ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ ఒమన్ వాణిజ్య వేదికకు హాజరైన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
18 DEC 2025 4:01PM by PIB Hyderabad
మస్కట్ లో జరిగిన భారత్- ఒమన్ వాణిజ్య వేదికను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ఈ సమావేశానికి ఒమన్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ ఖైస్ అల్ యూసఫ్, ఒమన్ వాణిజ్య, పరిశ్రమల చాంబర్ చైర్మన్ శ్రీ షేక్ ఫైసల్ అల్ రావాస్, భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్, సీఐఐ అధ్యక్షుడు శ్రీ రాజీవ్ మెమాని హాజరయ్యారు. ఈ వేదికలో రెండు దేశాల నుంచి ఇంధనం, వ్యవసాయం, రవాణా, మౌలిక సదుపాయాలు, తయారీ, ఆరోగ్యం, ఆర్థిక సేవలు, హరిత అభివృద్ధి, విద్య, అనుసంధాన రంగాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. మాండ్వి నుంచి మస్కట్ వరకు రెండు దేశాల మధ్య శతాబ్దాల నాటి సముద్ర వాణిజ్య సంబంధాలు నేడు శక్తిమంతమైన వాణిజ్య లావాదేవీలకు పునాదిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. 70 సంవత్సరాల దౌత్య సంబంధాలు శతాబ్దాలుగా నిర్మితమైన నమ్మకం, స్నేహాన్ని సూచిస్తాయని ఆయన తెలిపారు. భారత్-ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (సీఈపీఏ) పూర్తి సామర్థ్యాన్ని వ్యాపారవేత్తలు గ్రహించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దీనిని భారత్-ఒమన్ ఉమ్మడి భవిష్యత్తుకు రూపురేఖగా అభివర్ణించారు. సీఈపీఏ ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని పరస్పర అభివృద్ధి, ఆవిష్కరణ, ఉపాధికి అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు.
గత 11 సంవత్సరాల్లో భారత్ సాధించిన ఆర్థిక విజయాన్ని ప్రస్తావిస్తూ.. తరువాతి తరం సంస్కరణలు, విధాన అంచనా, సుపరిపాలన, అధిక పెట్టుబడిదారుల నమ్మకంతో దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకున్న పరిస్థితుల్లో కూడా గత త్రైమాసికంలో 8శాతానికి పైగా భారత అధిక వృద్ధిని సాధించిందని తెలిపారు. ఇది ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపక స్వభావం, అంతర్గత బలానికి నిదర్శనమని అన్నారు. ‘‘జీవన సౌలభ్యాన్ని’’, ‘‘వ్యాపార సౌలభ్యాన్ని’’ పెంపొందించడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రవాణా, అనుసంధానం, విశ్వసనీయ సరఫరా వ్యవస్థ, తయారీ సామర్థ్యాలు, హరిత వృద్ధిని నెలకొల్పేందుకు భారత్ వేగంగా, భారీ స్థాయిలో పనిచేస్తోందని చెప్పారు. ఇంధనం, చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్, ఎరువులు వంటి సాంప్రదాయ రంగాలకు మించి.. హరిత ఇంధనం, సౌర పార్కులు, శక్తి నిల్వ, స్మార్ట్ గ్రిడ్‌లు, అగ్రి-టెక్, ఫిన్‌టెక్, ఏఐ, సైబర్ భద్రతా వంటి రంగాల్లో అవకాశాలను అన్వేషించాలని ఒమన్ వ్యాపారాలను ప్రధానమంత్రి ఆహ్వానించారు. వ్యాపార భాగస్వామ్య భవిష్యత్తును సిద్ధం చేయడానికి భారత్-ఒమన్ వ్యవసాయ ఆవిష్కరణ కేంద్రం, భారత్-ఒమన్ ఆవిష్కరణకు మధ్య అనుసంధానం సృష్టించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు కేవలం ఆలోచనలు మాత్రమే కాదని, పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు, కలిసి భవిష్యత్తును నిర్మించడానికి ఆహ్వానాలని తెలిపారు.
ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్తలు భారీగా హాజరవ్వడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. వారు తమ విధానాలతో వ్యాపారాన్ని సమన్వయం చేసి సీఈపీకి ఊతం ఇవ్వాలని పిలుపునిచ్చారు. భారత్-ఒమన్ కేవలం సమీప పొరుగుదేశాలే కాదని.. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా స్థిరత్వం, వృద్ధి, పరస్పర శ్రేయస్సుకు కట్టుబడి ఉన్న వ్యూహాత్మక భాగస్వాములుగా పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2206331)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam