సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీవితం, దార్శనికతలకు ప్రతీకగా గొప్ప మ్యూజికల్ మల్టీమీడియా ప్రదర్శనతో అహ్మదాబాద్‌ ప్రజలను అలరించిన “నమోత్సవ్” 140 కోట్ల మంది భారతీయులను ఉత్తేజపరిచిన నాయకుడి జీవితాన్ని ప్రదర్శించిన "నమోత్సవ్": శ్రీ అమిత్ షా

నాడు పోస్టు చేయడమైనది: 29 DEC 2025 3:18PM by PIB Hyderabad

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీవితం, నాయకత్వం, దార్శనికతల ప్రస్థానాన్ని కీర్తిస్తూ 'నమోత్సవ్' పేరుతో నిర్వహించిన గొప్ప మ్యూజికల్ మల్టీమీడియా ప్రదర్శనతో నిన్న అహ్మదాబాద్‌ నగరంలో గర్వం, సంస్కృతి, స్ఫూర్తి కలగలసిన ఒక మరపురాని సాయంత్రం ఆవిష్కృతమైంది. సంస్కార్‌ధామ్ నిర్వహించిన ఈ మూడు రోజుల సాంస్కృతిక కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. సేవ, సంకల్పం, జాతి నిర్మాణంతో ముడిపడిన ఒక అసాధారణ ప్రస్థానాన్ని కళ్లకు కట్టేందుకు కళ, సంగీతం, సాంకేతికత, కథనం వంటి కళలను ఇది ఏకతాటిపైకి తెచ్చింది.

 

కేంద్ర హోం వ్యవహారాల, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా ఈ ‘నమోత్సవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.... “నమోత్సవ్ కార్యక్రమం ఒక గొప్ప నాయకుని జీవితానికి ప్రతిబింబం. ఆ మహానేత కేవలం 11 సంవత్సరాల కాలంలోనే... 2047 నాటికి దేశాన్ని అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా మార్చడానికి 140 కోట్ల మంది భారతీయులను ప్రేరేపించగలిగారు. ఒక వ్యక్తి తన జీవితాన్ని ఒక నిర్దిష్ట జాతీయ లక్ష్యానికి అంకితం చేసి... దాని సాధన కోసం నిరంతర ప్రయోగాలు చేస్తూ... ఆ లక్ష్యాన్ని సాకారం చేసే బాధ్యతను పంచుకునే ప్రజలందరితో దేశవ్యాప్తంగా ఒక పెద్ద బృందాన్ని తయారు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది” అని శ్రీ అమిత్ షా అన్నారు.

 

 

నమోత్సవ్ కార్యక్రమం ఒక గొప్ప రంగస్థల ప్రదర్శన. ఇది గుజరాత్‌లోని వడ్‌నగర్‌ నుంచి ప్రారంభమై  సాధారణ జీవితం నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారత ప్రధానమంత్రిగా పరివర్తనాత్మక నాయకత్వం దాకా ఎదిగిన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక జీవితాన్ని కళాత్మకంగా చిత్రించింది. ప్రత్యక్ష ప్రదర్శనలు, సంగీతం, నృత్యం, కథనం, అత్యాధునిక మల్టీమీడియా దృశ్యాల సమ్మేళనంతో సాగిన ఈ కార్యక్రమం ఆయన వ్యక్తిగత ప్రయాణం, భారత అభివృద్ధి పథంలోని కీలక ఘట్టాలను అద్భుతంగా ప్రదర్శించింది.

 

ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సాంస్కృతిక సాధకులు, ఆధ్యాత్మిక నాయకులు, కళాకారులు, పండితులు సహా విభిన్న రంగాలకు చెందిన పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ఈ కార్యక్రమ విస్తృత ఆకర్షణను, ప్రాముఖ్యతను ప్రతిబింబించింది. అధిక సంఖ్యలో ప్రజల భాగస్వామ్యం సాంస్కృతిక వ్యక్తీకరణ, సామూహిక జాతీయ స్పృహల మధ్య బలమైన సంబంధాన్ని పునరుద్ఘాటించింది.

