ఠించారు. నాపై ఆ ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. ఆ బంధం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇండోర్ కార్యక్రమంలో గౌరవ డాక్టర్ సయేద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ సాహెబ్, మీరంతా నాపై చూపిన ఆదరాభిమానాలు వెలకట్టలేనివి.
మిత్రులారా,
కేవలం మన దేశంలోనే కాదు. నేను విదేశాలకు వెళ్లినప్పుడు కూడా బోహ్రా సోదరీసోదరులు ఎంతో మంది నాకోసం విమానాశ్రయానికి వచ్చి వేచి చూస్తారు. అర్థరాత్రి రెండు 2 గంటలకు నేను దిగినా కూడా 2 నుంచి 5 కుటుంబాలు అప్పటికే సిద్ధంగా ఉంటాయి. ‘‘ఇంత చలిలో ఎందుకు ఇబ్బంది పడటం? ఎందుకు శ్రమ తీసుకున్నారు?’’ అని నేను వారిని అడిగితే.. "మీరు ఇక్కడికి వచ్చారు. కాబట్టి మేం తప్పకుండా రావాల్సిందే" అని సమాధానం ఇస్తారు. ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, భారత్ పట్ల వారికున్న ప్రేమాభిమానాలు స్పష్టంగా తెలుస్తాయి. మీలోని ఆ భావోద్వేగం, ప్రేమే నన్ను పదేపదే మీ వద్దకు వచ్చేలా చేస్తున్నాయి.
మిత్రులారా,
కొన్ని ప్రయత్నాలు, విజయాల వెనక దశాబ్దాల నాటి కలలుంటాయి. అల్‌జామియా-తుస్-సైఫియా ముంబై శాఖ విస్తరణకు దశాబ్దాల కిందట గౌరవ సయేద్నా అబ్దుల్ ఖాదిర్ నజీముద్దీన్ సాహబ్ కలలు కన్నారని నాకు తెలుసు. ఆ సమయంలో దేశం వలస పాలనలో ఉంది. అటువంటి కాలంలో విద్యారంగంలో ఇంతటి పెద్ద కల కనటం నిజంగా గొప్ప విషయం. సరైన ఆలోచనతో కన్న కల కచ్చితంగా నెరవేరుతుంది. ఇవాళ దేశం 'ఆజాదీ కా అమృత్ కాల్' దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో విద్యారంగానికి బోహ్రా కమ్యూనిటీ అందిస్తున్న సహకారం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 75 ఏళ్ల స్వాతంత్ర్యం గురించి మాట్లాడినప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాలి. మీరు సూరత్ లేదా ముంబై వెళ్లినప్పుడు తప్పకుండా దండిని సందర్శించాలని కోరుతున్నాను. అది మన స్వాతంత్ర్య పోరాటంలో కీలక మలుపు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉప్పు సత్యాగ్రహం కన్నా ముందుగానే గాంధీజీ దండిలోని మీ ఇంట్లోనే బస చేశారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సయేద్నా సాహెబ్ ను ఒక కోరిక కోరాను. నా మనసులోని పెద్ద కోరికను ఆయనతో పంచుకున్నాను. ఆయన మరో ఆలోచన చేయకుండా సముద్రం ఎదురుగా ఉన్న ఆ పెద్ద బంగ్లాను నాకు అప్పగించగా.. ఇవాళ అక్కడ దండి యాత్రకు గుర్తుగా అద్భుతమైన స్మారక చిహ్నాన్ని నిర్మించాం. దండి యాత్రతో పాటు సయేద్నా సాహెబ్ అందించిన జ్ఞాపకాలు కలకాలం నిలిచిపోతాయి. ఇవాళ మన దేశంలో నూతన జాతీయ విద్యా విధానం వంటి ఎన్నో సంస్కరణలు అమలవుతున్నాయి. ఇక్కడున్న ఎందరో మాజీ, ప్రస్తుత వైస్ ఛాన్సలర్లు నా మిత్రులు. మన దేశంలోని మహిళలు, కుమార్తెలకు ఆధునిక విద్యను అభ్యసించేందుకు ఎన్నో కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. మనం అమృత కాలంలో తీసుకున్న సంకల్పాలను, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లటంలో అల్‌జామియా-తుస్-సైఫియా విద్యాసంస్థ కూడా కృషి చేస్తోంది. ఆధునిక విద్యకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పాఠ్యప్రణాళిక మెరుగవుతుంది. అలాగే మీ ఆలోచనా విధానం కూడా పూర్తి ఆధునీకంగా ఉంది. ముఖ్యంగా మహిళల విద్య పట్ల సంస్థ అందిస్తున్న సహకారం సామాజిక మార్పునకు నూతనోత్తేజాన్ని ఇస్తుంది.
మిత్రులారా,
విద్యారంగంలో ఒకప్పుడు నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలకు భారత్ నిలయంగా ఉండేది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు చదువుకోవటానికి, నేర్చుకోవటానికి ఇక్కడకు వచ్చేవారు. భారతదేశ పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే, ముందుగా ఆనాటి విద్యా వైభవాన్ని పునరుద్ధరించాలి. భారతీయ మూలాలతో ముడిపడున్న ఆధునిక విద్యా విధానం దేశ ప్రాధాన్యతగా మారింది. ఆ లక్ష్యం కోసం ప్రతిస్థాయిలో మేం కృషి చేస్తున్నాం. మీరు గమనించే ఉంటారు. గత 8 ఏళ్లలో మన దేశంలో రికార్డు స్థాయిలో నూతన విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యాయి. నేటి యువత వైద్య విద్యపై ఆసక్తి చూపుతోంది. దేశ అవసరాల దృష్ట్యా ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. 2004 నుంచి 2014 మధ్య కాలంలో దేశంలో 145 మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రారంభం కాగా.. 2014 నుంచి 2022 మధ్య కాలంలో 260కి పైగా వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. గడిచిన ఎనిమిదేళ్లలో మన దేశంలో ప్రతి వారం ఒక విశ్వవిద్యాలయం, రెండు కళాశాలలు ప్రారంభించటం సంతోషించదగిన విషయం. ఈ వేగం, విస్తృతి.. త్వరలోనే భారత్ అపారమైన యువ శక్తికి నిలయంగా మారనుందనటానికి నిదర్శనం. ప్రపంచ భవిష్యత్తుకు ఈ యువ తరమే దిశానిర్దేశం చేయనుంది.
మిత్రులారా,
మన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా విద్య ఉన్నప్పుడే దాని ప్రాముఖ్యత నిలిచి ఉంటుందని మహాత్మాగాంధీ తరచూ చెప్పేవారు. అందువల్ల విద్యావ్యవస్థలో దేశం మరో కీలక మార్పుని తీసుకొచ్చింది. విద్యా విధానంలో స్థానిక భాషకు అత్యంత ప్రాముఖ్యతనివ్వటమే ఆ మార్పు. ఇందాక మన మిత్రులు గుజరాతీ భాషలో కవిత్వం ద్వారా జీవిత విలువలను చర్చించటం చూశాం. ఒక గుజరాతీగా ఆ పదాల్లో దాగున్న భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకోగలను. మాతృభాషలోని ఆ శక్తి నా మనసుని తాకింది.
మిత్రులారా,
బానిస పాలనలో బ్రిటీష్ వారు ఆంగ్ల భాషను విద్యకు ప్రామాణికం చేశారు. దురదృష్టవశాత్తు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆ న్యూనతా భావాన్ని మనం కొనసాగించాం. దీనివల్ల దేశంలోని పేదలు, దళితులు, వెనకబడిన, బలహీన వర్గాల పిల్లలే ఎక్కువగా నష్టపోయారు. ప్రతిభ ఉన్నప్పటికీ కేవలం భాషా ప్రాతిపదికన వారు పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వైద్య, ఇంజినీరింగ్ వంటి విద్య స్థానిక భాషల్లో అభ్యసించవచ్చు. భారతీయ అవసరాలకు అనుగుణంగా దేశం ఎన్నో సంస్కరణలను చేపట్టింది. గత కొన్నేళ్లుగా పేటెంట్ వ్యవస్థపై దృష్టి సారించి, పేటెంట్ల దాఖలు ప్రక్రియను మేం సులభతరం చేశాం. గతంలో కంటే ఇప్పుడు ఐఐటీ, ఐఐఎస్సీ వంటి సంస్థల్లో అత్యధికంగా పేటెంట్లు నమోదవుతున్నాయి. నేడు విద్యా రంగంలో సాంకేతికతను ఎక్కువగా వాడుతున్నారు. అందుకే పాఠశాలల్లో వినూత్నమైన లెర్నింగ్ టూల్స్ వాడుకలోకి వస్తున్నాయి. ఇప్పుడు యువతను కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం చేయకుండా.. నైపుణ్యం, సాంకేతికత, ఆవిష్కరణల వైపు సన్నద్ధం చేస్తున్నాం. ఫలితంగా, మన యువత వాస్తవ ప్రపంచంలోని సమస్యలను ఎదుర్కోవటానికి సిద్ధమవటమే కాక, ఆ సమస్యలకు పరిష్కారాలను కూడా కనుగొంటారు.
మిత్రులారా,
ఏ దేశానికైనా విద్యా వ్యవస్థ, పారిశ్రామిక వ్యవస్థ రెండూ బలంగా ఉండాలి. విద్యా సంస్థలు, పరిశ్రమలు ఒకదానికొకటి సహకారం అందించుకోవాలి. ఈ రెండూ యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. దావూదీ బోహ్రా కమ్యూనిటీ వ్యాపార రంగంలో చాలా క్రీయాశీలకంగా ఉంటూ విజయం సాధిస్తుంది. గత 8 నుంచి 9 ఏళ్లలో 'వ్యాపార నిర్వహణ సౌలభ్యం' దిశగా జరిగిన చరిత్రాత్మక సంస్కరణల ప్రయోజనాలను మీరు అనుభవించారు. ఈ సమయంలో దేశం 40,000 నిబంధనలను రద్దు చేయడమే కాక, వందలాది నిబంధనలను నేర రహితంగా మార్చింది. గతంలో ఇటువంటి చట్టాల వల్ల పారిశ్రామికవేత్తలు వేధింపులకు గురవటం వల్ల వారి వ్యాపారాలపై తీవ్ర ప్రభావం ఉండేది. కానీ ఉద్యోగాలు కల్పించే వారికి ప్రభుత్వం అండగా నిలుస్తూ, పూర్తి మద్దతునిస్తోంది. గత కొన్నేళ్లలో బలమైన విశ్వాస వాతావరణం ఏర్పడింది. 42 కేంద్ర చట్టాలను సంస్కరించటానికి మేం 'జన్ విశ్వాస్ బిల్లు'ను తీసుకువచ్చాం. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని పెంపొందించటానికి మేం 'వివాద్ సే విశ్వాస్' పథకాన్ని ప్రవేశపెట్టాం. పన్ను రేట్ల సంస్కరణ వంటి అనేక నిర్ణయాలను ఈ బడ్జెట్‌లోనూ తీసుకున్నాం. దీనివల్ల ఉద్యోగులు, వ్యాపారవేత్తల చేతుల్లో ఎక్కువ డబ్బు మిగులుతుంది. ఉద్యోగ సృష్టికర్తలు కావాలని కలలుగంటున్న యువతకు ఈ మార్పులు అనేక అవకాశాలను కల్పిస్తాయి.
