పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఆరావళి పర్వతశ్రేణికి కేంద్రం రక్షణ - నూతన గని లీజులు రద్దు... రక్షిత ప్రాంతం విస్తరణ
प्रविष्टि तिथि:
24 DEC 2025 7:12PM by PIB Hyderabad
ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్న ఆరావళి పర్వత శ్రేణి మొత్తాన్ని అక్రమ గనుల తవ్వకాల నుంచి సంరక్షించి, పరిరక్షించే దిశగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్సీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో కొత్తగా గనుల లీజుల మంజూరుపై సంపూర్ణ నిషేధం విధిస్తూ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిషేధం ఆరావళి పర్వత శ్రేణి ప్రాంతం అంతటా ఏకరీతిగా వర్తిస్తుంది. పర్వత శ్రేణి సమగ్రతను కాపాడటం దీని ముఖ్య ఉద్దేశం. గుజరాత్ నుంచి జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) వరకు విస్తరించిన ఆరావళిని ఒక అవిచ్ఛిన్న భౌగోళిక శ్రేణిగా సంరక్షించడం, అలాగే నియంత్రణలేని గనుల తవ్వకం కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయడమే ఈ ఆదేశాల ఉద్దేశం.
ఇప్పటికే గనుల తవ్వకాన్ని నిషేధించిన ప్రాంతాలతో పాటు, మొత్తం ఆరావళి పర్వతాలలో పర్యావరణ, భౌగోళిక, భూభాగ స్థాయి అంశాలను ఆధారంగా చేసుకుని నిషేధించవలసిన అదనపు ప్రాంతాలు/జోన్లను గుర్తించాలని ఎంఓఈఎఫ్సీసీ భారత అటవీ పరిశోధన, విద్యా మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ -ఐసీఎఫ్ఆర్ఈ)ని కూడా ఆదేశించింది.
మొత్తం ఆరావళి ప్రాంతం కోసం సుస్థిర గనుల తవ్వకాలకు సమగ్రమైన, సైన్స్ ఆధారిత నిర్వహణ ప్రణాళిక (ఎంపీఎస్ఎం)ను సిద్ధం చేసే ప్రక్రియలో భాగంగా, ఈ కార్యాచరణను చేపట్టాల్సిందిగా ఐసీఎఫ్ఆర్ఈకు ఆదేశాలు జారీ చేశారు. విస్తృత స్థాయిలో భాగస్వాముల సంప్రదింపుల కోసం ప్రజల ముందు ఉంచనున్న ఈ ప్రణాళిక, సమగ్ర పర్యావరణ ప్రభావాన్ని, పర్యావరణాన్ని భరించగల సామర్థ్యాన్ని అంచనా వేయడంతో పాటు, పర్యావరణపరంగా సున్నితమైన, సంరక్షణకు అత్యంత కీలకమైన ప్రాంతాలను గుర్తించి పునరుద్ధరణ, పునరావాస చర్యలను నిర్దేశిస్తుంది.
స్థానిక భౌగోళిక స్వరూపం, పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం చేపట్టిన ఈ చర్య వల్ల మొత్తం ఆరావళి ప్రాంతంలో గనుల తవ్వకాల నుంచి రక్షణ పొందిన, నిషేధిత ప్రాంతాల పరిధి మరింతగా పెరుగుతుంది.
ఇప్పటికే పని చేస్తున్న గనుల విషయంలో కూడా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పర్యావరణ పరిరక్షణ నిబంధనలను కఠినంగా పాటించాలని, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణకు, సుస్థిరమైన గనుల తవ్వకం పద్ధతులకు కట్టుబడి ఉండేలా మరిన్ని ఆంక్షలతో గనుల కార్యకలాపాలను నియంత్రించాలని స్పష్టం చేసింది.
ఎడారీకరణ నివారణ, జీవవైవిధ్య సంరక్షణ, భూగర్భ జల వనరుల పునరుజ్జీవం, ఈ ప్రాంతానికి పర్యావరణ సేవల్లో కీలకంగా గుర్తించిన ఆరావళి పర్యావరణ వ్యవస్థ దీర్ఘకాల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉంది.
***
(रिलीज़ आईडी: 2208440)
आगंतुक पटल : 122