 

 

ఈ కార్యక్రమంలోని ముఖ్యాంశాల్లో ఒకటి... కళాకారుల అద్భుత లైవ్ ప్రదర్శన. విహంగ వీక్షణంలో ఈ దృశ్యం సంస్కృతి, సంగీతం, సందేశాల స్పష్టమైన సమ్మేళనాన్ని సామరస్యంగా ప్రదర్శిస్తూ... ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే ప్రత్యేక దృశ్య అనుభవాన్ని అందించింది.

 

 

ఈ వేదికపై 150 మందికి పైగా కళాకారులు ప్రదర్శననిచ్చారు. వారి శక్తిమంతమైన ప్రదర్శనలు శ్రీ నరేంద్ర మోదీ జీవిత, నాయకత్వ ప్రయాణాన్ని కళ్ళకు కట్టాయి. అద్భుతంగా రూపొందించిన నాటికల ద్వారా... గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలంలో చేపట్టిన చరిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమాలను ఈ కార్యక్రమం ప్రదర్శించింది. గుజరాత్ అభివృద్ధి నమూనా, సుపరిపాలనలు తరువాతి కాలంలో దేశ పురోగతికి ఒక బ్లూప్రింట్‌గా పరిణామం చెందిన తీరును ఈ ప్రదర్శన చక్కగా వివరించింది.

 

 

మౌలిక సదుపాయాలు, పాలనా సంస్కరణలు, సామాజిక సాధికారత, సమ్మిళిత వృద్ధిలో కీలక విజయాలను ఈ కథనం ప్రదర్శించింది. పారదర్శకత, జవాబుదారితనం, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి విధానాలనూ స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో విధానాలు, పాలనా ప్రణాళికలను రూపొందించడంలో గుజరాత్‌లో వేసిన పునాదులు ఎలా కీలక పాత్ర పోషించాయో ఈ కార్యక్రమం ప్రస్ఫుటం చేసింది.

 

ఈ కార్యక్రమాల్లో భాగంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తన పబ్లికేషన్స్ విభాగం ద్వారా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), పీఐబీల ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీవితం, కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచారం చేయడంలో చురుకైన పాత్ర పోషించింది. సీబీసీ, అహ్మదాబాద్‌లోని పబ్లికేషన్స్ విభాగం సిబ్బంది కార్యక్రమ వేదిక వద్ద ఒక ప్రత్యేక పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో ప్రధానమంత్రి ఆలోచనలు, నాయకత్వ తత్వం, ప్రజా సేవ ప్రయాణాన్ని చక్కగా వివరించే ప్రచురణలను ప్రదర్శించారు.

ఈ పుస్తక ప్రదర్శన... సందర్శకులు, పండితులు, విద్యార్థులు, సాధారణ ప్రేక్షకుల దృష్టిని గణనీయంగా ఆకర్షించింది. శ్రీ నరేంద్ర మోదీ జీవితం, కార్యకలాపాల వివిధ కోణాలను గురించి సమగ్ర సమాచారాన్ని అందించే దాదాపు 14 ప్రముఖ శీర్షికలను ఇక్కడ ప్రదర్శించారు. వీటిలో భావన సోమయ్య రాసిన లెటర్స్ టు మదర్, ఆంఖ్ ఆ ధన్యా చే, ది మోదీ స్టోరీ - రిఫ్లెక్షన్స్ ఆన్ లీడర్‌షిప్ అండ్ లైఫ్, మోడీ@20-డ్రీమ్స్ మీట్ డెలివరీ, 370-అన్‌డూయింగ్ ది అన్‌జస్ట్, ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్‌నెస్ - మన్ కీ బాత్ @100 సహా అనేక ఇతర ముఖ్యమైన ప్రచురణలూ ఉన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాల సంకలనాన్నీ పబ్లికేషన్స్ విభాగం ప్రదర్శించింది. ఇది పరిపాలన, అభివృద్ధి, సామాజిక సంస్కరణలు, అంతర్జాతీయ సంబంధాలపై ఆయన దార్శనికతను ప్రతిబింబించింది. ఈ సంకలనం సందర్శకులకు వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రధానమంత్రి పంచుకున్న ఆలోచనలు, సందేశాలతో మరింతగా మమేకమయ్యే అవకాశాన్ని కల్పించింది.

 

ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ గౌరవ్ ద్వివేది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ శ్రీ ధీరేంద్ర ఓజా, పీఐబీ అహ్మదాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రశాంత్ పాత్రబే ఈ పుస్తక ప్రదర్శనను సందర్శించి అధికారులతో సంభాషించారు. ప్రధానమంత్రి ప్రజా సేవ ప్రయాణాన్ని, దేశ నిర్మాణంలో ఆయన కృషిని వివరించే ప్రామాణికమైన, సమాచారాత్మక సాహిత్యాన్ని రూపొందించి... ప్రదర్శించడంలో మంత్రిత్వ శాఖ ప్రయత్నాలను వారు ప్రశంసించారు. సమకాలీన చరిత్రను పరిరక్షించడంలో పుస్తకాలు, ప్రచురణల ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ... సమాచార వ్యాప్తి, ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం కోసం సాంస్కృతిక వేదికలను ఉపయోగించుకునే ఆలోచన పట్ల వారు ప్రశంసలు కురిపించారు.

 

 

సాంస్కృతిక విలువలు, నాయకత్వం, సామాజిక పరివర్తనను తెలియజేసే ఒక మాధ్యమంగా నమోత్సవ్ కార్యక్రమం... సాంస్కృతిక ప్రదర్శనను ఉపయోగించుకునే తీరుకు ఒక శక్తిమంతమైన ఉదాహరణగా నిలిచింది. సాంప్రదాయ కళారూపాలను ఆధునిక సాంకేతికతతో మిళితం చేయడం ద్వారా... ఈ కార్యక్రమం అన్ని తరాలు, నేపథ్యాలకు చెందిన ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయవంతమైంది.

ప్రదర్శన సందర్భంగా ప్రేక్షకులంతా సమర్థతతను, ఆవిష్కరణలను, ప్రజాసేవ స్ఫూర్తిని ప్రతిబింబించే అద్భుత సన్నివేశాలను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. వినయం, అంకితభావం, సమష్టి కృషి వంటి ఇతివృత్తాలను ఈ ప్రొడక్షన్ హైలైట్ చేసింది. ప్రజా-కేంద్రిత పాలనలో పరివర్తనాత్మక నాయకత్వం లోతుగా పాతుకుపోయిందనే ఆలోచననూ ఇది బలోపేతం చేసింది.

ఉన్నత కళాత్మక ప్రమాణాలను పాటిస్తూనే... సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా, అర్థవంతంగా ఉండేలా నిర్వహాకులు ఈ కార్యక్రమాన్ని చక్కగా రూపొందించారు. కచ్చితత్వం గల కొరియోగ్రఫీ, ఉత్తేజకరమైన సంగీతం, ఆకర్షణీయమైన కథనం, లీనమయ్యే దృశ్యాలు కలిసి శాశ్వత భావోద్వేగ ప్రభావాన్ని సృష్టించాయి.

నమోత్సవ్ కేవలం ఒక సాంస్కృతిక కార్యక్రమంగానే కాకుండా... భారత ప్రజాస్వామ్య ప్రస్థానానికి, అభివృద్ధి ఆకాంక్షలకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచింది. చరిత్రను మలచడంలో నాయకత్వ పాత్రను ఈ కార్యక్రమం స్పష్టం చేసింది. తరతరాలను ఉత్తేజపరిచేలా కథలను చెప్పడంలో సృజనాత్మక వ్యక్తీకరణకు గల శక్తిని ఇది పునరుద్ఘాటించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2209695) సందర్శకుల సూచీ సంఖ్య : : 47
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , Urdu , English , Gujarati , Tamil , Marathi , हिन्दी , Punjabi , Kannada