మిత్రులారా,
భారత్ వంటి దేశానికి అభివృద్ధి, వారసత్వం రెండూ సమ ప్రాధాన్యత గల అంశాలు. ఇది భారతదేశంలోని ప్రతి వర్గం, సమాజం, భావజాలం ప్రత్యేకత కూడా. అందువల్ల నేడు దేశం సంప్రదాయం, ఆధునికతల సంగమంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ఒకవైపు దేశంలో ఆధునిక భౌతిక మౌలిక సదుపాయాల నిర్మాణం జరుగుతుండగా, మరోవైపు సామాజిక మౌలిక సదుపాయాలపైనా పెట్టుబడులు పెడుతున్నాం. ఇవాళ మనం ప్రాచీన ఉమ్మడి పండగ సంప్రదాయాలను పాటించడమే కాక, పండగ షాపింగ్ సమయంలో ఆధునిక సాంకేతికత ద్వారా డిజిటల్ చెల్లింపులను కూడా చేస్తున్నాం. నూతన సాంకేతికత సహాయంతో ప్రాచీన రికార్డులను డిజిటలైజ్ చేస్తామని ఈ బడ్జెట్‌లో ప్రకటించడం మీకు తెలుసు. ఇప్పుడే నేను శతాబ్దాల నాటి మన చేతిరాత పురాణాలను చూశాను. భారత ప్రభుత్వం వద్ద ఒక పెద్ద పథకం ఉంది. ప్రతి అంశాన్ని డిజిటలైజ్ చేయమని నేను ప్రభుత్వాన్ని కోరాను. ఇది రాబోయే తరాలకు ఎంతో ఉపయోగకరం. అన్ని సమాజాలు, అన్ని వర్గాలు ఇలాంటి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నా. ప్రాచీన గ్రంథాలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలనైనా డిజిటలైజ్ చేయాలి. ఇటీవల నేను మంగోలియా సందర్శించినప్పుడు బుద్ధుని కాలం నాటి కొన్ని చేతివ్రాత పత్రాలను అక్కడ చూశాను. వాటిని డిజిటలైజ్ చేస్తానని, నాకు ఇవ్వమని వారిని అడిగాను. మేం ఆ పనిని పూర్తి చేశాం. ప్రతి సంప్రదాయం, ప్రతి విశ్వాసం ఒక శక్తి. ఈ ప్రచారంలో యువతను కూడా భాగస్వాములను చేయాలి. ఇందులో దావూదీ బోహ్రా సంఘం కీలక పాత్ర పోషించగలదు. పర్యావరణ పరిరక్షణ, చిరుధాన్యాలను ప్రాచుర్యంలోకి తీసుకురావటం వంటి అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక భారీ ప్రచారానికి భారత్ నాయకత్వం వహిస్తోంది. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని మీరు కూడా ప్రతిజ్ఞ చేయాలి. ఈ ఏడాది భారత్ జీ-20 వంటి అంతర్జాతీయ వేదికకు అధ్యక్షత వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బోహ్రా కమ్యూనిటీ ప్రజలు భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించవచ్చు. మీరు ఎల్లప్పుడూ చూపే ఉత్సాహంతో ఈ బాధ్యతలను కూడా నెరవేరుస్తారని నేను నమ్ముతున్నా. అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని చేరుకోవడంలో దావూదీ బోహ్రా కమ్యూనిటీ కీలక పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో కూడా మీరు ఈ పాత్రను పోషిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ ఆకాంక్ష, విశ్వాసంతో ఈ శుభ సందర్భంలో మీ అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. సయేద్నా సాహబ్‌కు నాపై ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ, ఇక్కడికి రావడం కూడా నాకు ముఖ్యం. అందుకే మీ అందరి ఆశీస్సులు తీసుకోవటానికి ఇవాళ ఇక్కడికి వచ్చే అదృష్టం దక్కింది. మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.
ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది తెలుగు అనువాదం.
***
(రిలీజ్ ఐడి: 2210089)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam