హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో జరిగిన క్రెడాయ్ జాతీయ సదస్సు "వికసిత్ భారత్ @2047” లో ప్రసంగించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
పట్టణాభివృద్ధిని, మౌలిక సదుపాయాలను బలోపేతం చేసిన మోదీ ప్రభుత్వ భవిష్యత్ తరం మౌలిక సదుపాయాల కార్యక్రమాలు.. భారత్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణానికి దిశానిర్దేశం
డెవలపర్ల కమ్యూనిటీ వ్యాపారానికి భరోసాను, విశ్వసనీయతను అందిస్తున్న క్రెడాయ్
రియల్ ఎస్టేట్ రంగంలో నూతన ఒరవడి.. హరిత భవనాలు, వర్షపు నీటి సంరక్షణ, శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణే లక్ష్యం
భవన నిర్మాణ సామాగ్రిపై జీఎస్టీ తగ్గించటం ద్వారా గృహ నిర్మాణానికి నూతనోత్తాజాన్ని ఇచ్చిన మోదీ ప్రభుత్వం
పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉండే ధరలు, పర్యావరణహిత గృహ పథకాల దిశగా క్రెడాయ్ పయనం
జీఎస్టీ నుంచి రెరా వరకు మోదీ ప్రభుత్వ సంస్కరణలను గుర్తిస్తున్న ప్రపంచం
తక్కువ ఖర్చుతో గృహ నిర్మాణం, నెట్-జీరో సాధనే దిగ్గజ డెవలపర్ల కర్తవ్యం
సింగిల్ విండో క్లియరెన్స్, పారదర్శకత, సాంకేతికత ద్వారా నమ్మకమైన గృహ నిర్మాణ వ్యవస్థను అభివృద్ధి చేసిన మోదీ ప్రభుత్వం
భవన సముదాయాల రూపకల్పనలో పచ్చదనానికి కేటాయించే స్థలం పెంపు.. ప్రజలకు మెరుగైన వాతావరణం అందించటం, అడవుల పెంపకానికి ప్రోత్సాహం
प्रविष्टि तिथि:
19 DEC 2025 8:49PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జరిగిన క్రెడాయ్ జాతీయ సదస్సు "వికసిత్ భారత్ @2047”ను ఉద్దేశించి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రీ భూపేందర్ యాదవ్‌తో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రతి రంగంలోనూ భారతదేశాన్ని 2047 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలని, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మార్చటానికి దేశం కీలక ముందడుగు వేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని నిర్దేశించినట్లు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. భవిష్యత్ తరం మౌలిక సదుపాయాల కోసం గత 11 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, ఈ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిచ్చాయని చెప్పారు. నేషనల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ పైప్‌లైన్ సహా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాల ద్వారా పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలను క్రమబద్దీకరించటమే కాక ప్రపంచంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగిన దేశాల జాబితాలో భారత్‌ను చేర్చేందుకు స్పష్టమైన కార్యాచరణను రూపొందించినట్లు వెల్లడించారు. 11 ఏళ్ల మోదీ పాలనలో మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టటమే కాక, అన్ని రంగాల్లోని అడ్డంకులను తొలగించేందుకు కృషి చేసినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు.
క్రెడాయ్ సంస్థ 20 లక్షల మొక్కలను నాటడమే కాక, 25 గ్రామాల్లోని 9,000 ఎకరాల బంజరు భూమికి పునరుజ్జీవం పోసిందని శ్రీ అమిత్ షా కొనియాడారు. ప్రతి డెవలపర్ ప్రాజెక్టులను రూపొందించేటప్పుడే పచ్చదనం కోసం స్థలం కేటాయించాలని సూచించారు. భవన నిర్మాణ సమయంలో దేశంలోని ప్రతి డెవలపర్ 10 మొక్కలు నాటేందుకు కృషి చేయటం అభినందనీయమైన కార్యక్రమం అవుతుందని వ్యాఖ్యానించారు.
1999 నుంచి ఇప్పటివరకు గృహ నిర్మాణం, నివాస ప్రాంతాల అభివృద్ధిని ప్రోత్సహించటంలో క్రెడాయ్ స్థిరంగా లక్ష్యాలను సాధిస్తోందని కేంద్ర హోం మంత్రి అన్నారు. నైతిక విలువలకు, ప్రవర్తనా నియమావళికి క్రెడాయ్ అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని, అందుకే ఇవాళ డెవలపర్ల పనికి తగిన గుర్తింపు లభిస్తోందని తెలిపారు. కేవలం లాభనష్టాల పట్టికలు బలంగా ఉంటే సరిపోదని, సమాజంలో పనికి తగిన ప్రతిష్ఠ లభించడం కూడా ముఖ్యమని అన్నారు. భారతదేశంలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ల అత్యున్నత సంస్థను క్రమబద్ధీకరించడంలో, గుర్తింపు పొందిన పరిశ్రమగా తీర్చిదిద్దడంలో క్రెడాయ్ కీలక పాత్ర పోషించిందని శ్రీ అమిత్ షా కొనియాడారు.
దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 230 నగరాల్లో దాదాపు 13,000 మంది డెవలపర్లకు ప్రాతినిధ్యం వహిస్తూ క్రెడాయ్ ఒక మహా వృక్షంలాగా నిలిచిందని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రెడాయ్.. ప్రాముఖ్యతను, ఆవశ్యకతను నిరూపించుకుందని తెలిపారు. ఎన్నో సందర్భాల్లో క్రెడాయ్ మానవీయ కోణాన్ని చాటుకుందని, ఇప్పటివరకు 3 లక్షలకు పైగా కార్మికులకు శిక్షణ ఇచ్చిందన్నారు. కార్మికులకు ఏ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి అవసరమో గుర్తించటంపై దృష్టి సారించాలని శ్రీ అమిత్ షా సూచించారు.
భారతదేశంలో పట్టణీకరణ 2035 నాటికి సుమారు 40 శాతానికి చేరుతుందని, 2047 నాటికి దేశ జనాభాలో 50 శాతం ప్రజలు నగరాల్లో నివసిస్తారని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అన్నారు. జనాభాలో దాదాపు సగం మంది పట్టణాల్లో నివసించినప్పుడు, వారికి గృహ వసతి కల్పించే బాధ్యత ప్రధానంగా డెవలపర్లపైనే ఉంటుందన్నారు. ఈ బాధ్యతను స్వీకరించేందుకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణ మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం రెండూ విస్తరిస్తాయని శ్రీ అమిత్ షా తెలిపారు. పట్టణ గృహ నిర్మాణంలో సంతృప్త నిష్పత్తిని సాధించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, మెరుగైన జీవన ప్రమాణాలతో, అందుబాటు ధరలో, పర్యావరణహిత గృహాలను ప్రోత్సహించటంపై క్రెడాయ్ చర్చించాలని సూచించారు. సింగిల్ విండో క్లియరెన్సులు, కాలపరిమితితో కూడిన ఆమోదాలు, ఆన్లైన్ ట్రాకింగ్, రికార్డుల డిజిటలీకరణ నిర్మాణ రంగంపై నమ్మకాన్ని పెంచాయని, ఈ సంస్కరణలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు.
రియల్ ఎస్టేట్ రంగంలోని సంస్కరణల్లో రెరా గొప్ప మార్పు అని, దీనికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. భారత్‌లో గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించటంలో, పారదర్శకమైన లావాదేవీలకు, నాణ్యమైన నిర్మాణాల హామీ ఇవ్వటంలో రెరా అభినందనీయమైన కృషి చేసిందని కొనియాడారు. ఇప్పటికే 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని ఆమోదించాయని చెప్పారు. 29 రాష్ట్రాల్లో అప్పిలేట్ అథారిటీలు ఏర్పాటయ్యాయని, 29 రెరా అథారిటీలు సొంత వెబ్‌సైట్లను ప్రారంభించాయని వెల్లడించారు. ప్రస్తుతం రెరా ద్వారా 1.55 లక్షల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, దాదాపు 1.10 లక్షల మంది డెవలపర్లు రిజిస్టర్ అయ్యారని చెప్పారు.
జీఎస్టీ వల్ల అత్యధికంగా రియల్ ఎస్టేట్ రంగమే లబ్ధి పొందిందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో ఉండే గృహాలకు జీఎస్టీ 8 నుంచి ఒక శాతానికి తగ్గించినట్లు చెప్పారు. గృహ నిర్మాణ ప్రాజెక్టులకు పన్ను రేటు 12 నుంచి 5 శాతానికి, సిమెంట్‌కు 28 నుంచి 18 శాతానికి.. పాలరాయి, గ్రానైట్, ఇసుక, సున్నం, ఇటుకలపై పన్ను 12 నుంచి 5 శాతానికి, వెదురుపై పన్నును 12 నుంచి 5 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. దీనివల్ల మొత్తంగా 5 నుంచి 7 శాతానికి భవన నిర్మాణ వ్యయం తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ రంగంలో అభివృద్ధిని ప్రోత్సహించటానికి, నిర్మాణ ప్రాజెక్టుల్లో ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం ఎఫ్‌డీఐని ప్రభుత్వం అనుమతించిందని చెప్పారు. నేషనల్ అర్బన్ హౌసింగ్ ఫండ్ రూ.60,000 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ రంగం ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తిస్తుందని, ప్రతి ఒక్కరికీ సొంతిల్లు అందించాలన్న ప్రధానమంత్రి మోదీ వాగ్దానాన్ని క్రెడాయ్ ద్వారా నెరవేర్చవచ్చని శ్రీ అమిత్ షా అన్నారు. భారీ ప్రాజెక్టులను రూపొందించేప్పుడు తక్కువ ధరకే లభించే గృహాలను కూడా నిర్మించాలని దిగ్గజ డెవలపర్లను కోరారు. దీన్ని ప్రాథమిక అవసరంగా ఈ రంగం స్వీకరిస్తే, భవిష్యత్తులో విప్లవాత్మక మార్పును చూడవచ్చని తెలిపారు.
ఈ రంగంలో నేషనల్ బిల్డింగ్ కోడ్-2016తో సహా పలు కీలక సంస్కరణలను మోదీ ప్రభుత్వం చేపట్టిందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి తెలిపారు. పర్యావరణ కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించే 'నెట్-జీరో' లక్ష్యాన్ని చేరుకోవటానికి పూర్తి బాధ్యతతో క్రెడాయ్ ముందుకు సాగాలని సూచించారు. గ్రీన్ బిల్డింగ్ నిబంధనలు, విద్యుత్ పొదుపు డిజైన్లు, నీటి పునర్వినియోగం, వర్షపు నీటి నిల్వ, శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను గృహ నిర్మాణంలో సాధారణ నిబంధనలుగా మార్చాలన్నారు. డిజైన్ అంటే కేవలం భవనం రూపురేఖలు మాత్రమే కాదని స్పష్టం చేశారు. పర్యావరణ అనుకూల అంశాలన్నింటినీ నిర్మాణ డిజైన్లకు జోడించి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించాలని చెప్పారు.
భవిష్యత్తులో భూ క్రయవిక్రయాలు మరింత పారదర్శకంగా మారాలని.. ల్యాండ్ బ్యాంకింగ్, స్పెక్యులేటివ్ హోల్డింగ్ వంటి పద్ధతులకు నగరాలు దూరంగా ఉండాలని శ్రీ అమిత్ షా అన్నారు. నగరాలను నివాసానికి అనువైన ప్రాంతాలుగా మార్చటానికి మెట్రో సేవల విస్తరణ, ఫ్లైఓవర్లు, రహదారుల కల్పన, పర్యావరణహిత ఇంధనాన్ని ప్రోత్సహించటం వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టినట్లు వివరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పట్టణాభివృద్ధిపై అత్యంత దార్శనికతతో భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ముందుకు సాగుతోందని చెప్పారు. బాధ్యతాయుతమైన డెవలపర్లు ఇందులో కీలక భాగమని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 2207234)
आगंतुक पटल : 4